(డా. వైదేహి శశిధర్ గారితో ముఖాముఖం – డా. నారాయణ గరిమెళ్ళ)
‘నగరమంతా నిద్రించే సమయంలో……తదేకంగా, చంద్రుడిని చుట్టేసిన చుక్కలను లెక్కపెట్టుకుంటూ…అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి అనుకోకుండా ప్రవాసం వరకూ చేరి పోయాక….’అరే దారి తప్పి పోయానేమో?’ అని ఆశ్చర్యపడి; అంతలోనే, ఆ పరిసరాలకు అలవాటు పడుతూ… అక్కడి ప్రకృతిని దర్శించి, వానలో తడిసి, మంచు పూలను పదిలంగా ఏరి మూట కట్టుకుని….. తిరిగి వెనుకకు అమ్మ-వడి లాంటి మాతృభూమిని చేరుకుని అక్కడ అందరికీ తన జ్ఞాపకాల సంపదను పంచి ఇచ్చే ప్రయాణాల ఊయల డాక్టర్ వైదేహి శశిధర్ గారి కవిత్వం. వెన్నెలలో ఉయ్యాలలూగుతూ కబుర్లు చెప్పుకున్న బాల్యమంత అహ్లాదంగా కవిత్వీకరించడం ఆమె శైలి. తీరిక దొరకడమే గగనమనిపించే వైద్య వృత్తిని ఒక వైపు ఇష్టంగా నిర్వహిస్తూ…కవిత్వాన్ని కూడా ప్రేమతో సృజిస్తున్న వైదేహి గారి తో ముఖాముఖం:
1. వైదేహి గారు, మీ కవిత్వం చాలా వరకూ ప్రకృతీ రమణీయతను పలికిస్తుంది. ‘ఆకాశానికీ, భూమికీ మధ్య ఇన్ని పదచిత్రాలా?’ అని ఆశ్చర్య పరుస్తుంది. సమస్తం తెలిసినట్టే అనిపించే ప్రకృతి-ప్రపంచం, మీ కవిత్వంలో కొత్తగా అంతకు ముందు తెలియని కోణాలను తెలిసిన విషయాల అల్లికగా అద్భుతంగా చెబుతుంటుంది. అంత ఇష్టంగా చదివించే కవిత్వాన్ని సృజించే మీరు, మిమ్మల్ని కవయిత్రి గా మార్చిన మీ నేపధ్యం: పుట్టుక, ప్రవాహం, దిశ, రంగు, రుచి, వాసన మొదలైన విషయాలను మాతో పంచుకోండి.
ముందుగా సహృదయతతో నా కవిత్వం గురించి మీరు తెలిపిన అభిప్రాయాలకు ధన్యవాదాలు .
నా నేపధ్యానికి వస్తే , నేను పుట్టింది నరసరావుపేట అయినా నాన్నగారి ఉద్యోగరీత్యా (ఇంగ్లీష్ లెక్చరర్ ) నేను పెరిగింది,కాలేజ్ వరకూ చదువుకుంది నగరం లో (గుంటూరు జిల్లా ). నగరం అనగానే నాకు గుర్తు వచ్చేది పచ్చని వరిపొలాలు,చిక్కని మామిడి తోటలు,కలువపూలతో నిండిన చెరువులు ,స్వచ్చమైన గాలి ,సరళమైన జీవితం. నేను చదివిన హైస్కూల్ చుట్టూ కూడా మామిడి చెట్లు, పంట పొలాలే. నా పరిసరాల్లోని ఆహ్లాదకరమైన ప్రకృతి నా జ్ఞాపకాల్లోకి ,అనుభవాల్లోకి ఒదగటమే కాకుండా నా కవిత్వీకరణ కు మాధ్యమం అవడం జరిగి ఉండవచ్చు. మీకు తెలుసు , పరోక్షంగా నైనా మన అనుభవంలో లేనిదేదీ మన కవిత్వం లో సాధారణంగా ఉండదు .
