ప్రతిష్టాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు వ్యవస్థాపకులు రాధేయ గారితో ముఖాముఖం – ఎ.ఎ. నాగేంద్ర (పరిశోధక విద్యార్థి, అనంతపురం).
1) ముందుగా మీ జీవిత నేపధ్యం గురించి తెలుసుకోవచ్చా?
నా జీవితం వడ్డించిన విస్తరికాదు. పేదరికంతో అనేక ఆటుపోట్లతో గడచిపోయిన జీవితమే. ఒక సామాన్య చేనేత కుటుంబంలో పుట్టడం వల్ల తల్లిదండ్రులిద్దరూ చేనేత కార్మికులైనందువల్ల వారి రెక్కల కష్టంతో చదువుకోవడం జరిగింది. మేము మొత్తం 5మంది అన్నదమ్ముళ్ళం ఇద్దరు చెల్లెళ్ళు ప్రస్తుతం అందరం కూడా వారివారి స్థాయిల్లో నిలబడటం జరిగింది.
నేను ఒక సామాన్య ఉపాద్యాయునిగా 1982 సం॥లో ఉద్యోగంలోకి ప్రవేశించి, ఉద్యోగంలో వుంటూనే ఉన్నత చదువులు చదవాలనే బలమైన ఆకాంక్షతో ప్రయివేటుగా ఎం.ఏ. తెలుగు, తరువాత పిహెచ్‌డి పూర్తీ చేయడం జరిగింది. ఉపాధ్యాయునిగా, అంచెలంచెలుగా జూనియర్ లెక్చరర్‌గా, ఆ తరువాత డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా పనిచేసి 31 సంవత్సరములు ఉద్యోగ జీవితం పూర్తీ చేసుకొని ఇటీవలె ఏప్రిల్ 30 ` 2013 తేదీన పదవీ విరమణ చేయడం జరిగింది. నా ఉద్యోగం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఎందరో నావిద్యార్థులు సాహిత్య చైతన్యంతో ఈనాడు రచయితలుగా సమాజంలో గౌరవింపబడుతుంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది.
2) మీ కలం పేరు రాధేయ కదా! ఈ పేరు వెనుక గల నేపథ్యం గురించి తెలుసుకోవచ్చునా?
నిజమే, నా కలం పేరు రాధేయ అని 1972 సం॥లో నా మిత్రుల సలహాతో నాకు నేనుగా ప్రకటించుకున్నాను. నా తొలి కవిత 1972 సంవత్సరంలో ‘‘సాహితీ మిత్రదీప్తి’’ జగిత్యాల నుండి వెలువడిన ఒక చిన్న పత్రికలో ‘‘ఇదానవభారతం’’ అనే శీర్షికన వి.ఎన్. సుబ్బన్న అనే నా అసలు పేరుతో ప్రచురింపబడిరది. ఆ రోజుల్లో ప్రసిద్ధ రచయితలందరూ కలం పేరుతోనే తమ రచనలు చేసేవారు. నేను కూడా ఆ ప్రభావంతో రాధేయ అని నాకలం పేరును స్థిరపరచుకున్నాను. ఈ పేరు బాగుంటుందని భావించి పెట్టుకున్నానే కానీ ఈ పేరు వెనుక గల నేపథ్యం గురించి కానీ అర్థం గురించి కాని ఆనాడునేను ఆలోచించలేదు. నా ఉద్యోగ రికార్డులలో తప్పా మరెక్కడా నేను నా అసలు పేరును వాడుకోలేదు. ఇంటా బయటా సాహిత్యలోకంలో కూడా రాధేయగా గుర్తింపు ఉన్నది. ఈ గుర్తింపునే నేను పదిలపరచుకున్నాను.
3) కవిత్వం రాయాలనే ఆలోచన, ప్రేరణ ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది?
నా కుటుంబంలో ఎలాంటి సాహిత్య వాసన లేదు. మా తాతలు ఎవ్వరూ చదువుకోలేదు. మా తండ్రిగారు మాత్రం 5వ తరగతి వరకు చదువుకున్నారు. మా తండ్రి బాగా లౌక్యం తెలిసినవారు. సుమతీశతకం, భాస్కరశతకంతోపాటు, కొన్ని సామాజిక నీతిసూత్రాలు తీరిక వేళల్లో నన్ను కూర్చోబెట్టుకొని బోధించేవారు. ఆ సంస్కారం నాలో ఏమైనా కవిని గానీ రచయితని గానీ తట్టిలేపిందేమోనని నేను భావిస్తాను. మా అమ్మ పూర్తీగా నిరక్షరాస్యురాలు. బాల్యంలో నేను ప్రకృతి అంటే చాలా ఇష్టపడేవాణ్ణి. మా ఊరి చుట్టూ కొండలు ఉండటం వలన ఆదివారం ఆటవిడుపు కలిగితే కొండల్లో తిరుగుతూ కలీపండ్లు, బలస, నేరేడు, జామ మొదలగు పండ్లు కోసుకొని జేబులో వేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం.
పుట్టిన ఊళ్లో 5వ తరగతి వరకూ చదువుకున్నాను. తరువాత ఉన్నత పాఠశాలలో చేరడానికి మూడు మైళ్ళ దూరంలో వున్న ముద్దనూరుకు రోజూ కాలినడకన వెళ్లేవాణ్ణి. కొద్ది రోజులకు మా కాలినడక చూడలేని మా తండ్రి ముద్దనూరులో ఒక గదిని అద్దెకు తీసుకొని మాకు వంట వండిపెట్టడానికి నాన్నమ్మ (జేజి)ను మా వద్ద ఉంచాడు.
