కవిత్వం

గది లోపల..

22-నవంబర్-2013

గాయపడి నెత్తురు స్రవిస్తున్న ఆ పావురాన్ని
చేతుల్లోకి తీసుకుని తలపై నిమురుతున్నాను

రాతికాలంనాటి గరుకైన స్పర్శ
దుఃఖపు కండ్ల స్పర్శ

పావురం బెదిరిపోతుంది

రెక్కలను దగ్గరకు ముడుచుకుని
తలని నా చేతుల్నుంచి విదిలించుకుంటుంది

ఎలాగో గాయపడి
ఈ నా చేతిల్లోకి చేరి
దీనంగా నన్నే చూస్తున్న పావురాన్ని నమ్మించటం ఎలా ?

వొక అంతః సంఘర్షణ నాలో..

నాలుగు రోజులుగా
ఎటూ కదలకుండా
నన్ను శోధించుకోవడమనే పనిలో నిమగ్నమై
మౌనంగా రాసుకుంటున్నాను
నా గది లోపల..

ఎక్కడో- ఏ మూల నుంచో
గతపు గాయాల సలపరింత
తిరగబెడుతూ.. వీస్తో…

రాయడం మాత్రం ఆపట్లేదు

అక్షరాలు పదాలుగా
పదాలు వాక్యాలుగా అల్లుకుంటూ అల్లుకుంటూ..

అలవాటుగా వెనక్కి తిరిగి చూసుకుంటే -
అన్నీ కలగాపులగంగానే..

మచ్చికైన కాసిన్ని ఈ అక్షరాలూ
పంజరంలో పక్షుల్లా విలవిలలాడుతూ..

2

పద్యానికీ సంకెళ్లా ?

పద్యం
పావురం
రెండూ ఉండాల్సింది
బయటే గానీ
లోపల కాదు

ఖచ్చితంగా చెప్పగలను
ఆ పావురం పంజరంలోనే గాయపడింది

తోటి జీవి సామీప్యతనూ
పంజరంగా తలచిన
ఆ పావురం – నన్ను ఓడించింది

3

నేనుండాల్సింది
లోపల కాదు
నన్ను శోధించుకోవాల్సిందీ
గది లోపలా కాదు

4

నా కళ్ల ఊహాక్షేత్రంలో
నిన్నటి నాలుగు గోడల పద్యం
పావురంగా ఎగరటాన్ని యిప్పుడు చూస్తున్నా..