కథ

నైజం

జనవరి 2014

ఉదయం ఇంకా చీకట్లు విడిపోలేదు, బస్సు సర్ర్ మంటూ శబ్దం చేస్తూ ఆగింది. ఒక కుఱాడు బస్సు దిగి బ్యాగు భుజాన వేసుకు మొయ్యలేకో, మొహంలో నిరుత్సాహం తో , దిగులుగా నడక సాగించాడు. రెండు మైళ్ళు దూరంగా పల్లెటూరు .

“ఏరా ! శ్రీనుగా ! కాలేజికి ఇప్పుడేమి శెలవలు రా ఇప్పుడు బస్సు దిగావు ”
నవ్వుతూ పలకరించాడు శేషారావు మాస్టారు’

” నమస్తే మాష్టారు ! సెలవులేమి కాదు సార్ ! ఒకసారి నాన్న ను చూడాలనిపించింది. అందుకే… ”

“సర్లే రా ! బండెక్కు ! నేను ఊళ్ళోకే వెళ్తన్నా ” అంటూ టి.వి.యస్ ని స్టార్ట్ చేశాడు శేషారావు మాస్టారు’

“ఎలా ఉందిరా ! చదువు ! మీనాన్న ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాడు,ఒక్క కొడుకువి !ఎలా అయినా నువ్వు ఆ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఒక ఉద్యోగం సంపాదించుకున్నావంటే మీనాన్న సంతోష పడతాడు ! ” చెప్పుకుంటూ బండి నడుపుతున్నాడు శేషారావు మాష్టర్.

శ్రీను కి ఇవేమి తలకెక్కటం లేదు, ఎక్కడో అలోచిస్తున్నట్లున్నాడు….

ఊరొచ్చిందీ, ఇంటి ముందు బండి ఆగింది కూడా గమనించలేదు.

” ఓ వెంకయ్య మామ ! నీ కొడుకొచ్చాడు !” రోడ్డు మీద నుండే అరిచి చెప్పాడు శేషారావు మాష్టారు.
ఉలిక్కి పడ్డ శ్రీను బండి దిగకముందే, బయటకి వచ్చి బాగు అందుకున్నాడు వెంకయ్య.

“థాంక్స్ మాష్టారు” అని చెప్పేలోపే బండి కదిలి వెళ్ళిపోయింది.

“ఏమేవ్ ! అబ్బాయొచ్చాడే ” అని భార్య తో చెప్తూనే కొడుకొని లోపలికి తీసుకువెళ్లాడు వెంకయ్య.

“ఏందిరా ! ఇయ్యాళొచ్చావు, ఫోన్ కూడా చెయ్యకుండా ! ఇప్పడేమి శెలవులురా !”

అడుగుతున్న అమ్మతో ఏం చెప్పాలో తెలియ లేదు శీనుకి, ఇంట్లో పరిస్థితి తెలియనిది కాదు కదా ! పేరుకు పదిహేను ఎకరాల పొలం, పుస్తకాలుకొనటమే గగనం అయిపోయింది, ఇప్పటికిప్పుడు పీజు సంగతి ఎలా చెప్పాలో తెలియటం లేదు, ఫీజు కట్టకపోతే పరిక్షరాయనివ్వరు, ఈ ఒక్క సంవత్సరం ఎలాగోలా కడితే ఇంజనీరింగ్ అయిపోతుంది కాని చెప్పక తప్పదు, మరో నాలుగు రోజులే టైమ్ ఉంది.

“అది ! అమ్మా ! ఫీజు …. “. పక్కన యూరియాని కలిపి బస్తాలొకెత్తుతున్న వెంకయ్యకు వినవడింది, గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది. గొంతు పెగల్చుకొని అడిగాడు

” ఎంత కట్టాలిరా ”

“యాభై వేలు నాన్న ”

“యాభై వేలా !!! సర్లే ఎట్టాగో సర్దుబాటు చేత్తాలే నువ్వు టిఫిన్ తిని పడుకో ” బయటకు నడిచాడు వెంకయ్య.

చేతిలో రూపాయి లేదు, యాభైవేలు యాడ్నించి తేవాలో అర్దం కావటం లేదు వెంకయ్యకి. ఊర్లో ఎవుడి దగ్గర రూపాయి అప్పుపుట్టేలా లేదు, అందరూ తనలాంటి రైతులే. పొలాల్లో, కళ్ళాల్లో తప్ప, చేతిలో చిల్లిగవ్వలేనోళ్ళు.