నాకు ఊహ తెలిసిన దగ్గర నుండీ వైద్యవిద్య మీద అపారమైన గౌరవం .కవిత్వం అంటే ఎంత ప్రేమో వైద్యవిద్య అంటే అంత అభిమానం .నగరం లో కాలేజ్ చదువు తర్వాత నేను విశాఖపట్నం ఆంధ్రామెడికల్ కాలేజ్ లో మెడిసిన్ చేసాను.చిన్నప్పటి నుండీ కవిత్వం పై అభిమానం ఉన్నా మా ఫ్రెషర్స్ డే కి జరిగిన పోటీల్లో సరదాగా నేనువ్రాసిన కవితతోనే నేను తరచూ కవిత్వం వ్రాయడం మొదలయిందనే చెప్పాలి.అప్పట్లో ప్రచురితమయిన నా మొదటి కవిత నేరేడు చెట్టు.ఆంధ్రజ్యోతి ఈ వారం కవిత శీర్షిక క్రింద.ఈ కవిత ప్రచురించాక ఆలిండియా రేడియో విశాఖపట్నం వారు నన్ను కవితలు చదవటానికి ఆహ్వానించారు. పన్నెండు-పదహారు కవితలు మూడు దఫాలుగా రేడియోలో చదవటం జరిగింది .తర్వాత నా నిద్రితనగరం ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యెక సంచిక లో ప్రచురితమయింది . అప్పుడప్పుడూ ఆంధ్రజ్యోతి ,ఆంధ్రప్రభ లలో ఇతర కవితలు ప్రచురించాను. 1995 లో ఆలిండియా రేడియో వారి ఉగాది కవిసమ్మేళనంలో పేరాల భరతశర్మ గారి వంటి అనేక ప్రముఖ కవులతో పాటు నా కవిత కూడా చదవటానికి అప్పటి స్టేషన్ డైరెక్టర్ కాకరపర్తి మూర్తిగారు ఆహ్వానించారు. అప్పట్లో నేను తప్పిస్తే వేదిక మీద ఉన్నవారు అందరూ కనీసం ఒక్క పుస్తకం అయినా ప్రచురించినవారే.ఫైనల్ఇయర్ అవగానే అనుకోకుండా వివాహం,హౌస్ సర్జెంసీ తర్వాత మూడేళ్ళు స్విడ్జర్లాండ్ లో ప్రవాసం,ఆ పైన కుటుంబంతో కలిసి న్యూజెర్సీ రావడం జరిగింది .ఇక్కడ రెసిడెన్సీ పూర్తి చేసి , ప్రస్తుతం ఫామిలీ ఫిజిషియన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రవాసంలో కవిత్వం అప్పుడప్పుడూ వ్రాసినా తరచుగా పబ్లిష్ చేసింది ౨౦౦౪ తర్వాతే . కారణం రెసిడెన్సీ లో నిద్ర పోవటానికి కూడా టైం లేకపోవటమే తప్ప మరేం కాదు.
ఇక్కడ నేను కవితలు పబ్లిష్ చేసిన పత్రికలు ఈమాట,కౌముది,సుజనరంజని,పొద్దు ,ప్రజాకళ,ప్రాణహిత ,ఈ మధ్య నే వాకిలి .
2. ‘చంద్రునిలో రాట్నం వడికే అవ్వ చిందించిన దూది పిందెలను (లేదా నూలు దారాలను) మంచు పూలలా దర్శించగలిగిన’ మీ పై బాల్యంలోని కధల, మనుషుల ప్రభావం ఎక్కువగా ఉందనిపిస్తుంది. మీ బాల్యం, అప్పటి మనుషులు, సాహిత్య వాతావరణం అవి ఈ నాటికీ మీ కవిత్వం పై ప్రభావం చూపిస్తుంటే వాటి సంగతులు చెప్పండి.
మనందరి జీవితాల్లోనూ తప్పనిసరిగా ఇంప్రెషనబుల్ ఏజ్ బాల్యం . మీరు కోట్ చేసిన కవితా పంక్తులకి స్ఫూర్తి మా నాయనమ్మగారు . నాకు పదేళ్లు వచ్చేవరకు ఆమె చదివిన పద్యాలు ,చెప్పే కధలు వినడం నాకు చాల ఇష్టమైన వ్యాపకం. ఆ చిన్నప్పటి కధల్లో లో ఏదో తెలీని ఆకర్షణ ,మార్మికత ఉంది .చెప్పిన కధలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం,విన్నకధలే మళ్ళీ మళ్ళీ వింటాం.అంతే కాదు ఆ కధల్లో ఉన్న క్రియేటివిటీ , శిల్పం,అల్లిక జాగ్రత్తగా గమనిస్తే ఆకట్టుకునే రకంగా వ్రాయటం తాలూకు టెక్నిక్ నేర్చుకోవచ్చునేమో అనిపిస్తుంది .