నేను ముద్దనూరులోనే వుండటం, రోజూవారినడక తగ్గిపోవడం వలన పాఠశాల సమయాల్లో కాకుండా ఇతర తీరిక సమయాల్లో బాగా సమయం దొరికింది. ముద్దనూరులోనే శాఖాగ్రంథాలయం వుండేది, అక్కడికి వెళ్ళి ప్రతి పుస్తకాన్ని ఆబగా చదివేవాణ్ణి. అందులో శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, చలం, తిలక్, రావిశాస్త్రి, కోడూరి కౌలస్య, యద్దనుపూడి సులోచనారాణి, రంగనాయకమ్మ ఇంకా అనేక మంది రచయితల రచనలన్నీ చదివేవాణ్ణి. చివరికి ఆ గ్రంథాలయంలో ఉండే అధికారిని మచ్చిక చేసుకొని కథల పుస్తకాలు, కథానిక, నవలలు, జానపదసాహిత్యం, పుస్తకాలు ఇంటికి తెచ్చుకొని దాచిపెట్టుకొని మరీ చదివేవాణ్ణి.
ఒక పుస్తకం చదివిన తరువాత అందులోని పాత్రలు, సన్నివేశాలు, మళ్ళీ మళ్ళీ జ్ఞప్తికి వచ్చి నన్ను సృజనాత్మక ఆలోచనలవైపు మళ్ళించేవి. సినిమాలైనా సరే ఆ మూడు గంటల సమయం నన్ను నేను మైమరచిపోతాను. ఆ పాత్రల సన్నివేశాలు నాకళ్ళ ముందు మెదులుతుండేవి. రానురాను సృజనాత్మక ఆలోచనలు వచ్చినప్పుడు నేనూ ఇలా రాయగలిగితే ఎంత బాగుంటుంది అని ఎన్నోసార్లు మనసులో అనుకునేవాణ్ణి. ఇంతలో 1970 సం॥లో నా హైస్కూల్ విద్య ఎస్‌ఎస్‌సి పూర్తీ అయినది. తరువాత మా నాన్న నన్ను ప్రొద్దుటూరు నందు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో చేర్పించాడు.
ఒక సంవత్సరం మాత్రమే చదువుకొని 2వ సంవత్సరంలో ఆ చదువుపట్ల విరక్తి కలిగింది. ఎందుకంటే నాకు ఉపాధ్యాయుడు కావాలనే కోరిక ఉండేది. పాలిటెక్నిక్ చదువు వల్ల నేను ఉపాధ్యాయున్ని కాలేను. నాలోని రచనా ప్రవృత్తికి ఉపాధ్యాయవృత్తి బాగుంటుంది అని నా మనసులో అనుకున్నాను. అందువల్ల ఆ చదువులో ఇమడలేకపోయి ఇంటికి తిరిగి వచ్చాను. తండ్రి మందలించినా వినలేదు. ఉపాధ్యాయ వృత్తికి కావలసిన చదువును అర్హతను సాధించుకున్నాను.
1975 సం॥లో బిఈడీ చేరేందుకు నెల్లూరు వెళ్లాను. అక్కడ నా జీవితం కొత్త మలుపు తిరిగింది. ఒకవైపు బిఈడీ చదువుతూ ప్రతి రోజూ సాయంత్రం నెల్లూరు టౌన్‌హాల్‌లో జరిగే సాహిత్య కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవాణ్ణి. అక్కడే నేను శ్రీశ్రీ గారిని కలిశాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, బెజవాడ గోపాలరెడ్డి, మరపూరి కోదండరామిరెడ్డి మొదలైన వారిని ప్రత్యక్షంగా కలుసుకోవడం పరిచయం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి నాకు కవిత్వం రాయాలని మనసు ఉరకలు వేసింది. మొదట నాలో నేను భావకవితలు రాసుకుంటూ ఎవ్వరికీ చూపించకుండా దాచుకునేవాడిని. బిఈడీ శిక్షణ పూర్తీ అయిన తర్వాత 1978 సం॥ నుండి 1982 సం॥ వరకు నా స్వంత గ్రామంలో పార్ట్‌టైం ఉపాధ్యాయునిగా నెలకు రూ. 50/` గౌరవ వేతనంతో నియమింపబడినాను. (1978 సం॥లో నా తొలి కవితాసంపుటి ‘‘మరో ప్రపంచం కోసం’’ కుటుంబ సభ్యుల సహకారంతో వెలువరించాను). ఈ పుస్తకం విజయవాడ సాంస్కృతీ సమాఖ్య ఆధ్వర్యంలో వెలువడిరది. ఈ కవితా సంపుటికి నన్ను చూడకుండానే నేనెవరో తెలియకుండానే నా కవిత్వాన్ని చదివి డా॥ సి. నారాయణరెడ్డిగారు, ఆవంత్స సోమసుందర్ గారు మరియు మానేపల్లి గారు తమ విలువైన అభిప్రాయాలను ముందుమాటగా రాశారు. ఈ పుస్తకం విడుదలైన తరువాత సాహిత్యలోకంలో నాకంటూ ఒక స్థానం లభించింది. వచన కవితా పితామహుడైన కుందుర్తి ఆంజనేయులు గారు ఎంతో వాత్సల్యంతో నన్ను మెచ్చుకుంటూ, వచన కవితా రచనలో అనేక మెళుకువలు నాకు ఉత్తరాలు ద్వారా తెలియజేసేవారు. అంతేకాక అద్దేపల్లి రామమోహనరావు వంటి వారు కూడా పరిచయమై నాకెంతో ఉత్సాహాన్ని కలిగించారు. వీరిచ్చిన ప్రోత్సాహంతో 1982 సం॥లో ‘‘దివ్యదృష్ఠి’’ అనే కవితా సంపుటిని అద్దేపల్లి రామమోహనరావుగారు విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది. ఇది నాకు సాహిత్యలోకంలో ఒక మంచి గుర్తింపునిచ్చింది. ఎందుకంటే ఈ పుస్తకాన్ని సాహిత్యవేదిక వనపర్తివారు ఉత్తమ కవితా సంపుటిగా ఎంపిక చేసి ‘‘ఉమ్మెత్తల’’ అవార్డుతో నన్ను ఘనంగా సత్కరించడం జరిగినది. ఇది నా జీవితంలో మరువలేని మరపురాని మధురస్మృతి.
