కథ

సహజాతం

అక్టోబర్ 2017

సింగన్న నిలువెత్తు గొయ్యిలోకి దిగాడు. పాలేళ్ళిద్దరూ పైన చెక్కమూత అమర్చారు. ఆ మూతకి మీటరు వెడల్పున అరచేతి బారున రంధ్రం ఉంది. అదిగాక చెక్కమూత నిండా చిన్నచిన్న రంధ్రాలున్నాయి. గొయ్యిలో ఉన్నవాళ్ళకి పైన ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుంది. పాలేళ్ళిద్దరూ చెరో తోలు డప్పు పట్టుకుని బాటకిరువైపులా ఉన్న చెట్లనెక్కి కూర్చొన్నారు. సింగన్న ఈటెను రంధ్రం నుండి పైకి ఎత్తి పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. వేట సింగన్నకి సంప్రదాయ సిద్ధము. అతని జీవనాధారం, తప్పని కర్మ. దొరకి మాత్రం ఓ సరదా. ప్రతి పున్నమికి దొర షావుకారుని, పాలేళ్ళని, బోయపల్లె నుండి సింగన్నని తీసుకుని అడవికి వేటకొస్తాడు.

ప్రతి అడవి జంతువుకి పొట్టభాగం సున్నితంగా ఉంటుంది. గోతిలోని సింగన్న అలా జంతువుని దొంగపోటుగ పొట్టలో పొడిచి గాయపరచగానే అదిఅడవిలోకి పారిపోకుండా దొర డబుల్ బ్యారెల్ గన్నుతో వాటిని కాలుస్తాడు.

వేగుచుక్క పొడిచింది. గొడ్డుచలి మొదలైంది. చలికి అందరి దవడలు దడదడ లాడుతున్నాయి. ఎదురుగా ఉన్న వెన్నెల్లో గోదారి పాలసముద్రంలా పారుతుంది. పాలసముద్రం మీద ఆదిశేషుడిలా భద్రాచలంలో పెళ్ళిళ్ళు చేసుకుని తిరుగు ప్రయాణంలో వస్తున్న లాంచీలు లాంతరు వెలుగుతో నడుస్తున్నాయి. ముత్తాతల నాటి మర్రిచెట్టు కింద జీపులో షావుకారు నిద్రలోకి జారిపోయాడు. దొర జీపు దిగి గోదారి దగ్గరికెళ్ళాడు. గోదారిలోకి నీళ్ళు తాగడానికి వస్తున్నట్టు తీరం నుండి ఆ దారినిండా జంతువుల పాదాల ముద్రలు, గిట్టల గుర్తులు వున్నాయి. కొంచెం దూరంలో గోదారికి గోడకట్టినట్టు పాపికొండలు నిలబడ్డాయి. రెండుకొండల నడుమ నుండి వస్తున్న గోదారి ఉండుండి ఉలిక్కిపడి ఒడ్డుని కోత కోస్తుంది. దొర కాసేపలా ప్రేమగా గోదారిని చూసి తిరిగొచ్చి జీపులో కూర్చున్నాడు. చెట్లఆకుల మీద మంచు కిందున్న ఎండుటాకులపై బొట్లుబొట్లుగా పడుతున్న శబ్దం. ఆ ఎండుటాకులపై పాము జరజరా పాకుతున్న శబ్దం మినహా అడివంతా నిశ్శబ్దం.

ఇంతలో ఆకులు గలగలలాడిన అలికిడి. చెట్లమీది పాలేర్లు, జీపులోని దొర ఉలిక్కిపడి అటువేపు చూస్తూ కళ్ళప్పగించారు. గోతిలోని సింగన్న చెవులు కిక్కిరించి వింటున్నాడు. గుంపులో నుంచి తప్పుకున్న గొర్రగేదె(అడవి గేదె)డొంకలమాటు నుండి బయటకొచ్చి గోదారి వైపుకొస్తుంది. అందరి కళ్ళు విచ్చుకున్నాయి. ఆ గేదె పాలేర్లు ఎక్కిన రెండు చెట్ల మధ్యకొచ్చాక అందులో ఒకడు తోలు డప్పుని గోళ్ళతో గీరడం మొదలుపెట్టాడు. బర్… బర్… బర్ మనే ఆ శబ్దాలంటే గొరగేదెకి పిచ్చి చిరాకు. ఆ శబ్దం వచ్చిన చెట్టు వైపు కాలు దువ్వుతూ పరిగెట్టింది. అంతలో వాడు ఆ ధ్వని ఆపేసాడు. ఈ సారి అవతలి వైపు చెట్టు మీద పాలేరు డప్పుని గీరడం మొదలుపెట్టాడు. గొర్రగేదె ఆ చెట్టు వైపుకి పరిగెట్టింది. గేదె అటూఇటూ కిర్రెక్కినట్టు తలూపుకుంటూ పరిగెడుతుంది. ఆ రెండు చెట్ల మధ్య బాటలో గోతిలోనే వున్న సింగన్న తన బలాన్నంతా ఉపయోగించి ఈటెను గేదె పొట్టలో పొడవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పొట్ట ఈటెకు చిక్కడం లేదు.