సాహిత్య పరంగా , నా కవితా ప్రస్థానాన్ని వెన్నెల జలపాతాల్లాంటి తన కవితలతో అద్వితీయంగా ప్రభావితం చేసిన కవి తిలక్. కవిత్వపు ఆల్కెమీ పూర్తిగా తెలిసిన కవి .ఆయన కవిత్వీకరణ, సమ్మోహనమైన మెటఫర్స్ ,ఆకట్టుకునే శక్తి నా కెంతో ఇష్టం. నా చిన్నప్పటి నుంచీ ఇప్పటి దాకా ఆయన కవితలు పునశ్చరణ చేసుకొనని రోజు దాదాపు లేదనే చెప్పాలి. ఇప్పటికీ ఆయన అమృతం కురిసిన రాత్రి లో కొన్ని కవితలు చదివినప్పుడు ఇంత అందంగా ,ఇంత శక్తిమంతం గా ఎలా వ్రాసారా అని అబ్బురపడుతూ ఉంటాను. అంతేకాదు నేను చిన్నతనం లో చదివి బాగున్నాయి అనుకున్న ఇతర సాహిత్యం పై నా అభిప్రాయాల్ని నేను పెరిగే కొద్దీ చాలాసార్లు మార్చుకోవటం జరిగింది.కానీ తిలక్ కవిత్వం మాత్రం అప్పటికీ ఇప్పటికీ అదే ఉద్వేగాన్ని ,స్ఫూర్తిని,ఆనందాన్ని కలిగించటం నా స్వానుభవం. నా వరకు నాకు మంచి కవిత్వానికి అదొక గీటురాయి.
ఇకపోతే మా నాన్నగారు మంచి విశ్లేషణ,చక్కటి సాహిత్యాభిరుచి,ఆంగ్లాంధ్ర సాహిత్యాలలో ప్రవేశం కలవారు. సహజంగానే సాహిత్యం పట్ల నాలో ఆసక్తి,ఆలోచనలు కలగటంలో మా నాన్నగారి ప్రభావం ఉంది .నిజానికి నేను మొట్టమొదట వ్రాసిన కవిత(లాంటిది) ఇంగ్లీషులోనే .ఒక చిన్న కుక్కపిల్ల గురించి ఏడెనిమిదేళ్ళ వయసులో వ్రాసినట్లు గుర్తు.అప్పట్లో నేను కూడా ఎక్కువ ఇంగ్లీషులోనే వ్రాయాలని అనుకునేదాన్ని.బహుశా నాన్నగారు ఇంగ్లీష్లో విస్తృతంగా వ్రాయటం వల్ల కావచ్చు.అయినా తిలక్ ,శ్రీశ్రీ కవితలు ,పోతన ,విశ్వనాధ,రాయప్రోలు,కరుణశ్రీ ,దువ్వూరి ,జాషువా వంటి ప్రముఖ కవుల పద్య కవిత్వం కూడా చాలా ఇష్టంగా చదువుకుని ఆనందిచేవారం.
మా అమ్మగారు కూడా శరత్,బాపిరాజు,విశ్వనాధ వంటి రచయితల సాహిత్యం చదువుతూ ఉండేవారు. నా హైస్కూల్ రోజుల్లో మేమిద్దరం శరత్ సాహిత్యం గురించి తరచూ మాట్లాడుకునే వాళ్ళం. ఒక రకంగా నేను అదృష్టవంతురాల్ననే చెప్పాలి, నా బాల్యం లోనే మంచి సాహిత్యంతో పరిచయం కలిగే అవకాశం కలిగినందుకు.
