కథ

అతడు

ఫిబ్రవరి 2018

తరవాత అరగంటలో పోలీసులొచ్చేరు.

వాళ్ళు మెట్లు దిగి బేస్ మెంట్ గదిలోకి వచ్చేసరికి అతను కంప్యూటరు ముందు కనిపించాడు. కూచుని ప్రశాంతంగా నిశితంగా కళ్ళజోడు లోంచి తెరమీది గళ్ళనీ, అంకెల్నీ చూస్తున్నా డతను . ఒకసారి ఆగి అతన్ని చూసాడు ఇన్ స్పెక్టరు. మధ్యలో కీబోర్డుని టైప్ చేస్తుంటే అతన్నీ కంప్యూటర్నీ  కీబోర్డు పని చేయిస్తున్నపించింది. ఇన్ స్పెక్టరు బాగా దగ్గిరికి వచ్చిన తరవాత గానీ అతను గమనించలేదు. తలెత్తి చూసి ఆశ్చర్యపోయాడతను.

రాత్రి ఏడున్నరయింది. గది వేడిగానూ లేదు, చల్లగానూ లేదు. అతనికి ఎలాగూ అనిపించడం లేదు. చిన్న గది. పక్కగోడకి కిటికీ. చెక్క టేబిలు ముందు మూడు కుర్చీలు. ఒక చెక్క కుర్చీలో కూచున్నాడతను. రెండు కుర్చీలు అప్పుడే ఖాళీ అయ్యేయి. ఆఫీసుకొచ్చిన ఇన్ స్పెక్టరు, మరోవ్యక్తి ఇంతసేపూ అతనితో మాట్లాడి వెళ్ళేరు . అతను ఊపిరి పీల్చుకున్నాడు. అతని ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. అతని ప్రాజెక్టు రిపోర్టుల్లాగ. అడిగినవే అడిగి, అడిగినవే అడిగి న్యూసెన్సు, పైగా టైము దండగ. గడచిన పదిగంటల్లో బోలెడు పని అయి ఉండేది. కంట్లో నలక పడ్డట్టు ఈ గొడవ తెచ్చిపెట్టుకున్నాడు. టేబిలు కీబోర్డు మీద అతని వేళ్ళు కదుల్తున్నాయి. అతని ముందు తెర.  తెర లోంచి ఎవరో వచ్చి ఎదురుగా కూచున్నారు. అతని కనుబొమలు చిరాకుతో ముడిపడ్డాయి. వచ్చినతను సిగరెట్టు వెలిగించుకుని పెట్టె అతని ముందుకు తోసాడు.

‘’స్మోక్ చేస్తారా?’’

‘’చెయ్యను ….ఎప్పుడేనా’’

సిగరెట్టు వెలిగించుకున్నాడతను .

‘’కాల్చనంటున్నారు , అలవాటు లేదా ?’’

“అనిగాదు . కాలుస్తాను . ఒక్కోసారి కాలుస్తా….. కాలిస్తే కాలుస్తా . లేకపోతె లేదు.’’

పోలీసు అతనివేపు చాలా కళ్ళతో చూసాడు. అతని కళ్ళు మామూలుగా ఉన్నాయి. ప్రత్యేకించి భయం కనిపించడం లేదు. పోలీసు ఆశ్చర్యంగా అతనివేపే చూస్తున్నాడు. అతనికి పోలీసు స్టేషన్లో ఉండడం ఇష్టం లేదని మాత్రం అర్థవైంది. మాట్లాడకుండా సిగరెట్టు కాల్చుకున్నాడు. చటుక్కున అడిగేడు పోలీసు.

‘’మీకు ఎన్నాళ్ళు శిక్ష పడుద్దో తెలుసా?’’

‘’తెలీదు’’

‘’ అంటే నువ్వెంచేసేవో మర్చిపోయేవా?’’

‘’సారీ , ఎన్నేళ్ళు పడుతుందో తెలీదంటున్నాను.’’

‘’రెండ్రోజులు జైల్లో ఉంటే అన్నీ తెలిసొస్తాయి’’

అతనికి పోలీసు ఆగ్రహం ఎందుకో అర్థం కాలేదు. పొరపాటు జరిగిందని తను చెప్తూనే ఉన్నాడు గదా. ఈ వ్యంగ్యం, ఎగతాళి ఎందుకు? చిరాకనిపిచిందతనికి. మళ్ళీ వెంటనే ఆఫీసుకెళ్ళి పని మొదలు పెట్టాలనిపించింది. బెంగ పడ్డాడతను . రేపు బయటపడగలడా? ఆఖరి దమ్ము లాగి అటూ ఇటూ చూసి అన్నాడు.

‘’ ఏష్ ట్రే లేదా?’’

