సమీక్ష

‘నెలవంక వెలుగు’లో నడిచిన కవిత్వం

అక్టోబర్ 2013

1

విప్లవోద్యమం పక్షాన నిల్చోని నిజాయితీతో విప్లవ భావజాల వ్యాప్తి కోసం-జుగల్బందీగా కవిత్వగానం చేస్తున్న కవి ‘కెక్యూబ్ వర్మ’.

వో సృజనకారుని సృజనని చదివే ముందు ఆ సృజనకారుని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం వలన- ఆ సృజన పుట్టుకకు గల కార్యకారణ సంబంధాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చంటారు.

నిజమే.

వర్మ గారిని ప్రత్యక్షంగా కలిసిన ఎవరైనా సరే- ఆయనలో నిశబ్దంగా ప్రవహిస్తున్న వెన్నెల జలపాతాన్ని గుర్తించకుండా వుండరు. అటు తర్వాత- ఆయన కవిత్వాన్ని చదివాక.. వర్మా, ఆయన సృజించిన కవిత్వమూ- రెండూ బింబప్రతిబింబాలుగా కనిపిస్తాయి.

చిక్కని అరణ్యపు రాత్రిలో కురిసే వెన్నెల- నడిచే చీకటి దారిని కాంతిమయం చేస్తున్నట్టు.. వర్మ తన కవిత్వంతో లోకాన్ని ఆవహించిన ‘అనైతకత’ అనే చీకటి పొరని ధ్వంసం చేయాలని తపిస్తున్నారు. అంతకు ముందు- ‘వెన్నెలదారి’ కవిత్వంతో; యిప్పుడు ‘రెప్పల వంతెన’తో……

కవికి తన మార్గం, తన కవిత్వమార్గం స్పష్టంగా అవగతమైన తర్వాత- ఆ రెండు మార్గాల గమ్యం వొకటేనని గట్టిగా నిశ్చయించుకున్నాక….. ఆ కవి ’సమాజ వికాస నేత్రం’గా పరిణమిస్తాడు. కనీసం తను ఎంచుకున్న గమ్యాన్ని
నిజాయితీతో చేరడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాడు. ఐతే.. వర్మ- స్పష్టాతి స్పష్టంగా …. ఆ గమ్యాన్ని చేరే దారిలోనే వున్నారు.

అందుకేనేమో- ‘రెప్పల వంతెన’ చదువుతున్నా, అంతకు ముందరి కవిత్వం ’వెన్నెలదారి’ చదువుతున్నా- అంతర్గతంగా
గానీ, బాహ్యంగా గానీ పుస్తకం నిండా… విశాలమైన విప్లవ ఆకాంక్షా – దాని పరిమళత్వం- అడుగడుగునా మనల్ని
మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. అదే వర్మ కవిత్వానికి- వొక అందాన్ని, వొక పరిపుష్ఠిని తీసుకొచ్చిందనుకుంటా.

వ్యక్తిగతంగా నేను వర్మ కవిత్వాన్ని ఎప్పుడు- ఏ సమయంలో చదువుకున్నా… గొప్ప విప్లవానుభూతికి లోనవుతుంటాను. ఆ అనుభూతి చాలా రోజుల పాటు నన్ను వెన్నాడుతూనే వుంటుంది.

2

వర్మ కవిత్వమంతటిలోకి నాకు నచ్చిన వొక గొప్ప imagines thing- నెలవంక.

‘రెప్పల వంతెన’ కవిత్వంలో అతని కవిత వొకటి- ‘అతడెప్పుడూ కలల్ని మోసుకు తిరుగుతాడు’లో…

‘అంతం కాని ఆ కలల మేఘాల చివర
వేలాడుతున్న నెలవంకను చేరాలని
అతడెప్పుడూ కలల్ని మోసుకు తిరుగుతాడు’

అంటారు. నెలవంకను- వర్మ విప్లవానికి ప్రతీకగా తీసుకున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది నాకు. వెంటనే తతిమా కవిత్వం ద్వారా తెలుస్తున్నదేమంటే- విప్లవం ఎక్కడో సుదూరాన లేదూ.. నడుస్తున్న వర్తమానపు దారుల్లోనే విప్లవమూలం- దాని ఉనికి వుందని తెలియకనే తెలుస్తుంది.

‘ఆరారు రుతువుల వెంటా
ఏడేడు రంగుల ఇంద్రధనస్సుని
భుజానేసుకుని
అతడెప్పుడూ కలల్ని మోసుకు తిరుగుతాడు’

ఈ వాక్యాలను చదువుతున్న ప్రతిసారి- నాకు మనసును పట్టి ఊపేసే గొప్ప image కనిపిస్తుంది. ఆ image లో వర్మ నిర్మలమైన ముఖం కనిపిస్తుంటుంది. కవితలో ఆ ‘కలలధారి’ మరెవరో కాదు. వర్మే!

