కవిత్వం

దుబ్బ కాళ్ళు

జూలై 2014

చెప్పు తోడ్కలు లేని కాళ్ళు
గెగ్గెలు గెగ్గెల కాళ్ళు

తుమ్మ ముండ్లు ఇరిగి
సల సల సలిపిన అరికాళ్ళు

పోట్రవుతులు తాకి తాకి
నెత్తురు కార్చిన బొటనేల్లు

పుండ్లు పుండులై
బర్రలు అగుపిస్తున్న మోకాళ్ళు

దుబ్బ తుత్తుర్లు పల్లేరు గాయలు
అత్తుకొని గుల గుల పెడుతన్న కాళ్ళు

ఎవుసం చేసి చేసి
కంచెల ఎడ్లు ఇడిశి కూకున్న కాళ్ళు

శెల్కల ఇరువాలు దున్ని
ఇత్తునాలు అలికిన కాళ్ళు

బురుద నాగలి దున్ని దున్ని
మెత్తపడ్డ కాళ్ళు
తెల్లగ శెడ్డ ఏళ్ళ సందులు

గోదల కాడికి పోయిన కాళ్ళు
గొర్లు మ్యాకల కాసిన కాళ్ళు

పెండ కడి కోసం
తట్ట పట్టుకొని తిరిగిన కాళ్ళు

ఊర చెర్ల దునికి
ఈత కొట్టిన కాళ్ళు
ఎడ్ల పెయ్యి కడిగిన చేతులు

సద్దుల బతుకమ్మ పండుక్కు
ఎనెకు పువ్వేర బోయిన కాళ్ళు

పీరీల గుండం సుట్టు
ఆశన్న భుశన్న ఆటాలడిన కాళ్ళు

మన్ను గంధం పూసుకున్న కాళ్ళు
చెమట చుక్కలు పట్టిన కాళ్ళు
సకల పనులకు సంచరించిన కాళ్ళు

ఇగో ఈ కాళ్ళకు పట్టం కట్టాలే
ఈ కాళ్ళకు ఇత్తడి గజ్జెలు కట్టాలె
గండపెడేరం తొడిగి దండం పెట్టాలె..

 

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)
చిత్రం: జావేద్