‘’ కొందాం. అక్కడ పారెయ్యండి.’’

‘’సాయంత్రం నాలుగ్గంటల్నించీ ఇప్పటి వరకూ మర్యాదగా అడుగుతున్నాం. పోలీసోళ్ళు  ఇంతసేపు మాటాడ్రు. మా స్టైలు మీకు తెలవదనుకుంటున్నాను. బాడీలో ఎక్కడేం జరిగిందో డాక్టర్లకి గూడా అంతుబట్టదు.’’

‘’ అంటే కొడతారా?’’

‘’ఇరగదీస్తాం.’’

‘’ఎందుకు?……. నేనబద్ధం చెప్పడం లేదు . కొట్టడం దేనికి?  నేనేం నేరస్తుణ్ణి కాదు గదా? జైలు శిక్ష అంటున్నారు . వెయ్యండి . మీ ప్రాబ్లం ఏవిటి?’’

పోలీసు టీ గ్లాసు వేపు చూసాడు. దాన్ని అలాగే గుప్పిట్లో పగలగొట్టా లనిపించింది .

‘’ఒప్పుకోడం కాదు. అసలు కథంతా కావాలి. ఏ వూరు మీది?’’

‘’ తెనాలి’’

‘’అక్కడెవరున్నారు? మీ ఇంటి ఎడ్రసూ, ఫోన్ నెంబరూ …’’

‘’అవన్నీ ఎందుకు?’’

‘’మీ ఇంటికి తెలియజెయ్యడానికి’’

‘’వాళ్ళకీ దీనికీ సంబంధం లేదు.’’

‘’అసలు నువ్వు చదువుకున్నోడివేనా? నువ్వేం మాట్లాడుతున్నావు?’’

‘’వాళ్ళని ఇందులోకి లాగడం నాకిష్టం లేదు.’’

‘’మీ ఇష్టం ఎవడిక్కావాలి? అమెరికాలో చదివేవంట గదా? ఏం లాబం ?’’

‘’అంటే నాకర్థం కావడం లేదు. యూఎస్ లో చదివేను. ఓకే.’’

‘’ఎక్కడ చదూకున్నా ఒకటేనంటావు?’’

‘’లేదు. అక్కడ మనకంటే మంచి యూనివర్సిటీలున్నాయి.’’

పోలీసు అతనివేపు ఆశ్చర్యంగా చూసాడు. చటుక్కున లేచి వెళ్తూ అన్నాడు.

‘’నీకేవేనా మెంటలా?’’

ఈసారి అతను ఆశ్చర్యపోయాడు. తనకి అంతా స్పష్టంగానే ఉంది. వీళ్ళకి ఎందుకింత చిక్కుముడిగా కనిపిస్తోందో అర్థం కావడం లేదు. స్పష్టంగా అయిదారు వాక్యాల్లో తప్పు తనదేనని చెప్తుంటే అన్ని ప్రశ్నలు అడగడం దేనికి? అతనికి విసుగనిపించింది. నిస్సహాయంగా కీబోర్డు మీద అతని వేళ్ళు కదుల్తున్నాయి.

***

పది అంతస్తుల ఐటి కంపెనీ.  మిగతా కాంక్రీటు, గ్లాసు గొట్టాల్లాంటి కంపెనీల్లో అది ఒకటి. ఉదయం పది దాటగానే తేనెపట్టుల్లాంటి కంపెనీల్లో కందిరీగల రొద. మొదటి రెండేళ్ళూ అతను ఐదో అంతస్తులో పనిచేసాడు. ఇంటికీ తేనెపట్టుకీ మధ్య రొదగా వచ్చి వెళ్ళడం. చెట్లు కూడా పచ్చగా శుభ్రంగా ఉండే ప్రాంతంలో ఉంటాడతను. నల్లటి రోడ్లు,  తెల్లటి గీతలు, రోడ్డు మధ్యలో పూలమొక్కలు , చల్లటి కార్లోంచి వాటిని చూస్తూ, వెళ్లి వస్తూ అయిదు నుంచి ఆరో అంతస్తూ , అక్కణ్ణించి భూమికింద చల్లటి పొట్టలో, బాగా ఎదిగిన పిండంలా ఉంటున్నా డతను. నిజాని కతనికి పైకి రావడం ఇష్టం ఉండదు. కొన్నాళ్ళు మూడో అంతస్తులో కాంటీన్ లో తిండి తినేవాడు. ఒక మూల చూసుకుని సాధ్యమైనంత త్వరగా కోడి గింజల లంచి చేసేవాడు. మాటల శబ్దం, పలకరింపులూ నాలుగైదు వాక్యాల తరవాత తల మీద వడగళ్ళ వానలా పడేవి. పారిపోడానికి కుదిరేది కాదు. ఫోను మోగింది. ‘’సర్’’  ‘’ఒకసారి వెంటనే రాగలరా?’’  అరనిముషంలో మెత్తగా జుత్తులోంచి దువ్వెనలా లిఫ్టులో పైకి వెళ్ళేడు. నీలంగదిలో తెల్లగా కూచున్నా డాయన. ఎదుటి కుర్చీలో నిశ్శబ్దంగా కూచున్నా డతను. అతనికా గదిలో చాలా సేపు కూచుని ప్రాజెక్టు గురించి మాట్లాడ్డం ఇష్టం .

