పుస్తక పరిచయం

మూడవ మనిషి – ఓ చీకటి దృశ్యం

అక్టోబర్ 2017

కొన్ని అపురూపాలకి కవిత్వమూ మినహాయింపు కాదు. అలాంటిదే ‘మూడవ మనిషి’ దీర్ఘ కవిత.

కవితా వస్తువుని ఎంచుకోవటంలోనే కవి తన ధైర్యాన్ని చాటుకున్నాక ఇక కవితలో చదవాల్సింది చాలానే ఉండి ఉండాలి అనుకున్నా. అలానే ఆద్యంతమూ చదివించింది.

కుర్షించని మేఘాలూ, రాయని బలపాలూ, పాలివ్వని ఆవులూ మనకెప్పుడూ చిరాకే, కానీ వాటి గురించి ఆలోచించే సమయముంటే అవీ మాట్లాడతాయి. అవీ తమ గోడుని వెళ్ళబోసుకుంటాయి. వాటిని సవరదీసి మచ్చిక చేస్కుంటే అవీ తమ కథలు చెప్థాయి. హిజ్రాలు ఆ కోవకి చెందినవారె. ఎంతసేపూ వారిని ఊరినుంచో, ఇంటి నుంచో తరిమికొట్టే ప్రయత్నమే కానీ వారిని అర్ధం చేసుకునే ప్రయత్నమేదీ మనం చెయ్యం.

ఆ ప్రయత్నంలో భాగమే ఈ దీర్ఘ కవిత “మూడవ మనిషి”.

భారత సమాజంలో మూడో జెండర్ మనుషుల స్థానం ఎప్పుడూ అవమానకరమే. వారిని ముందుగా కుటుంబం అంగీకరించదు. సమాజం అంతకన్నా రానివ్వదు. ప్రభుత్వ చట్టాలు ఎక్కడున్నాయో, ఏం చెప్తున్నాయో ఎవరికీ తెలీదు. వీరికి ఎక్కడా ఉద్యోగం ఇవ్వరు. కానీ మిగతా దేశాల్లో వీరి జీవన విధానం మాములు ప్రజల కంటే భిన్నమేమీ కాదు– చదువూ, ఉద్యోగం, కుటుంబం అన్నీ మాములే. అక్కడ వీరిని అన్ని కార్యక్రమాలకి మిగతా అందరిలానే స్వాగతిస్తారు.

***

ఆంగ్లంలో ట్రాన్స్జెండర్స్ పై రాసిన కవితలు చాలానే ఉన్నాయి, కానీ తెలుగులో ఈ ప్రయోగం కొత్తదే. నిజానికి ఆంగ్ల భాషలో 2013 లోనె దాదాపు 55 హిజ్రాలు తమంతట తామే ఓ సంకలనాన్ని విడుదలా చేసుకున్నారు వారి కవితలతో! “Troubling the Line: Trans and Genderqueer Poetry and Poetics”.

“మూడవ మనిషి”– ఈ దీర్ఘ కవిత పదిహేను కథలుగా చెప్పబడింది. అందువలన రీడబిలిటీ సులభమవుతుంది పాఠకులకి. పుస్తకం తెరిచి ఏ కథతోనైనా కవిత చదవటం ప్రారంభించొచ్చు. ఈ కవితకి ఉన్న ప్రత్యేక లక్షణాల్లో ఇదొకటి.

ఆత్మకథగా ప్రారంభమైనా ఓ మోనోలాగ్ గానే కొనసాగింది మొత్తం పదిహేను ఖండికల్లోనూ. ఇంకా నిర్ధారించి గట్టిగా చెప్పాలంటే ఓ డ్రమటిక్ మోనోలాగ్ రూపంలోనే ఈ దీర్ఘ కవితంతా రాయటం జరిగింది. కవి కావాలనే ఈ మోడ్ లో రాసారో లేక కవిత చివరికొచ్చేసరికి ఆ రూపం వచ్చిందో నాకైతే తెలియదు.

” మెత్తటి పూలచెండులా దూదిబొమ్మలా/ అమ్మ గుండెలమీద నేను” ఇలా కవిత ఆద్యంతమూ వినిపిస్తుంది ఈ మూడవమనిషి స్వరం. కన్నకొడుకు కంటిముందే అమ్మయిలా తయారవ్వుతుంటే బిడ్డని ఎవ్వరికీ చూపించలేకా, చూపించకుండా ఉండనూలేకా ఆ తల్లిపడే అవేదనని కవయిత్రి చాలా చక్కగా మలచుకున్నారు. అదీ కవితలోని ప్రధాన పాత్ర-ఓ హిజ్రా ద్వారా!

మాములు కవితల్లో కవితా వస్తువుని వర్ణించటానికీ , పాఠకులముందు విస్పష్ట పర్చటానికీ, ఇలాంటీ రచనల్లో కవితా వస్తువును శ్లాఘించటానికీ చాలా తేడాఉంది. ఇక్కడ హిజ్రాలో పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఆ పాత్ర గురించి పూర్తి అవగాహన లేకున్నా ఉన్నట్లుగా పూర్తిగా ఊహించి మరీ రాయటం కష్టమైన పనే.

ఓ సంక్లిష్ట సబ్జెక్ట్ ని తీసుకున్నాక ఆ కవిత భాష అలతిగా లేకపొతే పాఠకులు చదివే అవకాశాలు తక్కువవుతాయి. కానీ ఈ కవితలో రేణుకా గారి పాటవం అంతా ఇక్కడె కనిపిస్తుంది.

“గాయపు పొర రేగి చిమ్మిన నెత్తురు/ వేసవి గాలి తెచ్చిన దుమ్ములా/కాగితాల మీద పేరుకుంది/కథ చెప్తున్న కలం
కాగితం చాపమీద నడుం వాల్చింది” ఈ వాక్యాల ద్వారా చాలా విషయాలు బోధపడే అవకాశం ఉంది: కొన్ని వాక్యాలు ఎలా కవిత్వమవుతాయి అన్నదీ, కాగితం చాప అన్న మెటఫర్ ప్రయోగం- ఇలాంటివి మరికొన్ని ఈ కవితని జీవితాంతం గుర్తుంచుకుపోయేలా చేస్తాయి.

కవితని రెండు భాగాలుగా విభజించి చూడొచ్చు– వీరు ప్రపంచానికి ఎలా కనపడతారు, వీరికి ప్రపంచం ఎలా కనపడుతుంది.

“శరీరాన్ని కావలించుకున్న మగతనపు ఛాయలు”

“సంతృప్తి పమిట కప్పుకుని, తెలి మెరుపుల జరీపోగుల చీరతో, తెల్లగులాబీలా” ఈ వాక్యాల్లో హిజ్రా తనని తానే ఆవిష్కరించుకుంటే,

“ఈ దారినిండా మనుషులు/ఆర్తి నిండిన ముఖాలు/ తెగింపు తిరస్కారంతో నిండిన చూపులు”
లాంటి ఒక్క వాక్యం చాలు వీరిని ప్రపంచం ఎలా ట్రీట్ చేస్తుందో అర్థమవ్వటానికీ.

ఇలంటివి ఈ దీర్ఘ కవితలో చాలానే ఉన్నయన్న నిజాన్ని మీ నుంచి దాచిపెట్టలేనన్నదే ఏకైక నిజం.

రేణుకా అయోలా గారికి అభినందనలతో..

**** (*) ****