యావజ్జీవితం శాసన పరిశోధనకు అంకితమై ఆంధ్ర చరిత్ర రచనకు ఆకరాలు అందించిన పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి జయనామ సంవత్సర బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము.
శాసనాధారాలతో కాకతీయ వంశానుక్రమణిక, నాణాల పరిశీలనతో శాతవాహన శక కాల నిర్ణయం చేసి పరిశోధకుల మెప్పు పొందారు. సంస్కృతం మీద గల పట్టుతో ఎన్నో బ్రాహ్మీ లిపి శాసనాలను అవలీలగా పరిష్కరించారు . పన్నెండు గ్రంథాలు రచించారు . ఇటీవల వచ్చిన, శాసనాల్లో ఉన్న అన్నమాచార్యుల కీర్తనల పుస్తకానికి సహా సంపాదకత్వం వహించారు 94 ఏళ్ల నిండు వయసులో పరిశోధనలో మునిగి తేలే వారి జీవితం భావి పరిశోధకులకు ఆదర్శ ప్రాయం.
జీవిత విశేషాలు: గుంటూరు జిల్లా పెద కొండూరు లో జననం (1921), గురుకుల పద్ధతిలో సంస్కృతం చదువుకున్నారు, కాశీలో ఉన్నత విద్య, ధార్వాడ్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో డాక్టరేట్, పురావస్తు శాఖలో దీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ. ప్రస్తుత నివాసం నల్లకుంట , హైదరాబాద్.
మన కాలపు గొప్ప పరిశోధకులు, ప్రాచీన శాసనాలను చదవడానికి, చరిత్ర పరిశోధనకు మార్గదర్శి పరబ్రహ్మ శాస్త్రి గారికి ఈ పురస్కారం ఎంతో గొప్పగా ఉంది. అది చరిత్ర పట్ల మన గౌరవాన్ని మరింత పెంచుతుంది. – ప్రభు, కాకినాడ