ఆమె నీడల్ని అదిలిస్తోంది
నల్లని గేదెల్లాంటి నీడల్ని
నీడల్లాంటి నల్లటి గేదెల్ని
ఆమె
కర్రతో అదిలిస్తోంది
పాము పడగల్లాంటి నీడలు
గేదెల కాలిగిట్టల కింద పడి
నలిగి
బుసలు కొడుతున్న నీడలు
ఆమె నీడల్ని
గోముగా
లాలనగా
అదిలిస్తోంది
తెల్లవారెప్పుడో
కళ్లంలో
‘రాత్రంతా కురిసి కురిసి
కళ్లమంతా పరుచుకున్న
లేత కొబ్బరాకుల్లాంటి నీడల్ని’
ఏరి..
ఆమె సిగన పింఛాల్లా
తురుముకుంటుంది
రోజుల తరబడి ఒంటరిగా..
ఎర్రని నాలుకలా
వేళాడుతున్న పొద్దు మీద
నడయాడతున్నప్పుడు
‘ఆమె వెనుకనే కొంగుపట్టుకు తిరిగే
మూడేళ్ల మనవడి
ఉయ్యాల చేతులే నీడలగా మారి’
ఆమెను నీడల ఉయ్యాలలో
సేదదీరుస్తాయి
బతుకంతా శ్రమ చేసి అలసిన శరీరాన్ని
ఒకానొక పున్నమి జాతరలో
ఊరేగించాలని
ఆమె అనంతకాల స్వప్నం
‘తెల్లని నీడల జెండా’
ఆమె కలల ‘వేకువరెక్క’
ఎదురౌతున్న మనుషులందరూ
ఎడారి నేల ముఖాలలా కనిపిస్తున్నాక
ముఖాల వెనుక మిగిలిన
నిశబ్ద సౌందర్యమూ బద్దలౌతున్నాక
ఆమె
నీడల్ని అదిలిస్తూనే ఉంటుంది
కాసింత ప్రేమగా
కాసింత మొరటుగా
బుసలు కొడుతున్న నీడల కోరలకు
పదునబెడుతున్న
ఒక అపూర్వమైన శక్తిసంపన్నురాలుగా…
ప్రతి పదం కవిత్వాన్ని ఊరుతూ చాలా చాలా బాగుంది
thank u swaathi sreepaadha gaaru….