పరిచయం

ఇంకా రాయాల్సింది చాలా ఉంది – సాయిపద్మ

డిసెంబర్ 2013

నా పేరు సాయి పద్మ. పుట్టడం, పెరగడం, చదువుకోవటం, అక్షరాల నుండి సాహిత్యం దాకా పరిచయం అన్నీ విజయనగరం జిల్లా . అమ్మ, నాన్న డాక్టర్లు , చిన్న  వయసునుండే ఇంగ్లిష్ లో మాట్లాడాలని బాగా  ఉండేది మా కజిన్స్ తో వాళ్ళతో. . అయితే చదివేది తెలుగు మీడియం అందువల్ల ఎలాగైనా ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన. నాన్న గారి గది లో ఉన్న ఇంగ్లిష్ పుస్తకాలన్నీ చదివేయాలని , నాన్న గారితో చాలా తెలివిగా మాటాడేయాలి అన్నది  ప్రధమ కోరిక నాలో  చాలా  చిన్న వయసునుండే ఉండింది. ఎందుకంటే అందరి పిల్లల్లా నేను ఆడు కోవడానికి  వీలు  అయ్యేది కాదు. అదీ కాక  ఏదో చదవాలనే తపన నాలో ముందు నుండి ప్రేరేపించింది మా అమ్మమ్మ గారు.

మా అమ్మమ్మ కి చదువుకోవాలనే ఆసక్తి, ఎలాగైనా మెట్రిక్యులేషన్  పూర్తి చేయాలన్న ఆశ ఎన్నడు నెరవేర లేదు. ఆ రోజుల్లో ఆడపిల్ల చదువుకి అంత ప్రాముఖ్యత ఉండేది  కాదు అన్నది మనకి తెలిసిన విషయమే కదా !!

కానీ అమ్మమ్మ చాలా పుస్తకాలూ చదివేది. తను నాతో చెప్పేది “నువ్వందరి లాగా కాదు, నువ్వు ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవాలి అందుకు అక్షరామొక్కటే ఆయుధం…ఆలంబన ..దాన్ని పట్టుకో..అనేది.ఏది సాధించాలన్న ధైర్యం ముఖ్యం, అది ఏ కాలేజీల్లోనూ నేర్పరు, అది నేర్చుకోవాల్సింది కేవలం చదువు ద్వారానే అని చెప్పేది . మనవంతు ప్రపంచానికి ఏమి ఇస్తామనేది చాల ముఖ్యం…అందుకు అక్షరమే నీకు ఆస్కారం అని చెప్పేది.

ఇంట్లో చాల పుస్తకాలూ ఉండేవి ఇదీ అదీ అని లేకుండా అన్ని రకాల పుస్తకాలూ చదివేసేదాన్ని. కొవ్వలి , పానుగంటి , ఇలా ఏమైతే ఉండేవో  అన్నీ. అమ్మమ్మ ఎప్పుడూ .. నువ్వు ఈ పుస్తకం చదవకూడదు అనేది కాదు. అంత చదివేసాక అప్పుడు ఆ పుస్తకం గురించి అనేది చదివావు కదా ఏమి బాగుంది ?  అని అడిగేది. ఏమి బాగులేదు అని.అంటే ఏమి బాగులేదో తెలుసుకోవాలన్నా చదవాల్సిందే కదా!! అది తెలుసుకోగలిగితే చాలు అనేది. నా సిలబస్ అయిపోయాక క్లాసు పుస్తకాల్లో నవలలు,రకరకాల ఇతర పుస్తకాలూ పెట్టి చదివిన రోజులున్నాయి. అలా పుస్తకాలూ వాటి ద్వారా ఎందఱో మేధావుల మస్తిష్కలతో నా బాల్యం సాగింది.