ఈ హడావిడికి షావుకారుకి మెలకువొచ్చింది.

దొరగారు డబుల్ బ్యారెల్ గన్నుని గేదెవైపు ఎక్కుపెట్టి ఉండడాన్ని చూసి ఆవులించడం ఆపేసాడు. ఇంతలో సింగన్న చేతిలో ఈటె గొర్రగేదె పొట్టని చీల్చుకుని వేగంగా వెనక్కొచ్చేసింది. అప్పుడప్పుడే తెల్లారుతుండడం మూలాన ఆ దృశ్యం షావుకారుకి స్పష్టంగా కనబడింది. ఆనందం ఆపుకోలేక షావుకారు “చచ్చింది”అని అరిచాడు. ఈటెపోటు తిని బాధపడుతున్న గేదె ఆ బాధని కోపంగా మార్చి రెప్పపాటులో జీపువైపు ఉరికింది. దొర జీపులోంచి దూకేసాడు. గొర్రగేదె జీపుని అమాంతం బలం కొద్దీ ఢీకొట్టింది.

షావుకారుతో ఉన్న జీపు తిరగబడిపోయింది. వెంటనే దొర తన చేతిలోని టార్చ్ లైటుని గేదె కళ్ళల్లోకి వేసి గన్నులోని తూటాను దాని మీదకి వదిలాడు. తూటా దెబ్బ ఎక్కడ తగిలిందో తెలియదుగానీ గేదె వెనకడుగేసి పారిపోవడం మొదలెట్టింది. పదిమీటర్ల దూరం పరిగెత్తి బొక్కబోర్లా ముందుకి విరుచుకు పడిపోయింది.

గోతిలోని సింగన్న పైకెక్కి గునపం తీసుకుని దొరతో కలిసి గేదె దగ్గరికి అడుగులేస్తున్నాడు. అప్పుడే వాళ్ళూహించని దృశ్యమొకటి అడుగు వ్యవధిలో జరిగిపోయింది. అప్పటిదాకా పొదల మాటున నక్కిన చిరుతపులి అమాంతం గొర్రగేదెపై పడి దాని పీకని కొరకడం మొదలెట్టింది. వారం వయస్సున్న రెండు చిరుతకూనలు తల్లికోసం పరిగెత్తుకొస్తున్నాయి. ఊహించని పరిణామానికి దొర బిక్క చచ్చిపోయాడు.

సింగన్న చేతిలోని గునపం పైకి లేచింది. తేరుకున్న దొర తుపాకి తూటాని చిరుత మీదకి వదిలాడు. చిరుత డొక్కల్ని బద్ధలు కొట్టుకుంటూ తూటా దూసుకెళ్ళింది. చిరుత వెల్లకిలా పడి మెదలకుండా వుంది. పాలేళ్ళు చెట్టు దిగి వాళ్ళ దగ్గరికొచ్చారు. నలుగురూ గేదె తల వైపు వెళ్ళారు. తూటా దెబ్బకి గేదె కన్ను ఉండాల్సిన చోట రంధ్రమొకటి వుంది.

సింగన్న గునపం పైకెత్తి గేదె గొంతుపై పొడిచాడు. గేదెలో చలనం లేదు. పాలేరు చేతిలోని కత్తి తీసుకుని గొర్రగేదె తలను మొండెం నుండి వేరు చేసి దాని శరీరాన్ని ముక్కలుగా కోసాడు. ఎక్కువ దెబ్బల్లేని చిరుత చర్మం విలువైంది కనుక చిరుతని అలాగే లేపిన జీపులోకి మోసుకుపోయారు.