‘’okay. సోమవారం అర్జంటుగా మీరు డెన్మార్కు వెళ్ళాలి. పదిహేనురోజులు.’’

‘’ యస్ సర్ .’’ (‘’I want to hug you.’’)

‘’good’’

దరిదాపు గంటసేపు ఆయన తెరమీద ప్రాజెక్టుని ముక్కలు చేసి అంకెలు వేసి టేబిల్సులో ఇరికించి కింద నీలపు అక్షరాలలో డాలర్లని రూపాయలు చేశాడు. ప్రాజెక్టు రుచికరంగా అనిపించిం దతనికి. దువ్వెనతో కిందికి దువ్వుకున్నట్టు మెత్తగా కిందికి వెళ్ళిపోయాడతను. అప్పటికే అతను డెన్మార్కు లో ఉన్నాడు. అతనికి సంతోషంగా ఉంది. కూచుని వెంటనే కంప్యూటరు తెరిచాడు. వేళ్ళు వాటంత అవే కదులుతున్నాయి. తెరమీది అంకెలు అతనికి నీలాకాశంలో పక్షుల్లా కనిపిస్తున్నాయి. రాధిక రావడం చూడలే దతను. ఫైల్సు టేబిలు మీద పెట్టిన తరవాతగా చూశా డతను.

‘’ఏ లోకంలో వున్నారు?’’

‘’డెన్మార్కు’’

పది నిముషాలు మాట్లాడి వెళ్లిపోయిం దామె. ఆమె డియో కొంచెం విడిచి వెళ్ళింది. కొంచెం ఆమెని పీల్చుకుని ఫైలు తెరిచా డతను. ముందు పేజీలు చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ఎక్కువ పేజీలు చదవడం టైము దండగ. సరిగ్గా అయిదు పేజీలు, మరో నాలుగు పేజీల అంకెలు. ఇష్టంగా పేజీలు తిప్పేడతను.

డెన్మార్కు నుంచి వచ్చీ రాగానే అక్కణ్ణించి అతని గురించి ఆఫీసుకి మంచి మెయిల్ వెంబడించి వచ్చింది. సంతోషంగా ఉందతనికి.  కేంటీన్ లో టీ తాగుతూ కూచున్నా డతను. కింద పచ్చటి పచ్చిక,రెక్కలు ముడుచుకున్న ఇనుప పక్షుల్లా రంగురంగుల కార్లు. వెరీ నైస్. అట్లా కిందికి చూస్తూండడం ఇష్టం అతనికి. ఇద్దరు ముగ్గురు వచ్చి పలకరించి వెళ్ళేరు. అంతా అవాస్తవంగా కనిపించిం దతనికి.

‘’నన్ను గూడా డెన్మార్కు తీసుకెళ్లచ్చుగా’’ ఎదురుగా కూచుంటూ అంది వసంతా బార్వే . తెర తొలగించుకుని చూశాడతను. నవ్విందామె. చెయ్యిజాపి ‘’కంగ్రాట్స్’’ అందామె. ఆమె వెచ్చటి మెత్తటి చేతిని తన చల్లటి అరచేతిలో నొక్కి అలాగే ఉంచింది వసంత. అతనలాగే ఉంచుకుని నవ్వేడు. నవ్వినా తరవాత ఏం మాట్లాడాలో తెలీలే దతనికి. ఆమె చేతులు అతనికి కొత్తగాదు. ఒకసారి సినిమా చూస్తూ అతని చెయ్యి పట్టుకుని భుజం మీద తలపెట్టుకుని కునుకు తీసిందామె. చెయ్యి తీసుకుంటూ అడిగింది.

‘’ఏం చేస్తావు రోజూ నువ్వు?’’

‘’పని’’

‘’ఊ. సాయంకాలం?’’

‘’ఇంటికెళ్ళి ఒక బీరు తాగుతాను. ఎగ్ బుర్జీ అప్పుడప్పుడు. రెస్టు తీసుకుని పని. దట్సాల్.’’

