చలువ పందిరి

దిఖాయీ దియే యూ

నవంబర్ 2013

“గజల్స్ ఫ్రమ్ ఫిల్మ్స్” అని లతా పాడిన ఓ పాతిక గజల్స్ ఉన్న ఆల్బం(రెండు కేసెట్లు) కొన్నారు నాన్నగారు నా కాలేజి రోజుల్లో. నా ఫేవొరేట్ ఆల్బంస్ లో ఒకటి అది. ఆ గజల్స్ లో వాడిన ఉర్దూ పదాలకు అర్థాలు తెలియకున్నా అవన్నీ నాకెంతగానో నచ్చేవి. కొన్నళ్ళయ్యాకా డిక్షనరీ కొనుక్కుని మరీ ఆ ఉర్దూ పదాలకు అర్థాలు వెతుక్కుని, అర్థాన్ని ఆస్వాదిస్తూ ఆ గజల్స్ వినేదాన్ని. అసలా భాషకున్న మధురిమవల్లనే అనుకుంటా ఓ చిత్రకథానాయకుడు “జిస్కీ జుబా ఉర్దు కీ తర్హా..” అని నాయికను వర్ణిస్తూ పాడతాడు! అలా నే పదే పదే వింటూ వచ్చిన ఆ సినీ గజల్స్ ఆల్బంలోదే ‘Bazaar’ చిత్రంలోని “దిఖాయీ దియే యూ..” అన్న గజల్. నాకెంతో ప్రియమైన పాటల జాబితాలోది. వినేకొద్ది వినాలనిపించే ఈ గజల్ లో దాదాపు అన్నీ ఉర్దూ పదాలే. పాటల డైరీలో రాసుకున్న గజల్ లోని ప్రతి పదానికీ అర్థం రాసుకుని, మొత్తం అర్థాన్ని గ్రహించటానికి ప్రయత్నించేదాన్ని అప్పట్లో. ఆ ఇష్టంతోనే ఈ సిరీస్ లో ఈ పాట గురించి రాయడానికి సాహసిస్తున్నా..

‘Bazaar’ చిత్రాన్ని గురించి చెప్పేకన్నా ముందుగా ఈ గీత రచయిత గురించి కొంత చెప్పాలి. 18వ శతాబ్దానికి చెందిన గొప్ప పేరుగాంచిన ఉర్దూ కవి “Mir taqi mir” రాసిన గజల్ ఇది. ఉర్దూ సాహిత్యానికీ, ప్రేమ కవిత్వానికీ తన వంతుగా ఉత్తమమైన రచనలను అందించిన మేటి ఉర్దూకవి. ఈ కవి గురించి తాను రాసుకున్న ఆత్మకథలో తప్ప మరెక్కడా ఎక్కువ వివరాలు లేకపోవడం, అతని జీవితకాలంలోనే అతనికి సరైన గుర్తింపు లభించకపోవడం చాలా విచారకరం. ఎంతో వేదనకూ, నిరాశకూ గురైన బాధాతప్త జీవితగాథ అతనిది. అయినా ఎన్నో విలువైన రచనలను ఉర్దూ సాహిత్యానికి అందించాడు కాబట్టే మీర్ ను “Khuda-e-Sukhan” (God of poetry) అని తలుచుకుంటారు ఉర్దూకవులు నేటికీ. “రెఖ్తా కే తుమ్హీ ఉస్తాద్ నహీ హో గాలిబ్, కెహ్తే హై జమానే మే కోయీ మీర్ భీ థా…” అన్నాడట మిర్జాగాలిబ్. (అంటే, ఉర్దూ కవిత్వంలో నువ్వొక్కడివే పండితుడివి కాదు, మీర్ అనే నిన్ను మించిన నేర్పరి కూడా గతంలో ఉండేవాడంటారు” అని అర్థం) మీర్ గొప్పతనం అంతటిదన్నమాట. ఎంతవరకూ నిజమో తెలీదు కానీ మీర్ తండ్రి ఒక ‘సూఫీ యోగి’ అనీ, అందువల్ల అతని కవిత్వంలో సూఫీ తత్వం, సిధ్ధాంతాలూ కనబడతాయి అని కొందరంటారు.

