చలువ పందిరి

నీవు లేని పగళ్ళలో సంచారిని!

మార్చి 2013

పురస్కారాలు అందుకోకపోయినా, కొన్ని పాటలు ఎంతో ఖ్యాతిని సంపాదించేసుకుని సంగీతప్రియుల పెదాలపై ఎప్పుడూ నాట్యం చేస్తూ ఉంటాయి. అటువంటి పాటల్లో ఒకటి “ముకద్దర్ కా సికందర్“(1978) సినిమాలోని “ साथी रे..” పాట. అమితాబ్ బచ్చన్ సినిమాల్లో “షోలే” తరువాత అత్యంత జనాదరణ పొందిన సినిమా ఇది. చిత్రంలో “సలామే ఇష్క్ మేరీ జా”, “దిల్ తో హై దిల్”, “రోతే హుయే ఆతే హై సబ్” మొదలైన మిగతా పాటలన్నీ బహుళజనాదరణ పొందినవే. ప్రేమనీ, ఆవేదననీ, ఆర్ద్రతనీ కలగలుపుకున్న “ओ साथी रे..” పాట మాత్రం ఆణిముత్యమనే చెప్పాలి. అమితాబ్ కి ఎన్నో హిట్ సాంగ్స్ ని రాసిన గీత రచయిత “అంజాన్” ఈ పాటని రాసారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గాయకుడు కిశోర్ కుమార్ పాడిన ఉత్తమ చిత్రగీతాల్లో ఈ పాట ఒకటి. సంగీతదర్శకద్వయం “కల్యాణ్ జీ-ఆనంద్ జీ” సంగీతాన్ని అందించిన “ओ साथी रे..” పాట ఇప్పటికీ ఎంతో మంది నోట వినిపిస్తునే ఉంటుంది అనటం అతిశయోక్తి కాదు. కొన్నేళ్ళుగా ఇదే పాట కొందరి నోటి వెంట పాటగా, ఈల గా కొన్ని వందలసార్లు వినీ వినీ విసుగొచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి :)

చిత్రంలో ఈ పాట పాడే ముందు సికందర్(అమితాబ్) చెప్పే ఉద్వేగభరితమైన మాటలు మనసుని తడి చేస్తాయి. అనాధగా పెరిగిన అతని చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడుతున్న సమయంలో ఒక తోడు దొరికిందనీ, ఆ ఆప్యాయతకి, ఆదరణకీ తను కరిగిపోయానని చెప్తాడు. ఆ నేస్తం చిన్ననాడు పాడిన ఓ పాట తన గాయాలకు మందుగా పనిచేసిందనీ, ఎప్పటికి మరువని ఆ గీతాన్నే తానిప్పుడు పాడుతున్నానని చెప్పి ఈ పాట పాడతాడు సికందర్. చిన్ననాటి చెలిమి తనతో పాటు పెరిగి పెద్దదై ఊహల్లో చెలిగా మారి తనకు జీవితమైందనీ, ఆ చెలి చెలిమి లేనిదే తను బ్రతకలేననీ, ఆమె తనకెంత ప్రియమైనదో ఈ పాట ద్వారా తెలియచెప్తాడతను.

 

వాక్యార్థం:

 

: ओ साथी रे, तेरे बिना भी क्या जीना

ఓ చెలియా… నీవు లేని జీవితమూ జీవితమేనా?

फूलों में, कलियों में, सपनों की गलियों में

పూవుల్లో, మొగ్గల్లో, స్వప్నవీధుల్లో..

तेरे बिना कुछ कहीं न

నీవు లేనిదే ఎక్కడా ఏమీ లేదు

तेरे बिना भी क्या जीना(2)

నీవు లేని జీవితమూ జీవితమేనా?

 

భావం: ఓ చెలియా, నువ్వు లేని జీవితమూ జీవితమేనా? పూవుల్లో, మొగ్గల్లో, నా స్వప్నాలలో… నువ్వు లేనిదే అన్నిటా, అంతటా శూన్యమే. బ్రతకటానికి ప్రపంచంలో నువ్వు తప్ప మరేమీ నాకక్కర్లేదు అని అతని భావం.

 

(ఈ మొదటి చరణం ఆశా భోంస్లే పాడిన వర్షన్ లో వస్తుంది.)

 

1చ: जानॆ कैसॆ, अंजानॆ ही, आन बसा कॊई प्यासॆ मन मॆं

ఎలానో తెలియకనే, నా దాహార్త మనసులోకెవరో నివసించవచ్చారు

अपना सबकुछ खॊ बैठॆ हम, पागल मन कॆ पागलपन मॆं

వెర్రి మనసు ఉన్మాదంలో ఆదమరచి నా సర్వం కోల్పోయాను

दिल के अफ़साने… (2)

మనసు కథలు…

मैं जानूँ तू जाने, और ये जाने कोई न

నీకు తెలుసు.. నాకు తెలుసు, వేరెవరూ ఎరుగరు

तेरे बिना भी क्या जीना

నీవు లేని జీవితమూ జీవితమేనా?

