కథ

భిక్షువు

డిసెంబర్ 2017

స్సాం వచ్చిన కొత్తలో అసలేమీ తోచేది కాదు. ఈయనేమో, ‘కాంపులు కాంపులు’ అంటూ ఇంటిపట్టున ఉండరు. ఎంత ఉదాసీనంగా ఉంటుంది తనకు. చుట్టుపక్కలవారికి కొందరికి హిందీ వచ్చు. తను చిన్నప్పుడు బొత్తిగా అశ్రద్ధ చేసింది. ‘నీంద్‌ ఖానా’ ఏవో నాలుగు రైల్లో వినిపించే ముక్కలు అంతే. శుకకు రెండేళ్లు వచ్చేదాకా అమ్మ ఉండి వెళ్లింది. ఇప్పుడు నాన్న ఆరోగ్యం బాగా లేదని చెప్పి కర్నూల్లోనే ఉంటోంది. వాలంటరీ తీసుకోమంటే నాన్న మండిపడతాడు. ఈయన వాలకం చూస్తే అసలు తన ఉనికి గుర్తించాడా లేదా అన్నది అనుమానం. దుమ్ము రేగుతుంది. రోడ్డు మీద ఏదో జీపు. ఇంత ఎండలో చినుకుల చప్పుడు. శుక వచ్చీరాని మాటలతో ఏదో చెబుతుంది. బయట ఆరేసిన బట్టల గురించేమో. ఉట్టి పావడా వేసుకొని, బోసి భుజాలతో బొద్దుగా కన్పార్పకుండా చూసే శుక- నవ్వాగేది కాదు పూర్ణకు.

పాతకాలం ఇల్లు. వచ్చిన కొత్తలో ఆయన ఇంకో ఇంటికి మారదామన్నా తనే వద్దంది. ఊరికి దూరంగా ఉన్నా నష్టమేముంది? అయినా తెలిసిన ఊరా ఏమిటి – తనకు ఇక్కడే హాయి అనిపించింది. ఇంటికి రెండు మైళ్ల దూరంలో గుడి కూడా ఉంది. విసుగ్గా అనిపిస్తే, అమ్మ ఉన్నప్పుడు కాలి నడకనే వెళ్లేవారు. ఆయనకు ఎంతసేపూ ఆఫీసు. గుళ్లూ గోపురాలు పెద్ద పట్టింపు లేదు. అత్తయ్య, మామ వచ్చినప్పుడు కూడా అంతే. జీపు ఇచ్చి పంపారు, కానీ ఆయనైతే రాలేదు. అత్తయ్య సర్దుకుపోయింది, ‘వాడిదో లోకం, నీవంత ఇదవబోకు,’ అని. మనవరాలిని గుండెల మీద కూచోబెట్టుకుని మామ ఏవో మాటలు చెబుతూ ఉండేవారు. ఎవరయినా, ఇలా వచ్చి వెళుతుంటే బావుంటుంది. తమ్ముడు ఒకసారి వచ్చి రెండు వారాలు ఉండి వెళ్లాడు. వాడి పుణ్యమా అని తను అరుణాచలప్రదేశ్‌ పూలదారులన్నీ చూడగలిగింది. ఇద్దరూ…స్కూలు పిల్లలైపోయారు – ఎంత ప్రశాంతంగా ఉంది అక్కడివారి జీవనం. మనం అనవసరంగా పరిగెడుతున్నామా? అనిపించింది. తమ్ముడు పూవులు కోయబోతుంటే తను వారించింది. ‘అక్కా, నీవేమీ మారలేదే,’ అని ఆట పట్టించాడు. వాడెక్కడో హెల్సింకీలో తేలాడు. ఫోనుకే పరిమితం అనుబంధం.
ఈయన దేనికీ అడ్డు చెప్పరు. అప్పుడప్పుడు అస్సామీల ఇంటికి విందుకు తీసుకు వెళుతుంటారు. అందరూ ఆత్మీయంగా పలకరిస్తారు. తనకే బెరుకు పోలేదు. కొందిరికి మంచి గాత్రశుద్ధి ఉంది. వారు పాడుతుంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. ఒకరోజు సైకియాగారని, వీరి డైరెక్టరు. చాలా నెమ్మదస్తుడు. మా ఇద్దరినీ వారింటికి తీసుకువెళ్లాడు. వారి తాతయ్య గొంతెత్తి ఆలాపిస్తున్నారు. పాట కాదు, శ్లోకం. ‘కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ.’ ఒక్కక్షణం అప్రతిభురాలినయి పోయాను. ఆయన నా వంక తేరిపార చూశారు. కానీ, నా మనసక్కడ లేదు.