అకస్మాత్తుగా మార్కండేయ శర్మ గుర్తొచ్చాడు ఊరి పూజారి కొడుకు, తనతో పాటే చదువుకున్నాడు,.పాలేరు కొడుకు యాదయ్య, తను, మార్కండేయ శర్మ ముగ్గురిని ఒకే సారి టెంత్ పాసయ్యారు. ముగ్గురిని తన అయ్యే చదివింఛాడు. పొలం ఉండగా మనకు చదువెందుకురా భూమాతే మనల్ని చల్లగా చూసేది అని తనను చదువు మానిపించినా,
శర్మ పై చదువుకెళ్తానంటే కాదనకుండా డబ్బులిచ్చాడు, ఇప్పుడు యమ్.అర్.ఒ గా పట్నం లో పని చేస్తన్నాడు, యాదయ్య, ఊర్లో బ్యాంక్ లోనే అటెండర్ గా పని చేస్తన్నాడు. శర్మ యమ్.అర్.ఒ అయ్యాడంటే అదంతే అయ్య చలవే అని చచ్చిపోయిన పూజారి ఎప్పుడంటూ ఉండేవాడు, ఇప్పుడు నాకు సహాయం చెయ్యకపోతాడా అనుకుంటుంటూనే కొద్దిగా గుండె ధైర్యం వచ్చింది వెంకయ్యకి.

బస్సు దిగి యమ్.అర్.ఒ అఫీసు దగ్గరకు నడుచుకుంటూ పోయాడు, చాన రోజులయ్యింది ఈ పక్కకొచ్చి. ఒక ఏడాది కితం పాస్ బుక్కులో చచ్చిపోయిన అయ్య పేరు బదులు తనపేరు రాయించుకోడానికి వచ్చాడు ! శర్మ పది పది నిమిషాల్లో చక చక పని చేసి ఇచ్చాడు, ఇప్పటివరకు ఎప్పుడూ ఎవరిని ఏమడిగిన పాపాన పోలేదు, ఇయ్యాళ శర్మ ఒక యాభైవేలు అప్పుగా ఇస్తే చాలు. అనుకుంటూఆఫీసులోకి అడుగుపెట్టాడు, ఉప్పలపాడునుండి వెంకయ్య వచ్చాడు, చెప్పిరా శర్మ గారికి అని బంట్రోతుకి చెప్పాడు.

రెండు నిమిషాలలోనే పిలుపు వచ్చింది లోపలికి

“ఏం ! వెంకయ్యా ! ఎలా ఉన్నావు ! చాలా రోజులయ్యింది చూసి, ఊర్లో అందరూ బాగుండారా ! ” టక టకా అడిగేశాడు శర్మ

” హా ! బాగానే ఉండారు సార్ ! చిన్న పని మీద వచ్చాను ”

” చెప్పు వెంకయ్యా ! ఏమి కావాలా ! పాసు పుస్తకాల పనా ! పహాణిలలో ఏమన్నా మార్చాలనా ”

“అది కాదు సారూ ! మా పిల్లోడు శీను ఇంజనీరింగ్ చదువుతున్నాడు, చివరేడు కి వచ్చాడు, పీజు కట్టాల, మీరొక యాభైవేలు అప్పు ఇస్తే, పంటరాగానే ఇచ్చేస్తాను”

శర్మ ఏమీ తొణక్కుండా కుర్చీలో వెనక్కి జారగిల బడి నవ్వాడు.

” వెంకయ్యా ! నా దగ్గరెక్కడున్నాయి, అప్పుడు మీ నాన్న ఏదో నాకు చదువుకు సహాయం చేశాడని, ఇప్పుడు బదులు తీర్చాలన్నట్టు వొచ్చి ఇట్టా అడిగితే ఏం జేసేది? ఏదో పాస్ పుస్తకాలో, పహాణిలో అయితే ఏమన్నా చేస్తా కాని, ఇలాంటి డబ్బుల సహాయం నన్ను అడగమాకు ! అయినా మీ అయ్య నేనేమన్నా పంటపొలం అనుకున్నారా ! అప్పుడు పెట్టుబడి పెట్టి ఇప్పుడు డబ్బులడగటానికి ! అలాంటివేమి నా వల్ల గాదు కానీ ఇంకేదన్నా పనుంటే చెప్పు చేసి పెడతా ”

సౌమ్యంగా అయినా నిక్కచ్చిగా చెప్పాడు. ఒక్కసారిగా కుంగిపోయినట్లనిపించిది వెంకయ్యకు. ఏ మాత్రం ఊహించని ఎదురు దెబ్బ. డబ్బులివ్వకపోవటం ఒక్కటే కాదు, ఎంత అవమానకరంగా మాట్లాడాడు. అయినా పంటపోలానికి మనిషికి పోలికేంటి? అది ఏమి ఆశించకుండానే ఇవ్వగలిగినంత ఇస్తుంది. మనిషి అట్టాకాదు. ఎంత ఇచ్చినా స్వార్దం పోదు. ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది.ఇప్పుడేమి చెయ్యాలిరా భగవంతుడా!

