కబుర్లు

ఆకుపాట

ఏప్రిల్ 2014

నా  ’ఆకుపాట’ కవితా సంపుటి లోంచి  - ప్రముఖుల ఆత్మీయ వాక్యాలు:


అఫ్సర్:

వున్నచోటనే మడికట్టుకోకుండా తను వెళ్ళిన చోట కూడా వొక గుడి కట్టుకోగల మనస్థైర్యం వున్న కవికి భాష అడ్దంకి కాదు, తనలోపలితనాన్ని కవితలా తెరవడానికి అతను కొత్త భాషలోకి హాయిగా వెళ్ళిపోతాడు. వాసు కవిత్వ వాక్యాల్లో తెలుగు, ఇంగ్లీషు, తెలిగింగ్లీషూ స్నేహంగా వొదిగిపోతాయి. ఆ రెండు భిన్న ప్రపంచాల సాహిత్య సాన్నిహిత్యాన్ని వొద్దికగా తనలో ఇముడ్చుకొని, వొకే వాక్యపు గూటిలో దీపంలాగా వెలిగిస్తాడు వాసు. ఆ వెలుగు ఎంత అందంగా వుంటుందో అంత కొత్తగానూ వుంటుంది. ఎంత కొత్తగా వుంటుందో అంత దగ్గిరగా అలవాటయినట్టుగానూ వుంటుంది.

జీవితాన్ని మొత్తంగా చూడాలా, శకలాలుగా చూడాలా అన్న సందిగ్ధంలోంచి ఇంకా తేరుకోకుండానే, ఆధునిక జీవన శకలాల విశ్వరూపం చూపిస్తున్న కవి వాసుదేవ్. ఎదో వొక రకంగా సరిహద్దుల్ని చెరిపేసుకుంటూ వెళ్తే తప్ప ఇప్పటి జీవితం శకలాలుగా ఎలా మారుతున్నదో అర్థం కాదన్నది నిజం. ఆ నిజం అర్థమయ్యాక రాసే కవిత్వం ప్రతివాక్యంలోనూ కొత్త అర్థాన్ని చూపిస్తుంది. ఈ సంపుటిలో వాసుదేవ్ కవితల్ని వరసగానో, వరస తప్పించో చదువుతున్నప్పుడు వెంటనే ఈ multiplicity వినిపిస్తుంది. మనఃకల్లోలం నుంచి సాధ్యమైనంత వరకూ స్థిర స్థితిలోకి తీసుకువెళ్ళే లయని వాసు వెతుక్కుంటూ ఉంటాడు. వాసుతో పాటు మనం కూడా! ప్రతి కవీ తనతోపాటు వొక ఆశ్చర్యాన్ని తీసుకువస్తాడు. తనని చదివే చదువరికే కాకుండా, తన పంక్తిలో నిలబడే తోటి కవులకి కూడా ఆ ఆశ్చర్యం కలిగిస్తాడు. దాన్ని “ఆహా” క్షణం అనుకుంటాం. అలా ‘ఆహా’ అనిపించే అనేక క్షణాల చిగురాకుల మెరుపులివి.


హెచ్చార్కె:

‘మాటకు మరణం లేదు/ ఏ వాక్యమూ నశించిపోదు’. బహుశా కవికి తప్ప మరెవరికీ ఉండదు ఇంత నమ్మకం పదం మీదా, వాక్యం మీద. మాటలు కేవలం అక్షరాల కలయికలు కావు. మనసు నుంచి మనసుకు బదిలీ అయ్యే బొమ్మలు. ఈ సంగతి తెలిసిన మొదటి సారి పొందిన సంభ్రమాశ్చర్యాల నుంచి ఎప్పటికీ బయటపడ లేక, ప్రాక్టికల్ ప్రపంచంతో సామరస్యం కుదరక తపిస్తాడు కవి. తన తపన లోంచి తనదైన భాషను, వ్యాకరణాన్ని, వ్యక్తీకరణ సంప్రదాయాలను సృష్టిస్తాడు.

