1994లో అనుకుంటాను భూమయ్యగారి మొట్ట మొదటి పద్య కవితా సంపుటి ‘వేయి నదుల వెలుగు’ వారు పంపగా అందుకున్నాను. మంచి పద్యం ఎక్కడ కనపడ్డా కళ్ళ కద్దుకొని చదువుకునే నాకు ‘వేయి నదుల వెలుగు’లో కొత్త కాంతి లోకాలు కనిపించాయి. అప్పటికి నేను రాజమండ్రి సాహిత్య పీఠం లో బదిలీ పై పనిచేస్తున్నాను. తెలుగు పాదయారామం అనదగివ బేతవోలు రామబ్రహ్మం గారు పద్య కవిత్వానికి ‘క్రొత్త గోదావరి’ పరవళ్ళు నేర్పిస్తూ మరొక పక్క అవధానాలను తన కనుసన్నలతో శాసిస్తున్న కాలం. మరొక పక్క ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్. ఒక రకంగా పద్యానికి, వచన కవిత్వానికీ ఆరోగ్యకరమైన పోటీ వున్న కాలం. ఎవరు ముందు కవిత వినిపిస్తే ఆ రోజు వారికే అగ్ర తాంబూలం. అదీ ఘాటు పరిమళాల ఎక్ సౌ బీస్ జర్దాపాన్ తో. ఆ వాతావరణంలో చదువుకున్నాను భూమయ్యగారి పద్యాలు. దానికి రామబ్రహ్మంగారి ఆముఖం వుంది. వారూ సముఖంలోనే వున్నారు. రస స్వాదనకు ఇంకేం కొదవ. ఎక్కడో లోపల్లోపల ఆ కావ్య వస్తువుతో తెలియకుండానే తాదాత్మ్యం చెందడం జరిగింది. అప్పటికి భూమయ్య గారిని ప్రత్యక్షంగా చూసి వుండలేదు. అప్పటికి అయన ఎంత వయసు వారో కూడా తెలియదు. అయినా సాహసం చేసి ఆయనకు ఉత్తరం రాస్తూ ఇంత చిన్నవయసులో ఈ మార్మికత్వాన్ని ఎందుకు తలకెత్తుకున్నారు? అని రాసినట్టు గుర్తు. ఆ తర్వాత ఆయన ఇతర కావ్యాలు చదివినప్పుడు, ఆయన్ను చూసినపుడు, దగ్గరగా కలసి పనిచేసిననప్పుడు అనిపించింది, ఒక కవి తనది కానిది తప్ప ఇతరం ఏది రాయలేడని, ఇతరేతర కారణాల వల్ల రాసినా దాని ఆయుష్షు అత్యల్పమనీ -
సాధారణంగా లోకంలో ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది విశ్వ విద్యాలయాలు, పరిశోధనా రంగం సృజన కారులకు బద్ధ శత్రువులనీ. ఈ అభిప్రాయాన్ని పూర్వ పక్షం చేసిన కవులలో ప్రధమ పంక్తి లోని వారు భూమయ్య. దాదాపు దశాబ్దన్నర కాలంగా పరిశోధనా వాల్మీకంలో ఒక మహా రుషిలా గడిపారు భూమయ్య. మరీ ముఖ్యంగా భావ కవితా యుగపు మూల స్థంభాలలో ఒకరైన నాయని సుబ్బారావు గారి కృతుల మీద డాక్టరేటు పట్టా కోసం 1981లో ఆయన రూపొందించిన గ్రంధం ఒక రకంగా నాయని వాజ్మయ సర్వస్వం వంటిది. ఆ దాహం ఇంకా తీరకపోతే 2000 సం. ‘నాయనితో కాసేపు’ వారు ముచ్చటించి ఆ ముచ్చట్లను మనకు గ్రంథ రూపంలో అందించారు. ఆ కాలంలో కట్ట మంచి, ఉన్నవ, విశ్వనాథ, మధునాపంతుల, సినారె, వేమన వంటి వారి విలువైన పరిశోధన, విమర్శన గ్రంథాలు అందించారు. ఇంక చాలు అనకున్నా రేమో! కుబుసం విడిచిన సర్పంలా కావ్య రంగం లోకి ప్రవేశించారు. ఇన్నాళ్ళుగా ఎంత సృజనను లోలోపల అణచుకున్నారో అదిమి పట్టుకున్నారో! ఆకాశ గంగలా ఆయన కలం నుండి కావ్యగంగ వెల్లువెత్తింది. కురచకురచగా పెరుగుతున్న పద్య కేదారాలను సస్యశ్యామలం చేసింది.
