కవిత్వం

మునక

22-ఫిబ్రవరి-2013

ఈత నేర్చుకుంటున్నారా?
నదుల్లోకి ప్రవేశించకండి
పురాతన జ్ఞాపకాలతో మురిగిపోయి
అలసిన నెత్తుటి యేరుల్లా
ప్రవహించడం తప్ప
సముద్రగమనం తెలియని
నదుల్లోకి ప్రవేశించకండి

వెళ్ళండి
సముద్రాలలో ఈదండి
నీలి మహాసముద్రాల్లో ఈదులాడండి
ఎదురయ్యే మొదటి అల మీ దేహమే
చిరంతనంగా వేధిస్తున్న చీడపురుగు
ఒక్కసారి దానిని దాటేస్తే
ఇక అంతా భద్రమే!
ఔను

ఆ తరువాత అంతా సురక్షితమే
అప్పుడు మునకైనా సుఖమే!

మూలం: కమలా దాస్
అనువాదం: డా.నీరజ జవ్వాజి

(Advice to fellow swimmers కవితకు స్వేచ్చానువాదం)
మాధవి కుట్టి కలం పేరుతో మలయాళంలో రచయిత్రిగా, కమలా దాస్ పేరుతో భారతీయ ఆంగ్ల కవయిత్రిగా ప్రఖ్యాతి గాంచిన కమలా దాస్/కమలా సురయ్యా . భారతీయ సాహిత్యంలో మౌలికమైన స్త్రీవాద తాత్విక స్ఫూర్తిని, చైతన్యాన్ని అందించి సంచలనాన్ని కలిగించిన తొలితరం కవయిత్రి. తన కలం ద్వారా స్త్రీల మనసుని, లైంగికతని స్వేచ్చగా, నిజాయితిగా, శక్తివంతంగా ప్రకటించి తనతరం లో సంప్రదాయాలను బద్దలుగొట్టిన విధ్వంసకారిణిగా ముద్ర వేసుకుంది. 1984 లో సాహిత్యం లో నోబెల్ బహుమతికి ఎంపిక చేసిన తుది జాబితాలో పేరు సంపాదించటమేకాక అనేక అవార్డులు, రివార్డులు పొందారు. మార్చ్ 31 కమలా దాస్ జన్మదినం సందర్భంగా ఆమె స్మృతిలో.