1982 సం॥లో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించాను. తొలి తెలుగు శాసనం పుట్టిన కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాను. ‘‘దివ్యదృష్ఠి’’ కవితా సంపుటికి వరంగల్లు వారు ‘‘భాగ్య అవార్డు’’తో నన్ను సత్కరించడం జరిగింది. ఈ పుస్తకానికి రాష్ట్రస్థాయిలో 2 అవార్డులు రావడంతో ఆంధ్రదేశంలో కవిగా అందరికీ పరిచయం కావడం జరిగింది. నేను పనిచేస్తున్న గ్రామంలోనే కాపురం వుంటూ నా తీరిక సమయాన్ని కవిత్వానికి అంకితం చేయడం జరిగింది. (అక్కడే నేను ‘‘జ్వలనం’’, ‘‘తుఫాన్ ముందటి ప్రశాంతి’’ ఈ రెండు పుస్తకాల్ని వెలువరించడం జరిగినది.) ‘‘తుఫాను ముందటి ప్రశాంతి’’ సంకలనం కూడా ఉత్తమ కవితా గ్రంథంగా ఎంపికైంది.
1989 సం॥లో నా కుటుంబాన్ని ప్రొద్దుటూరుకు మార్చడం జరిగినది. ఇక్కడ అనేకమంది కవులు, రచయితలతో పరిచయం ఏర్పడి నా సాహిత్య రచనకు మరింత మంచి వాతావరణం కలిగింది. అప్పుడే నేను ‘‘ఈ కన్నీటికి తడిలేదు’’ కవితా సంపుటిని వెలువరించాను. ఈ పుస్తకాన్ని ప్రముఖ అభ్యుదయ కవి ఉదయం పత్రిక చీఫ్ ఎడిటర్ గజ్జెల మల్లారెడ్డిగారు ఒక ప్రత్యేక సభలో ప్రొద్దుటూరులో ఆవిష్కరించారు.
4) ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డును మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన అవార్డుగా అందరూ గుర్తిస్తున్నారు, ఈ అవార్డుకు ఇంత గుర్తింపురావడం వెనుక మీ కృషి గురించి తెలియజేస్తారా?
ఒక పేద చేనేత కార్మిక కుటుంబంలో నుంచి బయటకు వచ్చి కష్టపడి చదువుకొని, ఉపాధ్యాయునిగా స్థిరపడి కవిగా ఆంధ్రదేశంలో గుర్తింపు తెచ్చుకున్న తరువాత నా మనసులో ఒక ఆలోచన కలిగింది. నాలాంటి కవి మిత్రులకు నా వంతుగా నేనేమైనా చేయగలనా, ఉత్తమ కవిత్వాన్ని రాసే కవులకు నేనేమైనా తోడ్పాటునందించగలనా? అనే ప్రశ్న నిరంతరం నన్ను తొలుస్తూ వచ్చింది. నిరుద్యోగిగా వున్నప్పుడు నేనేమీ చేయలేకపోయాను కానీ ఉద్యోగం వచ్చిన తరువాత ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ మొదలైంది.
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి దారపోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.
అన్న మహాకవి వాక్యాలు నాకెంతో స్ఫూర్తిని కలిగించాయి. ఈ స్ఫూర్తితోనే 1988 సం॥లో మా ఇంటి పేరుతో ‘‘ఉమ్మడిశెట్టి సాహితీ’’ అవార్డు అనే రాష్ట్రస్థాయి పురస్కారాన్ని ప్రకటించాను. నా కుటుంబ ఖర్చులను పొదుపుచేసుకుంటూ, నా జీతంలో కొంత భాగాన్ని ఈ అవార్డుకోసం కేటాయించాలని మా శ్రీమతి సత్యాదేవి, నేను కలసి నిర్ణయించుకొని ఈ అవార్డును ప్రకటించడం జరిగినది. ప్రతి ఏటా క్రమం తప్పకుండా, ప్రణాళికాబద్దంగా న్యాయనిర్ణేతలచేత ఎంపిక చేయబడిన ఉత్తమ కవితా సంపుటికి అవార్డును ప్రకటించి ఆ కవిని ఆహ్వానించి వారికి రూ 500/` నగదు, షీల్డు మరియు శాలువతో సత్కరించాము.
