1
అప్పటి దాకా సంగీతం నేర్చుకుంటున్నట్టు ఊగిన లేత కొమ్మలు
ఉరిబిగుంచుకుని విరిగిపడిన నిశ్శబ్దం
అక్కడ పొద్దున్నే ప్రార్ధనా గీతంలా వినిపిస్తుంది.
వాళ్ళు నడిచే దారంతా
మొక్కల్ని పూలు పూయనీకుండా
రహస్యం దాచినట్టు నేల
మెడ వాల్చేసిన మొగ్గలతో
రణభూమిలా కనిపిస్తుంది
ఆ ఉదయపు ఒళ్ళో
చలినెగళ్ళు కాసిన వెచ్చదనం లేదు
జారుడుబల్ల మీంచి ఎవరూ కిందపడలేదు
బబుల్ గమ్ నమిలి భూగోళంలాంటి బుడగలు ఊదలేదు
ఇక్కడెవరూ
కాళ్ళూ చేతులాడని ఇరుకు తరగతి గదుల్లోంచి
ఆటస్థలం వెతుక్కుంటూ బయటకి తిరగట్లేదు
కలలు దీరని ఎర్రటి నిద్ర కళ్ళతో
స్కూల్ దారి మాత్రం
రోజూ వచ్చే బోన్సాయ్ దేహాల కోసం బెంగ పడుతుంది.
2
ఆత్మదీపాల్ని ఆర్పేస్తున్న చిక్కటి చీకటేదో
వెన్నుపూస రాని వీపు మీదనుంచి
శరీరమంతా దిగులుగా పరుచుకుంటుంటే-
మోస్తున్న బరువేంటని అడగలేరు గానీ
స్కూల్ బేగెప్పుడూ భేతాళుడి ప్రశ్నలాంటిదే!
అది పిట్టలు వాలని చెట్టుమీదకి
రాజు దగ్గర లేని సమాధానంలా నవ్వి పారిపోతుంది
ఇప్పుడా చెట్టుకి తియ్యని పూలూ పళ్ళూ కాదు
నిగనిగలాడుతూ లోహ పంజరాలు వేలాడుతున్నాయి
3
నెలతప్పిన అమ్మ కలల మీద
బడి గంట గురిచూసి గేలమేస్తుంది గానీ
పోటీ పరీక్షల్ని రాసేసిన ప్రతీ బాల్యం
తెల్లగుడ్డ కప్పుకుని ముఖం దాచేస్తుంది.
క్రమశిక్షణతో కోచింగ్ తీస్కుంటున్న బానిసలకి
ఆశల తీరం తెలీని గెలుపొక్కటే కావాలి
చదువిప్పుడు
ఒత్తిడికి పగిలిన నల్ల పలక మీద
బుద్దిగా ఓనమాలు దిద్దమంటుంది
బిరడా వేసిన గాజు సీసాలోంచి
తూనీగల్ని, సీతాకోకచిలకల్నీ
రెక్కలు తెగ్గోసుకుని స్వేచ్చగా ఎగరమంటుంది.
4
ఈ దారిలో ఇప్పుడెవరైనా ఆకాశాన్ని పరచండి.
ఎంత బాధ సార్ పిల్లలది చాలా బాగా రాశారు బహుశా ఈ కోణం లో పిల్లల గురించి ఆలోచన చేసిన కవిత్వం రాలేదేమో బావుంది మీకు అభినందనలు
Very good poem.
చాలా బావుంది కవిత. మనసుని కదిలించింది.
గాఢమైన అభివ్యక్తీకరణ, లాలిత్యమైన పద భావన