2

కాలేజీ రోజుల్లో నన్ను ‘పెంకె’ అనేవారు. నా గురించి నేనెప్పుడూ అలా అనుకోలేదు. అందరితోటి సౌమ్యంగానే ఉండేదాన్ని. కొంచెం నాట్యం పిచ్చి ఉండేది. నేను మరీ అంత ఎక్కువ సాధన చేయలేదు. కానీ అలా అలవడిన అభినయం ఉండిపోయింది. కానీ, నాకు చచ్చేంత సిగ్గు. ‘అత్తిపత్తి’ అని ఏడిపించేవారు. నేను బింకంగా ‘ఊఁహూ’ అని తల తిప్పినా…వారి మాటల్లో సత్యం ఉందని నాకు తెలుసు. రాజీ, సరిత బాగా అల్లరి. నన్ను సభలనీ, సంగీతమనీ బాగా తిప్పేవారు. నేను నోరు తెరవలేనని తెలిసే, వారెక్కడికి వెళ్లినా, నన్ను లెక్కలోనికి వేసుకొనేవారు. అమ్మాయిలు నలుగురం చిన్న రూపకం ప్రాక్టీస్‌ చేస్తున్నాం. నాది చాలా చిన్న పాత్ర. వ్యాసుడు కాశీని శపించబోయే సమయంలో, అతని ఆకలి తీర్చే ఘట్టం. వ్యాసుడు శాంతించి అంజలి ఘటించడం అంతే. చాలాసార్లు రిహార్సల్స్‌ చేశాము. అయితే, వారు నాకు చెప్పకుండా దాచినదొకటుంది. వ్యాసపాత్ర, పొడవుగా, లావుగా ఉండే నీరజకు మీసాలు, గడ్డాలు తగిలించి తీసుకువస్తారని నా ఊహ. దూరం నుండి వ్యాసుడు…హుందా నడక, బవిరి గడ్డం…పెద్ద నాసిక…మేకప్‌ బాగా కుదిరింది అనిపించింది. శపించబోతున్నప్పుడు నేను ఒక భంగిమలో ప్రవేశించాను. నామీద లైట్‌ ఫోకస్‌. మ్రాన్పడిపోయిన వ్యాసుడు. ఇవన్నీ గమనించక నా పని నేను చేసుకుపోతున్నా. ‘కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ’ అని గొంతు విప్పేదాకా విషయం నాకర్థం కాలేదు. అతను నా పాదాలకు నమస్కరించిన తర్వాత నేను అంతర్దానమైపోవాలి. ఎంతో భక్తిభావంతో, కనుల దూకుతున్న బాష్పధారతో…నా పాదాలను స్పృశించాడు. కందిపోతాయా అన్నంత మృదువుగా – అంతే! నాకేమైపోయిందో తెలియదు. నేను తూలిపడకుండా అతనే ఎత్తి పట్టుకున్నాడు. తెర వాలిపోయింది. మరీ ఇంత కాలానికి ఆ శ్లోకం విన్నాను కదా!

3

ఆయన నా గురించి ఏదో చెబుతున్నాడు…డైరెక్టరుగారితో తిరిగి వస్తున్నప్పుడు…ఆరోజు పక్కకు ఒత్తిగిలి పడుకున్నానుగానీ బొత్తిగా నిద్ర పట్టలేదు. విశ్వం, ఏం చేస్తున్నాడో! అయినా నేనింత కఠినంగా ఉండగలనని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏదో సంగీతసభకు సరితా, నేను వెళితే అతనూ వచ్చి ఉన్నాడు. గడ్డాలు అవీ లేవు కదా, నేను గుర్తుపట్టలేకపోయాను. సరిత పలకరిస్తుంటే నేను బెల్లం కొట్టిన రాయిలా నిలబడి చూస్తున్నా. ‘విశ్వం, ఈమె అన్నపూర్ణ,’ అని పరిచయం చేస్తుంటే నా గుండెదడ హెచ్చింది. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. తమాషా ఏమిటంటే అతను, ‘అలాగా,’ అని తల పంకించాడు. అంతకన్నా ఎక్కువ లేదు. ఈలోగా సభ ప్రారంభం. అతనెందుకో సభ మధ్యలో లేచి వెళ్లడం నేను గమనించాను.