ప్రథమ అవార్డును సౌభాగ్య రచించిన ‘‘కృత్యాద్యవస్థ’’కు ప్రకటించి వారిని ముద్దనూరుకు ఆహ్వానించి ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సభలో స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు, కవులు, రచయితలు మరియు సాహిత్యాభిమానులు పాల్గొనడం జరిగినది. కడప జిల్లాలోనే పనిచేస్తూ వరుసగా ఆరుమంది కవులకు ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డును ప్రదానం చేయడం జరిగినది. తరువాత బదిలీ మీద 1991 సం॥లో తాళ్ళప్రొద్దుటూరుకు రావడమైనది. పిల్లల చదువుల నిమిత్తం కుటుంబాన్ని మాత్రం తాడిపత్రిలో పెట్టి, రోజూ తాళ్ళప్రొద్దుటూరు వెళ్ళి వస్తుండేవాణ్ణి. 1994 సం॥లో ఎస్కే యూనివర్సిటీ ప్రయివేటు విద్య ద్వారా ఎం.ఏ. తెలుగు పాస్ అయ్యాను. నా అవార్డు సభలకుగాను తాడిపత్రి వేదికగా మారింది. ఇక్కడ 5వ, 6వ, 7వ (అంటే 1994 సం॥ నుంచి 2004 సం॥ వరకు) 6 మంది కవులకు అవార్డు ప్రదానం చేయడం జరిగింది తాడిపత్రి వేదికగా. ఇంతలోనే నన్ను జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇచ్చి అనంతపురం జిల్లాలోని కొత్తచెరువుకు బదిలీ చేయడం జరిగింది. ఉపాధ్యాయుడుగా నా పాత్ర ముగిసిపోయి ఉపన్యాసకుడిగా నా జీవితం ఆరంభమైంది. జూనియర్ కళాశాలలో పనిచేస్తూ, విద్యార్థులలో కవిత్వంపట్ల ఆసక్తిని కల్గించడానికి స్థానికంగా కవి సమ్మేళనాలు, సాహిత్యసభలు, సాహిత్యగోష్ఠులు ఇతర ప్రాంతాల నుంచి ప్రముఖులను ఆహ్వానించి నిర్వహించేవాణ్ణి. అక్కడ పని చేస్తుండగానే 2003 సం॥లో భారత ప్రభుత్వం ఆకాశవాణి ద్వారా నిర్వహించే జాతీయ కవి సమ్మేళనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు భాషా కవిగా ఎంపికయ్యాను. గుజరాత్ రాజ్‌కోట్ నగరంలో ఏర్పాటైన ‘‘సర్వభాషా కవిసమ్మేళనం’’లో పాల్గొని రాయలసీమ జన జీవితం గురించి ‘‘క్షతగాత్రం’’ పేరుతో కవితాగానం చేశాను. అది సభికులందరి ప్రశంసలు అందుకొని అన్ని భాషల్లోకి అనువదింపబడి దేశమంతా రేడియో ద్వారా ప్రసారం జరిగింది. జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగ బదిలీ వలన కుటుంబాన్ని కూడా తాడిపత్రి నుంచి కొత్తచెరువుకు మార్చడం జరిగినది. 2005 సంవత్సరం వరకూ కొత్తచెరువులోనే నివసించడం జరిగినది. ఇక్కడి స్థానికులతో, ప్రముఖ వ్యక్తులతో, విద్యార్థులతోను మంచి సంబంధాలు వుండేవి. కొత్తచెరువులో వున్నప్పుడే నా ‘‘క్షతగాత్రం’’ కవితా సంపుటిని 2003 సం॥లో ప్రచురించడం జరిగింది. తరువాత పిల్లల ఉన్నత చదువులకోసం కుటుంబాన్ని జిల్లా కేంద్రమైన అనంతపురంకు మార్చాను. అంతలోనే నాకు కూడా బదిలీ మీద కళ్యాణదుర్గం రావడం జరిగినది. కళ్యాణదుర్గంలో అడుగుపెట్టిన విశేషమేమో గానీ నా కవితా వ్యాసంగం మరింత వికాసవంతమైంది. అక్కడి జూనియర్ కళాశాలలో ‘‘కళ్యాణభారతి’’ అనే పేరుతో ఒక సాహిత్యసంస్థను కళాశాలకు అనుబంధంగా స్థాపించి జిల్లాస్థాయిలో అనేక సాహితీ కార్యక్రమాలు, కవిసమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు మొదలైన కార్యక్రమాలను విద్యార్థుల భాగస్వామ్యులతో ఏర్పాటు చేయడమైనది. ఇక్కడుండగానే ‘‘మగ్గంబతుకు’’ అనే దీర్ఘకావ్యం రచించడం జరిగినది. ఇది చేనేత కార్మికుల జీవితాలపై వచ్చిన తొలి దీర్ఘకావ్యంగా సాహితీ విమర్శకులు పేర్కొన్నారు. ఈ ‘మగ్గం బతుకు’ ఆవిష్కరణ కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంతో వైభవంగా స్థానిక చేనేత నాయకులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఆవిష్కరణ ఎంతో వైభవంగా జరిగింది. ఈ కావ్యాన్ని అనంతపురం పార్లమెంటు సభ్యులు అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్కరించగా, ఎంఎల్‌ఎ గోవిందప్పగారు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులందరూ పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా మగ్గంబతుకు రాష్ట్రంలో ఎక్కడైతే చేనేత కార్మికులు ఉన్నారో అక్కడ పరిచయ సభలు, ఆవిష్కరణ సభలు విస్తృతంగా జరిగాయి. ఇది నాకు అనంతమైన కీర్తిప్రతిష్టలు తెచ్చిన దీర్ఘకావ్యం.
నా పురిటిగడ్డ అయిన కడప జిల్లా ప్రొద్దుటూరులోని చేనేత ప్రజల సహకారంతో మరువలేని విధంగా అపూర్వంగా పౌరసన్మానం జరిగింది. ఇదే పుస్తకం మీద శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మరియు శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలలోని విద్యార్థులు ఎం.ఫిల్. చేశారు. తరువాత ప్రసిద్ధ అనువాదకులు, రచయిత అయిన కొమ్మిశెట్టి మోహన్‌గారు ఈ పుస్తకాన్ని హిందీలోకి అనువాదం చేశారు. ఇది ప్రచురణ రూపంలో త్వరలో రాబోతోంది. 2005లో కుటుంబాన్ని అనంతపురానికి మార్చాక అవార్డు సభలకు వేదిక అనంతపురం అయింది. ఒక వ్యక్తిగా, ఒక కవిగా, కవిత్వం రాస్తూ ఉత్తమ కవులను సత్కరించాలనే లక్ష్యంతో 1988 సం॥లో స్థాపించిన అవార్డు ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రతిష్ఠాత్మక పురస్కారంగా ప్రసిద్ధికెక్కింది. ఈ అవార్డు పొందిన ప్రతి కవి నేడు కవితారంగంలో అత్యుత్తమ స్థాయి కవులుగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఈ అవార్డు రజతోత్సవ ప్రస్థానంలోకి ప్రవేశించింది. రాష్ట్రంలో కవిత్వం బాగా రాస్తున్న ప్రతికవీ ఈ అవార్డు రావాలని కోరుకుంటారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
2005 ` 2008 సం॥ వరకు కళ్యాణదుర్గం నందు పనిచేయడం అక్కడి నుంచి బదిలీ మీద పామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్ళడమైంది. పామిడిలో ఉండగానే 2009 సం॥లో ‘‘అవిశ్రాంతం’’ అనే కవితా సంకలనం వెలువరించడమైనది. ఇది ఉత్తమ కవితా సంపుటిగా మూడు రాష్ట్రస్థాయి అవార్డులను గెలుచుకుంది.