నన్ను బాగా ప్రభావితం చేసిన రచయిత్రి అంటే అయిన్ రాండ్ కాలేజ్ రోజుల్లో బాగా ప్రభావితమైనది , నన్ను ఆలోచింప జేసినది అయిన్ రాండ్ స్త్రీ పాత్రలు నన్ను బాగా  ఆలోచింప జేసేవి. ఇలా అసలు మనం ఆలోచించ గలమా అనుకునేదాన్ని. ఆ  కాలం  లోనే అంత పవర్ఫుల్ గా రాయగలగడం అసలు ఆలోచనకి అంచనాకి అందనంత గా నా మనసుని ఆకట్టుకున్నాయామే స్త్రీ పాత్రలు . మనకున్న సాంస్కృతిక నేపధ్యం మన కున్న కట్టు  బాట్లు మనుషుల్ని ముఖ్యంగా స్త్రీని ఎలా కట్టి పడేసి కట్టు బానిసని చేస్తున్నాయో చూసినప్పుడల్లా నాలో ఏదో తెలియని ఆవేదన.  ఐన్ రాండ్ చదివాకే నాకేమి కావాలో తెలుసుకున్నానిపించింది. నా  ఆవేదనకు ఒక  ఆలోచనా క్రమం ఏర్పడింది.  ఏది నా లక్ష్యం కావాలి ?? ఏమి కావాలి జీవితంలో ఆనందమా  , ధనమా , కీర్తా ఇవి తెలిసాయి .అట్లాస్ ష్రగ్డ్  ఇప్పటికీ నా ఆల్ టైం ఫావొరిట్.ఇవి కాలేజ్ వయసులో చదివినవి అనుకోండి. అల్లాగే వర్చ్యూ అఫ్ సెల్ఫిష్నెస్, వీ ద లివింగ్ ఇలా ఆల్మోస్ట్ దొరికినవన్నీ చదివాను. ఆమె పాత్రలు నను ప్రభావితం చేసాయి బాగా.  అసలు మనకి  ఎలా ఆలోచించాలో నేర్పాయి. ఇక తెలుగు లో కొస్తే మధురవాణి (గురజాడ వారి కన్య శుల్కం లోని ప్రధాన పాత్ర) . ఆమె లో ఉన్నమానవీయత నన్ను బాగా ఆకర్షించింది నా మనసులో నిలిచి పోయింది. ఆమె ముందు మానవీయత కలిగిన మనిషి, తర్వాత ఆమె వేశ్యా లేక మరోటా అన్నది ఏమీ ఆమె ను ప్రేమించడానికి ప్రతిబంధకం కాదు. అలాగే చలం పుస్తకాలలోని కొన్ని స్త్రీ పాత్రలు , అరుణ , లాలస లాంటివి బాగా గుర్తుండి పోయిన  కొన్ని  పాత్రలు. చలం పాత్రల్లోని సహజత్వం పట్ల బాగా ఆకర్షింపబడ్డాను . అందులో ఉన్నది ఇప్పుడు మనం ఒక్క శాతం కూడా మనమిప్పుడు చెపుతున్నామా , చెప్ప గలుగుతున్నామా, అన్నది ఇంకా ప్రశ్నే ఎందుకంటే మనకున్న చాందస స్వభావాలు కట్టు బాట్లు ఇంకా మారాలి .

ఇప్పుడు బాగా రాసే ప్రతీ పుస్తకం, కవిత, కధ చదువుతాను. ఆఖరికి అది సామాన్లు చుట్టే పొట్లం కాగితం అయినా, ఇంకే కాగితం అయినా .

రచన అంటే మొట్ట  మొదట పదవ క్లాస్ లో ఉనప్పుడు ఒక అనువాదం చేశాను. అది లార్డ్ బెడేన్ పావెల్ డి స్కౌట్స్ హిస్టరీ , మా మాస్టారు స్కౌట్స్ గైడ్స్ లో ఉండేవారు మరి ఆ పుస్తకం ప్రింట్ చేసారో లేదో తెలియదు ఆ తర్వాత అది చాలా  రిఫైన్ చేసి ఉంటారేమో  కానీ నా రచన అంటూ చెప్పాలంటే అదే మొదటి ప్రయత్నం. అది ఇంగ్లిష్ లో ఉండింది దాన్ని తెలుగులోకి చేశాను. ఇక స్వంత రచన అంటే ఇరవై ఒకటి రెండు ఏళ్ల వయసపుడు చేశాను. మొదటినుండి ఇంగ్లిష్ లోనే రాసేదాన్ని.చెప్పానుగా ఆ భాష మీద పట్టు సాధిస్తే మనం ప్రపంచానికి ఏమి చెప్పాలన్నా మనుషుల్ని చేరుకోగలము అన్నది నా భావన.