చిరుత రెండు పిల్లల్లో ఒకటి తల్లి చనిపోయినప్పటి తూటా శబ్దానికి పారిపోయింది. ఇంకొకటి మాత్రం తల్లి కళేబరం దగ్గరే భయం లేకుండా వుంది. జీపు దాకా వచ్చేసింది. దొర తుపాకీ మడమని తిప్పి ఆ పిల్ల చిరుతను ఒక్కటెయ్యాలనుకున్నాడు. కానీ దాని ధైర్యం చూసి ముచ్చటేసి చేతిలోకీ తీసుకున్నాడు. దొర ఒళ్ళు జలదరించింది. ప్రతి పున్నమికి వేటకొచ్చిన ప్రతీసారి దొర గోదారిని చూస్తూ గడుపుతాడు. వేటాడాలన్న నిర్దయ ఒకవైపు ఉన్నా గోదారిని చూస్తే దయ పుట్టేది. ఇప్పుడు మాత్రం పారుతున్న గోదారిని చూస్తుంటే దొర మొండి మనసు కరిగి ప్రవహమైపోయింది. గోదారి “దేవతాత్మ”.

తల్లి చావుకి ప్రతీకారం అన్నట్టు ఆ బుడత చిరుత దొర చేతిని కొరుకుతుంది. దొర ప్రేమపూర్వకంగా ఒక నవ్వు నవ్వి దాని మూతి ముందు పాల గిన్నె పెట్టాడు. అది దొర చేతినొదిలి పాలను నాలుకతో చప్పరించింది. చలికి ఒణుకుతున్న చిరుతని సీటులో తన పక్కనే కూర్చోబెట్టుకుని దాని మీద రగ్గు కప్పి జీపును అడవిలోంచి వెనక్కు మళ్ళించాడు. చావు తప్పి కన్ను లొట్టపోయిన షావుకారు చిరుతని భయంభయంగా చూస్తున్నాడు.

అలా పులికి మనిషి ఇల్లు ఆశ్రయంగా మారింది. సరిగ్గా ఆ రోజు నుండి దొర దినచర్య దిశను మార్చుకుంది. పొద్దున్నే లేచి తను టీ తాగకుండానే ముందుగా సీసాతో పాలు పట్టుకుని చిట్టి చిరుతకు పట్టించేవాడు. అది తన్మయత్వంతో పాలపీక చీకుతూ గొంతులోకి గుటకలేసేది. ఆ తరువాత దాన్ని నూతికాడికి తీసుకెళ్ళి చేదతో తనే స్వయంగా నీళ్ళు లాగి, నూతి అరుగు మీద సబ్బుపెట్టి నురగలు వచ్చేలా రుద్ది స్నానం చేయించేవాడు. వెన్నముద్దను తాకినంత మృదువుగా దాన్ని తాకేవాడు. గాజు బొమ్మను పట్టుకున్నట్టు జాగ్రత్తగా ఎత్తుకునేవాడు. అది పెరుగుతున్న కొద్దీ కొద్దికొద్దిగా ఆహారాన్ని అలవాటు చేసాడు. మధ్యాహ్నపు ఎండలో తిరగనివ్వకుండా నిద్రపుచ్చేవాడు. రాత్రిళ్ళు మంచం మీద తల్లిబిడ్డను పొదివి పట్టుకుని పడుకున్నట్లు పడుకునేవాడు.

తన సొంత కొడుక్కి మల్లే సాకాడు. అమెరికాలో చదువుతున్న దొర కొడుకు అక్కడే అమెరికన్ అమ్మాయిని దొరకి తెలియకుండా పెళ్ళి చేసకున్నాడని, ఇండియా రావడానికి ఇష్టపడట్లేదని, తల్లిదండ్రులతో సంబంధాలు తెంచేసుకున్నాడని వార్త అందింది. దానితో దొరకి పులే ప్రపంచమయింది. చిరుత బంగారు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ దాని నుదురుకు తన నుదురు, దాని ముక్కుకి తన ముక్కు ఆనించి మాటిమాటికి ఢీ కొడుతుండేవాడు. తన బుగ్గలతో చిరుత చెంపల్ని తాకి పరవశానికి గురయ్యేవాడు. దాని మీసాల్ని తన చేతి వేలికొనలతో ముట్టుకుని మురిసిపోయేవాడు. చూస్తుండగానే చిరుతకు ఏడాది వయసొచ్చేసింది.