5) కవిగా గుర్తింపు తెచ్చుకున్న మీరు విమర్శకుడిగా ఎలా మారారు?
కవిత్వం నాకు నిరంతరం అధ్యయనం, ఈ అధ్యయనమే నన్ను కవిగానే కాకుండా విమర్శకునిగా ఒక కొత్త మలుపుతిప్పింది. కవితా రచనలో వస్తువు, శిల్పం, అభివ్యక్తి ఈ మూడు అంశాల ప్రాధాన్యాన్ని నేను నా అధ్యయనంలో గుర్తించాను. అంతేకాకుండా ఒకే వస్తువు మీద అనేకమంది కవులు విభిన్న కోణాల్లో రాసిన కవితలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. ప్రతి ఏటా అవార్డుకు వస్తున్న కవితా సంపుటాలైనా, నాకు ఇంటికి వస్తున్న సాహిత్యపత్రికలు, మరికొన్ని పత్రికల నుంచి సేకరించిన విడికవితల ద్వారా ఈ వస్తువైవిధ్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేశాను. ఆ అధ్యయన ఫలితంగా విభిన్న వస్తువుల మీద ‘‘ఆధునిక కవిత్వంలో వస్తు`వైవిద్య విశ్లేషణ’’ పేరుతో వరుసగా అన్ని దిన, మాస, వారపత్రికలల్లో అసంఖ్యాకంగా వ్యాసాలు రాశాను. రాస్తూనే ఉన్నాను. ఆ వ్యాసాలన్నీ పుస్తకరూపం దాల్చి 3 భాగాలుగా (1) ‘‘కవిత్వం ఒ సామాజిక స్వప్నం’’ (2) ‘‘కవిత్వం ఓ సామాజిక సంస్కారం’’ (3) ‘‘కవిత్వం ఓ సామాజిక సత్యం’’ అనే పేర్లతో మూడు సంపుటాలుగా వచ్చి, ఆధునిక కవితారంగంలో నన్ను ఒక విమర్శకునిగా నిలబెట్టాయి. ఈ మూడు సంపుటాలు వర్ధమాన కవులకు, పరిశోధకులకు మరియు విమర్శకులకు సైతం రెఫరెన్స్ గ్రంథాలుగా నిలిచిపోయాయనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఆధునిక కవిత్వరంగంలో వస్తువైవిధ్యం మీద ఇంత విస్తృతంగా వ్యాసాలు రాసిన వారెవ్వరూ లేరు. ఈ మూడు సంపుటాలు ఆంధ్రదేశంలో కవిత్వం రాస్తున్న ప్రతి కవికి అధ్యయన గ్రంథాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ మూడు సంపుటాల్లో వెయ్యి కవితల్ని వస్తువైవిద్య విశ్లేషణ చేయడం జరిగింది.
‘‘రాధేయ కవిత్వం సమగ్ర పరిశీలన’’ అనే అంశం మీద శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో టి. నాగేంద్ర అనే విద్యార్థి పిహెచ్‌డీ పట్టా తీసుకోవడం జరిగింది.
58 ఏళ్ళ జీవితంలో 40 ఏళ్ళ సాహితీనేపథ్యం 25 సం॥ అవార్డు చరిత్ర ఉంది.
6) రాష్ట్రంలో ఏ వ్యక్తి పేరు మీద (బతికుండగానే) అవార్డు లేదు అటువంటిది రాధేయ అవార్డు మన రాష్ట్రంలో ఉంది ఇందుకు మీరెలా స్పందిస్తారు?
నా సాహిత్య విద్యార్థులైన పేళ్లూరి సునీల్, సుంకరగోపాల్, దోర్నాదుల సిద్ధార్థ వీరి నేతృత్వంలో డా॥ రాధేయ కవితా పురస్కారం పేరుతో 2010 సం॥లో స్థాపించి, వరుసగా 3 సంవత్సరములుగా రాష్ట్రస్థాయిలో ఒక ఉత్తమ కవితకు పురస్కారం అందజేస్తున్నారు. ఈ ముగ్గురు యువకవులు ఆ ప్రాంతంలో మంచి కవులుగా రాణిస్తుండటం విశేషం. ఇంతకంటే మించిన గౌరవం నాకు ఇంకేం కావాలి? ఎందుకంటే రాష్ట్రస్థాయిలో ఒక వ్యక్తి పేరు మీద అవార్డు స్థాపించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం వారి గురుభక్తికి నిదర్శనంగా నేను భావిస్తాను.
7) మీరు వందలపైగా కవితలు రాశారు కదా? అందులో మీకు బాగా ఇష్టమైనవి చెప్పగలరా?
నా కవితలన్నీ వస్తువు, శిల్పం, అభివ్యక్తితో కూడుకున్నవే. అప్పుడప్పుడు ఒక పెద్ద సమస్య కానీ సంఘటన కానీ జరిగి ఒక తీవ్ర సామాజిక సంక్షోభం ఏర్పడినప్పుడు ఏ కవీ మౌనంగా వుండలేడు. తనదైన స్వరాన్ని వినిపిస్తాడు, ఆ సంఘటనను నిరసిస్తాడు. ముఖ్యంగా నా కవితల్లో నేను పుట్టి పెరిగిన నేల గురించి, నేను బతుకుతున్న సమాజం గురించి, ఆ సమాజంలో నేను పడుతున్న మానసిక వేదన అంతర్లీనంగా ఉంటుంది. ఉదాహరణకు 2003 సంవత్సరంలో నేను జాతీయ కవిసమ్మేళనంలో పాల్గొన్నప్పుడు నేను నివసిస్తున్న రాయలసీమ జనజీవనం గురించి నాదైన స్వరంలో వినిపించడం జరిగింది. ఆ కవితలో కొన్ని పాదాలు నాకు ఇప్పటికీ గుర్తు
మా అప్పులేమో ఊట బావులు
ఆదాయం ఎండమావులు
మారెప్పల కింద జలాశయాలు
రెక్కల కింద అగాధాలు
నిరంతరం…. తరంతరం
ఆర్థిక దాస్యానికే వారసత్వం
కాడికిందికి మెడసాచే మా బానిసత్వం
పిడికిలి నిండని ముక్కారు శ్రమ ఫలితంలో
గింజుకున్నా గింజ మిగలని రైతుకు
భవిష్యత్తు ఓ ప్రశ్నార్థకం!