ఫిక్షన్ చదివితే నాకు అది తిరిగి మళ్ళీ చెప్పే టప్పుడు ఎలా ఎంతవరకు మనకి అర్ధమైంది ఎంతవరకు తిరిగి చెప్పగలుగుతున్నాము  అని అంచనా వేసుకోవడానికి ఉపయోగపడేది. “You can’t live every life , but you can do that so with books and the traveler in me , I wanted to go places and interact with people so books could only give that satisfaction to me”  ఏదన్నా ఒక మంచి పుస్తకం బాగా నచ్చితే దాన్ని ఎంత బాగా ఒక కవితగా రాయగలను అనుకునేదాన్ని. ఒక చిత్రంగా చూపాలని ప్రయత్నించేదాన్ని పుస్తకంలో చూపించలేని దాన్ని నా భాష లో ఒక చిత్ర౦గా  ముందు నాకు  అర్ధమైన  తర్వాత నే రాసింది చదివే వారికీ  చూపించాలని ప్రయత్నించేదాన్ని   ఇలాగే నా సోషల్ వర్క్ గూడా మొదలైంది. వాళ్ళ బాధలు వినడం, అర్ధం చేసుకోవడానికి ఈ ప్రక్రియ ఎంతో  ఉపయోగిస్తుంది నాకు.

 

How do we interpret life, and to me life is a celebration in spite of all hard ships we have to go through”నాకైతే ఎలాగంటే అసలు జీవితం లో ఏదన్నా సాధించాలి ఈ వయసుకల్లా ఈ చదువై పోవాలి ఇలా ఎన్నో ఆకాంక్షలు ఉండేవి. కానీ నా ఆరోగ్యం, disability కారణంగా నేనేమీ చేయలేనేమో అని ఆలోచించినపుడు ఒక దుఖం కలిగేది, అదే నా సామాజిక సేవ పట్ల ఉన్న నిబద్ధతకు కారణం ఏమో!

ఎక్కువ దుఖం అకాలంగా సరి అయిన సహాయం అందక మృత్యువు బారిన పడిన మనుషుల్ని చూసినప్పుడు, నేనేమి చేయగలను వీళ్ళ కోసం అనుకునే దాన్ని. నాన్న , అమ్మ ఇద్దరూ డాక్టర్లే పైగా మా గజపతి నగరం పల్లెటూరు. చుట్టూ పక్కల గ్రామాలనుంచి రోగిని తీసుకోచ్చేసరికే ఒకోసారి పరిస్థితి చేయి దాటి పోయేది. ఆ శవాన్ని వాళ్ళ వాళ్ళు తీసుకెళ్ళేవరకూ మా హాస్పిటల్ లోనే ఉండేది. చిన్నవయసునుండే మృత్యువుని అంత ప్రత్యక్షంగా దగ్గరగా చూడటం అలవాటయి పోయింది. అందుకే జీవితమంటే నాకు చాలా ప్రేమ దానివల్లే “లైఫ్” అని పేరు పెట్టడం జరిగింది అంతే కాక నా జీవితం లో నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు గురించి నేను రాసుకున్నవి ఉండడం కుడా ఒక కారణం.

ఇక్కడ మనం ఏదో ఒక వర్గానికో, వాదానికో, పరిమితమైపోతున్నాం. ఎక్కువ అలాంటి రచనలే వస్తున్నాయి. ఉదాహరణకి ఫెమినిసం , దళిత సాహిత్యం , ఇలా ఎవరికి వారు బాక్సుల్లో బందీలై పోయి రాస్తున్నారు తప్ప సార్వజనీనమయిన సమస్యలను విషయాలను గూర్చి రాయడం లేదు. మన పక్క రాష్ట్రం లో కూడా ఎటువంటి సాహిత్యం వస్తుందో తెలుసుకోవాలనుకోరు మన వాళ్ళు.వాళ్ళని తప్పు పట్టాలని కాదు కానీ మన వాళ్ళు వాళ్ళ వాళ్ళ  బాక్సులు వదిలి ఇంకా విస్తరించాలని నా ఆకాంక్ష. అన్ని రకాలైన పుస్తకాలూ రెండు భాషలలోను చదవడం మూలాన, మన వాళ్ళు ఎందుకింత శక్తిమంతంగా రాయలేక పోతున్నారు అన్నదే నా బాధ.

నిజానికి నేను అప్పుడప్పుడు రాసి పెట్టుకున్న నా భావాలను “లైఫ్” పేరిట పుస్తకంగా రావడానికి కారణం మా వారు ప్రజ్ఞానంద్, ఆయన ఆ కవితలన్నీ ఏర్చి కూర్చిపుస్తక రూపం తీసుకొచ్చి ఆ డి.టి.పి వాడి దగ్గర కుర్చుని ఏ సందర్భం లో ఏ మాట వాడేనో అది కర్రెక్ట్ గా వచ్చిందో లేదో నని చాల కష్టపడి అ పుస్తకం తెచ్చి నా చేతిలో పెట్టినప్పుడు నిజంగా నాకంటూ ఓ అస్తిత్వం కలిగినట్టనిపించింది. నేనేదో  గొప్ప  కవిత్వం రాసేనని కాదు నా అక్షరాలకి భావాలకి ఎంత  విలువ నిస్తారో తను అని చాల ఆనందం కలిగింది, ఆత్మ విశ్వాసం కలిగింది,. ఈ పుస్తకం మా నాన్నగారు తన ఫౌండేషన్ ద్వారా ప్రచురించారు.