4

‘‘అమ్మా! మంచినీళ్లు!’’ ఒక్కొక్క గుటక నెమ్మదిగా తాగి హాయిగా నిద్రపోయింది శుక అర నిమిషంలో. ఎందుకో నవ్వుతుంది లేలేత పెదాలతో. నన్ను చూసి కాదు కదా? నన్ను చూసి నవ్వని వారు లేరు! ఒకరోజు వెంకటరమణ స్వామి గుడికి బయల్దేరాను, ఎవరికీ చెప్పకుండా. రాజీ, సరితా ‘ఏం మొక్కుకున్నావే చెప్పు,’ అని ఊపిరి ఆడనివ్వరు. అదేం చోద్యం, గుడి సందులో చింతతోపు మీద కోతుల గుంపు. ఎప్పుడూ ఉండేదే. మనిషంత కోతి తటాలున దూకి నా చేతిలోని బుట్ట లాక్కునేసరికి చేష్టలుడిగి నిలబడిపోయాను. రక్కుతుందేమోనని భయం. బలిష్టమైన హస్తం, నన్ను అవతలకు లాగింది. వాటిని అదిలించే పెద్ద గొంతు. విన్నట్టుగానే ఉంది. ‘ఒంటరిగా వచ్చారేం,’ నా వణుకు తగ్గలేదు. విశ్వం, మారు మాటాడకుండా గుడి దగ్గర దింపి వెళ్లాడు.

రాజీ, సరిత వాళ్లు కదిలిపోయేలా నవ్వారు, ‘నీ ప్రియుడు కోతి,’ అని. ఇదంతా చెప్పకుండా ఉండాలనిపించింది. ఇవన్నీ నిజం కోతులు! గుడి దగ్గరివి చాలా నయం.

5

మకాం మద్రాసుకు మార్చాక, నాకెందుకో బాగా వెలితిగా అనిపించింది. నాన్న ఆఫీసు, నేను కాలేజి. తమ్ముడు తాతయ్య దగ్గర ఆంధ్రలోనే ఉండిపోయాడు. అమ్మ కుట్టుమిషన్‌తో కుస్తీ పడుతుంది. అదో సరదా. అష్టలక్ష్మి దేవాలయం దగ్గరకు నన్ను తీసుకు వెళ్లింది చుట్టాలావిడ. అక్కడ తెలుగు అక్షరాలను చూసి ముచ్చట పడుతుంటే, ఈవిడగారు గుంపులో కలిసిపోయారు. దగ్గరగా సముద్రం అలలు ఎగిరెగిరి పడుతున్నాయి. ‘ఎలారా భగవంతుడా ఇల్లు చేరడం,’ అని విచారిస్తున్నా. ఎండ తగ్గు ముఖం పడుతోంది. పూవులు కట్టేవాడు, ‘ఉంగళ్‌,’ అని ఏదో సైగ చేస్తున్నాడు. దవనం వాసన గుప్పుమంటోంది. గుంపులో ఎవరో వ్యక్తి చేయి ఊపుతున్నాడు! నన్నా? నమ్మలేకపోయాను. ‘పూర్ణా,’ లీలగా కంఠస్వరం. విశ్వానిదే! ఆరోజు చీకటి పడేదాకా చాలాసేపు మాట్లాడుకున్నాం.

