సమీక్ష

ప్రకృతీ, ప్రేమల ఆత్మీయ నెమరువేత: పునశ్చరణం

డిసెంబర్ 2014

కొన్ని మాధుర్యాలుంటాయి. ఎలా అంటే- అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి తడిమి తడిమి అదే పనిగా చూసుకోవటం, పరాయి దేశంలో అనుకోకుండా కలిసిన చిన్ననాటి ఆప్తమితృడిని తరచి తరచి ఆనంద పారవశ్యంలో పరామర్శించడం, ఏళ్ళకు ఏళ్ళు ప్రియురాలికి దూరమైన ప్రేమికుడు ఆమెను కలిసినప్పుడు పదే పదే ఆలింగనం చేసుకోవడం వంటి తన్మయత్వము కల్గించే విషయాలు. ఇంతటి గొప్ప మాధుర్యాన్ని కొందరు ‘మనసుపెట్టి ఇష్టంగా పూర్తి చేసిన పనిలోనూ, హృదయ పూర్వకంగా వ్రాసిన కవితలోను, సర్వస్వమూ లగ్నం చేసి ప్రదర్శించిన కళ వంటి విషయాల లోను, ముఖ్యంగా వాటి పునశ్చరణము (పునర్-సందర్శనం) లో పొందగలరు. అంకిత భావంతో నిర్వహించిన పనులకున్న విశేషణము అంతటిది. తిరిగి సందర్శించినప్పుడు మాధుర్యాన్నిచ్చే ఇలాంటి తన అనుభూతులు, అనుభవాలతో కూడిన 36 కవితల అపురూపమైన సమాహారాన్ని పునశ్చరణం కవితా సంకలనంగా మన ముందుంచారు కవయిత్రి డా. వైదేహి శశిధర్ గారు.

అమ్మో, అమ్మమ్మో, నాయనమ్మో తనకోసం చేసిన తాయిలాన్ని అపురూపంగా బడికి తీసుకొచ్చి ఆ కమ్మదనాన్ని తుంచి ఇచ్చి మనతో కూడా పంచుకున్న బాల్యపు మిత్రుడో మిత్రురాలో ఉంటే ఆ స్నేహ బాల్యం ఎంత మధురంగా ఉంటుంది!? అలాంటి స్నేహపు మాధుర్యాన్ని చవి చూడాలనిపిస్తే ఈ ‘పునశ్చరణం’ కవితలలో మునిగి తేలితే అనుభవానికొస్తుంది.

మొదట కవితలో ‘కచ్చేరీ’ చేసినప్పటి లేదా చూసినప్పటి పారవశ్యాన్ని, మరొక కవిత ‘సభ ముగిశాక’లో కూడా అంతే భావావేశంతో చెప్పడం అంత సులువైన పనేమీ కాదు. ఎందుకంటే ముగిసిపోయిన సభలో కోలాహలం, ఉత్కంఠ, మమేకం వంటివేవీ ఉండవు. కానీ, దానినీ అవలీలగా తన చక్కటి కవిత్వ సోయగంతో చూపించారు వైదేహి గారు.

కోలా హలపు అలల మీద ఆడిటోరియం
అరటిదొన్నెలా తేలుతుంది
….
మొగ్గ విచ్చుకున్నంత నిశ్శబ్దంగా
తెరలేస్తుంది
….
గాంధర్వలోకపు లోతుల్లోకి
…విసిరేస్తూ
ఆమె ఆలాపన మొదలవుతుంది

అని కచ్చేరీ కవితలో సుతిమెత్తని ఆలాపనతో కవిత్వానికి తెర తీశారు. అలలు, అరటిదొన్నె తేలడం, మొగ్గ విచ్చినట్టు తెర లేవడం లాంటి సున్నితమైన పోలికలను కవిత్వములో చేర్చి తనంత ఇష్టంగా మనల్ని కూడా కుర్చోబెట్టి కచ్చేరీ ని ఆస్వాదించే ప్రేక్షకుల్ని చేస్తారు ఈ తొలి కవితలోనే.
సభముగిశాక కవిత ఇలా ప్రారంభమవుతుంది.