3. దైనందిన జీవితంలో పత్రికల-వార్తలు, మీ వృత్తికి సంబంధించిన విషయాలు ఇవి మీ కవిత్వంలో తొంగి చూసినట్టు అనిపించదు. అలా ఉండాలని ఏ నియమమూ లేదు. ఐతే ఇది కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వృత్తి రీత్యా లాయర్, డాక్టర్, ఇంజనీర్ ఐన కవులు వారు వారి వారి దైనందిన జీవితాలను ఎంతోకొంత సాహిత్యంలో ప్రస్తావించిన సందర్భాలు ఉంటుంటాయి. మీ విషయంలో చెప్పగలరు.
మంచి ప్రశ్న. నిజానికి నా కవిత్వం లో నా వృత్తికి సంబంధించిన విషయాల గురించి ప్రస్తావన లేకపోలేదు.కొన్ని కవితలకి ప్రేరణ వృత్తిలో నా అనుభవాలే కూడా .అయితే అవి ఆ కవిత తాలూకు చట్రం లో ఒదిగి ,కవిత శిల్పాన్ని అధిగమించకుండా ఉండాలని నా ఉద్దేశ్యం .అందుకే ప్రస్తావన ఉన్న చోట్ల అది అంతర్లీనంగా ఉండటమో, ప్రేరకం గా ఉండటమో , సటిల్ గాఉండటమో జరుగుతుంది .కొన్ని ఉదాహరణలు అమ్మ,నువ్వు ,అమెరికాలో వసంతం,వృద్ధ మొదలైన కవితలు. నేను వ్రాసిన మరో కవిత యుద్ధం పూర్తిగా నా వృత్తి గురించి వ్రాసినదే. పొద్దులో ప్రచురితమయింది. ఇంకా మరికొన్ని అముద్రిత కవితలు కూడా వున్నాయి .
ఒక బలీయమైన అనుభూతిని కేంద్రీకరించి చెప్పడం కవిత్వ లక్షణం అని నా అభిప్రాయం. సంక్లిష్టమైన,విస్తృతమైన జీవితానుభవాల్ని కూడా అనుభూతి అద్దం లోంచి చూపినపుడే ఆ కవితకు సార్వజనీనత కలుగుతుంది. ఎందుకంటే కవిత్వం ప్రధానంగా హృదయ సంబంధి కాబట్టి .
4. ‘నిద్రిత నగరాని’కి మీరు ఇస్మాయిల్ గారి పురస్కారాన్ని అందుకున్నారు కదా! ‘నిద్రిత నగరం’ లో కాని, అంతకు ముందూ తరువాత వ్రాసిన కవితలలో, Specific గా మీకు బలమైన అభిప్రాయాన్ని కల్గించినవి ఏవి? ఈ పురస్కారం మీకు కల్గించిన ప్రొత్సాహాన్ని, బాధ్యతను చెప్పండి. ఇతరత్రా మీ కవిత్వానికి వచ్చిన అవార్డులు, పురస్కారాలు, అభినందనలు కూడా చెప్పండి.
నిద్రితనగరం నాకు చాలా ఇష్టమైన విశాఖనగరం పై వ్రాసిన కవిత. నాకు బలమైన అభిప్రాయాన్ని కలిగించిన నా ఇతర కవితలు అమ్మ,ప్రవాసంలో వాన,నిశ్శబ్దం నీకు నాకూ మధ్య ,సహచర్యం ,ఏటివడ్డున ,యుద్ధం .
ఇస్మాయిల్ పురస్కారం తప్పనిసరిగా నాకు ప్రోత్సాహాన్ని,నేను వ్రాసే ప్రతి కవితను నేను తిరిగి బేరీజు వేసుకోవాల్సిన బాధ్యతను కూడా ఇచ్చింది. వంగూరి ఫౌండేషన్ వారి బహుమతి ప్రవాసం లో వానకు వచ్చింది,లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో నిద్రితనగరం చోటు చేసుకుంది .
5. తెలుగు కవిత్వానికి ఇప్పుడు ఆదరణ తగినంత ఉందనుకుంటున్నారా? మున్ముందు ఎలా ఉంటే బాగుంటుందను కుంటున్నారు?