నాగేటి చాళ్ళలో ధారపోసిన స్వేదం
మట్టి పొత్తిళ్ళలో ఇంకిపోయి
అగ్నిశ్వాసగా మారిపోతున్నప్పుడు
ఈ గుండెల్లో గునపాలు దించినంత
దుస్సహమైన బాధ
మట్టి పొరల్లోంచి అంకురం
మొలకెత్తుతున్నప్పుడు
తప్పిపోయిన మా పసివాడు
ఇంటికి చేరుకున్నంత సంతోషం!
కంకి మీద గింజ కన్పిస్తేచాలు
మా అరచేతుల్లోకి
అన్నం ముద్ద చేరినంత ఆనందం!
ఇది పిరికివాడి స్వర్గం, శరణార్థుల శిబిరం
ఇది ఎండిన నేల, ఎడారి ఉపరితలం.
ఈ దేశానికి నేతన్న, రైతన్న రెండు కళ్ళులాంటి వాళ్లు. రైతు జీవితాన్ని గురించి అనేక కవిత్వం, కథ, నవలలు విరివిగా వచ్చాయి. కానీ నేత కార్మికుల గురించి కవిత్వం కథలు అక్కడక్కడ వచ్చాయి. కానీ నేత కార్మికుల గురించి సమగ్రమైన చిత్రణ జరగలేదు. ఆ ఆవేదనతో స్వయాన నేత కార్మిక కుటుంబం నుంచి వచ్చిన చిన్నతనం నుండి చేనేత కార్మికుల కష్టాలు దగ్గర నుండి చూశాను. నేను కూడా అనుభవించాను కనుక నా స్వానుభవం ‘‘మగ్గంబతుకు’’ దీర్ఘకావ్యం అయింది. ఒకవిధంగా చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలోనే నేతన్న కార్మికులు గురించి వచ్చిన దీర్ఘకావ్యమని విమర్శకులు ప్రశంసించారు.
ఈ కావ్యంలో చేనేత కార్మికుల ఊర్లను, వారి పేర్లతో సహా ఈ దీర్ఘకావ్యంలో రికార్డు చేశాను. చేనేత కార్మికులు ఈ కావ్యంలో నాయకులయ్యారు. వీరితోపాటు నా తల్లి కూడా చేనేత కార్మికురాలిగా, ఆమె రెక్కల కష్టాన్ని ఇందులో కవిత్వీకరించాను.
నడుంలోతు గుంటలో
నీరసంగా దిగబడిపోయి
శక్తినంతా కూడదీసుకొని
మా అమ్మ పావుకోళ్ళను తొక్కుతుంటే
ఓ అనార్కలి ఆకలి గీతం
ఆపాదాల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం
నేను చూశాను
లాకల మధ్యబంధీ అయిన
పడుగూ పేకల్ని చిక్కుతీసి, సాపుచేస్తూ
సుతారంగా కదిలే
ఆ చేతి వేళ్ళ నైపుణ్యానికి
తాజ్‌మహల్ సౌందర్యమే
తలవంచే దృశ్యాన్ని
నేను చూశాను!
8) ఇన్ని ప్రక్రియలు ఉండగా, కవిత్వాన్నే ఎందుకు మీరు ఇంత ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నారు?
అన్ని సాహిత్య ప్రక్రియలల్లో కవిత్వానిదే అగ్రతాంబూలం ఇది అందరూ అంగీకరించే విషయమే. కవిత్వం సూటిగా గుండెను తాకుతుంది. మనిషిలోని మానసిక సంఘర్షణను సాత్వన కల్గిస్తుంది. కవిత్వం నాకు ఓ సామాజిక స్వప్నం, సామాజిక సంస్కారం, సామాజిక సత్యం. ఇంకా చెప్పాలంటే కవిత్వం సామాజిక చైతన్యం. అందుకే నేను కవిత్వాన్ని ఇంతగా ప్రేమిస్తాను.
కవిత్వమంటే నాకు ప్రాణం, అందుకే కవిత్వాన్ని గురించి నేను ఇలా అంటాను. కవిత్వమే నా జీవితం, నా జీవితమే కవిత్వం. కవిత్వం నా ఉనికి, నా ఇంటి చిరునామా కూడా కవిత్వమే.
కవిత్వం నాకు కన్నుమూతపడని జ్వరం
కవిత్వం నాకన్రెప్పల మీద వాలిన
నమ్మకమైన కల
ఒక్క కవితా వాక్యం
ఈ గుండెలోతుల్లోంచి పెల్లుబికి రావాలంటే
ఎన్ని రాత్రుల నిద్రను తాకట్టుపెట్టాలో
వేదనలోంచి పుట్టిన ఈ కవిత్వాన్నే అడుగు
అక్షరసైన్యం నావెంట నడిస్తేచాలు
నాసర్వస్వం కోల్పోయినా లెక్కచెయ్యను
కవిత్వమై మిగిలిపోతాను
ఈ గుండె చప్పుడు ఆగిపోయి
ఈ తెప్ప ఏరేవులోకి చేరవేసినా
అక్కడ పచ్చని మొక్కై
మళ్ళీ ప్రాణం పోసుకుంటాను
కవిత్వం తోడులేకుండా నేనులేను
అక్షరాలు వెంటరాకుంటే
అడుగు ముందుకెయ్యలేను
కడదాకా రాస్తాను
నా కన్నీటి తడి ఇంకిపొయ్యే దాకా రాస్తాను!
