“గజల్స్ ఫ్రమ్ ఫిల్మ్స్” అని లతా పాడిన ఓ పాతిక గజల్స్ ఉన్న ఆల్బం(రెండు కేసెట్లు) కొన్నారు నాన్నగారు నా కాలేజి రోజుల్లో. నా ఫేవొరేట్ ఆల్బంస్ లో ఒకటి అది. ఆ గజల్స్ లో వాడిన ఉర్దూ పదాలకు అర్థాలు తెలియకున్నా అవన్నీ నాకెంతగానో నచ్చేవి. కొన్నళ్ళయ్యాకా డిక్షనరీ కొనుక్కుని మరీ ఆ ఉర్దూ పదాలకు అర్థాలు వెతుక్కుని, అర్థాన్ని ఆస్వాదిస్తూ ఆ గజల్స్ వినేదాన్ని. అసలా భాషకున్న మధురిమవల్లనే అనుకుంటా ఓ చిత్రకథానాయకుడు “జిస్కీ జుబా ఉర్దు కీ తర్హా..” అని నాయికను వర్ణిస్తూ పాడతాడు! అలా నే పదే పదే వింటూ వచ్చిన ఆ సినీ గజల్స్ ఆల్బంలోదే ‘Bazaar’ చిత్రంలోని “దిఖాయీ దియే యూ..” అన్న గజల్. నాకెంతో ప్రియమైన పాటల జాబితాలోది. వినేకొద్ది వినాలనిపించే ఈ గజల్ లో దాదాపు అన్నీ ఉర్దూ పదాలే. పాటల డైరీలో రాసుకున్న గజల్ లోని ప్రతి పదానికీ అర్థం రాసుకుని, మొత్తం అర్థాన్ని గ్రహించటానికి ప్రయత్నించేదాన్ని అప్పట్లో. ఆ ఇష్టంతోనే ఈ సిరీస్ లో ఈ పాట గురించి రాయడానికి సాహసిస్తున్నా..
‘Bazaar’ చిత్రాన్ని గురించి చెప్పేకన్నా ముందుగా ఈ గీత రచయిత గురించి కొంత చెప్పాలి. 18వ శతాబ్దానికి చెందిన గొప్ప పేరుగాంచిన ఉర్దూ కవి “Mir taqi mir” రాసిన గజల్ ఇది. ఉర్దూ సాహిత్యానికీ, ప్రేమ కవిత్వానికీ తన వంతుగా ఉత్తమమైన రచనలను అందించిన మేటి ఉర్దూకవి. ఈ కవి గురించి తాను రాసుకున్న ఆత్మకథలో తప్ప మరెక్కడా ఎక్కువ వివరాలు లేకపోవడం, అతని జీవితకాలంలోనే అతనికి సరైన గుర్తింపు లభించకపోవడం చాలా విచారకరం. ఎంతో వేదనకూ, నిరాశకూ గురైన బాధాతప్త జీవితగాథ అతనిది. అయినా ఎన్నో విలువైన రచనలను ఉర్దూ సాహిత్యానికి అందించాడు కాబట్టే మీర్ ను “Khuda-e-Sukhan” (God of poetry) అని తలుచుకుంటారు ఉర్దూకవులు నేటికీ. “రెఖ్తా కే తుమ్హీ ఉస్తాద్ నహీ హో గాలిబ్, కెహ్తే హై జమానే మే కోయీ మీర్ భీ థా…” అన్నాడట మిర్జాగాలిబ్. (అంటే, ఉర్దూ కవిత్వంలో నువ్వొక్కడివే పండితుడివి కాదు, మీర్ అనే నిన్ను మించిన నేర్పరి కూడా గతంలో ఉండేవాడంటారు” అని అర్థం) మీర్ గొప్పతనం అంతటిదన్నమాట. ఎంతవరకూ నిజమో తెలీదు కానీ మీర్ తండ్రి ఒక ‘సూఫీ యోగి’ అనీ, అందువల్ల అతని కవిత్వంలో సూఫీ తత్వం, సిధ్ధాంతాలూ కనబడతాయి అని కొందరంటారు.