ఆమె అతని వేపు అట్లాగే చూసి చటుక్కున లేచి వెళ్ళిపోయింది. ఊపిరి పీల్చుకున్నాడతను. ఏం చేస్తాడు, సాయంత్రం, రాత్రీ?  పదకొండవుతుంది పడుకునేసరికి . హాయిగా ఒక్కడే , కాసేపు టీవీ చూసి , బుద్ది పుడితే కాసేపు సినిమా చూసి, చాటింగ్ చేసుకుని, కంప్యూటరు ముందు కూచుంటాడు. ఈ ప్రపంచం చొక్కామీది చిమ్మెటలా కాసేపుండి ఎగిరిపోతుంది. ఏవిటి చెయ్యడం సాయంకాలం? వంట అవసరం అనుకుంటే చేసుకుంటాడు. భోజనం చేసి ఒక్కోసారి కిటికీ దగ్గిర నుంచుని సిగరెట్టు వెలిగిస్తాడు. అక్కణ్ణించి వెలుగుతున్న నగరం చూడ్డానికి బావుంటుంది. కిటికీ తెర మీద రాత్రి నగరం చూస్తాడు. వెరీనైస్ . ఇంకేంటి?    ఓ… అండర్ వేర్ తీసి లుంగీతో కంప్యూటరు ముందు కూచుంటాడు. ఇదంతా మెసేజ్ చెయ్యాలి వసంతకి. కొంచెం నవ్వుకుని వాచీ చూసుకుని లేచే డతను.

అతను డెన్మార్కు వెళ్ళొచ్చి ఏడాది అయింది.

***

రాత్రి బెంచీ మీద పడుకున్నాడతను. మధ్యాహ్నం బెయిలు దొరకవలసింది. మూడు రోజులు వాయిదా వేశారు. అతనికి కోపం, చిరాకూ పొరపాటున నమిలిన మిరపకాయ కారంలా. అతని ఆలోచనలు మళ్ళీ మిగిలిపోయిన పని మీదికి వెళ్ళేయి. కాస్త ఊరట కలిగింది. కళ్ళు మూసుకుని చేస్తూ వదిలేసిన పని గురించి ఆలోచిస్తూ కూచున్నాడు. మంచి కాఫీ తాగాలనిపించింది. ఇక్కడ టీ కూడా పోలీసు స్టేషను వాసనేస్తోంది.        Oh… The hell…  తను పొరపాటు చేసాడు. అసలు ఎప్పుడూ తొందరపడ్డం అలవాటులేదు. నిజానికి రాధిక మంచి అమ్మాయి. తెలివైంది. ఆమెతో  పనిచెయ్యడం నిజానికి తనకిష్టం. ఆ రోజు రాధిక వేగంగా వెళ్ళిపోగానే పదిహేను నిముషాల్లో నలుగురైదుగురు సీనియర్లు లిఫ్టు లోంచి వేగంగా కిందికి పది మెట్ల మీంచి కిందికి దొర్లు కొచ్చేరు. అప్పటికే అతను బాత్రూంలోంచి వచ్చి మంచినీళ్ళు తాగి కంప్యూటరు ముందు కూచున్నాడు. పొరపాటు చేశాడు. తనట్లా చెయ్యకుండా ఉండవలసింది. తొందర పడ్డాడు తను. తనెప్పుడూ అనవసరంగా తొందర పడ్డది లేదు. షిట్. చాలా మామూలుగా ఉంటాడు. అల్లా మామూలుగా ఉండడం తన కలవాటు. అలవాటని కాదు, ఇంకోలా ఎలా ఉండగలడు? వసంతకి అదే చిరాకు. ఆమె కళ్ళలో అప్పుడప్పుడు ఎగతాళి చూశాడతను. తను గమనించలే దనుకుటుంది. ఆమె ఎగతాళి, ఆ మాటకొస్తే ఆకర్షణ, మెత్తటి అరచెయ్యి, చక్కటి పెదాలు పట్టించుకునే ఆసక్తి లేదు తనకి. ఎప్పుడేనా , ఏమో చెప్పలేం. ఆమెకేం తెలుస్తుంది?  ఏ బీరు బావుంటుందో తెలుసు.

‘’నీకే బీరు ఇష్టం?’’

‘’నాకు బీరు ఇష్టం అని చెప్పేనా?’’

‘’ఉస్. పోన్లే what is your poison?’’

‘’any beer-any drink.’’

‘’నీకు ఇష్టం ఏవంటున్నాను?’’

‘’ అదే , ఒకటని కాదు. ఆపాటికి ఏది తోస్తే అది. ఓకే. నా లంచి టైము అయిపొయింది. చాలా పనుంది. See you’’ అతను కుర్చీల్లోంచి మనుషుల్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. లిఫ్టు దిగి కంపెనీ గర్భంలోకి వెళ్లి కూచున్నాడు.