9) మరీ మీ ఇంటి పేరునే ‘కవితా నిలయం’గా పెట్టుకున్నారే ఇలా పెట్టుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది?
కవిత్వం నాలుగు దశాబ్ధాలుగా నాతో మమేకమై ఉంది. 1972 సం॥ నుండి నేటి వరకూ రాస్తూనే ఉన్నాను. అంతేకాకుండా పాతికేళ్ళుగా ఉత్తమ కవిత్వానికి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డును ప్రదానం చేస్తున్నాను. అయిదేళ్ళుగా కవితా విమర్శకుడిగా పత్రికలలో 200 దాకా వ్యాసాలు రాశాను. మూడు కవితా విమర్శగ్రంథాలు కూడా ప్రచురించాను. గత మూడు సంవత్సరముల నుండి నా శిష్యులు నా పేరుతో రాష్ట్రస్థాయిలో ఒక ఉత్తమ వచన కవితను ఎంపికచేసి, ఆ కవిని సత్కరిస్తున్నారు. ఇన్ని విధాలుగా కవిత్వం నా నరనరాల్లో జీర్ణించుకొని పోవడమే కాకుండా, నా ఇంటి చిరునామాగా కవిత్వమే అయింది. అందుకే నా ఇంటి పేరును ‘కవితానిలయం’గా మార్చుకున్నాను. ఇప్పటికీ ప్రతిరోజూ నా వద్దకు స్థానికంగా అనేకమంది యువకవులు వస్తుంటారు. వారు రాసిన కవితలను వినిపిస్తూ కొన్ని సలహాలు, సవరణలు పొందుతూ వుంటారు. నాకు తెలిసినంత వరకూ వారికి కవిత్వం గురించి వివరిస్తూ, వారితో చదివిస్తూ ఉంటాను. ఒకవిధంగా చెప్పాలంటే వారికి కవిత్వంలో హోం వర్క్ ఇస్తుంటాను. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది కవులు తమ కవిత్వాన్ని నాకు వినిపిస్తూ వుంటారు. వారి కవిత్వాన్ని ఎంతో ఆనందంగా వింటూవుంటాను. ఒక కవిగా నాకు అంతకుమించిన అదృష్టం ఏముంటుందని నాలో నేను పొంగిపోతూ వుంటాను. ఎవరైనా బయట ప్రాంతాల నుండి మా కవితా నిలయానికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యమివ్వడానికి నేనెంతో ఇష్టపడతాను. వారు రెండు మూడు రోజులు అనంతపురంలో వున్నా కూడా వారు వుండటానికి అనువైన ఒక గదిని ప్రత్యేకంగా వారి కోసమే కేటాయించాను. స్థానిక కవులను పిలిపించి వారితో ముఖాముఖీ సమావేశాలు ఏర్పాటుచేసి కవిత్వ చర్చలు సాగిస్తుంటాను.
10) ఇంకా ఎలాంటి రచనలు మీ నుండి ఆశించవచ్చు?
విమర్శకు సంబంధించి ఇంకా రెండు పుస్తకాలు రావాల్సివుంది. చేనేత కార్మికుల జీవనస్థితిగతులు గురించి పెద్ద కథానిక చాలావరకు పూర్తీ అయినది. కవిత్వానికి సంబంధించిన కొన్ని సమీక్షలు, ముందుమాటలు కలిపి ఒక పుస్తకంగా తీసుకురావాలనుకుంటున్నాను.
ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు రజతోత్సవాల తరువాత ప్రతిభావంతులైన ఆ 25 మంది కవుల కవితా సంపుటాలు గురించి 25 వ్యాసాలను విమర్శకుల చేత రాయించి, పుస్తకంగా తీసుకురావాలనే ఆలోచన కూడా వున్నది. నా ఆరోగ్యం సహకరిస్తే కవిత్వానికి సంబంధించిన ప్రతినెల బులిటెన్ నడపాలనే కోరిక కూడా ఉన్నది. ఇవి ప్రస్తుతం నా ఆలోచనలు.
11) పదవీ విరమణ తరువాత మీ జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు?
ఉద్యోగంలో ఉన్నంత వరకూ నేను ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు సాహిత్యసభల నిమిత్తం వెళ్ళలేకపోయాను. పదవీ విమరణ తరువాత వివిధ ప్రాంతాల్లో జరిగే సాహిత్య సభలకు వెళ్లాలని, ఆ సభలలో నాదైన స్వరం వినిపించాలనే కోరిక ఉన్నది.
12) వర్ధమాన కవులు, రచయితలకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?
నేను ఎప్పటికీ నిరంతర సాహిత్య విద్యార్థినే, నేర్చుకున్నదానికంటే నేర్చుకోవలసింది చాలా వున్నదని నేను విశ్వసిస్తాను. వర్తమానంలో కవిత్వం రాసే యువ కవుల్లో అధ్యయనం బాగా తక్కువయిందని నేను భావిస్తాను. తెలుగు కవిత్వమే కాకుండా, అనువాద కవిత్వాన్ని, మంచి కథలను, సాహిత్య వ్యాసాలను ప్రతివర్థమాన కవి చదవాలని నా కోరిక. అధ్యయనం అనేది ఒక నిరంతర సాధనం సాధన కొరవడితే సృజనాత్మకత బలహీనపడుతుంది. అందుకే యువకవులు బాగా చదవాలి. చదవడమే కాకుండా కనీసం ఒకరిద్దరు కూర్చోని వారి కవిత్వం గురించి బాగా చర్చించుకోవాలి. అందులోని శిల్పాన్ని, అభివ్యక్తిని, వస్తువును గురించి ఆ కవుల మనోభావాలను ఎలా వెల్లడిరచారో చర్చించుకోవాలి. చర్చించుకోగలిగినప్పుడు మాత్రమే వారిలోని సృజనాత్మకత పెరిగి చక్కటి కవిత్వాన్ని రాయగలరని నా విశ్వాసం.