కవి ‘Mir’ ఇతర కవితలు కొన్నింటిని ఇక్కడ చూడవచ్చు:
http://www.kavitakosh.org/kk/%E0%A4%AE%E0%A5%80%E0%A4%B0_%E0%A4%A4%E0%A4%95%E0%A4%BC%E0%A5%80_%27%E0%A4%AE%E0%A5%80%E0%A4%B0%27#.UmjK71PN2St
‘Mir’ తాలూకూ చిన్న చిన్న జీవితవిశేషాలను ఇక్కడ చదవవచ్చు:
http://universalpoetries.wordpress.com/2012/04/04/the-chronicles-of-mir-taqi-mir/
ఇక “బాజార్” చిత్రకథ లోకి వస్తే, నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లలను పెళ్ళి పేరుతో గల్ఫ్ దేశాల్లో ఉండే భారతీయులకు అమ్మివేసే వ్యాపారం గురించి తెల్పే కథ ఇది. తన స్వార్థం కోసం ఒక స్త్రీ, ఓ నిరుపేద కుటుంబంలోని అమ్మాయిని ఓ గల్ఫ్ దేశస్థుడితో పెళ్ళికి కుదురుస్తుంది. డబ్బు కోసం కూతురి ప్రేమను కాలరాసి, ఆ కుటుంబం వారు బలవంతంగా ఆ ఆమ్మాయిని ఆమెను కొనుక్కున్న ముసలాడికిచ్చి పెళ్ళి చేసేస్తారు. అందువల్ల ఇద్దరు అమాయక ప్రేమికులు విడిపోతారు. విషాదాంతమైన ఈ కథను చూస్తున్నంత సేపు బాహ్యప్రపంచాన్ని మర్చిపోతాం మనం. పాటలు బావుంటాయని సరదాపడి సీడీ కొనుక్కుని, చూసిన తర్వాత రెండురోజులపటు బాధపడ్డాను ఎందుకు చూసానీ చిత్రాన్నని! కథలోని సర్జూ, షబ్నం పాత్రల్లో ఫారూఖ్ షేక్, సుప్రియా పాఠక్; సలీం, నజ్మా పాత్రల్లో నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్ జీవించారు అనడమే సబబు.
‘బాజార్’లో “కరోగే యాద్ తో హర్ బాత్ యాద్ ఆయేగీ”, “ఫిర్ ఛిడీ రాత్ బాత్ ఫూలోం కీ… “, “దిఖాయీ దియే యూ” మూడు పాటలూ చాలా బాగుంటాయి. ముఖ్యంగా “ఖయ్యామ్” అందించిన సంగీతం ఈ పాటలకు ప్రాణం అని చెప్పాలి. ఎక్కువగా సాహిత్యపు విలువలున్న పాటలకు సంగీతం అందించేవారుట ఖయ్యామ్. అందువల్ల ఆయన స్వరపరిచిన పాటల్లో సంగీతంతో పాటూ సాహిత్యానికి కూడా పెద్ద పీట కనబడుతుంది. “దిఖాయీ దియే యూ” కు ఊపిరి లతా గాత్రం. ఎన్నిసార్లు విన్నా తనివితీరనంత మధురంగా పాడింది లతా మంగేష్కర్ ఈ పాటను. ఓ రాత్రిపూట డాబా మీద జరిగే బంధుమిత్ర సమావేశంలో చిత్ర కథానాయిక అక్కడే ఉన్న తన ప్రియుడిని ఉద్దేశిస్తూ ఈ పాట పాడుతుంది. కథలో సలీం ప్రేమించే నజ్మా కూడా అక్కడే ఉండటం వల్ల వాళ్ళీద్దరినీ కూడా మధ్య మధ్య చూపిస్తూ ఉంటారు. పాట అర్థాన్ని సలీం దృష్టితో కూడా మనం చూడచ్చు.
“బాజార్” చిత్రకథకు అనుగుణంగా మీర్ సాహిత్యాన్ని వాడుకున్నారు గానీ “దిఖాయీ దియే యూ” లో అంతర్లీనంగా సూఫీతత్వం కనబడుతుంది. పరమాత్మ పట్ల తనకు గల అమితమైన ప్రేమను తెలుపుతూ, ఆ ప్రేమపారవశ్యంలో తాను తన ఉనికిని కూడా కోల్పోయానని; భగవంతుడి ప్రేమను తిరిగి తన నివేదనగా సమర్పించేసాననీ, ఇక ఆ పరమాత్మలో ఐక్యం అవ్వాలన్నదే తన చిరకాల వాంఛ అనే అర్థం ఈ గజల్ లో అంతర్లీనంగా దాగి ఉంది. అందువల్ల వాక్యార్థం పొసగదని ఈసారి కూడా పాటను చిత్రకథకు అన్వయిస్తూ చాలావరకూ స్వేచ్ఛానువాదమే చేసాను. ఇక పాట అర్థాన్ని చూద్దామా…
“దిఖాయీ దియే యూ”.. స్వేచ్ఛానువాదం:
दिखाई दियॆ य़ू कॆ बॆखुद किया
हमॆं आप सॆ भी जुदा कर चलॆ
నీ ప్రేమ పారవశ్యంలో ఎంతగా వివశురాలినయ్యానంటే
నేను నానుండి కూడా దూరమైపోయాను
భావం: ప్రియతమా, నీ ప్రేమ నన్ను ఏ స్థితికి చేర్చినట్లు కనిపిస్తోందంటే, ఆ ప్రేమ తన్మయత్వంలో నన్ను నేనే మరచిపోయాను. నేనే నువ్వైపోయిన ఈ తాదాత్మ్యత వల్ల నా నుండి నేను విడిపడి నువ్వైపోయాను. నేనంటూ ఏమీ మిగలలేదు.
