కవిత్వం

రెండో సూర్యుడు

18-అక్టోబర్-2013

రంగురంగుల మేఘాలన్నింటినీ విన్నాకా
మరే మేఘమూ వర్షించడానికి సిధ్ధంకానప్పుడూ
ఓ చిక్కటి మాటేదో పరిగెత్తుకొచ్చింది
కప్పుకోమంటూ….
చప్పున పట్టేసుకుని రంగులద్దేసాను.
జీవితమెక్కడ శూన్యస్వప్నమౌతుందోనన్న భయం పోయింది.

నెరుడా ప్రేమకవితలమీద ఈవ్నింగ్ వాక్
బెర్ట్రాండ్ రస్సెల్ తో మనసు చర్చా
బ్లేక్ బైరాన్ లూ కృష్ణశాస్త్రి శేషేంద్రలతో ప్రేమ మాటలూ
పద సౌందర్యాన్ని చూస్తూనే ఉన్నాడు రెండో సూర్యుడు
మాట ఘనీభవించినచోట మరో మాటనెత్తుకుంటూ

కొన్ని రక్తాశృవులని అధాటుగా విడిచిన కన్ను
మరికొన్ని క్షుద్రాశృవులని దాచేసుకుంటూ
కవిత్వనాట్యం చేస్తూనే ఉంటుంది
దాన్నుంచి మరో సూర్యుడు పుడుతూనే ఉంటాడు
వాడు నాలా అరుస్తూనే ఉంటాడు
కవిత్వ హృదయమంటూ……

రెండు క్షణాల మధ్య ఇరుక్కుని
అర్ధంకానిదేన్నో వెతుక్కోవటం ఎంతగొప్పగా ఉంటుందనీ..
అప్పుడే ఓ చక్రవాక జంట ప్రేమని మోస్తూ పోతుంటూంది.
నాలోని మరో సూర్యుడు వాటిని స్వాగతిస్తుంటాడు.

గడిచిన క్షణమొదిలిన పదాల హ్యాంగోవర్
ఇంకా గుండె గదిలినొదలదనీ తెల్సు
అక్షరాలందక చింపేసిన కాగితంలో నా మనసున్నట్టు
పైటజార్చిన ఆలోచన్లేవీ మాటవినవు
ప్రతివాకిట ముగ్గూ మరో ఆలోచనకి నాందే….
మనసుండాలేకానీ! నా రెండో సూర్యుడిలా