ఇప్పుడు మరో కవితల పుస్తకం వెయ్య  బోతున్నాకాదు కాదు వేస్తున్నారు మా వారె హహహ ….త్వరలో వస్తుంది అది. అలాగే బ్లాగ్ లో నేను రాసిన పరిశీలనాత్మక, పరిశోధనాత్మక వాస్తవ  జీవన గాధలు కూడా ఒక పుస్తకంగా తీసుకురావాలని  , నేను అమెరికా వెళ్ళినప్పటి నా  అనుభవాలను ఒక ట్రావెలాగ్ లా ప్రచురించాలని ప్రయత్నిస్తున్నాను . ప్రస్తుతం పుస్తక సమీక్షలు కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను, అలాగే తమ్మి మొగ్గలు అనే తెలుగు బ్లాగ్ పెట్టి ఇటీవలే తెలుగులో కుడా రాస్తున్నా.

…చాల రకాలైన ఇతివృత్తాలు  కొంతమంది ప్రయత్నిస్తున్నారు కూడా రాయడానికి, కానీ ఇంకా పవర్ ఫుల్  అభివ్యక్తి, విషయ సాంద్రత ఉ౦టేనే  కనుక ఇంకా మంచి సాహిత్యం వస్తుందని చెప్పచ్చు మన తెలుగులో. తెలుగు వారు రాస్తున్నా సాహిత్యం ప్రపంచ సాహిత్యం లో నిలవ దగ్గవి ఉన్నాయి కానీ వాటిని సరి అయిన రీతిలో లోక భాష ఐన ఆంగ్లం లో అందించాలి అందుకే అప్పుడప్పుడు అనువాదాలు కూడా చేస్తాను. నిడదవోలు మాలతి  గారి “తూలిక”(అంతర్జాల పత్రిక) కి కూడా చాల రోజులు పనిచేసాను. ఇప్పుడు పని వత్తిడి వల్ల చేయలేక పోతున్నా!!

ఇక విషయా౦శాల కొస్తే ఇంకా రాయల్సినవి చాల ఉన్నాయి . ఉదాహరణకి ఎపుడూ మనం స్త్రీ బాధలు ఒంటరితనం ఇలాంటివి రాస్తాము కానీ ఆధునిక జీవనం లో మగాడు ఎంత ఒంటరితనం మానసికంగా దైహికంగా అనుభావిస్తున్నాడో  ఇలాంటి అంశాలను మనం డీల్ చెయ్యాలి అనిపిస్తుంది.

 

నన్ను నేనెప్పుడూ రచయితగానో, కవయిత్రిగానో ఊహించలేదు. FOR ME WRITING IS NOT ONLY ACCIDENTAL BUT PURE DELIVERANCE OF MY THOUGHTS AND BLISSFUL ACTIVITY. చిన్నప్పుడు, ఇంటికి ఎవరు వచ్చినా , మిగతా పిల్లలు అందరూ అటూ ఇటూ వెళ్ళిపోయేవారు. మొహమాటానికి లేదా పెద్దవాళ్ళతో మేమేం మాట్లాడతాం అనో.. నా వరకూ, నాకు అలా వెళ్ళలేను కాబట్టి, తప్పనిసరిగా మాట్లాడేదాన్ని. నా ఏకాంతం ఇలా అక్షరాల పరమైంది అనుకుంటాను నేను . అంతే కాక, నాకు తారసపడిన, సాహిత్యవేత్తలు, స్నేహితులు, కుటుంబం , అందరూ .. నువ్వు తెలుగు లో రాసిన ప్రతీవాక్యం చాలా బాగుంటోంది . అని ప్రోత్సహించటం కూడా నేను మురిపెంగా చెప్పుకోగలిగే విషయం .

చివరగా ఒక మాట – మనం మనుషులం ముందు -అన్న సంగతి మరిచి పోతున్నాం. ఎప్పుడూ మగవాడి గానో ఆడదానిగానో, ఏదో ఒక వర్గానికి, వాదానికి  చెందిన వారిగానో ఎదగాలనుకుంటున్నాము  అదే మన లోని ప్రేమ రాహిత్యానికి, సమగ్ర అవగాహన లోపానికి కారణం..!!