 

కవి ‘Mir’ ఇతర కవితలు కొన్నింటిని ఇక్కడ చూడవచ్చు:
http://www.kavitakosh.org/kk/%E0%A4%AE%E0%A5%80%E0%A4%B0_%E0%A4%A4%E0%A4%95%E0%A4%BC%E0%A5%80_%27%E0%A4%AE%E0%A5%80%E0%A4%B0%27#.UmjK71PN2St

 

‘Mir’ తాలూకూ చిన్న చిన్న జీవితవిశేషాలను ఇక్కడ చదవవచ్చు:
http://universalpoetries.wordpress.com/2012/04/04/the-chronicles-of-mir-taqi-mir/

 

ఇక “బాజార్” చిత్రకథ లోకి వస్తే, నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లలను పెళ్ళి పేరుతో గల్ఫ్ దేశాల్లో ఉండే భారతీయులకు అమ్మివేసే వ్యాపారం గురించి తెల్పే కథ ఇది. తన స్వార్థం కోసం ఒక స్త్రీ, ఓ నిరుపేద కుటుంబంలోని అమ్మాయిని ఓ గల్ఫ్ దేశస్థుడితో పెళ్ళికి కుదురుస్తుంది. డబ్బు కోసం కూతురి ప్రేమను కాలరాసి, ఆ కుటుంబం వారు బలవంతంగా ఆ ఆమ్మాయిని ఆమెను కొనుక్కున్న ముసలాడికిచ్చి పెళ్ళి చేసేస్తారు. అందువల్ల ఇద్దరు అమాయక ప్రేమికులు విడిపోతారు. విషాదాంతమైన ఈ కథను చూస్తున్నంత సేపు బాహ్యప్రపంచాన్ని మర్చిపోతాం మనం. పాటలు బావుంటాయని సరదాపడి సీడీ కొనుక్కుని, చూసిన తర్వాత రెండురోజులపటు బాధపడ్డాను ఎందుకు చూసానీ చిత్రాన్నని! కథలోని సర్జూ, షబ్నం పాత్రల్లో ఫారూఖ్ షేక్, సుప్రియా పాఠక్; సలీం, నజ్మా పాత్రల్లో నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్ జీవించారు అనడమే సబబు.

‘బాజార్’లో “కరోగే యాద్ తో హర్ బాత్ యాద్ ఆయేగీ”, “ఫిర్ ఛిడీ రాత్ బాత్ ఫూలోం కీ… “, “దిఖాయీ దియే యూ” మూడు పాటలూ చాలా బాగుంటాయి. ముఖ్యంగా “ఖయ్యామ్” అందించిన సంగీతం ఈ పాటలకు ప్రాణం అని చెప్పాలి. ఎక్కువగా సాహిత్యపు విలువలున్న పాటలకు సంగీతం అందించేవారుట ఖయ్యామ్. అందువల్ల ఆయన స్వరపరిచిన పాటల్లో సంగీతంతో పాటూ సాహిత్యానికి కూడా పెద్ద పీట కనబడుతుంది. “దిఖాయీ దియే యూ” కు ఊపిరి లతా గాత్రం. ఎన్నిసార్లు విన్నా తనివితీరనంత మధురంగా పాడింది లతా మంగేష్కర్ ఈ పాటను. ఓ రాత్రిపూట డాబా మీద జరిగే బంధుమిత్ర సమావేశంలో చిత్ర కథానాయిక అక్కడే ఉన్న తన ప్రియుడిని ఉద్దేశిస్తూ ఈ పాట పాడుతుంది. కథలో సలీం ప్రేమించే నజ్మా కూడా అక్కడే ఉండటం వల్ల వాళ్ళీద్దరినీ కూడా మధ్య మధ్య చూపిస్తూ ఉంటారు. పాట అర్థాన్ని సలీం దృష్టితో కూడా మనం చూడచ్చు.