వచ్చిన నలుగురూ మొదట ఏవీ అనలేదు. కళ్ళు పెద్దవిచేసి నిర్ఘాంతపోయి చూస్తూ నుంచున్నారు. ఎవరికీ నోటమాట రాలేదు. వాళ్ళలా చూస్తూ నుంచుంటే అతనికి చిరాకనిపించింది . పొడవాటి నిట్టూర్పు విడిచాడు.

‘’are you mad? రాధిక చెప్పేది నిజవేనా?’’

దరిదాపు వెంటనే తల ఊపే డతను. వాళ్లకి మళ్లీ మాట పడిపోయింది. అందులో అందరి కంటే సీనియర్ మేనేజరు మొహం ఎర్రటి బుడగలా అయిపోయి పేలడానికి సిద్ధంగా ఉంది.

‘’మీడియా రాస్కెల్సు ఒస్తారు. నీవల్ల మా పరువు పోయింది.’’ మేనేజరు చెయ్యి అసంకల్పితంగా లేచి అతని చెంప మీద పడింది. మాడిపోయింది చెంప. అతనికి కోపం రాలేదు. కొంచెం బరువు దిగినట్టనిపించింది. కాసేపు కోపం వాంతి చేసుకుని  వాళ్ళు వెళ్ళిపోయారు.

మరో అరగంట తరవాత పోలీసులొచ్చేరు.

అతనికి మళ్లీ డెన్మార్కు జ్ఞాపకం ఒచ్చింది. అక్కడే మరో ఏడాది ఉండిపోవాల్సింది. ఉదయం దిగేడు. డెన్మార్కులో కార్లో వెళ్తూ వెలిగిపోతున్న నగరాన్ని చూస్తే ఉదయమో, రాత్రో, పగలో, తెలీలే దతనికి. ఆ నగరం అంతా ఫ్రిజిడీర్లో ఉన్నట్టుంది.  తనకి ఆ చల్లదనం నచ్చింది. ఎముకల్లోంచి , కంట్లోంచి, చర్మంలోంచి చెమర్చే చలి. చర్మంలోకీ, అస్తిపంజరం లోకి కుచించుకుపోవడం సంతోషం కలిగించిం దతనికి. ఈ చలిహాయితో పాటు రోడ్లమీద , రెస్టారెంట్లలో పలకరించేవారు లేకపోవడం మరింత బాగుం దనిపించిం దతనికి. అతనెప్పుడు మాట్లాడాలనిపించినా చాటింగ్ ఇష్టపడేవాడు. ఎప్పుడంటే అప్పుడు కీ నొక్కితే గొంతు నొక్కినట్టే. తనతో ప్రాజెక్టులో పనిచేసే ఆరుగురు మాత్రం అతనితో మాట్లాడతారు. అదీ ఎక్కువ భాగం చేసే పని గురించి. పెద్ద ఊరట తనకి. అతని బృందంలో ఇద్ద రమ్మాయి లున్నారు. ఇద్దరూ అతనికి నచ్చేరు.  అందులో ఒక అమెరికన్ అమ్మాయి ఎప్పుడో ఒక హిందీ సినిమా చూసింది.(‘’nice songs.’’) రాధిక కూడా బాగా పని చేస్తుంది. అయినా వీళ్లిద్దరిలో ఏదో ప్రత్యేకమైన వాడి. లంచి టైములో ఆ అమ్మాయే ఎక్కువ మాట్లాడుతుంది.

‘’మీకు పెళ్లయిందా?’’ అందామె.

‘’లేదు’’

‘’ఇలాగే ఉంటావా?’’

‘’హాయిగా వుంది. ఇంట్లో ఒత్తిడి తెస్తూంటారు. నువ్వు?’’

‘’ప్రస్తుతం ఒంటరిని. విడిపోయాం’’

‘’ఒంటరిగా ఉండడం, పని చేసుకోడం నయం. మిగతాదంతా బరువు సామాను.’’ ఆమె నవ్వింది. క్షణం ఆగి అంది.

‘’కొంత లగేజీ అవసరం అనుకుంటాను. మనుషులం గదా?’’

‘’లగేజికీ దానికీ సంబంధం లేదు. I am happy.’’

అప్పటికి అతను ఒచ్చి అయిదు రోజులైంది. కాఫీ తాగి పైకి వెళ్ళే రిద్దరూ . ప్రాజెక్టు రూం లోకి వెళ్ళగానే ఎప్పటికప్పుడు అతనికి కొత్తగా అనిపించే చైతన్యం ఆవహించింది. కంప్యూటరు తెరలు రంగులు మారుతూ మెరుస్తున్నాయి. హీటరు గదిని వెచ్చబెడుతోంది. చిత్రమైన వెచ్చటి సంతోషం అతన్ని కమ్ముకుంది.