వర్మ ఈ కవిత ద్వారా .. తన గమ్యాన్ని కూడా స్పష్టంగా ప్రకటించారు.

‘జీవితమే యుద్ధమైన చోట
యుద్ధాన్ని అంతం చేయడమే కలగా
అతడెప్పుడూ కలల్ని మోసుకు తిరుగుతాడు’

అని అందుకే అనగలిగారు.

‘అతడెప్పుడూ కలల్ని మోసుకు తిరుగుతాడు’ కవితలో వొక గొప్ప ఆకాంక్షని వ్యక్తం చేసిన వర్మ- ‘ఇక్కడో’ కవితలో…….

‘ఇక్కడో వటవృక్షం పిట్టలగుంపుతో కిలకిలమంటూండేది!
ఎవరో నరికేసినట్టున్నారు.’

‘ఇక్కడో పాక కడుపు నిండా ఇంత అన్నం పెట్టేది!
ఎవరో పీకి పారేసినట్టున్నారు.’

‘సామూహిక జీవన నిర్మాణం’ ధ్వంసం చేయబడడాన్ని గురించీ; కడుపు నిండా అన్నం బెట్టి ఆకలి తీర్చిన పాక ఉన్నట్టుండి అదృశ్యం కావడాన్ని గురించీ… వేదన పడతారు.

మళ్లీ వర్మ- imagines thing….

‘ఇక్కడో పావురాల గుంపు మినార్లపై ఎగురుతూ వుండేది!
పచ్చని ఆకు ఈనెలపై నెలవంకను పూసేది!
ఎవరో తవ్వి పారేసినట్టున్నారు….’

‘పచ్చని ఆకు ఈనెలపై నెలవంక పూయడం’- ఈ కవితకే వొక అద్భుతమైన సౌరభాన్ని తీసికొచ్చింది. కానీ ఆ నెలవంకని తవ్వి పారేయడం- మిగిలిన మహా విషాదం. ఆ విషాదాన్ని దూరం చేసుకోవడం అవసరం కనుకనే.. కొత్త కలలను ధరిస్తూ ముందుకు
వెళ్లడమే నిజమైన బాధ్యత కనుకనే…

‘కాసేపు నిశబ్దాన్ని పాటిద్దాం
అడవి అంతా వెన్నెల పరుచుకుంటుంది
కాసింత దోసిలి పట్టండి’

అంటూ.. ‘కాసేపు నిశబ్దాన్ని పాటిద్దాం’ కవిత ద్వారా ధైర్యాన్ని నూరుపోస్తారు.

‘వెన్నెలా.. వెన్నెలను కాసే నెలవంకా ఎక్కడికీ పోదని’ వొక నమ్మకాన్నిచ్చి…

‘కాసేపు నిశబ్దాన్ని పాటిద్దాం
ఎవరో విముక్తిగీతాన్ని ఆలపిస్తున్నారు
గుండెగది తాళం తీయండి’

అని వొక ఉద్యమ పరిణామక్రమంలో ప్రజాబాహుళ్యం నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్నీ గుర్తు చేస్తారు. ఈనాడు అనేక దేశాల పీడిత ప్రజానీకంపై యధేచ్చగా రుద్దబడుతున్న అగ్రరాజ్యాల భావ వక్రత నుంచి స్వేచ్ఛని ప్రసాదించే ‘విముక్తిగీతం’ కోసమే..
దశాబ్దాలుగా ఆయా దేశాల ప్రజలు ఎదురుచూస్తున్నారన్నది జగమెరిగిన సత్యం.

‘మీలోకి లోలోకి పాకిన తన రక్తజ్వలన సంగీతాన్ని
చెవులారా విని గొంతులో స్వేచ్ఛాగీతాన్ని
జుగల్బందీగా గానం చేయండి…’

 

అని ‘కాసింత ఎండను ఆహ్వానించండి’ కవితలో వర్మ పిలుపునిస్తాడు.

ఇంతకన్నా ప్రజల పక్షాన నిలబడే కవి- తన ప్రజలకిచ్చే సందేశం ఇంకేమైనా వుంటుందా?