తనదయిన ఒక ‘ఆకాశాన్ని కోసుకుంటూ’ రాలిన కన్నీటి చుక్కలను లోకంతో పంచుకుంటున్న కవి కుమారుడు శ్రీనివాస్ వాసుదేవ్. ‘ఆకలి సమ్మేళనాల, వెతల వెక్కిళ్ల’ జ్ఞాపకాల’ను ఒక్కొక్క తొనగా వొలిచి అందిస్తున్నాడు. ఒక మెత్తని కొత్త గొంతు; సనాతన, అత్యాధునిక వేదన. నేనొక చిన్ని పాపాయినై ఈ సుకుమార గళం చుట్టూ చేతులు వేసి, ఈ భుజం మీద చెక్కిలి ఆన్చి కాసేపు సేద దీరాను. మనసు నుంచి చాచిన చేతులతో ఆహ్వానం మరొక మంచి తెలుగు స్వరానికి….


బతుకురంగుల కోరస్ ‘ఆకుపాట’
కవి యాకూబ్:

ఇతడో నిలువెత్తు కవి. నిలువెల్లా కవి.
తనలోంచి తనలోకి, మనలోంచి తనలోకి అటూ ఇటూ గెంతుతూ, జీవితాన్ని కవిత్వంగా పలవరిస్తున్న కవి .

అబ్బురంలాంటి కవి. అబ్బురపరిచే కవి.
అమృతం తాగి జరామరణాల్ని జయించినట్లు, కవిత్వం తాగి శాశ్వతమైపోతున్న కవి .
తానే ఒక మార్గంగా ‘మనసుపై తడిఅరని ఓ సంతకం’లా మారిపోతున్న కవి.
సమస్తాన్నీ అక్షరాలకు అప్పగించి అంతర్జాతీయస్వరమై ఎదిగి ,ఒదిగిఉన్న కవి.
తడి తడి పదాల్తో తడిచిముద్దయిపోతున్న కవి.
పత్రహరితపు గుణమేదో ఒంటపట్టించుకుని
సతత హరితాక్షర అరణ్యంలా ఆకుపచ్చని పాటల్ని పాడుకుంటున్న కవి.
ఇతడేనేమో ఆ అల్లల్లాడుతున్న కొమ్మ !

ఇతడేనేమో ఆ అంతరాంతర జ్యోతిసీమలు రూపుకట్ట్టిన కవిత్వం !
లోపలి సెగ పదాలకంటితే ఇతని కవిత్వం .
కన్నీరింకే సమయాలల్లో కరుగుతున్న చెమ్మ ఇతని కవిత్వం.
రాత్రి తన తనాన్ని మరిచి ,కలలోకి జారుకుంటున్నట్లు
ఒక పురాస్మృతిలా ఇతని కవిత్వం మరో ఆకాశంలోకి తెరుచుకుంటుంది.
ఉరికే మబ్బుల్ని అందుకునే సముద్రం తనతో తాను
సంభాషించుకునే సన్నివేశంలా ఉంటుంది ఇతని కవిత్వం.

కవిత్వంఎదుట వినమ్రంగా మోకరిల్లిన బాలుడు
పలుకుతున్న స్వచ్చమైన మాటల్లా ఉంటుంది ఇతని కవిత్వం .
కొన్ని పిడికిళ్ళు,కొంత ప్రేమ,మరికొన్ని బతుకుకొమ్మకు పూసిన పూలు
దోసిట్లోకి తీసుకున్నట్లుగా ఉంటుంది ఇతని కవిత్వం.
మెలకువలోంచి మెలకువలోకి
జీవితంలోంచి జీవితంలోకి
ఇవాళ్టినుంచి రేపటిలోకి
మంద్రంగా సాగుతూ,వినిపిస్తున్న నిసర్గ తంత్రీనాదంలా ఉంటుంది ఇతని కవిత్వం.

నిజమే !
ఇతడు కవిత్వాన్ని సహజకవచంగా ధరించాడు.
కాలాన్ని కవిత్వవస్త్రంగా కప్పుకున్నాడు.
ఇతని కవిత్వం బతుకుపలవరింతకు నిఘంటువు ;
అక్షరాన్ని పలుమార్లు దిద్దుకునే పలక పరవశం.

ఇప్పుడిక యితడు వొంటరి కానేకాడు
‘ఆకుపాట’ ఇతడి వెంటే నడుస్తుంది.