 

భావం: నాకు తెలియకుండానే ఎవరో నా దాహార్త మనసులో స్థిరనివాసమేర్పరుచుకున్నారు. నేనేమో మనసు మాయలో పడి నాకంటూ నేను మిగలకుండా మనసంతా అర్పించేసాను. ఈ మనసు కథలు నీకూ నాకూ తప్ప వేరెవరికీ తెలియవు కదా! నాదన్నదంతా నీదయ్యాకా ఇక నీవు లేని జీవితాన్ని జీవించేదెలా అని  భావం.

 

2: हर धड़कन में प्यास हैं तेरी,

ప్రతి గుండె సవ్వడీ నీ పిపాసి

साँसों में तेरी खुशबू है

ప్రతి శ్వాసలో నీ పరిమళమే ఉంది

इस धरती से उस अंबर तक,

ఈ దివి నుండి ఆ భువి వరకు

मेरी नज़र में तू ही तू है

నా చూపుల్లో నిండి ఉన్నది నీవు మాత్రమే

प्यार ये टूटे ना,

ఈ ప్రేమ భగ్నమవరాదు

तू मुझ से रूठे ना

నీకు నాపై అలుకే రారాదు

साथ ये छूटे, कभी ना

ఎప్పటికీ మన జంట ఎడబాయరాదు

तेरे बिना भी क्या जीना..

నీవు లేని జీవితమూ జీవితమేనా?

 

భావం: నా ప్రతి గుండె సవ్వడీ నిన్నే కోరుతోంది. నా శ్వాస నిండా నీ పరిమళమే నిండి ఉంది. దివి నుండి భువి వరకూ ఎటు చూసినా ప్రతి చూపులో నువ్వే కనబడుతున్నావు. ఇటువంటి గాఢమైన ప్రేమ భగ్నమవకుండా ఉండాలి అంటే నీవు నాపై ఎప్పటికీ అలగనే కూడదు. మన జంటకి అసలు ఎడబాటే ఉండకూడదు.. అలా జరిగితే నేను జీవించలేను అంటూ తన గాఢమైన ప్రేమను వ్యక్తపరుస్తాడు.

 

3: तुझ बिन जोगन मेरी रातॆं,

నీవు లేని రాత్రులలో విరాగిని

तुझ बिन मेरे दिन बंजारे

నీవు లేని పగళ్ళలో సంచారిని

मेरा जीवन जलती धूनी,

నా జీవితమొక మండే కొలిమి

बुझे बुझे मेरे सपने सारे

నా కలలన్నీ నశించిపోతున్నాయి

तेरे बिना मेरी, मेरे बिना तेरी

ये जिन्दगी, जिन्दगी ना

నీవు లేని నా జీవితం, నేను లేని నీ జీవితం,

జీవితమే కాదు

तेरे बिना भी क्या जीना

నీవు లేని జీవితమూ జీవితమేనా?

 

భావం: నీవు లేని రాత్రుల నిండా వైరాగ్యమే ఉంది. నీవు లేని పగళ్లలో దిక్కుతోచని సంచారిని మాత్రమే. మండే కొలిమి లాంటి నా జీవితంలో పడి నా  కలలన్నీ ఒక్కొక్కటిగా నశించిపోతున్నాయి. మన ఇరువురం ఒకరికొకరం లేని మన జీవితాలు జీవితాలే కాదు. నీవు లేని జీవితాన్ని జీవించేదెలా అంటూ తన  విరహాన్నీ,ఒంటరితనాన్ని వ్యక్తపరుస్తాడు.

 

కిశోర్ కుమార్ పాడిన ఈ పాటను ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/play/?id=2611

 

ఆశా భోంస్లే పాడిన వర్షన్ ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/play/?id=2608

 

ఈ సినిమాని “ప్రేమ తరంగాలు” పేరుతో 1980లో తెలుగులో రీమేక్ చేసారు. కృష్ణంరాజు, జయసుధ, చిరంజీవి ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ “ఓ సాథీ రే” పాట అదే బాణీలో ఈ సినిమాలో లేదు. ఇంతకు ముందే 1979 లో “రంగూన్ రౌడీ” చిత్రంలో అదే బాణీని “ఓ జాబిలీ.. వెన్నెలా..ఆకాశం ఉన్నదే నీ కోసం” పాటకు వాడుకున్నారు. తెలుగులో వేటూరి రచించగా, బాలూ, సుశీల గానం చేసారు. చిత్రకథ తెలీదు కానీ పాట మాత్రం సోలో గా, డ్యూయెట్ గా రెండుసార్లు వస్తుంది సినిమాలో. ఆ పాటను ఇక్కడ వినవచ్చు..

http://www.raaga.com/player4/?id=194215&mode=100&rand=0.9781879493966699