కవిత్వం

వాళ్ళ నృత్యం

01-మార్చి-2013

వేడి, విపరీతమైన వేడి, కొజ్జావాళ్ళు నాట్యం చేయడానికి వచ్చేవరకు
పావడాలు గిర్రున తిరుగుతున్నాయి, చేతాళాలు
సొగసుగా మోగుతున్నాయి, కాలి గజ్జెలు ఘల్లు ఘల్లు
ఘల్లుమంటున్నాయి…గుల్‌మొహర్ పువ్వుల వెనుక
అటూ ఇటూ ఊగుతున్న పొడవైన జడతో, మిలమిలలాడే కళ్ళతో నాట్యం చేస్తున్నారు
చేస్తూనే ఉన్నారు నెత్తురు ఎగజిమ్మేవరకూ…

బుగ్గలమీద పచ్చబొట్లు, జడలో మెల్లెపూలు,
కొందరు నల్లగా, కొందరు తెల్లగా.
స్వరాలు గంభీరంగా, ఖిన్నమైన పాటలు; పాడుతున్నారు
ప్రేమికుల మరణాల గురించి, పుట్టుక నోచుకోని శిశువుల గురించి….

కొందరు డప్పులు బాదుతున్నారు, కొందరు వికసించని రొమ్ములు బాదుకుంటున్నారు
ఏడుస్తున్నారు, వేదనాభరితమైన పారవశ్యంతో గిజగిజలాడుతున్నారు.
వాళ్ళు పీలగా, కళావిహీనంగా, సగం కాలిన
కట్టెల్లా ఉన్నారు, ఒక రకమైన దైన్యం, నిస్సహాయత
కనిపిస్తోంది వాళ్ళందరిలో. పిట్టలు కూడా నిశ్శబ్దంగా
కూర్చున్నాయి చెట్ల మీద, పసిపాపలు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు, ఇంకా;

అందరూ ఆ నిర్భాగ్యుల వెర్రి ఆవేశాన్ని వింతగా చూస్తున్నారు
అప్పుడే ఆకాశంలో పెళపెళమని చప్పుడు, ఉరుములు, మెరుపులు
తుంపరలు, చినుకులు దుమ్ము లేపుతూ
సన్నటి జల్లులు, కొన్ని చుక్కలు…

 

మూలం: కమలా దాస్ (The Dance Of The Eunuchs)
అనువాదం: ఆలమూరు సౌమ్య