రాత్రి ఎనిమిది గంటలకి విస్కీ గ్లాసు ముందు పెట్టుకుని టీవీ చానెళ్ళు తిప్పుతున్నా డతను. మంచి పోర్న్(PORN) ఛానెల్ వెతుక్కుని గళాసందుకుని రెండు గుక్కలు సేవించగానే కాలింగ్ బెల్లు మోగింది. ఆశ్చర్య పడ్డా డతను. టీవీ మూసి వెళ్లి తలుపు తీసి ఆమెని చూడగానే మరింత ఆశ్చర్యం కలిగింది.

‘’ఆశ్చర్యం గా ఉందా? వచ్చినందుకా… చెప్పకుండా వచ్చినందుకా?’’ అందామె.

తేరుకుని అన్నాడతను. ‘’వెల్ కమ్, ముందా కోటు తీసివ్వు’’ ఇద్దరూ లోపలికి వచ్చేరు. సోఫాలో రెండు కాళ్ళూ పెట్టుకుని ముడుచుకుని కూచుందామె. గ్లాసులో విస్కీ పోసి అందించాడతాను . రాత్రి ఉండిపోయిందామె. వెళ్ళడానికి రాలేదని అతనికి తెలుసు. (‘’bye, see you at work’’) ఉదయం కాఫీ తాగుతూ అతని వేపు పరిశీలనగా చూసిందామె.

‘’నామొహం అంత బాగుండదు.’’

‘’రాత్రి చేసిందంతా ఇష్టం గానే చేశావా?’’

‘’ఊ’’

‘’నాకలా అనిపించలేదు’’

‘’ఏం’’

‘’చెప్పలేను, I admit you were quite skillful’’

మళ్ళీ అతని దగ్గరికి రాలే దామె. పని మామూలే.

***

దోమ ఒకటి నిశ్శబ్దంగా వచ్చి అతని చెవి మీద కుట్టి వెళ్ళిపోయింది. ప్చ్. అతన్ని చూస్తూ లోపలికి వచ్చేడు ఇన్ స్పెక్టరు. తెరమీద చూస్తున్నట్టు చూశాడతను. సిగరెట్టు వెలిగించి పొగ అతని మీదికి వదులుతూ అన్నాడు ఇన్ స్పెక్టరు.

‘’కొచెం కొత్తగా ఉన్నావయ్యా నువ్వు. నీకు జెయిలంటే బయం లేదా?’’

‘’జైల్లో ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు…. మా పేరెంట్స్ గురించే…’’

‘’నీ గురించి’’

‘’not much. నా పనంతా దీనివల్ల చెడిపోయింది. నా వల్ల పొరపాటు జరిగింది.’’

‘’దాన్ని  పొరపాటంటారా?

‘’ ఎలా అన్నా పొరపాటే’’

కొంచెం ఆశర్యంగా అతని వేపు చూస్తూ అన్నాడు ఇన్ స్పెక్టరు.

‘’నువ్వు కొంచెం మెంటలు కేసనుకుంటున్నాను’’

‘’ఎందుకని? నేను మామూలు మనిషిని. ఉదయం కంపెనీకి వెళ్తాను. I’m a team leader. రోజంతా పనిచేస్తాను. ఇంటి కొస్తాను. కాసేపు రెస్టు తీసుకుని కంప్యూటరు తెరిచి పని చేసుకుంటాను. ఉదయం మళ్ళీ కంపెనీ. ఇది నా రొటీను. అట్లా పని చెయ్యడం నా కిష్టం. Is that a problem?’’

‘’మీ పేరెంట్స్ ని తెచ్చుకోవచ్చుగా?’’

‘’ఎందుకు? అక్కడ వాళ్ళు బావున్నారు. అప్పుడప్పుడు వెళ్లి చూసి వస్తూంటాను. వెళ్ళినప్పుడల్లా పెళ్లి గురించి గొడవ పెడుతూంటారు. నా కిష్టం ఉండదు.

‘’కరెక్టు. ఈ ఎదవ పన్లు చేసే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా?’’

‘’రెండింటికీ సంబంధం లేదు.’’

‘’అదీ నిజవేలే. నీకు ఇంకా ఫ్యూచరుందనే అనుకుంటున్నావా?’’

అతనేం చెప్పలేదు. చటుక్కున ఆగిపోయిన కంప్యూటర్లా కూచున్నడతను. అనుకోకుండా కళ్ళు చెమర్చేయి.

‘’అసలు మావాళ్ళు చెయి చేసుకోందే ఊరుకోరు. ఎందుకో గానీ నిన్నొది లేశారు. పేపరు చూశావా?’’

