పుస్తక పరిచయం

మొయిద శ్రీనివాసరావు కవిత్వం

జూలై 2015


ర్తమాన కవిత్వం సామాజిక నేపథ్య ప్రధానంగా వుండడం తక్షణ ఆవశ్యక అవసరంగా వుంది. పరిస్థితులు అంత ప్రభావశీలంగా వున్నాయి.

ఈనాటి కవికి తను నిలబడ్డ నేల మీద జరుగుతున్న సకల విధ్వంసాలనూ ప్రశ్నిస్తూ.. కవిత్వం చేయడం గొప్ప బాధ్యతాయుతమైన పని. ఆ ఎరుక వున్న కవి
తనకు తెలిసిన తన స్థానికత పునాధి మీద నిలబడి తన మట్టిని గురించి కలవరిస్తాడు. ఆవేదన పడతాడు. కవిత్వం శక్తి గ్రహిస్తున్న క్రమంలో కవి జన
పురోభివృద్ధిని కాంక్షస్తాడు.

మొయిద శ్రీనివాసరావు కవి – ‘సముద్రమంత చెమట చుక్క – అతని కవిత్వం’ నేటి సామాజిక, రాజకీయ అలజడుల కేంద్రబిందువు నుంచి స్పృహతో
కవిత్వం రాయడం అవసరమౌతున్నప్పుడు ‘సముద్రమంత చెమటచుక్క’లో ఆ కోణాల్ని చూడొచ్చు.

కళింగాంధ్రలో మూడునాలుగేళ్లుగా మార్పు సంబంధితంగా జరుగుతున్న కదలికలను కవిత్వ వస్తువుగా తీసుకుని కవిత్వం చేశారు. ఢిల్లీ నిర్భయలాంటి
ఘటనలను కూడా తన కవిత్వంలోకొచ్చాయి.

అన్వేషణ కవిని కార్యోన్ముఖిణ్ణి చేస్తుంది. నేటి సమాజ స్థితికి కారణాలను సరిగ్గా అన్వేసించాలి – అలా అన్వేసించే క్రమంలో కవిలో
ప్రజాపక్షభావాజాలం వృద్ధి చెందుతుంది. ఈ సంపుటిలో తొలి కవిత ‘నెల్లిమర్ల’. నెల్లిమర్ల – ఒక ఊరు. రాష్ట్రంలో నెల్లిమర్లకొక చరిత్ర
ఉంది. ఇరవై యేళ్ల కిందట ఘటన – చరిత్ర లిఖితం. నెల్లిమర్ల జూటుమిల్లు కార్మికుల కుటుంబాలను వీధిపాలు చేసే కుట్రను జనం తిప్పికొట్టిన వైనం
కార్మికలోకానికి ప్రేరణోపకరణం. కవిత ప్రారంభం ఇలా ఉంటుంది.

‘ ఈ మధ్యనే
నిన్నటి నా ఊరు గూర్చి
తెలుసుకోవాలన్న ఆలోచన
నా బుర్ర తొర్రలోకి
వడ్రంగి పిట్టై వచ్చి వాలింది ‘ – అని కవి అంటారు.

చరిత్రలో లిఖించబడిన ఊరు గురించి తెలుసుకోవాలని కవి అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

‘ వేకువ పిట్టలను వెక్కిరిస్తూ
గోడ గడియారాలను కునుకు తీయిస్తూ
చెమట చుక్కలను
సైరన్ మోతలతో మేల్కొలిపే
ఏరు పక్కనున్న నారమిల్లునడిగాను
చేజారిన ఆకలిగిన్నెల
చప్పుళ్లకు ధీటుగా
కాలే కడుపులు
కాగే డప్పులుగా మారిన వైనాన్ని వివరించింది ”

ఆనాటి చరిత్రను తెలుసుకున్నప్పుడు ఈ కవితను రాయగలగడం ఆశ్చర్యం అవదు. ఏ మనిషికైనా తను బతుకుతున్న నేల మీద ప్రేమ వుంటుందని
అనుకుంటున్నాను – కవైతే దాన్ని మరింత ఎక్కువగా అనుభవంలోకి తెచ్చుకుంటాడు.

ఈయన కవిత్వానికి ‘కార్మికుడు – కర్షకుడు’ ప్రధాన వస్తువులు.

‘ అతనెప్పుడూ పనిలోనే వుంటాడు
ఆకలేస్తే పనినే తింటాడు
అలసినప్పుడు పనిలోనే సేదతీరుతాడు
ఆఖరికి నిద్దట్లో పనినే కలగంటాడు
పనే తనని మొలకెత్తించే విత్తనం ‘ ( మట్టిబోదె )

కవి దేనిని గుర్తిస్తున్నాడు ? శ్రమని గుర్తిస్తున్నాడు – శ్రమలోనే రైతు పురోగమనం చెందుతాడంటున్నాడు – నిలబడతాడంటున్నాడు. ఈ
సంపుటిలో మరికొన్ని కవితలను చూస్తే…

‘ ఏమి చేసి మెప్పిస్తాడో మరి
పగలంతా కన్నెర్ర జేసిన ఎండ
రాత్రికి అతని చుట్ట చివర
నిప్పై నిల్చుంటుంది
పట్టించుకోలేదనే దిగులుతో
వెన్నెల..
వాకిట్లో మంచం కింద
మచ్చల కుక్కై కూర్చుంటుంది ‘

అనుభవంలో విషయాన్నే కవి కొత్తగా దృశ్యం చేసి చూపెడతాడు.

కవి యానాంని కవిత్వం చేశాడు. రెండేళ్ల కిందట యానాం సిరామిక్ పలకలు తయారీచేసే ఫ్యాక్టరీ కార్మికులపై యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరించి
కార్మిక నాయకుడు మురళీని పొట్టనపెట్టుకుంటే.. కవి కన్నెర్రజేశాడు.

‘ నేడు యానాంను చూస్తుంటే
సిరామిక్ పలక సైతం
కడుపుమంటతో కాలే కంచంలా కనిపిస్తుంది ‘

.. నెల్లిమర్లను కవిత్వం చేసిన కవి యానాంనూ కవిత్వం చేసాడు. ఆయా ఊర్లలో జరిగిన రెండు సందర్భాలూ దగ్గర సంబంధం ఉన్నవే. రెండింటినీ కవి
కవిత్వంలోకి తీసుకురావడం విశేషం. యానామంటే ‘ నల్లత్రాచుల నెత్తిన ఎగిరెగిరి తన్నడానికి – సిద్ధంగా వున్న కత్తెర పిట్ట ! ‘ అని కవితను
ముగిస్తారు.

కవి – లక్ష్మిపేటని కవిత్వం చేశారు. విజయనగరంలో కర్ఫ్యూ స్థితిని కవిత్వంలోకి తీసుకొచ్చారు. ‘అద్దె గర్భాల’ మీదా తన కలంని
ఆగ్రహవాక్యంగా వ్యక్తం చేశారు. అమ్మ మీద, నాన్న మీద, చదువుల చందమామ మీద, ఆపరేషన్ గ్రీన్ హంట్ మీద – చాలా విషయాలు కవిత్వంలోకొస్తాయి. ఇంచుమించు
అన్ని కవితల్లో పురోగామితనం ప్రకటితమవుతుంది. పురోగామిక ఆలోచనే ముందు దారి వేస్తుంది. ఆ పని చేసిన కవి అజేయుడు.

***

పుస్తకం: సముద్రమంత చెమట చుక్క

రచయిత: మొయిద శ్రీనివాసరావు

వెల: ₹ 72

ప్రతులకు: కినిగే

 

**** (*) ****