కవిత్వం

అతడొక కావ్యం

జనవరి 2018

నిర్లక్ష్యంగా అతను ఒడ్డుకి విసిరేసిన ఆల్చిప్పలు ఏరుకుని
ఇసకలో ఆటలకొచ్చిన పిల్లలకి అమ్ముకుంటుంటాను

ఆకలేసినప్పుడు పక్షినై
చేపలు రెండు ముక్కున కరుచుకుని
తీరానికి ఎగురుకుంటూ వచ్చేస్తుంటాను

ఆకాశం అతని మీదకి వంగి చెప్పిన ఊసులేవో
కెరటాల హోరులో గుసగుసలుగానో,
వికటాట్టహాసంగానో వినిపించినప్పుడు
రహస్యమేదో చేతికి చిక్కినట్టు సంబరపడిపోతుంటాను

పున్నమినై పైకెగసినప్పుడు
ఆవలి తీరాన అంతులేని ఖండాలతోనూ,
అందమైన వనాలతోనూ సరసాలాడుతూంటే
అసూయతో కృశించిపోతుంటాను

అతని వైశాల్యాన్ని కొలుద్దామని
నావనై లోపలికి పోయినప్పుడు
తుఫానులో చిక్కుకుని అల్లాడిపోతుంటాను

నదినై అతనిలోపలికి చొచ్చుకుపోవాలని,
అతని దాహం తీర్చాలనీ ఆరాటపడుతుంటాను కాని,
అస్తిత్వమో అహమో అడ్డొచ్చి ఇసకలోకి ఇంకిపోతుంటాను

బడబాగ్నిగా బద్దలై ప్రళయ భయంకర రూపంతో అతను చెలరేగినప్పుడు
ఒడ్డున ఒద్దికగా గడ్డిపోచనై ఆశ్చర్యంతో చేతులు జోడిస్తాను.

అతని కడుపులోని అమృతాన్ని దోచుకుందామని సాగరమథితంలో
వలవిసిరిన ప్రతిసారీ ఏవో పద్యాలు ఒడిలో నింపుకుంటాను.