అతనేవీ అనలేదు. మామూలుగానే పేపరు పూర్తిగా చదవడు. ఇప్పుడా?

‘’నిన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. మీ బాసుగారు నిద్దరపోయి మూడ్రోజులైంది. ఆయన్ని మీడియా గాళ్ళు నంచుకు తింటన్నారు.’’

అతని కడుపు భగ్గుమంది. ఎదురుగా పీ.పీ. తెర మీద ఇన్ స్పెక్టరు కనిపిస్తున్నాడు. తనవేపు తవ్వుతున్నట్టుగా చూస్తున్నాడు. తన మనసులో, జీవితంలో ఏదో పెద్ద రహస్యాన్ని చూపులతో వెలికి తియ్యాలనే పట్టుదలతో ఉన్నాడాయన. ఒళ్లో పెట్టుకున్న చేతులవేపు చూసుకున్నా డతను. పొడవాటి తెల్లటి వేళ్ళు చచ్చిపోయినట్టున్నాయి. ఎప్పుడూ చకచక కీ బోర్డు మీద నృత్యం చేసే వేళ్ళు నిర్జీవంగా పడి ఉన్నాయి. బాధ కలిగిం దతనికి. మృదువుగా, ఏదో ఆరిపోయిన వెచ్చదనాన్ని రగిలిస్తున్నట్టు రెండు చేతులూ రాసుకున్నాడతను. మధ్యలో ఇన్ స్పెక్టరు వేపు చూశాడు. తన వేపే పోలీసు చూపులు చూస్తున్నాడు. తను చాలా మామూలు మనిషి. మెంటల్ కేసంటా డేవిటి? అదే అయితే తప్పు చేసానని ఎందుకు ఒప్పుకుంటాడు?  చెప్తూనే ఉన్నాడు గదా, పొరపాటయిపోయిందని. చేసిన పొరపాటు వల్ల కొత్త ప్రాజెక్టు పని అంతా కొరగాకుండా పోయిందని తను ఎంత బాధ పడుతున్నాడో ఇన్ స్పెక్టరుకేం తెలుస్తుంది? ఎంతసేపటికీ తిట్టడం, కొట్టడం, జైల్లో పారెయ్యడం. ఇదీ వీళ్ళకి తెలిసింది. జైలు కెళ్ళడం తనకేదో సరదా అన్నట్టు మాట్లాడుతున్నాడు వీడు.

‘’బెయిలొస్తే ఇంటికి పోవచ్చనుకుంటున్నావా ?’’ అనసలు దాని గురించి అనుకోడం లేదు, అదే అన్నాడతను.

‘’నేను దాని గురించి ఆలోచించడం లేదు.’’

‘’నీకు ఉద్యోగం రాదు.’’

అప్రయత్నం గా అన్నాడతను. ‘’ఓ ఏడాది డెన్మార్కులో ఉన్నా బాగుండేది.’’

‘’అంటే, అక్కడీ బాద లేదా?’’

‘’నాకర్థం కావడం లేదు.’’

‘’నీకేం బాదగా లేదా? బయం లేనోడివని తెలుస్తానే ఉంది. నాల్రోజులు లోపలుంటే అదీ తెలుస్తుందనుకో.’’

‘’I am sorry. నేనేవీ చెప్పలేను.’

ఇన్ స్పెక్టరు వంగి అతని ముఖంలోకి చూస్తూ ‘’నువ్వంత వయలెంటు టైపులా కనిపించడం లేదు.’’ అన్నాడు . తెరమీది ఇన్ స్పెక్టరు ముఖం క్లోజప్ లో కనిపించింది పెద్దగా. తెరమీద పోలీసు ముఖం వెనక్కి పోయింది. అతనికి ఏవీ మాట్లాడా లనిపించడం లేదు. ఒక్కడే అలా కూచోవాలని ఉంది. ఇన్ స్పెక్టరు కి  కూడా మాట్లాడా లనిపించలేదు. మళ్లీ సిగరెట్టు వెలిగించి ఓ దమ్ము లాగి లేచి వెళ్ళిపోయాడు. తెర ఖాళీ అయిపోయింది. కళ్ళు మూసుకున్నా డతను. అస్పష్టంగా అమ్మ , నాన్న కనిపించారు. వాళ్ళకు ఈ పాటికి తెలిసి ఉండాలి. చాలా ఏడుస్తారు. దీనికంటే అదే ఎక్కువ బాధ, తలకాయ నెప్పి.