మళ్ళీ మొదటికొస్తే, ఆయన మొదటి పుస్తకం చదివి ఎందుకు మార్మికతను తలకెత్తుకున్నారు అన్నమాటకు వస్తే, ఇలాంటి అభిప్రాయంలో అపుడు చాలా మంది వున్నారని తెలిసింది. అందుకు ఉదాహరణగా వారి రెండవ కావ్యం “వెలుగు నగల హంస”కు రామబ్రహ్మంగారు రాసిన ఈ మాటలు చదవండి “మొదట్లో నేనూ అనుమానించాను. కొత్త పిచ్చి కాదు గదా అని సంశయించాను. ఆ దృష్టితోనే అక్షరాక్షరాలను విన్నాను. కన్నాను. కాదని తేల్చుకున్నాను. ఇందులోనూ అదే కవితా వస్తువు. అమ్మవారి పూనకం నుండి భూమయ్యగారి అంతఃచేతనా విడివడలేదు.” 1995లో రామ బ్రహ్మంగారు అన్న మాటలు భూమయ్యగారి విషయంలో నానాటికి బలపడ్డాయే కానీ, తగ్గలేదు. ఒక్క జ్వలిత కౌసల్య తప్ప ఆయన సృజన యావత్తు ‘అమ్మ’ కేంద్రం చుట్టూ తా సాగిందే. ఈ అమ్మ మామూలూ అమ్మ కాదు. పోతనగారన్నట్టు అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఆయమ్మను పోతన్న ఏమి కోరుకున్నాడు! మహాత్వకవిత్వ పటుత్వ సంపదలు. పోతన్నలాగే ఈ భూమన్న కూడా అలాంటి కవిత్వ సంపదనే కోరుకున్నాడు. అందుకే తెలుగు పద్య కవిత్వానికి ఈ వేయినదుల వెలుగులూ, వెలుగు నగల హంసలూ, అగ్ని వృక్షాలూ, చలువ పందిళ్ళూనూ.
బ్రహ్మ లేడు, విష్ణువు లేడు పరమ శివుడు
లేడు వారి లోకము లేవి లేవు దేవి!
అందరికి ముందు నీవుండి, ఆత్మ దలచి
సృష్టి జేసితి లోకాలన్ని మాకు.
ఈ దేవీ తత్వానికి మూలం కొంత ఉపనిషద్వాణి కాగా మరికొంత లలితాసహస్ర నామాలలో అనంతంగా సాగిన దేవీ విరాడ్రూప వర్ణన సరే! ఇంతవరకూ బాగుంది. మరి ఈ కవిత్వానికి ఇంత మృదుత్వం, మెత్తదనం ఎలా అబ్బింది. మామూలుగా అయితే కవి గొప్పదైన తన ప్రతిభా విశేషాల చేత సాధించాడు అంటారు విమర్శకులు. కాని కవిగారేమంటున్నారు ఆ మెత్తదనపు గొప్పదనం అంతా తనది కాదంటున్నాడు. ఆయమ్మదే అంటున్నాడు చూడండి.
గుడికి వచ్చిన యపుడెను కోరకుండ
ఏమి పూవు నే దేవి! నాకిచ్చినావు
నీ ప్రసాదమనుచు, ఇది నీ హృదయము
పండి రాల్చిన మెత్తని పద్యమేమో!
ఇదీ రహస్యం. ఆమె గారి హృదయం పండిరాల్చిన మెత్తని పద్యాలు ఇవి. అందులో కాఠిన్యానికి ఇంకోచోటెక్కడ. ఈ పద్యం కవి సంస్కారాన్ని సూచిస్తుంది. ఈ సంస్కారం వారసత్వం గా వస్తున్నదే అని నన్నయ్యను చదివినా, పోతన్నను పలకరించినా తెలుస్తుంది. మెత్తగా రాయడమే కాదు అంతకంటే సుతిమెత్తగా పద్యాన్ని ఆలపించగలరు భోమయ్య. ఆయన పద్యాలు పాడేటప్పుడు మనం కళ్ళు మూసుకొని వింటే ఎక్కడో లోపల్నుండి సన్నగా జీరగా జీవునివేదన వినిపిస్తుంది. తెలుగు నాట మార్మిక కవిత్వం కొత్త గాదు. కాకపొతే అది ఆధునిక వచన కవిత్వంలో విస్తరించినంతగా పద్య కవిత్వంలో విస్తరించలేదు. రాసినా ఒకటీ అరా తప్ప ఇలా కావ్య పరంపరగా వెలువరించిన వారు అరుదు. ఆ ఘనత ఖచ్చితంగా భూమయ్యగారికే దక్కుతుంది. తన క్రమ పరిణామ గతిని కవిగారే ఈ పద్యంలో ఇలా చెబుతున్నారు. వినండి.
