విరగబోయే కొబ్బరిమట్ట మీద కూర్చుని
ముక్కుతో పొట్ట పొడుచుకుంటూ
దిగులుగా ఊరంతా చూస్తుంది
ఒంటరి కాకి
డాబా మీది తూము నుండి నీళ్ళు
ధారల్లే క్రిందకు పడుతోంటే
తలంతా తడుపుకుంటూ ఇకిలిస్తాడు
బట్టల్లేని బుడతడు
దండేనికి వేలాడుతోన్న చినుకులన్నింటిని
చూపుడువేలు గాల్లోకి విసిరేశాక
ఏడుపు మొహాలతో బయటకొస్తాయ్
ఆరీఆరని బట్టలు.
జీరాడే కుచ్చిళ్ళు జాగ్రత్తగా
బురద నీళ్ళకు దూరంగా జరిగాక
పసుపు మరకల పట్టీలతో పేరంటానికెళ్తుంది
అమ్మలాంటి ఓ అమ్మ.
వానపడ్డంతసేపూ బుడబుడా నవ్వుతుంది, ఈ నేల
ఆ కాస్త ప్రేమకే మెత్తబడి కరిగిపోతుంది
ఎంత బాధ లోలోపల కొంపుకుంటుందో,
వాన వెలిశాక అదేపనిగా కళ్ళు తుడుచుకుంటుంది.
వాన- గుండె లోపలే కాదు, కళ్ళ ముందర కూడా …ఈ మాటలు బొమ్మగా.
సూపర్బ్
చాలా బాగుంది ఇలాగే రాస్తూవుండండి