వసంత అన్నిసార్లు చెయ్యి గిల్లినా పట్టించుకోకుండా తను ఇటువంటి తెలివి తక్కువ పనిచేశాడు. రాధిక మరో అరనిముషం ఉన్నా తను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పి ఉండేవాడు. అంతటితో అయిపోయేది. రాధిక కూడా క్షణం ఆగి అలోచించి ఉండవలసింది. తానెప్పుడూ ఆ అమ్మాయి తెలివి తేటలని మెచ్చుకుంటాడు. ఇన్ని సంవత్సరాలుగా తను ఎటువంటివాడో ఆమెకి తెలియదా? It was a bloody mistake. మంచివాళ్ళు కూడా పొరపాట్లు  చేస్తారు. మరి రాధికకి  ఎంత అనుభవం ఉన్నా పొరపాట్లు దొర్లినప్పుడు తను సరిదిద్దలేదా, సలహా లివ్వలేదా?

***

రాధిక వచ్చి పక్కన నిలబడింది. ఆమె కంటే ముందే ఆమె డియో అతన్ని చేరుకుంది. అతను వెంటనే పలకరించలేదు. అతని వేళ్ళు వేగంగా కదుల్తున్నాయి. అతని భుజం తట్టిందామె .

‘’కొన్నాళ్ళకి నా పేరు మర్చిపోతావు ‘’ అందామె. కూచోమని చెప్పి ఆమె వేపు తిరిగే డతను . ఆమె ఎప్పుడూ స్కర్టు వేసుకోదు. మోకాళ్ళ మీంచి స్కర్టు పైకి జరిగింది. నీలపు అంచు కింద ఆమె మోకాళ్ళు తెల్లగా గుండ్రంగా చక్కగా ఉన్నాయి. అతని చేతికి ఫైలు అందించింది రాధిక.

‘’ఒకసారి చెక్ చెయ్యాలి. నువ్వు చూస్తుంటే నా సందేహాలు అడుగుతాను.’’

అతను కాయితాలు మెల్లిగా తిప్పుతూ ఆమె డియో పీల్చుకుంటూ అయిదు నిముషాల తరవాత ‘’ఫైన్’’ అన్నాడు.

‘’నేనేం అడగొద్దా?’’

‘’అవసరం లేదు, గో ఎహెడ్ ‘’

అతను తల వెనక్కి వాల్చి రెండు చేతులూ పైకి ఎత్తి ఒళ్ళు విరుచుకున్నాడు. ఆమె వెళ్ళడానికి లేచింది.

‘’టీ తాగుదాం.’’ అందామె.

‘’ ఇప్పుడా?’’

‘’ఎప్పుడయితే ఏం?…..వస్తావా?’’

అతను లేచి నుంచుని ఆమె వేపు చూశాడు. తెరమీద రాధిక ఆకర్షణీయమైన ముఖం చిరునవ్వుతూ కనిపించింది. ఆమె కింద పెదవి చాలా బావుంటుంది.

‘’ఏంటి చూస్తున్నావు? Let us go.’’

‘’నువ్వు చాలా బావున్నావు.’’

‘’ఓకే , కమాన్.’’

చటుక్కున తెరమీద నవ్వుతున్న ఆమె ముఖాన్ని దగ్గరికి లాక్కుని ఆమె పెదాల్ని గట్టిగా ముద్దు పెట్టుకున్నా డతను . క్షణం సేపు ఆమె కేం చెయ్యాలో తోచలేదు. అతనే ఆమె పెదాల్ని వదిలి భుజం మీద చేతులు వేసి దగ్గిరికి లాక్కున్నాడు. ఆమె విదిలించుకుంది. ఆమెని పొదివి పట్టుకుని పెదాలతో ఆమె నోరు మూశాడతను. ఇద్దరూ తివాచీ మీదికి జారేరు . అతన్ని పక్కకి నెట్టడం ఆమె వల్ల కాలేదు. పది నిముషాలు  తరవాత ఆమె మీదనుంచి లేచేడతను. ఆమె లేచి స్కర్టు సద్దుకుని అతని వేపు చూసింది. రాధిక కళ్ళలో కోపం, ఆశ్చర్యం… అతన్నీ లోకంలోకి తోశాయి. నిశ్శబ్దంగా ఆమె వేపు చూస్తున్నాడతను. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగేయి. విసురుగా బయటికి వెళ్ళిపోయింది… షిట్…. మర్యాదగా అడిగి ఉండవలసింది. పొరపాటు చేశాడు తను. బాత్రూంకి వెళ్లి వచ్చి అయిదు నిముషాలు అలాగే కూచుండి పోయాడు. కంప్యూటరు మళ్ళీ తెరిచి తెరలోకి వెళ్ళిపోయా డతను.

అరగంట తరవాత పోలీసు లొచ్చేరు. ఇన్ స్పెక్టర్ని అతను బాగా దగ్గిరకి వచ్చిన తరవాత గానీ గమనించలేదు.

**** (*) ****