4

వర్మ కవిత్వం చదువుతూ చదువుతూ వుండగా- ‘వర్మ’ విప్లవకారులను మనసులో పెట్టుకుని- వాళ్లనే ‘నెలవంక’తో.. వాళ్లు నడిచిన బాట నిండా పరచుకున్న వెన్నెలను ‘విప్లవ ఆకాంక్ష’తో పోల్చారనీ అనిపిస్తుంది నాకు.
‘కామ్రెడ్.పడాల జోగారావు’ గారి అకాల మరణంతో సంభవించిన వెలితితో ‘కరిగిన స్వప్నం’ కవితలో…

‘నీ నవ్వుల వరికంకులు లేని
ఈ శరత్కాలపు వెన్నెల మసకబారిపోయి
నాగవళి ఇసుకలో ముఖం దాచుకుంది’

అంటారు.

తను నమ్మి నడుస్తున్న దారిలో నుంచి వొక్కొక్కరూ దూరమౌతున్న కొద్దీ- తను మాత్రమే వొంటరిగా నడవాల్సిన పరిస్థితిని ‘కనురెప్పల వంతెన కింద’గా కవిత్వం చేస్తూ…

‘ఎలా చెప్పను
ఏమని చెప్పను??

ఒంటరిని చేసి చీకటిలో విడిచిపోయిన
నెలవంక వెనకాల నడకాయె..’

 

అని తన ఒంటరితనాన్ని కూడా వ్యక్తీకరిస్తారు. అయినా నమ్మిన సిద్ధాంతం నుంచి పక్కకి తప్పనితనం వర్మ సొంతం.

5

వర్మ తన కవిత్వానికి strength గా నెలవంకని- వెన్నెలని చేసుకోవడం ’వెన్నెలదారి’తోనే ప్రారంభమైంది.
‘వెన్నెలదారి’లో ఏ విప్లవకాంక్షనైతే దారి పొడుగునా వెదజల్లుతూ నడిచారో దాని continuous process లో భాగంగానే ‘రెప్పల వంతెన’ని సృజించారు. ఐతే కొన్ని కవితలలో జీవితంలో ఆనంద విషాదాలను గురించి, అయిన వాళ్ల మీద ప్రేమను గురించి రాయొచ్చు. కానీ వాటికీ విప్లవ తన్మయత్వంలో ఒదిగిపోయేతనం వుంటుందని చెప్పుకోవడం చాలా సహజం.

‘వెన్నెలదారి’లోనే ‘వెన్నెలగానం’ కవితలో వో చోట- నాలుగు దిక్కులా చీకటి అలుముకున్నాక.. అంతా భయవిహ్వలౌతున్నప్పుడు…

‘ఇటు చివర బక్క పలుచని
జంటొకటి సన్నని మెరుపుతీగల
విల్లంబులను సవరించుకుంటూ
వెన్నెలగానాన్ని ఆలపిస్తూ
ఎదురొస్తూంది…’

 

అని అంటారు.

అలాగే ‘కామ్రెడ్.కౌముది’ స్మృతిలో రాసిన కవిత ‘అతను.. అమె.. నేను’లో-

‘చీకటిలో ఆయన నవ్వు
అడవంతా పరుచుకొన్న వెన్నెల’

 

అని గుర్తుకు తెచ్చుకుంటారు.

వర్మ అప్పుడూ వెన్నెలను వదల్లేదు. యిప్పుడూ వదల్లేదు. అందుకే వర్మ ’రాత్రి నిశబ్దారణ్యంలో కురిసే వెన్నెల దారెంట నడక’ను అమితంగా ఇష్టపడతానంటారు. ‘అడవిలో పూచిన వెన్నెల వెలుగు మనసు వీడదు’ అంటారు.

మొత్తమ్మీద ‘రెప్పల వంతెన’ కవితా సంపుటిలో- మాటాడుకుందాం రా!!, చెరిగిపోని చిత్రం, రహస్య వంతెన, సమకాలీనం, సగం కాలిన నెలవంక లాంటి కవితలలోనూ తన కవిత్వానికి గాఢతను చేకూర్చే paints గా నెలవంకను, వెన్నెలను వర్మ వినియోగించుకున్నారు.

బహుశా నెలవంకని, వెన్నెలని ఇంత గాఢంగా ఆలింగనం చేసుకుని- కవిత్వం చేసిన కవిగా- కెక్యూబ్ వర్మ- ‘రెప్పల వంతెన’ కవిత్వం చదివాక గుర్తుండిపోతారు. విప్లవాదర్శాన్ని మోస్తున్న కవే ఇలా రాయగలడనీ చదువరులు వొక నిశ్చితాభిప్రాయానికి రాక తప్పదు.

 

*** * ***

వాకిలి లో ‘కెక్యూబ్ వర్మ ’ రచనలు