సంరంభంతో రెపరెపలాడిన
ఉత్సాహపు తోరణాలు
ఉత్సవాల షామియానాలు
చెదిరిన ముంగురులని సర్దుకుంటాయి

ఇక్కడ ముంగురులు సర్దుకోవడం అనేది అలసటనుండి సేద తీరబోతున్న సానుకూల చర్యే.

రోజంతా సాహితీ గగనంలోకి ఉవ్వెత్తున ఎగిసిన ఆలోచనలు
గూళ్ళలోకి రెక్కలు ముడుచుకున్న
మెత్తటి పావురాలవుతాయి

సభ ముగియటం ‘ఆలోచనలు మెత్తటి పావురాలవడానికి’ కూడా దారి తీస్తుందంటే అది మృదుమధురమే కదా!

నిన్నటి దాకా ఎదురు చూసిన ఈరోజు
అప్పుడే జ్ఞాపకాల పుటల్లోకి
అందంగా ఒదిగిపోతుంది

ఉద్విగ్నతతో నిద్రపట్టని రాత్రినై
ముగిసిన సభను
మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ
నేను మాగన్నుగా మిగిలిపోతాను

అందంగా ఒదిగిపోయే జ్ఞాపకాలలా మిగిలిపోతాయని ముందే తెలిసిన అలాంటి సభలు ముగియటం కోసమన్నా ప్రారంభమైతే బాగుండు అని మది కోరుకోవటం ఎంతో సహజంమనిపిస్తుంది.

ఇంతే చక్కటి అనుభవాన్ని ఎప్పటి స్నేహితులో తిరిగి కలసినప్పటి సందర్భంలో ‘రీ యూనియన్’ అనే కవిత రూపంలో కూడా చెప్పారు. ఇలా మనకు, తన మరియు మన స్నేహితుల మధ్య గడిపే అమూల్యమైన అవకాశంగా అందిస్తారు.

మొదటి కచ్చేరీ లో ఆలాపనని ఆస్వాదించినంత ఇష్టంతోనే వశీకరణ, అంధగీతం కవితలను అందించారు. ఒక గాయకుడు తన పాట తో ‘వశీకరణ’ చేసుకునే అపూర్వ సందర్శనానికి మన ప్రశంసలు అందించే లోపలే, రైలులో సైతం సదా చిరపరిచితమైన ‘అంధగీతం’ (అంధుడు ఒక చిన్నపిల్ల ఆసరాగా నడుస్తూ పాడుతూ అడుక్కునేప్పటి గీతం) లో కూడా పొందుపరచి ప్రస్తావించడం, మనల్ని కూడా ఆ సందర్భాలలో భాగం చేసేంతలా హత్తుకుపోతుంది.

వశీకరణ కవితలో:

అతను పెదవి విప్పగానే
కవిత్వం అతని కంఠాన్ని
కౌగిలించుకుంటుంది.
….
అతని పాట ఏరై పారుతుంది
….
ఓ ఒంటిస్తంభపు రాకుమారికి
ఎర్రని వివశత్వపు పారాణి దిద్దుతూ
అతని పాట జీరగా
వంపులు తిరుగుతుంది.

ఆఖరికి ఆ పాట ‘ వశీకరణాన్ని గుప్పెట్లో దాచుకుని ముగుస్తుంది ’ . రాకుమారికి పారాణి దిద్దే గాంధర్వలోకాన్ని కవిత్వంలో ఆవిష్కరించినందుకో ఏమో ఆ సమ్మోహపు భావన పాఠకుల్ని కూడా వశీకరణ చేస్తుంది.