13) రజతోత్సవాల తరువాత ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డును నిలిపివేయాలనే ఆలోచన ఉన్నట్లు వినికిడి ఇది ఎంతవరకు వాస్తవం?
నిజమే, ఆలోచనేమో ఉంది. ఎందుకంటే ఒక విశ్రాంత ఉద్యోగిగా ఒక అవార్డును కొనసాగించడం ఆర్థికంగా కష్టమే. ఇంతవరకూ ఎవరి ఇష్టంతోను, ఆర్థిక సహాయంతోను ఈ అవార్డును నిర్వహించకుండా కేవలం నా వేతనం నుండి కొంత మొత్తాన్ని ఈ అవార్డుకు కేటాయించుకొని నా శ్రీమతి సత్యాదేవి సంపూర్ణ సహకారంతో 25 సం॥ నడపగలిగాను. ఇకపై నేను ఒక విశ్రాంత ఉద్యోగిగా ప్రతిఏటా ఈ అవార్డును నిర్వహించడం కష్టతరమవుతుంది. ఈ అవార్డు ఆగిపోవడం రాష్ట్రస్థాయిలో ఏ కవికీ ఇష్టంలేదు. ఈ అవార్డును నిలుపుకోవాలని, నిలబెట్టుకోవాలని అందుకు ఆర్థికంగా సహకరిస్తామని చేయూతనిస్తామని అనేకమంది కవిమిత్రులు నాకు విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను. నాకేమో ఇతరుల ఆర్థిక సహాయంతో కాకుండా ఇకపైనకూడా కుటుంబ సభ్యులు సహకరిస్తే, నా ఆరోగ్యం సహకరించేంత వరకు దీనిని కొనసాగించాలనే ఆకాంక్ష నాకు ఉన్నది. అందుకు కాలమే నిర్ణయించాలి.
ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు (ఆధునిక కవిత్వానికి ప్రతిష్ఠాత్మక పురస్కారం)
అవార్డు గ్రహీతలు
————
1. సౌభాగ్య – కృత్యాద్యవస్థ – 1988
2. డా॥ శిఖామణి – మువ్వల చేతికర్ర – 1989
3. సుధామ – అగ్ని సుధ – 1990
4. డా॥ అఫ్సర్ – ఇవాళ – 1991
5. డా॥ పాపినేని శివశంకర్ – ఒక సారాంశం కోసం – 1992
6. ఆశారాజు – దిశ – 1993
7. కందుకూరి శ్రీరాములు – వయొలిన్ రాగమో, వసంత మేఘమో – 1994
8. దర్భశయనం శ్రీనివాసాచార్య – ముఖాముఖం – 1995
9. డా॥ చిల్లర భవానీదేవి – శబ్దస్పర్శ – 1996
10. డా॥ నాళేశ్వరం శంకరం – దూదిమేడ – 1997
11. విజయచంద్ర – ఆహ్వానం – 1998
12. డా॥ జూపల్లి ప్రేమ్‌చంద్ – అవేద – 1999
13. అన్వర్ – తలవంచని అరణ్యం – 2000
14. దాసరాజు రామారావు – గోరుకొయ్యలు – 2001
15. పి. విద్యాసాగర్ – గాలికట్ట – 2002
16. కొప్పర్తి – విషాదమోహనం – 2003
17. మందరపు హైమవతి – నిషిద్ధాక్షరి – 2004
18. ప్రభు – పారిపోలేం – 2005
19. గంటేడ గౌరునాయుడు – నదిని దానం చేశాక – 2006
20. తైదల అంజయ్య – పునాస – 2007
21. పెన్నా శివరామకృష్ణ – దీపఖడ్గం – 2008
22. డా॥ యాకూబ్ – ఎడతెగని ప్రయాణం – 2009
23. కోడూరి విజయకుమార్ – అనంతరం – 2010
24. సిరికి స్వామినాయుడు – మంటి దివ్వ – 2011
25. కొండేపూడి నిర్మల – నివురు – 2012
మీ సాహితీ కృషి నిరంతరాయంగా సాగాలనీ మళ్ళీ కొందరి కవితాశేముషీ ప్రతిభావ్యుత్పత్తులు మీ ద్వారా గౌరవించబడాలనీ ఆశిస్తూ
chala baagundi ..enno viseshalu telputhoo…..
sir , mee jeevita viseshaalanu vintunte maku entho spoorthi vasthondi.
సౌజన్యశీలురు,సుకవితాప్రియులు,అవిశ్రాంత సాహిత్య సృజనకారులు,అలుపెరుగని అవార్డు ప్రదాతలు,ప్రతిష్టాత్మక ఉమ్మిడిశెట్టి వారసులు అయిన రాధేయ గారి ఆత్మీయ సంభాషణ కు శుభాబినందనలు…
Naana mee kavitwam chala baguntundi.Naku chala santhoshanga undi ela mee gurinchi abiprayam rase avakasam vachinanduku.vaakili team vaarandiriki naa krutagnatalu.
Anna Nagendra meeru chesina interview Dr Radheya sir gaaridi chaala bagundi. meeku kruthagnathalu.
sir, mee gurinchi vishayalu chaduvutunte mana parichayam nati gynapakalaloki manasu vellipotondi.meru kavitvaniki chesina krushi slagganeeyam.meeru rasina vimarsa pustakalapai evraina parisodana cheachu.mee visrantha jeevitam prasantam gadavalani aa devudini prarthistu mee anthevasi-dornadula sidhartha
Radheya gari gurinchi thelusokovadaniki A.A. Nagendra chesina mukamukhi baagundi abhinandanalu Nagendra garu.
SIR MEE GURINCHI YETHA CHADIVINAA THAKKUVE… U R A GREAT POET AND GREATEST HUMANBEING
-MOUNASRI MALLIK
CINE LYRICIST
9394881004
dhanyavaadaalu