ఏమి పాలు పోవటం లేదు, పొలం అమ్ముదామన్న కొనే వాళ్ళు కూడా లేరు. భారంగా అడుగులు వేసుకుంటూ ఊరి వైపు కదిలాడు వెంకయ్య.

ఇంటికి చేరి నిస్సత్తువ తో కూలబడ్డ భర్త ను చూడగానే అంజమ్మ కు ఏమి జరిగిందో అర్దం కాలేదు. చల్లటి నీళ్ళిచ్చి పక్కన కూర్చుంది

” ఏందయ్యా ! ఏమైంది ! ”

పై కండువా తీసి పక్కన పెడుతూ ” ఏముందే ! లేవన్నాడు ! ఇయ్యనన్నాడు ! పొమ్మన్నాడు ”

అయినా మనకు ఇంజనీర్ చదువులెందుకే ! మట్టి పిసుక్కోనేవాళ్లం ” దుఃఖం పొంగుకొచ్చినట్లుంది, గొంతులో మాట రాలేదు
“అట్టంటే ఎట్టయ్యా ! ఎట్టాగైనా వాడిని ఇంజనీర్ ని చెయ్యాలి’ అవసరమైతే పొలమో, బంగారమో ఏదో ఒకటి అమ్మైనా వాడిని ఇంజనీర్ ని చేద్దామయ్యా”

” హా ! పొలం ఎవడు కొంటన్నాడే, అందరూ అమ్మే వాళ్ళే…. బంగారం , ఏముందే తాళి బొట్టు తప్ప అన్ని తాకట్టులోనే ఉండయి కదే ”

” పోనిలెయ్యా ! ఇదైనా మిగిలింది , ఈడి చదువు కోసమేనేమో ! ఇది బాంకి లో పెట్టి డబ్బులు తేయ్యా ”

” వాడికి తెలిస్తే బాధపడతాడేమోనే”

” వాడికి తెలియకుండా నేను చూత్తాలే ! నువ్వు రేపు బాంకి కి పోయి పని చూడయ్యా ”

ఉదయాన్నే దేవుడి ఫోటో ముందు దండం పెట్టుకొని పసుపుతాడు మెడలో వేసుకొని, తాళి బొట్టు తీసి వెంకయ్య చేతిలో పెట్టింది, వెంకయ్య కంట్లో కన్నీటి బొట్టు అంజమ్మ కళ్ళలో కంట పడింది, తమాయించుకుంది

బ్యాంక్ గేటు దగ్గరే కనపడ్డాడు యాదయ్య, నవ్వుతూ పలకరించాడు

“ఏంది వెంకన్నా ! ఇట్టావచ్చా ! పిల్లగాడింటికి వచ్చాడంటగా ! ఎట్ట చదువుతున్నాడు ”

“ఆ ! బాగానే చదువుతున్నాడు యాదయ్యా ! వాడి ఫీజు కట్టాలి ! అంజమ్మ సూత్రాలు తీసుకొచ్చాను ! బాంకి లో పెట్టుకొని అప్పుఇస్తే వాడి ఫీజు కడతా ! ఈ సంవత్సరం ఎట్టాగో ఓపిక పడితే వాడి చదువు అయిపోతుంది, తర్వాత వాడి బతుకు వాడు బతుకుతాడు”

” సర్లే రా ఫీల్డ్ ఆఫీసర్ తో మాట్లాడుదాం ”

లోపలికి తీసుకుపోయి వెంకయ్యని కూర్చోపెట్టాడు యాదయ్య. దూరంగా ఫీల్ద్ ఆఫీసర్ తో ఏదో మాట్లాడుతున్నాడు, ఒక అరగంట గడిచింది, గోల్ద్ అప్రైజర్ కూడా వచ్చాడు, బంగారం తూకమేసి , నాణ్యత చూస్తున్నాడు.మరో అరగంట గడిచింది, ఫీల్డ్ అఫీసర్ రిజిష్టర్లు చూస్తూ యాదయ్యతో ఏదో చెప్తున్నాడు. యాదయ్య ముఖం కూడా చిన్నబోయింది, వెంకయ్య మనసెందుకో కీడి శంకిస్తుంది, యాదయ్య తనవైపే నడుచుకుంటూ రావటం చూశాడు,

