కవిత్వం

ప్రియాన్వేషి

జనవరి 2013

తాపంతోనో
తమకంతోనో
ప్రకృతిలోని యే యే
మూలల్లోంచి
ఏరి ఏరి ఆ చినుకుల్ని
నింపుకొచ్చాడో

ఎదురు చూసి
చూసి
బరువవుతున్న దేహాన్ని
మోయలేక
మెళికలు తిరుగుతూ కదులుతుంటే
చల్లగాలి తన అరికాళ్ళపై
గిల్లుతూ చక్కిలి గింతలు
పెడుతుంటే

దొంగ దొంగగా
ఊళ్ళని దారులని దాటుతూ
కొండ పూలు
కన్నుగీటుతూ సన్నజాజులు
పరిమళాల దారాలతో
కౌగిళ్ళ పతంగులుకట్టి
రసిక ఆహ్వానం పంపినా
చూడకుండా

కళ్ళనిండా తన రూపం
తనువు అణువణువున
వేడినేదో పుట్టిస్తుంటే
చల్లదనంతో దూదిలా
పోగులు పోగులుగా
ఊహల చిత్రాలేవో
మెరుపు కుంచెతో
అద్దుకుంటూ

ప్రియురాలైన అరణ్యంపై
వర్షిద్దామని
ప్రతి వత్సరం లాగే వచ్చి
ఈ తొలకరిన పరిణయానికుంటానని
చెప్పి, అదృశ్యం అవడం చూసి
భంగపడి
వెక్కి వెక్కి ఏడుస్తూ

వణుకుతూ ఆ తనను తానూ
వర్షిస్తూ.. కృమ్మరించుకుని
ఎర్రన్ని మృత్తికలో
ఎరుపై
అరణ్యపు జాడనెతుకుతూ
బయల్దేరాడు
వణుకుతున్న వాగై ..