దానితో ఫోటో దిగడానికి దొర రాజమహేంద్రవరం నుండి ఫోటోలు తీసే ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఆంజనేయుల్ని పిలిపించాడు. ఆయన కూడా ఆంజనేయుడిలానే పర్వతకాయుడు. స్టాండుతో కూడిన నల్లటి ముసుగున్న పెద్దకెమెరాను ఆయనతో తెచ్చుకున్నాడు. తీరా దొర దర్శనం తరువాత పులితో ఫోటో దిగాలనే ఆయన కోరికకు ఈయన కాళ్ళు ఒణికాయి.

తనకెదో కీడు దాపురించిందని ఆయన గ్రహించినా దొరగారి కోరిక , కాబట్టి కక్కలేక మింగలేక ఒప్పుకున్నాడు. గార్డెన్ లో ఇనుప చైనులతో వేలాడుతూ టేకు కర్రతో చేయించిన ఉయ్యాల మీద ఒళ్ళో పులిని పెట్టుకుని ఆసీనుడై కూర్చున్నాడు దొర. పులిని బయటకు తెచ్చినప్పటి నుండి ఆంజనేయుల మీద నుండి దృష్టి మరల్చకుండా చూస్తుంది. పులెక్కడ మీద పడుతుందేమోనని ఆంజనేయులు ఆయన రెండు కళ్ళను దాని మీదే పడేసాడు. ఫోటో తియ్యాలంటే ముసుగులో దూరి మూత తియ్యాలి. అలా కెమెరా మూత తియ్యడానికి ఆంజనేయులు ముసుగులో దూరితే చిరుత అతన్ని పట్టుకోవడానికి దొర ఒళ్ళో నుండి ముందుకు దూకడానికి ప్రయత్నించేది. ఆంజనేయులు వెంటనే ముసుగులోంచి బయటకొచ్చి నిలబడితే పులి పద్ధతిగా కూర్చునేది. అలా దాగుడుమూతలు ఆట మూడుసార్లయ్యే సరికి ఆంజనేయులికి తలస్నానం చేసి తుడుచుకోకుండా బయటకొచ్చేసినట్టు ఒళ్ళంతా చెమటలు కారుతూ వణికిపోతున్నాడు. కెమెరా ముత తియ్యడం మాటిమాటికి విఫలమవుతుండే సరికి దొరకి చెడ్డకోపం వచ్చేసింది. పులిని గట్టిగా గద్దించాడు. అది పిల్లిలా ఒద్దికగా ఒళ్ళో కూర్చుంది. నాలుగోసారి ఆంజనేయులు ముసుగులోకి దూరినప్పుడు మాత్రం దొరచేతిని విదుల్చుకుని కిందకి దూకేసింది. దానితో ఆంజనేయులికి పిచ్చి కంగారు పుట్టేసి పక్కనున్న కొబ్బరి చెట్టు ను ఒక్కగెంతుతో ఎక్కేసి సార్ధకనామధేయుడయ్యాడు, కొబ్బరిచెట్టు చుట్టూ తిరుగుతున్న చిరుతను ఇంట్లొ పెట్టి గడియపెట్టాక, కొబ్బరిచెట్టుకి బంకలా బిగుసుకుపోయిన ఆంజనేయుల్ని బలవంతాన పాలెళ్ళిద్దరూ కిందికి దింపారు. కిందికి దిగిన ఆంజనేయులు కెమెరాని కూడా వదిలేసి బయటికి సత్తువ కొద్దీ పిక్కబలం చూపించి పరుగు లంకీంచుకున్నాడు.

ఆ తరువాత దొరెంత ప్రయత్నించినా ఆంజనేయులు ససేమిరా అనడంతో రాజమహేంద్రవరం నుండే చిత్రకారుడిని తీసుకొచ్చారు. చావు భయం ఎదురుగా నిలబడితే నిలబడ్డమే కష్టంగా వుంటుంది. అలాంటిది, కుంచెతో కుదురుగా ఏకాగ్రతతో చెయ్యాల్సిన పని ముందుకెట్లా సాగుతుంది!కుంచెకి రంగులద్ది స్టాండుపై పేపరు మీద పెట్టగానే ఫిట్స్ వచ్చినట్టు చెయ్యి వణికి అతడు గీసే గీతకి ఇంకో ఏడుగీతలు ఏర్పడి వెరసి అష్టవంకర్లు దర్శనమిచ్చేవి. ఆ స్ధితి గ్రహించిన దొర పాలేర్ల సాయంతో ఆ ఆర్టిస్ట్ ని నిచ్చెన మీదకెక్కించి సన్ సైడ్ మీద కూర్చొబెట్టాడు. పూటలో పూర్తయిన ఆ పెయింటింగ్ కెమెరా ఫోటో కంటే సజీవంగా వుండడంతో దొరకి పట్టపగ్గాల్లేవు. ఆర్టిస్ట్ ని గుండెలకు హత్తుకున్నాడు. పెయింటింగ్ కి ఫ్రేమ్ కట్టించి హాల్లో వేలాడదీసి అపురూపంగా చూసుకునేవాడు.