కవిత్వానికి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది,కారణం కవిత్వానికి స్పందించే శక్తి మనందరిలోనూ సహజ సిద్ధంగా ఉండటమే.ఆ స్పందనా శక్తిలో,అభిరుచిలో స్థాయీ భేదాలు ఉండవచ్చును.అలాగే దేశ,కాల పరిస్థితులను బట్టి ,సమకాలీన ప్రభావాలను బట్టి కవిత్వ రీతుల్లో,వస్తువు లో తేడాలు ఉండవచ్చు. వాటిల్లో కూడా బలమైన అభివ్యక్తి కల కవితలు వస్తువు ఏదైనా నిలబడిపోతాయి. సౌందర్యానికి,సంతోషానికీ,వేదనకి,వైఫల్యానికి మనలో కలిగే స్పందనలలోంచి కవిత్వావిర్భావం అప్రతిహతంగా సాగుతూనే ఉంటుంది.మన హృదయాన్ని తాకే కవిత్వాన్ని మనం వెతుక్కోక మానము .
ఈ మధ్య అంతర్జాల పత్రికల వల్ల ప్రపంచం ఎల్లలు చెరిగిపోయాయి.చాలా మంచి విషయం.మనకు ఎంతో చిక్కని భావస్ఫోరకమైన కవిత్వం ఇప్పటికే ఉంది. మనం గర్వపడే మన తెలుగు సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి విరివిగా అనువాదం చెయ్యడం ద్వారా మన కవిత్వానికి ఎక్కువ పరిధి పెంచితే బావుంటుందని నా ఉద్దేశ్యం. దీని ద్వారా మన కవిత్వపు సొగసు, సాంద్రత ,ఆత్మ కొంతైనా తెలుగు మాతృభాష కాని పాఠకుల అనుభవానికి అందుతుంది.
6. మీ కవితా ప్రక్రియలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా అత్యంత శ్రమించి గానీ, అనుభూతి కి లోనై గానీ లేదా భావోద్వేగానికి గురై గానీ వ్రాసిన కవితల గురించి….?
అమ్మ కవిత- నేను చాలా వేదనకు గురై వ్రాసిన కవిత.మా అమ్మ గారికి సుస్తీ చేసినపుడు నేనుపొందిన బాధ ,వేదన,ఆందోళన ల గురించి వ్రాసింది. వ్రాసింది మాత్రం మా అమ్మగారు కోలుకున్న ఒక ఎనిమిది నెలలకు.
నిద్రితనగరం – మెడిసిన్ నాలుగవ సంవత్సరం లో పాథాలజీ ఎగ్జాం కి ప్రిపేర్ అవుతూ నడిరాత్రివేళ అలసి నిద్రిస్తున్న విశాఖ నగర సౌందర్యాన్ని చూసి అబ్బురపడి వ్రాసింది.
అంధగీతం- నేను వైజాగ్ నుంచి విజయవాడ వెళుతూ ట్రెయిన్ లో ఒక గుడ్డి బిచ్చగాడిని,అతని చేయి పట్టి నడిపిస్తున్న ఓ ఎనిమిదేళ్ళ అమ్మాయిని చూసినప్పుడు ఒక కలత,గొప్ప దుఃఖం కలిగాయి.ఆ జ్ఞాపకం నన్ను చాలా రోజులు వెంటాడింది.సుమారు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ఆ కవిత వ్రాసాను .
ప్రవాసంలో వాన –నేను అమెరికా వచ్చిన కొత్తలో మా కుటుంబసభ్యులనందరినీ తలచుకుని వ్రాసిన కవిత
స్మృతి – నాతొ ఏడేళ్ళు పనిచేసిన నా కొలీగ్,స్నేహితురాలు అర్ధంతరం గా ౨౦౧౧ లో చనిపోయినపుడు నేను చాలా బాధ కు గురయ్యాను . ఈ కవిత దాదాపు ఒక సంవత్సరం తర్వాత వ్రాసింది.
ఇంకా సహచర్యం,నీవు,నిశ్శబ్దం నీకు నాకు మధ్య,ఏటివడ్డున నాకు చాలా ప్రియమైన,నా హృదయానికి చేరువైన కవితలు
7. కవి లేదా కవయిత్రికి హక్కులూ, బాధ్యతలూ ఉండాలా? ఉంటాయా? ఎలా?