“వెంకన్నా ! నువ్వు పోయినేడాది తీసుకున్న లోను తీర్చలేదు, ఇప్పుడు ఈ సూత్రాలు పెడితే వచ్చే డబ్బులు ఆ లోని జమ చేసుకుంటానంటున్నాడు ఫీల్డ్ ఆఫీసర్” మెల్లగా చెప్పాడు. ఒక్కసారి షాక్ కొట్టినట్లయింది వెంకయ్యకి, ఏమి చెయ్యాలో అర్దం కాలేదు.

ఒక్కొక్కమాట కూడబలుక్కుంటూ “యాదయ్యా ! ఈ ఏడు పంట చేతికి రాగనే తీర్చేస్తాను, ఎట్టాగో ఆ డబ్బులిప్పిచ్చు ! ఈ ఒక్కఏడాది ఆడి ఫీజు కడితే చాలు” మాట్లాడుతూనే కూలబడ్డాడు

“ఏంది వెంకన్నా ! ఇది ! ఇట్టైపోతావేంది ! ఇదిగో నీళ్ళు తాగు ” అంటూ గ్లాసు ఇచ్చాడు,

“నువ్వేం బెంగపెట్టుకోమాక ! నీకు అభ్యంతరం లేదంటే ఈ సూత్రాలు మా అవిడవని చెప్పి నా పేరు మీద లోన్ తీసుకొని నీకిస్తా! నువ్వు నిమ్మళంగా కట్టుకుందువు” అంటూ వెంకయ్య చేతిని ఆప్యాయంగా నిమురుతూ చెప్పాడు యాదయ్య..
ఎందుకోవెంకయ్యకు చచ్చిపోయిన పూజారి పూజచేసే దేవుడు గుర్తుకు వచ్చాడు

అప్రయత్నంగా చేతులు జోడించడం తప్ప మనసులోని కృతజ్ఞతను వ్యక్త పరిచే శక్తి కూడా లేక పోయింది.

ఎదుటి మనిషి కష్టంలో ఉన్నపుడేగా మనిషి నైజం బయట పడేది?

ఎవరీ యాదయ్య? అతనికీ తనకూ ఏమిటి సంబంధం?

శర్మ ఎంత తేలిగ్గా లేదన్న దాన్ని యాదయ్య ఎంత సులువుగా తలకెత్తుకున్నాడు!

“యాద..” ఏదో చెప్పబోయాడు.

“పద పద, నే మాట్టాడతా పద” అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లాక్కు పోయాడు చిరిగిన కండువాతో చెమట తుడుచుకుంటూ యాదయ్య.

*** * ***22 Responses to నైజం

  1. January 1, 2014 at 4:04 am

    సింపుల్ అండ్ క్రిస్ప్.చాలా బాగుంది.

    • mohan.ravipati
      January 3, 2014 at 8:27 pm

      థాంక్స్ అండి

  2. bhavani
    January 1, 2014 at 9:17 am

    ఒక మనిషి అసలైన నైజం ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడే బయట పడుతుంది అనే విషయాన్ని చక్కగా చెప్పారు. చాలా బాగుంది

    • mohan.ravipati
      January 3, 2014 at 8:28 pm

      నిజమే కదండి, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సింది మరో మనిషే , థాంక్స్ భవాని గారు

  3. sunita gedela
    January 1, 2014 at 10:59 am

    మానవత్వం ఇంకా మిగిలే వుంది అని చాల చక్కగా చెప్పారు. పిల్లలు చదువుకోవడం కోసం ఈరోజులలో కూడా
    పుస్తెలు తాకట్టు పెట్టె త్యాగం అనేది పేద రైతు కుటుంబాలలో ఒక ఆచారం , సంప్రదాయం గ మిగిలిపోయిందని జరుగుతున్న
    దృష్టాంతాలను ఈ కధ చక్కగా చెప్పింది.