जबि सजदा करतॆ ही करतॆ गई
हक़-ए-बंदगी हम अदा कर चलॆ
నీకై ప్రణమిల్లిన శిరస్సు అలా ప్రణమిల్లుతూనే ఉంది
నా స్వామ్యపు ఆరాధనను నేను అర్పించాను
భావం: ఓ భక్తురాలుగా నిన్ను పూజించడం మొదలుపెట్టాకా నీకై వంచిన నా శిరస్సు ఇక అలా ప్రణమిల్లుతూనే ఉంది. నీ పట్ల నా ఆరాధనను నా హక్కుగా నీకు అర్పించివేసాను.. అంటే – నువ్వు ఏ ప్రేమనైతే నాకు ఇచ్చావో అది నా హక్కుగా మారింది. ఆ హక్కుతోనే మళ్ళీ అదే ప్రేమను ఆరాధనాపూర్వకంగా నీకు నివేదన చేసాను.
परश्तिश किया तक कॆ ऎ बुत तुझॆ
नजर मॆं सबॊं की खुदा कर चलॆ
ఓ మూర్తిలా ఆరాధించాను నిన్ను
అందరి దృష్టిలో భగవంతుడిలా నిలిపాను
భావం: అమితమైన ప్రేమ పారవశ్యం వల్ల నిన్నొక మూర్తిలా(విగ్రహరూపంలో) నేను ఆరాధించాను. అందువల్ల నువ్వు ఇతరుల దృష్టిలో నాపాలిట దైవానివైయ్యావు.
बहुत आरजू थी गली की तेरी
सॊ यास-ए-लहूं मॆं नहा कर चलॆ
నీకు దగ్గరవ్వాలని ఎంతో ఆరాటపడ్డాను
నిస్పృహల రుధిరధారల్లో సైతం స్నానమాడాను
భావం: ఈ చరణంలో “గలీ కీ తెరీ” అంటే ‘నీ ఇంటి సందు’ అని కాదు ‘నీకు దగ్గరవ్వాలని’ అర్థం. అలానే చివరి వాక్యానికి ‘నిస్పృహ తాలూకూ రక్తధారల్లో స్నానమాడాను’ అన్నది అనే అక్షరార్థమైనా, ఆమె అసలు ఉద్దేశం ఏమిటంటే.. ‘నీకు దగ్గరవ్వాలనీ, నీలో కలసిపోవాలనీ చాలా ఉబలాటపడ్డాను కానీ ఆ ఆరాటం తీరక, నిరాశానిస్పృహల్లో మునిగిపోయాను’ అని. ఆమె నిరాశ తాలూకూ తీవ్రతను తెలపటానికి కవి అలాంటి పదాలను వాడి ఉంటారు.
ఈ మధురమైన పాటను ఇక్కడ చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=Xdzi5PSTs6I
Photo Credit: http://no1urdupoets.wordpress.com/2011/07/24/mir-taqi-mir/
బావుందండీ.మిగతా అన్ని పాటల్లా కాకుండా గజల్స్ వినడానికి ఓ ప్రత్యేకమయిన సమయం ఉండాలనిపిస్తుంటుంది నాకు.అలా గజల్స్ వింటూ మనమూ ఆలోకంలో విహరిస్తూ అక్కడ్నించి బయటపడడం కష్టమేమో
మంచి పాట తొ పాటు ఓ గొప్ప రచయితని కూడా పరిచయం చేసారు తృష్ణగారూ ధన్యవాదాలు
పప్పు గారూ, అవునండి..ఓ చల్లని సాయంత్రమో,వెన్నెల రాత్రో నిశ్శబ్దమ్గా ఉన్నప్పుడు వింటే అద్భుతంగా ఉంటాయి గజల్స్..:)
ధన్యవాదాలు.
పాట చాలా బాగుందండీ.. ఈ కవిగారి గురించి మొదటి సారి వింటున్నాను. మరో మంచి పాట పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్ : థాంక్స్ వేణుగారూ.
“ఉస్కీ జుబా ఉర్దూ కి తరహ్..” అని రాసింది గుల్జార్! చయ్య చయ్య పాటలో వస్తుందా line. హైదరాబాదును వర్ణించడానికి కూడా ఆయన ఒకసారి అదే వాక్యాన్ని ఉటకరించారు.