పులి సాన్నిహిత్యంతో దొర ప్రవర్తనలో మార్పు రేగింది. ప్రతి పున్నమికి అడవి వేట మానుకున్నాడు. పేకాట మానుకున్నాడు. శాకాహారిగా మారిపోయాడు. ఆ ఇంటి వంట పాత్రలు మాంసం వాసన మరచిపోయాయి. గోవులా ప్రవర్తించే పులి సాధు ప్రవర్తనతో పాటు దొర కూడా సాధువుగా మారిపోయాడు. ఆ మనిషిలో ప్రేమతత్వం పెరిగింది. పులిలో ఎలాంటి క్రూర స్వభావం, అసహనం ఏర్పడకుండా కడుపునిండా తిండి పెడుతున్నాడు. ఇదివరకటి అభద్రతా భావంతో కూడిన కలత నిద్రపోయి గురక్కొట్టి నిద్రపోతున్నాడు.

ఇదివరకు దొర పొలానికి గుర్రం మీద వెళ్ళేవాడు. ఇప్పుడు పులి పెద్దదవడంతో దాన్ని పైరుగాలి చల్లదనం కోసం సాయంత్రాలు జీపులో పొలం తీసుకెళుతున్నాడు. పులిని జీపు దగ్గరకీ తీసుకెళితే చాలు, దానికి విషయం అర్ధమై కోతిలా చెంగున ఎగిరి జీపులో కూర్చొనేది. అది కిందికి దూకకుండా దాని మెడకు చైను కట్టి జీపు సీటుకి బిగించేవాడు.

ఊరి మధ్య నుండి జీపు వెళుతున్నప్పుడు జనం పనులు మానేసి ఇళ్ళల్లోంచి బయటకొచ్చి విరగబడి చూసేవాళ్ళు. “పట్టాభిషేక మహొత్సవంలో మదపుటేనుగునెక్కి మహారాజు ఊరేగినట్టు “అది దర్జాగా కూర్చొనేది. ఆ ఊళ్ళో రావిచెట్టు రచ్చబండ దగ్గర కుక్కల గుంపొకటి వుండేది. ఆ గుంపు ఊరికి ద్వారపాలకుల్లా రోడ్డును కబ్జాచేసి ఇది తమ సామ్రాజ్యం అన్నట్టు రోడ్డుకి అడ్డంగా పడుకునేవి. కానీ జీపు అలికిడి చెవినబడగానే అవన్నీ తలో దిక్కుకి పారిపోయేవి. ఇళ్ళ సందున, కంచెల చాటున, అరుగుల మాటున, రోళ్ళ పక్కన, రచ్చబండ కీందన నక్కీ తోకలు కీందికి దించి చిరుతను చూసి తెగ మొరిగేవి. జీపు కనుచూపు మేర కనబడకుండా పోయాక మళ్ళీ రోడ్లపైకి చేరి తోకలెత్తేవి. తమ రాజ్యంలోకొచ్చిన శత్రుదేశీయుడిని తరిమితరిమి కొట్టినట్టు తమ దేశ సార్వభౌమత్వాన్ని ప్రాణాలకు తెగించి కాపాడిన వీరసైనికుల్లా మొహాలు పెట్టి మళ్ళీ రోడ్డుకి అడ్డంగా పడుకుని ఆక్రమించేవి.

పొలానయితే పశువులు మేసే బీడు భూముల్లో చిట్టిపొట్టి మొలకల పచ్చగడ్డిలో దొర చిన్నపిల్లాడయిపోయాడు. పులితో పాటు పచ్చగడ్డిలో పొర్లేవాడు. ఆ రెండు శరీరాల ఏకాత్మ జీవులు అలా ఆడి ఆడి ఆయాసంతో రొప్పి వరిపంట బోదెలలో నీళ్ళు తాగి దప్పిక తీర్చుకుని ఇంటికి మళ్ళేవి.