6

ఏదో పరీక్షకని చెప్పి తిరువనంతపురం ప్రయాణం. నాన్న కొలీగ్‌ ఇంట్లో బస. కొంచెం పెరిగిన గడ్డంతో విశ్వం. నాకు జీవితంలో మొదటిసారి గాలిలో తేలిపోతున్నట్టనిపించింది. కిటికీలోంచి చీకట్లు కమ్ముకొస్తున్నాయి. ఎన్నెన్నో మాట్లాడుకొన్నాక విశ్వం, మౌనంగా మారిపోయాడు. రాత్రి చుక్కలు మెరుస్తున్నాయి. Farm houses దూరదూరంగా కనిపిస్తున్నాయి. ఠకీ ఠకీమని రైలు శబ్దం! తమిళం తగ్గి మలయాళం వినిపిస్తోంది. నాకంతా వింతగానే తోస్తోంది. చేయి పట్టుకొని వదల్లేదు. ఎంత అమాయకత్వం. తిరుగు ప్రయాణంలో ఇద్దరం దిగులుపడ్డాం. ఎంతో దగ్గరైనా, దాన్ని మించిన దూరం ఉందనిపించింది నాకు! మళ్లీ శుక నిద్ర లేచినట్టుంది. కాసేపు జోకొడితే ఆవలించి నిద్రపోయింది, అటు తిరిగి. కిటికీ కర్టెన్లు ఊగుతున్నాయి. ఏదో వాహనం వెంటపడి మొరుగుతున్నాయి కుక్కలు. చిరిగిన కాలెండర్‌ గోడను రాచుకొని శబ్దం చేస్తుంది. ఎంతకాలం గడిచిపోయింది?

7

గుడిలో ఎవరో సాధువు వచ్చారని, పక్కింటి జతిన్‌ చిలవలు పలవలుగా వర్ణించి చెబుతున్నాడు. అమ్మ ఉంటే ఆయన దర్శనం చేసుకొని వచ్చేవారం. కానీ, ఆయన ఎవరితో మాట్లాడరట. ఆయనకు తోచిన సమయంలో భిక్షాటనకు బయల్దేరతాడట. రోజంతా గుడిలో ఓ మూల ధ్యానం! కొండ మీద గుడి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది? ఆయన అందుకే అక్కడే ఉండిపోయినట్టున్నారు. శుక, పెరట్లో టమోటా ఆకులను నులిమి వాసన చూస్తోంది. పోస్ట్‌మాన్‌ గొగోయ్‌ని చూస్తే ప్రాణం లేచి వస్తుంది. ఉత్తరాలు, వీక్లీలు వస్తుంటాయి. ‘పూర్ణో…శుకో,’ అని ఆప్యాయంగా, ఐదు నిమిషాలైనా గడిపి వెళతాడు. ఎండ మండిపోతోంది. శుక ఎంత చెప్పినా లోనికి వచ్చి పడుకోవటం లేదు. చెట్లు నిదానంగా కొమ్మలూపుతున్నాయి. శుక, ‘అమ్మా! అమ్మా!’ అని ఒకటే పిలుస్తోంది. జతిన్‌ భార్య మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ‘సాధు…భిక్ష’ అంటూ… మూడు దోసిళ్ల బియ్యం పోసుకొని వచ్చాను – రాగిపాత్రలో. స్కూలు పిల్లలు పొలోమని పరిగెత్తుకు వెళ్తున్నారు. ఆయన ఏదో గానం చేస్తున్నారు. శుక ఆయనను లోనికి లాక్కువచ్చినంత పని చేస్తోంది. ఆయన వారించి…ఎడంగా నిలబడి శంఖం పూరించి భిక్షాన్నర్థించారు, ‘కృపావలంబనకరి,’ అంటూ. నా పాదాలు వణికాయి. నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. వంటి మీద ఏ ఆచ్ఛాదన లేదు, కౌపీనం తప్ప. పెద్దగా పెరిగిన గడ్డం. దగ్గరిగా వెళ్లే కొద్దీ…వళ్లు స్వాధీనం తప్పుతోంది. పాత్ర కిందపడి బియ్యం చెల్లాచెదురైపోయాయి. పాదాలను తాకి నమస్కరించబోయాను. నా కళ్లనిండా నీళ్లు. ఆయన ఒక్కడుగు వెనక్కు వేశారు.

‘భిక్షాందేహి మాతాన్నపూర్ణేశ్వరీ,’ అని నా పాదాలు ఎంతో భక్తిగా తాకారు. అవే చేతులు…అదే స్పర్శ…‘విశ్వేశ్వరా,’ అని ఆక్రోశించాను. కన్నీళ్లు ఆగడం లేదు. నిలువరించుకోలేక తూలిపడబోయాను. తటాలున రెండు చేతులతో అవలీలగా నన్ను ఎత్తుకొన్నారు. పైట గాలికి ఎగిరి ఆయన మొహాన్ని కప్పింది. శుక ఏడుస్తోంది. నాకేమీ గుర్తులేదు.

**** (*) ****

ప్రధమ ముద్రణ: సముద్రం కథా సంపుటి జనవరి 2004