“బాజార్” చిత్రకథకు అనుగుణంగా మీర్ సాహిత్యాన్ని వాడుకున్నారు గానీ “దిఖాయీ దియే యూ” లో అంతర్లీనంగా సూఫీతత్వం కనబడుతుంది. పరమాత్మ పట్ల తనకు గల అమితమైన ప్రేమను తెలుపుతూ, ఆ ప్రేమపారవశ్యంలో తాను తన ఉనికిని కూడా కోల్పోయానని; భగవంతుడి ప్రేమను తిరిగి తన నివేదనగా సమర్పించేసాననీ, ఇక ఆ పరమాత్మలో ఐక్యం అవ్వాలన్నదే తన చిరకాల వాంఛ అనే అర్థం ఈ గజల్ లో అంతర్లీనంగా దాగి ఉంది. అందువల్ల వాక్యార్థం పొసగదని ఈసారి కూడా పాటను చిత్రకథకు అన్వయిస్తూ చాలావరకూ స్వేచ్ఛానువాదమే చేసాను. ఇక పాట అర్థాన్ని చూద్దామా…

 

“దిఖాయీ దియే యూ”.. స్వేచ్ఛానువాదం:

दिखाई दियॆ य़ू कॆ बॆखुद किया
हमॆं आप सॆ भी जुदा कर चलॆ

నీ ప్రేమ పారవశ్యంలో ఎంతగా వివశురాలినయ్యానంటే
నేను నానుండి కూడా దూరమైపోయాను

భావం: ప్రియతమా, నీ ప్రేమ నన్ను ఏ స్థితికి చేర్చినట్లు కనిపిస్తోందంటే, ఆ ప్రేమ తన్మయత్వంలో నన్ను నేనే మరచిపోయాను. నేనే నువ్వైపోయిన ఈ తాదాత్మ్యత వల్ల నా నుండి నేను విడిపడి నువ్వైపోయాను. నేనంటూ ఏమీ మిగలలేదు.

जबि सजदा करतॆ ही करतॆ गई
हक़-ए-बंदगी हम अदा कर चलॆ

నీకై ప్రణమిల్లిన శిరస్సు అలా ప్రణమిల్లుతూనే ఉంది
నా స్వామ్యపు ఆరాధనను నేను అర్పించాను

భావం: ఓ భక్తురాలుగా నిన్ను పూజించడం మొదలుపెట్టాకా నీకై వంచిన నా శిరస్సు ఇక అలా ప్రణమిల్లుతూనే ఉంది. నీ పట్ల నా ఆరాధనను నా హక్కుగా నీకు అర్పించివేసాను.. అంటే – నువ్వు ఏ ప్రేమనైతే నాకు ఇచ్చావో అది నా హక్కుగా మారింది. ఆ హక్కుతోనే మళ్ళీ అదే ప్రేమను ఆరాధనాపూర్వకంగా నీకు నివేదన చేసాను.

परश्तिश किया तक कॆ ऎ बुत तुझॆ
नजर मॆं सबॊं की खुदा कर चलॆ

ఓ మూర్తిలా ఆరాధించాను నిన్ను
అందరి దృష్టిలో భగవంతుడిలా నిలిపాను

భావం: అమితమైన ప్రేమ పారవశ్యం వల్ల నిన్నొక మూర్తిలా(విగ్రహరూపంలో) నేను ఆరాధించాను. అందువల్ల నువ్వు ఇతరుల దృష్టిలో నాపాలిట దైవానివైయ్యావు.

बहुत आरजू थी गली की तेरी
सॊ यास-ए-लहूं मॆं नहा कर चलॆ

నీకు దగ్గరవ్వాలని ఎంతో ఆరాటపడ్డాను
నిస్పృహల రుధిరధారల్లో సైతం స్నానమాడాను

భావం: ఈ చరణంలో “గలీ కీ తెరీ” అంటే ‘నీ ఇంటి సందు’ అని కాదు ‘నీకు దగ్గరవ్వాలని’ అర్థం. అలానే చివరి వాక్యానికి ‘నిస్పృహ తాలూకూ రక్తధారల్లో స్నానమాడాను’ అన్నది అనే అక్షరార్థమైనా, ఆమె అసలు ఉద్దేశం ఏమిటంటే.. ‘నీకు దగ్గరవ్వాలనీ, నీలో కలసిపోవాలనీ చాలా ఉబలాటపడ్డాను కానీ ఆ ఆరాటం తీరక, నిరాశానిస్పృహల్లో మునిగిపోయాను’ అని. ఆమె నిరాశ తాలూకూ తీవ్రతను తెలపటానికి కవి అలాంటి పదాలను వాడి ఉంటారు.

ఈ మధురమైన పాటను ఇక్కడ చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=Xdzi5PSTs6I

Photo Credit: http://no1urdupoets.wordpress.com/2011/07/24/mir-taqi-mir/