దొర తన ఇంటికి ఆనుకుని వున్న పామాయిల్ తోటలో వందల సంఖ్యలో కోళ్ళను పెంచుతాడు. ఆ తోటలోనే ఆయన గుర్రాన్ని కట్టేస్తాడు. పులి దొరతో అప్పుడప్పుడు ఆ తోటలోకెళుతుంది. గుర్రాన్ని కవ్విస్తూ దాని చుట్టూ అటూఇటూ పరిగెడుతుంది. గుర్రం కట్టు తెంచుకుని పారిపోవడానికి ప్రయత్నించేది. ఎందుకంటే గుర్రం చిన్నతనం నుండి నిన్నమొన్నటి దాకా అడవిలోనే పెరిగింది. దాన్ని తీసుకొచ్చి మచ్చిక చేసుకుని స్వారీ చేస్తున్నాడు దొర. పులి సహజ స్వభావం ఆ అడవి గుర్రానికి తెలుసు, కనుక అది బెదిరిపోయేది. కానీ పులి తన సహజ స్వభావం మర్చిపోయింది, కనుక ఆ చర్యను ఆటలా భావిస్తే గుర్రం మాత్రం వేటలా భావించేది. గజగజలాడుతున్న గుర్రాన్ని గమనించి దొర పగలబడి నవ్వేవాడు.

అది పున్నమి రాత్రి. రాత్రి రాజు ఆకాశంలో కొచ్చేసాడు. పులిని రాత్రిళ్ళు స్వేచ్ఛగా వదిలేసేవారు. ఇంటికి, పామాయిల్ తోటకి మధ్య చిన్న గేటుంటేది. ఆ అర్ధరాత్రి పులి గేటుని దూకి కోళ్ళ దొడ్డి దగ్గరికెళ్ళింది. గాబుల్లో కోళ్ళన్నీ కునుకు తీస్తున్నాయి. గాలి కూడా కదలనంత నెమ్మదిగా అది గాబు వైపుకి సాగింది. వెన్నెల పడి చిరుత రెండు కనుగుడ్ల లోపల ద్రవస్ఫటికం నక్షత్రాల్లా మెరుస్తుంది. కోళ్ళ గాబునొకదాన్ని తోసింది. ఆ గాబు తిరగబడింది. అందులో వున్న పుంజు అరిచేలోగా మెడ దగ్గరుండే ముఖ్యమైన నాళాన్నొక దాన్ని కొరికేసింది. ఇంకో పుంజు అరిచినా దాని మెడనాళాన్ని కొరికి ఆ రెంటి మాంసం తిని వెళ్ళిపోయింది, చిరుతలు వేటాడీన సదరు జీవుల చర్మం కానీ, ఎముకలు కానీ తినవు. తెల్లారాక పాదముద్రలను బట్టి పులిమీద అనుమానం వ్యక్తం చేస్తూ పాలేర్లు దొరకి ఫిర్యాదు చేసారు.

“అంత పనీ చేస్తే దాని తోలొలి చెయ్యను” అంటూ దండ ప్రయోగానికి కొరడా చేతిలోకి తీసుకుని పులికి రోజు ఉదయం పట్టేపాలు, పెట్టే అన్నానికి సమ మోతాదులో దాని ముందు పాలేర్లతో పెట్టించి కోపంగా నిల్చున్నాడు. కీడు మూడిందని చిరుతకి అర్ధమైనట్టుంది. ఎంత కష్టమైనా చుక్కపాలను గానీ, మెతుకు అన్నాన్ని గానీ మిగల్చకుండా మింగేసింది. దొర కోపం చల్లబడడమే గాదు, పరమానంద పడిపోయాడు, అనుమానమంతా బావురు పిల్లి మీదకు పోయింది.

కోళ్ళదొడ్లో చిరుత చర్యకి ప్రత్యక్ష సాక్షి వుంది. కానీ దానికి నోరు తెరిచి మాట్లాడే గుణం లేక గుగ్గిళ్ళు నములుతుందా గుర్రం. ప్రత్యక్షసాక్షి చెప్పకపోయినా పాలేర్లు ఊరుకోలేదు. తాము ఊహించిన నిజాన్ని ఊరంతా చాటింపు వేసారు. వరికోతల దగ్గరైనా, వరికుప్పల కాపలాల దగ్గరైనా, తూర్పార పట్టే దగ్గరైనా, ఇరుగుపొరుగులు చేరిన వీధి అరుగుల మీదైనా పులి ప్రస్తావనే నడుస్తుండేది. దాన్ని “రక్తం మరిగిన రాక్షసి”గా జనం జమకట్టారు. ఈ విషయాన్ని షావుకారు ద్వారా దొర చెవిన పడుతూనే వుండేవి. కానీ దొర ఆ గుసగుసల్ని జమకట్టలేదు. పులి దెబ్బకు మనిషన్నోడు దొర ఇంటి ఛాయలకు రావడం మానుకున్నాడు.

