కవిత్వం

నీది కాదు!

నవంబర్ 2017

ప్రియాలు అప్రియాలు
సృష్టించే గాలి అద్దంలో
ఆపాదమస్తకమూ మారిపోయిన
ప్రతిబింబం నీది కాదు!

ప్రేమలూ కోపాలకి
ఎటో ఒకవైైపు ఎగిరిపోయి
రాలిపోయే మనసు పొరలు!
నిజాలనుండి దొర్లిపోయిన పదాలలో
ఉనికి నీది కాదు!

దూరం దగ్గర అని
భ్రమలు గీసిన రేఖల్లో
జ్యామితి తెలియని అనుభూతుల్లో
బంధం నీది కాదు!

ఎక్కువని తక్కువని
ఎగిరిన ఎత్తుల్లో జారిన పల్లాల్లో
మజిలీని మరిచిపోయిన
ప్రయాణం నీది కాదు!

జననాలు మరణాల ఫలితమై
కదిలిపోయే నమ్మకాల బాటల్లో
కాలానికి చిక్కిన అవధుల్లో
జీవితం నీది కాదు!