కవిత్వం

కొన్ని సార్లు

జనవరి 2013

కొన్ని సార్లు
మొదలు ఎక్కడ పెట్టాలో వెతుకుతూఉంటా
నాలో ఆలోచన నిలువునా చినిగిన స్థానాన్ని
కుట్టుకోడానికి
లోపలికెళ్ళే దారికి గుమ్మం ఎదురుగానే ఉన్నా
కొన్ని సార్లు
ప్రశ్నలను పిడికిలిలోనే బంధిస్తూ తిరుగుతుంటా
గాయం మౌనం మిళితమై హృదయపు పునాదులను
కదిలిస్తున్నా
ఉదయం లాంటి నవ్వు నా పిడికిలో అస్తమించడం
ఇష్టం లేక
రాలిపోతుంటా
నాలో అగమ్యాలు రాలి  గమ్యం చిగురించేలా
నిశబ్దాలను చీల్చుకుని
వసంతపు శబ్ధం  నాలో జనిస్తుందని ఆశగా
కొన్ని సార్లు
నాలో నేను
మళ్ళీ మళ్ళీ పుడుతుంటా
అవమానాల్లోంచి విజయంగా
నిరుత్సాహంలోంచి లేలేతగా
చనిపోయిన ఓటమిలోంచి
నన్ను నేను నిర్వచించుకుంటూ కొత్తగా