దొర కోడిపందాలు జాస్తిగా వేస్తాడు. పందేల్లో పుంజుని నేలమీద వదులుతుంటే అది విసురుగా కిందికి దిగడంతో కోడిపుంజు కాలికి కట్టిన కత్తి దొర అరచేతిని చీరేసింది. చేతితో చేతిని నొక్కిపట్టినా చెయ్యి తీసెయ్యగానే రక్తం ఏకధారగా కారిపోతుంది. దొర యకాయకిన ఇంటికొచ్చేసాడు. రక్తం ఇంటి పాలరాతి అరుగు మీద మడుగు కట్టింది. వెంటనే వంటింట్లో వున్న దొరసాని దగ్గరికెళ్ళి పసుపుతో కట్టు కట్టించుకున్నాడు. బయటికొస్తూ ఇంటి అరుగు మీద జరుగుతున్న దృశ్యాన్ని చూసి భయంతో వెనకడుగేసాడు. రక్తమే ఆహారమైన పిశాచిలా పులి ప్రతి రక్తపు బొట్టుని సాంతం నాకుతుంది. మేక వన్నె పులైన దాని కళ్ళల్లో మృగం మేల్కొన్న ఛాయలు స్పష్టంగా కనబడుతున్నాయి. రుధిర ప్రవాహంలో ఈదాలన్న ఆశ పెరిగిపోతున్న దాని భావన దొరకి అవగతమైంది. ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోలేదు.

ఆ తరువాతి రోజు ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రోహిణి కార్తె కావడం మూలాన రోళ్ళు పగిలే ఎండ కాస్తుంది. పులిని దగ్గరికి తీసుకుని దాని మీసాలు దువ్వి ముద్దు పెట్టుకున్నాడు. ఆ సాయంత్రం పులి మెడకు చైను కట్టి బయటకు తీసుకొచ్చి వ్యాను వెనుక ఆగాడు. షరా మామూలుగానే సాయంత్రపు విహారానికి వెళుతున్నామనుకుని అలవాటు కొద్దీ ఎగిరి ఆ వ్యానులోకి దూకింది. అంతే!దానికున్న రెండు తలుపులని దొర వెంటనే మూసేసి గొళ్ళెం పెట్టేసాడు. ఆ వ్యాను మీద “వన్యమృగ సంరక్షణా నిలయం”, మచిలీపట్నం అని వ్రాసి వుంది. గొళ్ళెం పెట్టగానే అప్పటిదాకా వ్యాను ముందు క్యాబిన్ లో నక్కి కూర్చున్న ఇద్దరు వ్యక్తులు దిగి దానికి తాళం వేసి దొర దగ్గర సెలవు పుచ్చుకున్నారు. చిరుతకి లోపలంతా చీకటిగా వుంది. అంతకుమించి ఏం జరుగుతుందో తెలియని అయోమయంగా వుంది. కాళ్ళు రెండు ఎత్తి పట్టి డోరుని గీరుతుంది. గట్టిగా మూలుగుతుంది. కంగారుగా వ్యానంతా అటూఇటూ పరిగెడుతుంది. తలుపును పంజాతో కొడుతుంది. వ్యాను ఇంటిగేటు దాటి బయటికి వెళ్ళిపోయింది. ఇక ఆపుకోలేక వ్యాన్ వెళ్ళిన వేపు వెర్రెత్తినట్టు పరిగెత్తాడు. దొరగేటు దగ్గరికి చేరేసరికి వ్యాను సందు మలుపు తిరిగిపోయింది. దొర రోడ్డు మీదే కూలబడిపోయి కడవపోతగా కన్నీరుమున్నీరయ్యాడు.

