కవిత్వం

జీవం లేని బతుకు చిత్రం

26-ఏప్రిల్-2013

ఆ వూరి గడప గడపకు
గాయాల కుంకుమ బొట్లు

ఇంటింటికీ
ఎడారి మంటల సలపరింత

అందరి వాకిళ్ళ
సాన్పుల్లోను కన్నీళ్ళ తడి

మనిషి మనిషికీ
మనస్సుకు పట్టని అవస్థ

ఏజంట్ల వీసాల మోసాలు
విమానం దిగంగానే
కల్లవెల్లి కల్లోల కొలువులు

బతుకవోయి బతుకవోయి
తేరుపుతడనుకుంటే
అందమైన పెట్టెల
శవమై వచ్చిన పెనిమిటి
ఆమె శోకం ఆపతరం కాని దుక్కపాతం

ఎ గుండెను కదలిన్చినా
దుబాయ్ మస్కట్ బాధల గాదలే
పొందింది తక్కువ
పోగొట్టుకున్నది ఎక్కువ

రంగు నరసయ్య తేల్చిన
వలస సంపాదనల సారాంశం
బట్ట పొట్ట అగ్గిపెట్టె బీడీ కట్ట

ఉరడి లచ్లచవ్వ కండ్ల నిండా నీళ్ళు
క్యాన్సర్ తో తిరిగొచ్చిన భర్త
చేసిన పుట్టెడు బాకీలు తీర్చ
కొడుకులిద్దరూ మళ్ళా అవుటాఫ్

అమరవీరుల స్థూపాల సాక్షిగా
అలుముకున్న పేదరికం సాక్షిగా
దేశాలు పట్టుకొని తిరిగి తిరిగి
ఆ వూరి
బాల్యం యవ్వనం కరిగి పోయినయి
వృద్యాప్య చాయలే మిగిలినాయి
జీవితం లోనే జీవం లేని తనాన్ని
దర్శిస్తున్న విచిత్ర వైనమిది

(తెరవే ఆద్వర్యమ్ లో రుద్రంగి గ్రామ సందర్శన )