కవికి తప్పని సరిగా ఉండాల్సిన బాధ్యతలు –నిజాయితీ,సంయమనం .ఆ మాటకొస్తే పాఠకులకి కూడా.ఎవరికైనా నిజాయితీ ముఖ్యం. తనకి పూర్తిగా నమ్మకం లేని,తాను ఆచరించలేని ఏ ఆదర్శాన్నీ,సిద్ధాంతాన్నీ ,ఏ రకమైన ప్రయోజనాన్ని ఆశించి కూడా కవులు ,సాహిత్య కారులు ప్రచారం చేయకూడదని నా ఉద్దేశ్యం. కవిత్వం ఒక సహజమైన ,మానవీయ హృదయ స్పందన లోంచి మాత్రమే రావాలి.బాధ్యత కాదు కానీ కరుణ,ఆర్ద్రత ,సహృదయత లేకుండా నిజమైన కవిత్వం ,హృదయాన్ని తాకే కవిత్వం వ్రాయలేమని నా అభిప్రాయం.
ఇక హక్కుల విషయానికి వస్తే,సాహిత్య మర్యాదోల్లంఘనం చేయని స్వేచ్చ,భావ ప్రకటన ,సృజనపై హక్కు అన్నవి రచయితల కనీస హక్కులు .
8. ప్రస్తుత సమయంలో మిమ్మల్ని కవిత్వానికి ఎక్కువగా పురికొల్పేవి ఏమై ఉంటాయి? మీరు చదివే సాహిత్యం ఎక్కువగా ఏమై ఉంటుంది? ఏ భాష? ఏ ప్రక్రియ? ఏ కవి లేదా కవయిత్రి?
కవిత్వానికి పురి కొల్పడం ఎప్పుడూ ఒక Intense Emotion వల్లే అయినా , వ్రాయాలన్న గాఢమైన స్ఫూర్తి కలిగినప్పుడూ,వ్రాయకుండా ఉండలేనప్పుడు మాత్రమే వ్రాయటం అలవాటు. నేను తీరిక సమయాల్లో తెలుగు,ఇంగ్లీషు సాహిత్యాలు రెండూ చదువుతాను.కవుల్లో తిలక్,,శ్రీశ్రీ ,కృష్ణశాస్త్రి ,జాషువా,కరుణశ్రీ ,తుమ్మల,కీట్స్ ,షెల్లీ ,వర్డ్స్వర్త్ ,ఫ్రాస్ట్ .రచయితల్లో శరత్ , విశ్వనాధ, శ్రీపాద,బాపిరాజు,చాసో,కొకు,డికెన్స్,మొపాసా,మామ్,ఆస్కార్ వైల్డ్ ను ఎక్కువగా చదువుతాను .
9. మున్ముందు రాబోతున్న మీ పుస్తకాల గురించి..మీ కవిత్వం గురించి చెప్పండి.
ఈ మధ్య నేను మరీ అంత తరచుగా వ్రాయటం లేదన్న విషయం ఒప్పుకోవాల్సిందే. ప్రత్యేక కారణాలు ఏమీ లేకపోయినా ,ఇతర బాధ్యతలలో పడి కొంచెం కవిత్వానికి విరామం ఇవ్వటం జరిగింది.అయితే త్వరలోనే మరో సంకలనం తీసుకు రావాలన్న ఆలోచన మాత్రం ఉంది.
10. ధన్యవాదాలు వైదేహి గారు.
నరేన్ గారూ , చాలా సంతోషం.
మీకు, వాకిలి సంపాదకవర్గానికి, వాకిలి పాఠకులకు నా కృతజ్ఞతలు .
చాలా మంచి కవయిత్రిని పరిచయం చేశారు. ధన్యవాదాలు.
“కొన్ని కవితలకి ప్రేరణ వృత్తిలో నా అనుభవాలే కూడా .అయితే అవి ఆ కవిత తాలూకు చట్రం లో ఒదిగి ,కవిత శిల్పాన్ని అధిగమించకుండా ఉండాలని నా ఉద్దేశ్యం..”
అందుకే వైదేహి గారి కవితా వస్తువు ఏదైనా కవిత్వం మాత్రం తన శైలిలోనే సున్నితంగా ఉంటుంది!
