తలపోత

మాయమైపోయిన నెమలీక

19-జూలై-2013

సాహిత్య పరంగా నాకో చెడ్డ అలవాటుంది . అదేమిటంటే కవులు , రచయితల చిరునామాలు రాసి పెట్టుకున్న డైరీ ని ఎప్పుడు తిరగేసినా అప్పటి వరకూ చనిపోయిన వాళ్ళ చిరునామాలపై ఇంటూ గీతలు కొట్టడం. మొన్నటికి మొన్న కె.ఎస్. రమణ గారి చిరునామా కనబడితే ఎందుకో కొట్టి వేయబుద్ది కాలెదు. నా డైరీనిండా ఇలాంటివి ఎన్నో! వాటిలో కాల ధర్మం చెందిన జి.వి.ఎస్., నాగ భైరవ, తొక్కుడు బండ కృష్ణముర్తి, ఇస్మాయిల్, స్మైల్, అజంతా,మో , కొత్తపల్లి, వడలి మందేశ్వరరావు, జ్ఞానానంద కవి, సదాశివ వంటి పెద్దలూ, అకాల ధర్మం చెందిన మద్దెల శాంతయ్య, మద్దూరి నగేష్ బాబు, నాగప్పగారి సుందర్రాజు, నక్కా అమ్మయ్య, నాగపురి శ్రీనివాసులు, చంద్రశ్రీ, లాయర్ చంద్రశేఖర్, కలేకూరి ప్రసాద్ వంటి వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు జాబితాలో తీసివేసినంత మాత్రాన వాళ్ళు మన స్మృతి పధం లోంచి చెరిగి పోయినట్లు కాదు. అలాగే సాహిత్యేతర మిత్రుల జాబితా కూడా! అలాంటి మిత్రుల జాబితా నుండి పుస్తకం లో దాచుకున్న నెమలీక లాంటి జ్ఞాపకం మాయమైపోయింది. అతని పేరు పొట్నూరి ప్రభునాథ్. చిరునామా ప్లాట్ నెం . 26, తారాపధ్ నగర్, పోస్టల్ కాలనీ, కాకినాడ – 533 003. మామూలుగా ఇలాంటి వ్యక్తిగత మిత్రులకు సాహిత్య పేజీల్లో స్థానం దక్కక పొవచ్చు. కానీ అతను కవి మిత్రుడు కావడమే విశేషం. కవులూ, కళాకారులూ తమ చుట్టూ తమ తమ మిత్ర బృందాలు లేకుండానే వారి ప్రోత్సాహం, ప్రోద్బలం లేకుండానే మేం ఇంతటి వారమయ్యామని ఎవరైనా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? ఏమో! ఎవరైనా చెప్పగలరేమో కాని నాకా ధైర్యం లేదు. కలం పట్టిన దాదిగా చుట్టూ ఎంతమంది లేకపోతే ఒక కవీ ,రచయితా, కళాకారుడు వున్నాడు చెప్పండి.

ఇదుగో ఈ పొట్నూరి ప్రభునాథ్ అలాంటి వాడే! కాకినాడ పిఠా పురం మహారాజా వారి కళాశాలలో బియ్యేలో నా క్లాస్ మేట్ . నేను బి.ఎ. స్పెషల్ తెలుగు అతగాడు ఎకనామిక్స్. ఒక్క తెలుగు క్లాసులప్పుడు తప్ప మిగతా సమయంలో అంతా కలిసే! ఎన్.సి.సీ లోనూ, విద్యార్ధి రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. మంచి పొడగరి. ధృడకాయుడూను. ఇద్దరం కలసి తిరగడం వల్ల అధ్యాపకులైన సాహితీవేత్తలు ఇస్మాయిల్, పేరాల భరత శర్మ, మిరియాల రామకృష్ణ, నందుల గోపాల కృష్ణ వంటి వారికీ, కాలేజీమేట్స్ అయిన సాహిత్య పరులు చైతన్య ప్రసాద్, విన్నకోట రవి శంకర్, రసజ్ఞ శ్రీ, ప్రయాగ సుబ్రహ్మణ్యం వంటి వారికీ ప్రభునాధ్ పరిచితుడు.

అతను కేవలం కాలేజీ మిత్రుడయితే ఇంత కధ రాయనవసరం లేదు.. దానికి మించి తన మిత్రత్వంతో అతను నన్ను తమ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా చేసాడు. తొలి రోజుల్లోని నా బి.ఎ., చదువుకూ తర్వాత నా సాహితీ సృజనకు తనకూ, నాకు తెలియనంతగా అజ్ఞాత దోహదం చెసాడు. అప్పట్లో నేను యానాం నుండి కాకినాడ కాలేజీకి రోజూ బస్సులో వెళ్లి వచ్చేవాణ్ణి. ‘మా బాప్ప’ పెద్ద కూతురు, నా వదిన సత్యవతి ఎప్పుడో తెల్లవారు ఝామున లేచి కట్టెల పొయ్యి మీద వండి డబ్బాలో పెట్టిన అన్నం, ఆలుగడ్డల కూర మధ్యాహ్నానికి నీరుగారి చప్పబడిపోయేది. అది చూసిన ప్రభునాధ్ అమ్మ అగ్నేశమ్మగారు నా డబ్బాను పక్కకు నెట్టి ఇంట్లో వండినవి వడ్డించేది. నా గురించి తెలిసిన అగ్నేశమ్మగారు ఎంతో ప్రేమగా చూసుకునేది తన నలుగురు కొడుకుల్లాగే! ఆమె నా ప్రక్కనే కూచుని నాకు కూరలు వడ్డిస్తుంటే, వాడికి అంత ఎక్కువ ఎందుకు పెడుతున్నావంటూ నా కంచంలోని మాంసం కూరో, చేపల కూరో చేత్తో తీసుకునేవాడు ప్రభునాధ్! అదంతా సరదాగా సోదర ప్రేమే అనుకునేవాణ్ణి. ఒకసారి నేను వేసుకున్న చొక్కాకు బొత్తం లేకపోతే చొక్కా విప్పించి, బొత్తాం కుట్టి ఇచ్చిందాయమ్మ. ఇలా మూడేళ్ళలో ఎన్నో సందర్భాల్లో తల్లిని తలపించారామె! 1995లో ఆమె ఆకస్మికంగా మృతి చెందినపుడు ఆమె గురించి నేను రాసిన కవిత ‘పిల్లకోడి’ ఆ ఏడాది ఆంధ్ర జ్యోతి దీపావళి సంచికలో అచ్చయింది. అందులోంచి కొన్ని పాదాలు:

“తల్లి లేని బిడ్డడనీ ! ప్రేమగా చూడాలనీ
నీవు కొసరి కొసరి వడ్డించి నప్పుడు నేనెరుగని నాకన్నతల్లి
అన్నమై వచ్చి కంచంలో కూర్చునేది
గుండీ లేని చొక్కాతో బడికెలా వెళ్తావని
నా చొక్కాకు నీ గుండెను గుండీగా కుట్టిచ్సిన అగ్నేశమ్మ!
నిన్ను చూసాక దేవుడు కూడా తప్పకుండా
ఎవరో ఒక తల్లికే పుట్టి వుంటాడనిపించింది” – అని రాసుకున్నాను. ఇదుగో ఇలాంటి తల్లిని నాకు ఇచ్చిన ప్రాణ మిత్రుడు ప్రభునాధ్ ఇప్పుడు లేడు.

బి.ఎ. తరువాత ఎం.ఎ. కోసం ఆంధ్రా యునివర్సిటీ కొచ్చాను. ప్రభునాధ్ కొన్నాళ్ళు బి.ఇడి చదువుకోసం ప్రయత్నించాడు. మరికొన్నాళ్ళు ఎస్.ఐ. అవుదామని ప్రయత్నించాడు. అవేమి కుదరక కాకినాడ పోర్టులో కాబోలు కొన్నాళ్ళు పనిచేశాడు. అక్టోబర్ 18, 1987 నా మువ్వల చేతి కర్ర కవితా సంపుటి ఆవిష్కరణ ఆంధ్ర విశ్వవిద్యాలయం, అసెంబ్లీ లో ఏర్పాటు చేశాం! యానాం నుండి మహమ్మద్ ముస్తఫా ఖాన్, కాకినాడ నుంచి ప్రభునాద్ కలిసి బయలుదేరారు. ముస్తఫా, నేను యానంలో ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం. ముస్తఫా ఇస్మాయిల్ గారికి దూరపు బంధువు. కాకినాడలో పేర్రాజు పేట లోని చిలుకలు వాలిన చెట్టు గల గూడ పెంకుల మండువా లోగిలి ఇంట్లో ఇస్మాయిల్ గారి ప్రధమ దర్శనం నాకు ముస్తఫా వలన కలిగింది. కాకినాడ నుండి విశాఖకు బస్సులో బయలుదేరిన ఇద్దరూ కారణంతరాల వల్ల తుని లో దిగి కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. తెల్లవారు ఝామున రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ గదికి వచ్చిన ముస్తాఫాను చూసి భయకంపితున్నయినాను. ముస్తఫా బట్టల నిండా రక్తపు మరకలె. విషయం ఏమిటంటే విశాఖకు సమీపం లో పరిగెడుతున్న రైలు నుండి ప్రభునాధ్ జారి పడిపోయాడని. ఆ సమయంలో మాస్టారు అత్తలూరి నరసింహారావు, చప్పా సూర్య నారాయణ, దారా సుబ్బరాజు, వర్షాల పురుషోత్తం వంటి వారు చేసిన సహాయం మర్చి పోలేనిది. అంత బాధ లోను సభ బాగా జరగాలని మాకు శుభా కాంక్షలు చెప్పి. సభానంతర సభలో తనను మర్చిపోవద్దని గుర్తు చేసాడు హాస్పిటల్ బెడ్ మీద నుండే. అతని మొండి ధైర్యానికి, చిలిపి తనానికి అంత దుఃఖంలోనూ అందరం నవ్వుకున్నాం.

1987 లో మృత్యువును జయించిన ప్రభునాధ్ 2013 జులై 2న దానికి తలవంచక తప్పలేదు. ఇస్మాయిల్ గారు చనిపోయిన తరువాత సి. ధర్మారావు గారు ఫోను చేసి ‘శిఖా! మనకు కాకినాడకు ఇక దారులు మూసుకుపోయాయి అన్నారు. అయన అన్నట్లు గానే కాకినాడ వెళ్ళకుండానే ధర్మారావు గారు ఇస్మాయిల్ గారి దగ్గరికి ప్రయాణమై వెళ్ళిపోయారు. కవితా కల్ప తరువు ఇస్మాయిల్ గారు లేని కాకినాడకు మిత్రధనుడు ప్రభునాద్ లేని కాకినాడకు ఎలా వెళ్ళేది? ఏ దారి లేదాయే…… కాకినాడకు.