ఆరోజు నుండి దొర దినచర్య దిగ్భందనమయ్యింది. బతకడానికి ఏదో ముద్ద తిన్నట్టు తింటున్నాడు. గడియ పెట్టుకుని గదిలోనే గడిపేవాడు. షావుకారు, సింగన్న కలవడానికొచ్చినా గదిలోంచి బయటకి రాలేదు. చుట్టాలు పక్కాల్ని, గొడ్డుగోసుని పట్టించుకునేవాడు కాదు. తనలో తనే గొణుక్కునేవాడు. నూరులంకణాలు చేసినోడికి మల్లే చిక్కిపోయాడు. సరిగ్గా నిద్రపోక ఆయన కళ్ళ ఊరగాయ కారానికి మల్లే ఉండేవి. ఆయన పులి మీద బెంగెట్టుకున్నాడు. ఆయన ఆరోగ్యాన్ని దిగులు దిగలాగింది. చిరుతని చంటోడికి మల్లే సాకిన జ్ఞాపకాలు ఆయన్ని పిచ్చోడిని చేసాయి. దొరసానికి దొరని కనిపెట్టుక్కూర్చోవడం, కన్నీళ్ళెట్టుకోవడమే పనయ్యింది. జూలో చిరుతని చిత్రహింసలు పెట్టినట్టు ఆయనకి పీడకలలు వస్తుండేవి. చెట్టంత మనిషి ఉలిక్కిపడి ఒంటరిగా ఆ గదిలో జ్వరమొచ్చినట్టు వణికిపోయేవాడు. దొరసాని వైద్యుల్ని అర్ధరాత్రయినా, అపరాత్రయినా రప్పిస్తుండేది. కానీ మనేదికి మందేది.

కడుపునిండా తిండి తిన్నా, కంటికింపైన బట్టలేసినా ఓర్చుకోని జనాలు కొందరు బహిరంగంగానే మొరగడం మొదలు పెట్టారు. అందరిలా ఆయన కుక్కని పెంచుకుంటే జనం ఇంత పగ పెంచుకునేవాళ్ళు కాదు! భిన్నమైన పదార్ధంతో బతకడం జనం అహాన్ని రెచ్చగొట్టింది. జనాలకి ఇదే అదను అయ్యింది. అదిగో దున్నపోతు ఈనిందంటే ఇదిగో దూడని కట్టేసామనే జనం… వాళ్ళ నోళ్ళకి రెక్కలొచ్చాయి. అంతే మరి, బతికి చెడ్డోడంటే లోకానికి లోకువ!ఆయన ఉప్పు తిన్నోళ్ళు, మోచేతి నీళ్ళు తాగి బతికినోళ్ళు, ఆయనకి జీవితాంతం రుణపడి వుండాల్సినోళ్ళు కూడా తిన్నింటి వాసాలు లెక్కపెట్ట సాగారు. పులిని పెంచుకునే విడ్డూరం ఎక్కడా విన్లేదు. డబ్బున్నోళ్ళకి ఇలాంటి బడాయిలే అనే వాళ్ళు కొందరు, పులి దొరని కరిచిందని ఆ భయంతోనే పిచ్చోడయ్యాడని మరికొందరు వాగుతుండేవారు. జనాల గుంపుల్లోని కొందరు వారు మాట్లాడేది తప్పని ఖండిద్దామనుకొనేవారు కానీ ప్రతికూల భావోద్వేగాలు బలంగా ఉన్నచోట అనుకూల భావోద్వేగాలకు చోటు దక్కదు.

పులిని గురించి దొరని లక్ష్యంగా చేసుకుని ఎడతెరిపి లేకుండా వర్షధారల్లా పడుతున్న విమర్శలు ఆగడం లేదు. పులితో దొర వేయించుకున్న చిత్రపటం చెదలు పట్టడం మొదలైంది. అడవి సొత్తైన నిశ్శబ్దం ఆయనలో ఆవహించింది.

ప్రేమరాహిత్యం మనుషుల మీదే కాదు, జంతువుల మీదా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. జూకి వచ్చిన ప్రతివాళ్ళలోనూ చిరుత దొరగారి మొహాన్ని వెతుక్కుంటుండేది. కొన్నిరోజుల తరువాత దొర బయటికొచ్చాడు. తనని చూడ్డానికొచ్చినోళ్ళని, చుట్టాలని, జనాలని, జతగాళ్ళను అందర్నీ ఒకే ప్రశ్న అడిగేవాడు. చాలా రోజులుగా అలా అడుగుతూనే వున్నాడు.

“మనిషి తన సహజస్వభావాలైన స్వార్ధాన్ని, అహాన్ని వదులుకోనప్పుడు, మానసిక పరిపక్వతలేని చిరుత తన సహజాతాన్ని ఎలా వదులుకుంటుంది”?

ఆ ప్రశ్నకి జవాబు రాలేదు. దొర కాలం చేసే వరకు మళ్ళీ జనాల్లోనూ కలవలేదు.

**** (*) ****