కవిత్వం

బంధాలు

జనవరి 2014

ఎంత ప్రేమగా గింజలు చల్లినా
పంజరంలో పావురాయి నవ్వదు
ఎగరెయ్ ఆకాశంలోకి.
దాని రెక్కల చప్పుడులోని
స్వేచ్ఛా సంగీతాన్ని
వినిపించొకసారి హృదయానికి

ఎన్నెన్ని మొగ్గలు వికసించినా
మొదలంటా నరికేస్తే మిగలదేదీ
వాటినలా వదిలెయ్.
పూదోటలో నడిచెళ్తుంటే
వసంతమెలా కమ్ముకుంటుందో
అనుభవించి చూడు

ఎందరెందరు దోసిళ్ళు పట్టినా
అరచేతుల్లో ఒక్క చుక్కా నిలవదు
ఆకాశం ఊరికే కిందకు దిగదు
అడ్డు తొలగు
ఏదో ఒక రోజు
ఏటి ఒడ్డునే సేద తీరాలి.

వదలనివి కొన్నుంటాయి
వదల్లేనివీ కొన్నుంటాయి
వదులయ్యే కొద్దీ బిగుసుకునేవి మాత్రం
అపురూపమైనవి
నిజానికవి
వదిలిపెట్టకూడనివి.