ఇప్పటి వారిలో నాకు బాగా నచ్చిన ఒక కవయిత్రి వైదేహి!
ఇంటర్వ్యూ చాలా బాగున్నదండి. డా.వైదేహి శశిధర్ గారి ‘నిద్రిత నగరం’ మూడు నాలుగు సార్లు చదివాను. చాలా సరళంగా ఉండి మనసుకు హత్తుకునే కవితలే దాదాపుగా. అందులో నాకు బాగా నచ్చిన కవితలు ‘వేసవిలో ఓ రోజు,’ ‘నీవు ఊరెళ్ళినప్పుడు.’
నగరం,పిట్టలవానిపాలెం పరిసరాలు అంత రమణీయంగానే ఉంటాయి, నిజం.ఆ ప్రస్తావన వినటం సంతోషంగా ఉంది ..
ఇంటర్వ్యూ చాలా బాగుంది నరేన్. ఇద్దరు డాక్టర్లను(ఒకరు వృత్తి రిద్యా, మరొకరు పదార్ధము దాని సాంకేతిక శాస్త్ర పరిశోదనలో ), వారి మద్య సాహిత్య వేదిక లో చోటుచేసుకున్న ముఖా ముఖిని ప్రశంసించకుండ ఉండలేకపోతున్నాను. నిజాయితీగా, వైదేహి గారు నాకు కవిత్వము గురించి గొప్పగా తెలియదు కానీ, అదృష్ట వశాత్తు 12 వ తరగతి వరకు నేను చదివిన మాద్యమము తెలుగు అవడం వల్ల పద్యమైన, గద్యమైన, కవియతయైన దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాదానికి ప్రయత్నిస్తాను. అమ్మ,ప్రవాసంలో వాన,నిశ్శబ్దం నీకు నాకూ మధ్య ,సహచర్యం,నిద్రిత నగరం , చదవలేకపోయినా, ఆ పదాలు చాలా సరళంగా ఉండి ఒక మంచి అనుభూతిని, ప్రేరనను కల్గిస్తున్నాయి. సమయం దొరికనప్పుడు చదవడానికి తప్పక ప్రయత్నిస్తాను. దీని ద్వారా నేను నా బాల్యం లో చదివిన తెలుగు పాటాలు , పద్యాలు, కవుల్ని విశ్వనాధ సత్యనారాయణ, గుఱ)౦ జాషువా, శ్రీశ్రీ సినారె లను గుర్తు చేసినందుకు ధన్యవాధములు. మీ ఇద్దరి కలాల్లో నుంచి మంచి కధలు, కవితలు జాలువారాలని ఆశిస్తూ.. లక్ష్మీ నర్సింహా స్వామి మసురం.
వెన్నెలలో ఉయ్యాలలూగుతూ కబుర్లు చెప్పుకున్న బాల్యమంత అహ్లాదంగా కవిత్వీకరించడం ఆమె శైలి.
ఒక మంచి ఇంటర్వ్యూ… మంచి ప్రశ్నలకి మదిని దోచే జవాబులు.వైదేహిగారి గురించి నాకు ఇప్పుడే తెలిసింది..మీకూ.. కవయిత్రిగారికీ అభినందనలు.
చాలా చక్కని పరిచయం. వైదేహిగారి కవితలు నాకు బాగా నచ్చుతాయి.
నారాయణగారూ..వెన్నెలంత చల్లగా ,వెన్నలాగ మృదువుగా,మీరడిగిన ప్రశ్నలు, మంచు బిందువుల్లా స్వచ్చంగా డాక్టర్ల కోట్లులా తెల్లగా,వైదేహి గారు చెప్పిన సమాధానాలు చాలా బాగున్నై….
వైదేహి గారికి, వాకిలి సంపాదక వర్గానికి మరియు తమ ‘అభినందనలను/అభిప్రాయాలను’ తెలియజేసిన ‘కవి/పాఠక’ మిత్రులకు
ధన్యవాదాలు.
నారాయణ.
నారాయణ గారికి ,వాకిలి సంపాదక వర్గానికి ,అభిప్రాయాలు తెలిపిన పాఠకులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు
వైదేహి శశిధర్