పాట మరియు ఆలాపన పట్ల పొందిన ఈ తాదాత్మ్యాన్ని ‘అనాసక్త శ్రోతలని అలరించిన రైలు పెట్టెలో సాగిన అంధగీతంలో కూడా ప్రస్తావించారు. ఆ అంధుని బతుకులోని నైరాశ్యాన్ని తొక్కి పెట్టి అతని పాట ఉబికి వచ్చినా కూడా అది అతనికి పైసలు రాల్చలేకపోయి౦దన్న దిగులు మాత్రం ‘వలయాలు తిరుగుతూ దాటిపోయిన నిసర్గ మాధుర్యం’ లా మన వెంట తిరుగుతుంది.

తులసి మొక్క, అరటి దొన్నె, వత్తుల డబ్బా, గంధపు చెక్క, వ్యాసపీఠం, చిన్ని కృష్ణుడి కంచు విగ్రహం, తాతగారి ఊసులు మొదలైన సతత హరితారణ్యాల లాంటి అనేక జ్ఞాపకాలను తనకిచ్చి పోయిన తన ‘నాయనమ్మ ‘ సరస్వతమ్మ గారిని గురించి చెప్పినా, అకారణంగా తనను కన్నీటి కెరటాల వెనుక వదలి పోయిన సాటి డాక్టర్ మిత్రురాలు సురేఖ గారు పోయిన లోటు స్మృతి కి తల్లడిల్లి బాధపడినా, పురావస్తు తవ్వకాలలో బయల్పడ్డ అద్భుత శిల్పం లాంటి పాతఫోటో లో పరిమళించిన జ్ఞాపకాలను నెమరు వేసినా అన్నింటిలో ఆత్మీయమైన తన సొంత గొంతు తోనే మనతో హృద్యంగా చెప్పుకున్నారు ఈ కవయిత్రి.

తేనీటి సమయం లాంటి ప్రతిరోజూ తారసిల్లే సమయంలోని ఉత్తేజ, ఉత్సాహపు ఊసుల అపురూపాన్ని, స్ప్రింగ్ ఫెస్ట్ లాంటి ప్రకృతీ పండగలనీ, మన అందరికీ తెలిసిన అనుభవాలపరంగనే చెప్పారు. అందువల్లే, తెలిసినా కూడా ‘ అవును కదా’ అని ఆశ్చర్యము కల్గించే ఇష్టం ఏర్పడుతుంది. ఇలా అన్ని కవితలనూ తాయిలం తుంచి కమ్మదనాన్ని రుచి చూపించిన బాల్యపు స్నేహంలా పునశ్చరణం గావించారు వైదేహి గారు.ప్రకృతిని ఆమె ముట్టుకోని కవిత ఒక్కటీ లేదంటే అతిశయోక్తి కాదేమో! పూలను, మొగ్గలను, చెట్లను, ఆకులను, అలలనూ కవితలలో భాగం చేశారు. అంతే సహజ౦గానే ఎండ గురించి, ముసురు వేసి ముసుగు వేయించిన ఆకాశం గురించి, కొలను గట్టు గురించి, పైకి ఘనీభవించి లోపల కొబ్బరి నీళ్లు దాచుకున్న ఫ్రోజెన్-లేక్ గురించి, వెన్నెల వాన గురించి వేరు వేరు కవితలలో ఎంతో ముచ్చటగా, మురిపెంగా చెప్పుకొచ్చారు.

మీ ఇంటి పెరటి పూల వనం నుండి, బడి ఆవరణ లోని స్నేహ వనం గుండా, రాకుమారి విహరించే రాజవనం మీదుగా, సమ్మోహన పరిచే గాంధర్వ వనానికి ఒక హాయైన ప్రయాణం చేస్తూ ,చేసిన తరువాత కూడా ఆస్వాదించాలనుకుంటే పునశ్చరణాన్ని తప్పక చదివి అనుభూతించాలి

 

**** (*) ****