బజార్ సినిమా నాకో పెద్ద disappointment! అయినా అందులో పాటలు మాత్రం నన్ను చాలా ఆకట్టుకున్నాయి. మీర్ తాకీ మీర్ గురించి తెలీటం ఈ చిత్రం వల్లే. ఈ పాట పిక్చరైజేషన్ కూడా నాకు బా నచ్చుతుంది. మంచి పాటను పరిచయం చేసినందుకు థాంక్స్.
@పూర్ణిమ : ఊ..ఊ..తెలుసు తెలుసు…అందుకే ‘ఓ కధానాయకుడు’ అన్నా…గుల్జార్ అని రాస్తే మళ్ళి ఆ పాటలోకో, గుల్జార్ గురించో చెప్పేయబుధ్ధివేస్తుండి..అందుకనన్నమాట
ఈ సిన్మా చూసిన రెండురోజులు పిచ్చెక్కేసిన్దంటే నమ్మాలి.. ఎందుకు చూసానా అని.. such a sad story ..:(
ఆ డాబా మీద ఓ పక్కగా మనం కూడా కుర్చుని వింటున్నట్టు ఉంటుంది కదా.. ఈ సిరీస్ మొదలుపెట్టినప్పటినుండీ ఈ పాట రాయాలని..ఇన్నాళ్ళకు సాహసించాను.. థాంక్స్ పూర్ణిమ గారూ !
Very nice!!!!! For the song, translation and also for the description about the poet. Looking forward for many such beautiful works.
థాంక్స్ రూపా
ఎంత బాగా ఉందండీ తృష్ణ గారూ ఈ పాట అర్థం. భగవంతుడి ప్రేమని పొంది దాన్నే నివేదనగా అర్పించి అతనిలో ఐక్యం అవడం – అద్భుతం. మంచి పాటని పరిచయం చేసినందుకు ధన్యవాదములు
రాధ
@Radha :వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు రాధ గారూ.
ఒకప్పటి డీడీ (దూరదర్శన్ ) లో చూసిన బ్లాక్ అండ్ వైట్ సినిమాల మంచి రోజుల్ని గుర్తు చేశారు తృష్ణ గారు..
నిజమే ఈ సినిమా చూస్తున్నపుడు.. ఈ పాటలో సుప్రియా పాఠక్ ప్రేమ ని ప్రకటించిన సున్నితత్వం.. తర్వాత ఇష్టం లేని పెళ్లిని ఫేస్ చెయ్యలేక.. జీవితాన్ని అంతం చేసుకునే దుస్సాహసం.. అసలు గొంతులో గుండె గడ్డకట్టుకు పోయిన భావాన్ని కలిగిస్తుంది. ఇప్పటికీ ఆ పాట… సుప్రియా అమాయకపు ముగ్ధత్వం కళ్ళ ముందు నిలుస్తాయి. థాంక్ యూ ఫర్ ఠిస్ గ్రేట్ సాంగ్
@jayashree Naidu : ధన్యవాదాలు జయశ్రీ గారూ..
ఈ పాట అర్ధం తెలియకుండానే పాడేసుకునేదానిని. ముఖ్యంగా మరీ ఎక్కువ పారశీక పదాల వల్ల అర్ధం కష్టమైంది. పక్కనే బాజార్ లోని ‘కరోగే యాద్ తో’, ‘ఫిర్ చిడీ రాత్ బాత్ ఫూలోంకీ’ పాటలు సాహిత్యం, సంగీతం, గాయకుల ప్రతిభల వల్ల మరింత ఎక్కువ నచ్చటంతో ఈ పాట కాస్త తక్కువగా కనిపించేది నాకు. గజల్ ను ఆస్వాదించటానికి కావలసిన సెన్సిబిలిటీ కూడా నాకు తక్కువ. మీర్ తాకీ మీర్ గురించి చెప్పి, ఈ పాట అర్ధాన్ని ఇంత బాగా వివరించినందుకు కృతజ్ఞతలు తృష్ణ గారూ! .
@lalita P. : నేను కూడా చాలా కాలం అర్థం తెలియకపోయినా ఆ పదాల అందాన్ని ఆస్వాదిస్తూ వినేసేదాన్ని..! గజల్ గురించి రాయడం నిజంగా సాహసమేనండి.. ఈసారి ధైర్యం చేసాను.. నచ్చినందుకు ధన్యవాదాలు లలితగారూ.
మొదలు పెట్టిన చోటునుండి కొన్ని మేలికలు తిరిగి వ్యాసం సాగింది అనిపించింది.
“పాటలు బావుంటాయని సరదాపడి సీడీ కొనుక్కుని, చూసిన తర్వాత రెండురోజులపటు బాధపడ్డాను ఎందుకు చూసానీ చిత్రాన్నని”!…ఇలా ఉదహరించడంలోని ఆంతర్యం అర్థం కాలేదు నాకైతే
స్వేచ్ఛానువాదం: …. బాగుంది
@జాన్ హైడ్ కనుమూరి: మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.