    • mohan.ravipati
      January 3, 2014 at 8:30 pm

      మనిషి ఉన్నంత కాలం మానవత్వం మిగిలే ఉంటుందండి. ఫీజు కట్టటం అనేది రైతులకు సామాన్యమైన విషయం కానే కాదు , చాలా కష్టపడే కట్టాలి, థాంక్యూ వెరీ మచ్

  4. sunita gedela
    January 1, 2014 at 5:28 pm

    మానవత్వం ఇంకా మిగిలే వుంది అని చాల చక్కగా చెప్పారు. పిల్లలు చదువుకోవడం కోసం ఈరోజులలో కూడా
    పుస్తెలు తాకట్టు పెట్టె త్యాగం అనేది పేద రైతు కుటుంబాలలో ఒక ఆచారం , సంప్రదాయం గ మిగిలిపోయిందని జరుగుతున్న
    దృష్టాంతాలను ఈ కధ చక్కగా చెప్పింది.

  5. January 1, 2014 at 10:43 pm

    కథ బావుంది . అభినందనలు.

  6. ప్రసాద్ అట్లూరి
    January 2, 2014 at 12:02 pm

    నైస్ మోహన్ గారు .. కథ బాగుంది … నడిపించిన్ విధమూ బాగుంది … అభినందనలు ,
    మీరు మరిన్ని మంచి కధ రాయగలరని ..రాయాలని కోరుతున్నా …

    • mohan.ravipati
      January 3, 2014 at 8:31 pm

      థాంక్యూ వెరీమచ్ ప్రసాద్ గారు. తప్పకుండా ప్రయత్నిస్తాను

  7. lekha
    January 2, 2014 at 9:03 pm

    ఒక మనిషి అసలైన నైజం ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడే బయట పడుతుంది అనే విషయాన్ని చక్కగా చెప్పారు, మానవత్వం ఇంకా మిగిలే వుంది అని చాల చక్కగా చెప్పారు.

    • mohan.ravipati
      January 3, 2014 at 8:32 pm

      థాంక్యూ వెరీమచ్ ,లేఖ గారు

  8. కరణం లుగేంద్ర పిళ్ళై
    January 3, 2014 at 11:50 am

    చాలా బాగుంది. మనుషుల్లో నైజం , రైతుల వెతలు కళ్ళకు కట్టారు. చివరిలో ముగింపు కథకు బలాన్ని ఇచ్చింది

    • mohan.ravipati
      January 3, 2014 at 8:32 pm

      థాంక్యూ లుగేంద్ర పిళ్ళై గారు

  9. Ramakrishna
    January 3, 2014 at 5:18 pm

    ఇంజనీరింగ్ ఫీజు కట్టాలని ముందుగానే తెలుసు కాబట్టి కథలో ఎమోషన్స్ తీసుకురావటం కష్టం. ఏదైన అనుకోని అవసరం వచ్చినట్టు రాస్తే ఇంకా బాగుండేది.

    • mohan.ravipati
      January 3, 2014 at 8:35 pm

      మీరన్నది నిజమే రామకృష్ణ గారు, కాకపోతే చదువు కోసం పడుతున్న కష్టాలు, రైతులు తమ పిల్లలు వ్యవసాయాన్ని వదిలి పెట్టి పి చదువుకోవాలి వ్యవసాయం జోలికి రావద్దు అనుకుంటున్నారు, అని చెప్పాలని, ఈ ప్రయత్నం చేశాను

  10. Laxmi sri
    January 4, 2014 at 11:09 am

    చాలా బాగా చెప్పారు రామకృష్ణ గారు. రైతన్నలు ఎన్ని కష్టాలు పడతారో కళ్ళకు కట్టినట్లు రాసారు.. చాలా బాగుంది.. థాంక్స్ అండి..

    • mohan.ravipati
      January 5, 2014 at 9:15 pm

      థాంక్యూ లక్ష్మీగారు

  11. Sudharani Maradana
    January 6, 2014 at 8:32 am

    చాల బావుంది

    • mohan.ravipati
      January 7, 2014 at 8:07 pm

      థాంక్యూ సుధారాణి గారు

  12. January 29, 2014 at 11:11 pm

    ఇలాటి సందర్భాలలోనే అనిపిస్తుంది..మనుషులంతా ఒకటి కాదని. కథ లో పాత్రల్ని చక్కగా చిత్రిఇకరించారు మోహన్ గారు. మరిన్ని మంచి మంచి కథలు రాయాలని అభిలషిస్తూ.. అభినందనలతో..

  13. R. Karthika Raju
    August 28, 2015 at 11:48 am

    ఇతరుల నైజం బయటపడేది మనం ఆపదల్లో ఉన్నప్పుడే అని బాగా తెలియజేసారు. కథ చాలా బావుంది. అభినందనలు!!

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)