నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన శ్రీ వి.శాంతారామ్ ఎక్కువగా దర్శకుడిగానే మనకు తెలుసు. మన దేశంలో చెప్పుకోదగ్గ ఉత్తమ దర్శకుల్లో ఒకరు శాంతారామ్. ‘నవ్ రంగ్’, ‘దో ఆంఖే బారహ్ హాత్’, ‘డా.కోట్నిస్ కీ అమర్ కహానీ’, ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ మొదలైన ప్రయోగాత్మకమైన, కళాత్మకమైన చిత్రాలను తీసారు. శాంతారామ్ చిత్రాలు కళాత్మకంగానే కాక సందేశాత్మకంగా, సంగీతభరితంగా కూడా ఉంటాయి. తన చిత్రాల్లోని పాటలను ప్రత్యేకం సంగీతదర్శకుడి దగ్గర ఉండీ లేదా ఒకోసారి తానే స్వయంగా బాణీ కట్టి చేయించుకునేవారుట శాంతారామ్. సంగీతం పట్ల ప్రేమతో, అంత అపురూపంగా బాణీలు కట్టించుకునేవారు కాబట్టే వారి చిత్రాల్లోని పాటలు ఇప్పటికీ ప్రజాభిమానాన్ని పొందుతూ ఉంటాయి. శాంతారామ్ రూపొందించిన ఓ సందేశాత్మక చిత్రమే “బూంద్ జో బన్ గయీ మోతీ”! అందులోనిదే గీతకర్త ‘భరత్ వ్యాస్‘ రచించిన “ये कौन चित्रकार है.. ” అనే అందమైన పాట.
రాసి తక్కువైనా, వాటి ఖ్యాతి మాత్రం ఎక్కువే. అటువంటి ప్రఖ్యాత సినీగీతాలను రాసిన రచయిత భరత్ వ్యాస్. ఏభైల్లో, అరవైల్లో హిందీ చిత్రాలకు గీతరచన చేసారు. ‘దో ఆంఖే బారహ్ హాత్’ చిత్రంలో అన్ని పాటల్లోనూ ఎంతో అద్భుతమైన ‘ऎ मालिक तेरॆ बिंदॆ हम’ పాటను రాసినది ఈయనే. “నవరంగ్” లో ‘आधा है चंद्रमा रात आधी’, ‘जा रॆ नट्खट ‘ పాటలను, ఇంకా ‘ज्यॊत सॆ ज्यॊत जलातॆ चलॊ.. प्रॆम की गम्गा बहातॆ चलॊ’, ‘तॆरॆ सुर और मॆरॆ गीत’, ‘तुम गगन की चंद्रमा ‘, ‘आ लौट कॆ आजा मॆरॆ मीत’ మొదలైన చిరస్మరణీయమైన గీతాలకు రచన చేసారు భరత్ వ్యాస్.
ఇక “బూంద్ జో బన్ గయీ మోతీ” చిత్రకథలోకి వస్తే, ఇది ఒక ఆదర్శవంతుడైన స్కుల్ టీచర్ సత్యప్రకాష్ కథ. ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా అతడు వెళ్ళిన మారుమూల గ్రామంలో, తాను నమ్మిన సిధ్ధాంతాలు, విద్యావిధానాలు అమలు జరపడం వల్ల, అవి నచ్చని కొందరు గ్రామస్తుల వల్ల అతను కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడు. ఆ ఇక్కట్ల నుండి అతను ఎలా బయట పడతాడన్నది మిగిలిన చిత్రకథ. శాంతినికేతన్ లో లాగ పచ్చని ప్రకృతి ఒడిలో పిల్లలకు చదువు చెప్పాలనుకుంటాడు సత్యప్రకాష్. ఆ తరహా విద్యావిధానాన్ని అమలుజరిపే సందర్భంలో “యే కౌన్ చిత్రకార్ హై..” పాట వస్తుంది. ఇది చాలా చక్కని సరళమైన గీతం. పచ్చని చెట్లను, కొండలోయలను, అందమైన పూలనూ తయారుచేసిన కళాకారుడెవరు? ఇంత అందమైన ప్రకృతిని పుడమిపై చిత్రీకరించిన ఆ చిత్రకారుడెవరు? అంటూ కవి ప్రశ్నిస్తాడు. సృష్టికారకుడైన ఆ అంతర్యామిని మెచ్చుకుంటూ, ప్రకృతిలోని అందాలను వర్ణిస్తూ సాగే ఈ పాట ప్రకృతిని ఆరాధించేవారందరికీ ఎంతో నచ్చుతుంది.