మొన్నటి వరకు భూమిలో నున్న బీజ
మునయి దేవి, వర్షింప మొల్కనయి, చిగురు
లను తొడిగి తొడిగి ఒక చెట్టునయినాను
వేల పరిమళమ్ముల మూట విప్పినాను.
చాలా పద్యాలకు మల్లె ఈ పద్యం లోను ఒక విశేషముంది. ఈ కావ్యాల అంతటా ‘దేవి’ శబ్దం సంభోదవాచకమే! అయితే పై పద్యంలో దేవి “శబ్దం వర్షానికి ముందు చేరడం వలన అది మామూలు వర్షం కాక, దేవి కరుణా వర్షంగా మారింది. అందుకే బీజం మొలకెత్తి , చిగురాకులు తొడిగి, మహా వృక్షంలా వేల పరిమళాలను వెదజల్లింది. ఇదీ ఆ దేవీకృతమే! తాను కేవలం నిమిత్త మాత్రం. కవి ఎంతటి శాక్తేయుడైనప్పటికి సమాజ రుగ్మతల పట్ల అతనికి స్పష్టమైన ఎరుక వుంది. జరుగుతున్న హింసపట్ల ఆవేదన వుంది. ఆ ఆవేదనకు అక్షర రూపం ఈపద్యం.
“పరిమళములె జాల్వారు ఈపాలకొలను
నందు దేవి, రక్త పుటలలివేమి
హంసకాలికి మెత్తనైనట్టి చిన్ని
కత్తి కట్టి కనిపించు నిన్నటి గజ్జేలేదు”
పౌరుషవంతమైన కోడిపుంజు కాళ్లకు కత్తులు కట్టడం పల్నాటి వీర చరిత్ర నమోదు చేసింది. కానీ శాంతానికి, సౌకుమార్యానికీ, క్షీరనీరన్యాయానికి పర్యాయ పదమైన హంస కాలికి గజ్జె స్థానంలో ఎవరో కత్తులు కట్టారనడం లోకం ఎంత హింసలో మునిగితేలుతుందో చెప్పే పదబంధం – ఈ కవితా వృక్షాలకు పూచినా మార్మిక పద పుష్పాల మధువును గ్రోలే మధుపాయి భూమయ్యగారు.
పద్యమే మావియై దేవి! బ్రతుకు కనక
కోకిలలు వచ్చి పాటల గ్రుమ్మరించే
చిలుక లిటే వచ్చి ఫలముల పలకరించే
పథికుడొకడు రసానందుడై పరిమళించె
కవి లోకానికి గొప్ప మాట చెబుతున్నాడు. కవి అనే వాడు, కావ్యం అనేది ఒక పచ్చని చెట్టులా వుండాలని, అప్పుడే కోకిలల, చిలకలు వంటి జీవనోత్సాహ సంరంభం ఆ చెట్టును ఆశ్రయించి వుంటుంది. భూమయ్యగారు పథికుడొకడు రసానందుడై పరిమళించాడు అన్నారు గానీ అది ఏకవచనం నుండి ప్రస్తుతం బహువనానికి విస్తరించింది. ఇప్పుడు ఆ పథికుడొకడు పదివేల మంది పథికులైనారు. అయితే ఆ రసానందం కేవల రసానందం కాదు. మన అలంకారికులు చెప్పిన రసోవైస లాంటి రసయోగం, రససిద్ధి. అందుకు మీరూ సిద్దమేనా?
(డా. అనుమాండ్ల భూమయ్య 65వ సంవంత్సరం లోకి అడిగిడుతున్న సందర్భంగా)
భూమయ్యగారి పద్యపఠనం మంద్రస్థాయిలో ఎంతో భావస్ఫొరకంగా వినసొంపుగా ఉంటుంది.మీరు వ్యాసంలో కావ్య సమీక్షకే ప్రాధాన్యమిచ్చారనిపించింది.
Bhumayya gaari Vyasam Chadivaanu