కవిత్వం

జంతర్ మంతర్

12-జూలై-2013

సూర్యుడు చుక్కల్ని పట్టుకుని
పగటి గంప కింద కప్పి పెట్టి తన పనికి బయల్దేరింది మొదలు
రాత్రి ఇంటికి చేరి , గంప తీసి ఆ నక్షత్రాల్ని
ఆకాశంలో తిరగాడనికి వదిలే వరకు
నాది కాని ఇంకేదో లోకంలో
నన్ను నేను వెతుక్కుంటాను

నేను
సముద్రంతో ముచ్చట్లాడుతూ గూళ్ళు కట్టుకున్న సమయాల్ని
కొత్త పుస్తకంలోని వాసనని ముద్దగా ముక్కుకు పూసుకున్న క్షణాల్ని
చిన్న తనంలో ఆడి దాచి పెట్టిన గోలికాయల డబ్బా
మళ్ళీ కనిపిస్తే గుర్తు కొచ్చిన బాల్యాన్ని
ప్రేమ -ముద్దుగా పెట్టే మొదటి ముద్దు రుచి చూసిన అనుభవాల్ని
కొత్త పూలు పూసి మొక్క పడే గర్వంలాంటి చిన్న చిన్న విజయానందాల్ని
వదిలి
అదేదో బాషలో , ఇంకేదో లోకంలో
ఎల్లలు దిక్కులు తెలియకపోయినా వెతుక్కుంటూ

రోజు ఉదయమే
అరువు బాషను , హావభావాలను , వేషధారణను ,
చంకలోని బ్రతుకు దెరువు సంచిలో వేసుకుని
నన్ను నేను అమ్ముకోడానికి బయలుదేరుతూ
అమ్మనొక్కసారి ఆగి చూస్తాను

అమ్మ బాష క్షణం కూడా నిలబడలేని ఆ లోకంలో
గుర్తింపు పునాదిపై , డబ్బు మట్టితో ఎన్నెన్నో సౌధాలు నిర్మించుకోవాలని
ప్రయాణించే మనుషుల మధ్య

ఈ ప్రపంచీకరణలో నన్ను నేను బ్రతికించుకోడానికి
సగటు మనిషిగానైనా బతికున్నాను , బ్రతగ్గలనని
ఋజువు చేసుకోడానికి
ప్రతి రోజు పోటీ ప్రవాహంలో ఎదురీదుతూ
ఇదీ నా ఉనికని చాటే ప్రయత్నం చేస్తూనే

నేను
నా నాలుకకు ఇరవై ఆరక్షరాల నరకాన్ని కుట్టుకుని
ఉద్యోగపు జంతర్ మంతర్లో
బ్రతుకు సాగించేందుకు బయలుదేరుతాను