ఈ చిత్రానికి సతీష్ భాటియా సంగీతాన్ని అందించగా ప్రముఖ గాయకుడు ముఖేష్ ఈ గీతాన్ని ఆలపించారు. ముఖేష్ అరుదుగా పాడిన ఉత్సాహభరితమైన గీతాల్లో ఇదీ ఒకటి. ఇక ఈ పాట వాక్యార్థం చూద్దామా..
‘ये कौन चित्रकार है..‘ వాక్యర్థం:
ప: हरी हरी वसुंधरा पॆ नीला नीला ये गगन
के जिसपे बादलों की पालकी उड़ा रहा पवन
दिशाएं देखो रंग भरी..
दिशाएं देखो रंग भरी चमक रहीं उमंग भरी
ये किसने फूल फूल पॆ(౨) किया सिंगार है
ये कौन चित्रकार है? ये कौन चित्रकार?
హరితవర్ణ భూమి.. దానిపై ఈ నీలాకాశం..
ఆ నీలాకాశంపై మబ్బుల పల్లకీని ఊరేగిస్తున్న పవనం..
వర్ణాలతో నిండిన నలుదిశలనూ తళుకులీనే ఉత్సాహంతో నింపి,
ప్రతి పువ్వునీ అందంగా అలంకరించిన
ఈ చిత్రకారుడెవరు? ఈ కళాకారుడెవరు?
చ: तपस्वियों सी हैं अटल ये पर्वतॊं की चोटियाँ
ये सर्प सी घुमॆरदार घेरदार घाटियाँ
ध्वजा से ये खड़े हुए..
ध्वजा से ये खड़े हुए हैं वृक्ष देवदार के
गलीचे ये गुलाब के.. बगीचे ये बहार के
ये किस कवि की कल्पना..
ये किस कवि की कल्पना का चमत्कार है
ये कौन चित्रकार है.. ये कौन चित्रकार
నిశ్చల తాపసుల్లాగ ఉన్న ఈ వర్వతశిఖరాలు
సర్పంలా మెలికలు తిరిగి నలువైపులా వ్యాపించిన కొండలోయలు
పతాకధ్వజాల్లా నిటారుగా నిలబడి ఉన్న ఈ దేవదారు వృక్షాలు
ఈ గులాబీల తివాచీలు.. ఆమని తోటలు..
ఇవన్నీ ఏ కవి కల్పనలు? ఏ కవి సృష్టించిన అద్భుతాలు?
ఈ చిత్రకారుడెవరు? ఈ కళాకారుడెవరు?
చ: कुदरत की इस पवित्रता को तुम निहार लो
इसके गुणों को अपने मन में तुम उतार लो
चमका लॊ आज लालिमा…
चमका लॊ आज लालिमा अपने ललाट की
कण कण से झांकती तुम्हॆ छवी विराट की
अपनी तो आँख एक है, उसकी हज़ार है
ये कौन चित्रकार है.. ये कौन चित्रकार
పవిత్రమైన ఈ ప్రకృతిని నీవూ తిలకించు
ఈ ప్రకృతితత్వాన్ని నీవూ మనసునిండా నింపుకో
నీ భవితవ్యాన్ని ఇవాళ ప్రకాశింపచేసుకో
అణువణువులోంచీ అంతర్యామి నిన్ను వీక్షిస్తూనే ఉంటాడు
మనకున్న చూపు ఒకటే, ఆయనకు సహస్ర వీక్షణాలు..
ఈ చిత్రకారుడెవరు? ఈ కళాకారుడెవరు?
ఈ అందమైన పాటను ఇక్కడ చూడవచ్చు: http://www.youtube.com/watch?v=K9b63nSt9jY
ఈ పాట విన్నాను కానీ,ఎప్పుడూ చరణాలు అంత సరిగ్గా వినలేదు..పాట సాహిత్యం చాల బాగుందండీ..చక్కగా అనువదించారు.థాంక్ యు
@Nagini : థాంక్స్ నాగిని గారూ
మీరు ఉదహరించిన వాటిలో ఎక్కువగా పాడుకున్నవి, విన్నవీ వున్నా అప్పట్లో గీతరచయితపై అవగాహనలేదు మరిచిపోయిన కొన్ని గీతలను స్పురణకు తెచ్చారు
అభినందనలు
@జాన్ హైడ్ కనుమూరి: ధన్యవాదాలు జాన్ హైడ్ గారూ.