చలువ పందిరి

मोन्टा रे!

ఫిబ్రవరి-2014

సినీ రంగంలో సంగీతసాహిత్యమిళితమైన అద్భుతమైన పాటలు మనకందించిన కొన్ని చెప్పుకోదగ్గ జంటలు ఉన్నాయి. ఎస్.డి.బర్మన్-సాహిర్ లుధియాన్వీ, ఆర్.డి.బర్మన్-గుల్జార్, శంకర్ జైకిషన్-శైలేంద్ర., రాజా మెహదీ అలీ ఖాన్-మదన్ మోహన్… అలాగన్నమాట. అలా కొత్తతరం హిందీ సినీగీతాకాశంలో ఓ జంట హరివిల్లులాంటి అందమైన పాటలను మనకందిస్తున్నారు. వారే అమిత్ త్రివేదీ-అమితాబ్ భట్టాచార్య ! ఈ రణగుణధ్వనులకాలంలో పాటలంటే హోరు, వాయిద్యాల మోత మాత్రమే కాదు నాణ్యమైన సాహిత్యానికి సరిపడే సంగీతాన్ని జోడిస్తే, పదికాలాలు నిలబడిపోయే గీతాలు జన్మించగలవనే నమ్మకాన్ని ఇస్తున్న జంట వీరిద్దరూ.

Dev D, Wake up Sid, Ishaqzaade, Kai Po Che, Trishna, Ek mein aur Ek tu మొదలైన చిత్రాలకు సంగీతం అందించి, చిన్న వయసులోనే ఎంతో పేరుప్రఖ్యాతలు సొంతంచేసుకున్న “అమిత్ త్రివేదీ” పాడగలడు, రాయగలడు, వాద్యకారుడు కూడానూ! రచయిత “అమితాబ్ భట్టాచార్య” కూడా గాయకుడే! ఇతడు “అగ్నిపథ్” చిత్రానికి రాసిన గీతసాహిత్యం ఎంత అద్భుతంగా ఉంటుందో! ఈ జంట ఇటీవలి కాలంలో “లుటేరా” అనే అందమైన చిత్రానికి సాహిత్యసంగీతాలను అందించారు. ఈ ఆల్బం లో అన్ని పాటలూ వేటికవే ప్రత్యేకం. అన్నింటిలోనూ “మెంటా రే” అనే పాట చాలా ప్రజాదరణ పొందింది. ఆ పాట గురించే ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం!

“లుటేరా(2013)” చిత్రకథ బ్రిటిష్ పాలనా కాలంలో అంతరిస్తూ ఉన్న జమిందారీ వ్యవస్థకు సంబంధించిన కథ. వెస్ట్ బెంగాల్ లోని మానిక్ పూర్ అనే ఊళ్ళోని జమిందారు,ఆయన కుమార్తెల కథ! పల్లె వాతావరణంలోని కథ కాబట్టి కథాపరంగా కీలకమైన మొంటా రే పాటకు గ్రామీణపరమైన సంగీతాన్ని సమకూర్చారు. వేదాంతపరమైన బెంగాలీ జానపద సంగీతరీతుల్లో “బౌల్ సంగీత్” ఒక రీతి. (మన తెలుగు తత్వాల్లాంటివన్నమాట.) టాగూర్ కూడా తన పాటల్ని ఎక్కువగా ఈ జానపదరీతిలోనే స్వరపరిచారు. ఈ బౌల సంగీతకారుల గురించి టాగూర్ తన ప్రసంగాల ఆధారంగా రాసిన ’The Religion of Man ’ అనే పుస్తకంలో “The Baul Singers of Bengal” అనే అధ్యాయంలో కూడా ప్రస్తావించారు. ఈ బౌల గీతవాయిద్యాల్లో దోతార, ఖమాక్, ఢోల్, దుగ్గీ మొదలైన వాయిద్యాలతో పాటూ “ఏక్తార” అనే తంత్రీ వాయిద్యాన్ని ఎక్కువగా వాడతారు. గ్రామీణవాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉండే ఆ బౌల జానపదగీతాల మాదిరిగా ఈ మోంటా రే పాటని రూపొందించి, ఏక్తార, ఢోల్ మొదలైన వాయిద్యాలను కూడా ఎక్కువగా వాడారు అమిత్ త్రివేదీ. పాట మధ్యన పల్లెపదాల్లా వినబడే బెంగాలీ వాక్యాలకు స్వరకర్త అమితాబ్ భట్టాచర్య గాత్రం బాగా నప్పింది.

గాయకుడు “స్వానంద్ కిర్కిరే” కూడా గీతరచయిత, సంభాషణా రచయిత. పరిణిత లో “పియు బోలే”, కై పో చీ లో “మాంఝా”, త్రీ ఇడియట్స్ లోని అవార్డ్ పొందిన “బెహతీ హవా సా థా వో” లతో పాటూ ఎన్నో విలువైన సాహిత్యాలను అందించారాయన. అవటానికి ఇది చిన్న పాటే అయినా, ప్రతిభావంతులైన రచయిత, స్వరకర్త, గాయకుడు త్రిమూర్తుల్లా వెనుక నిలబడ్డ ఉత్తమ గీతంగా ఈ పాటను చెప్పుకోవచ్చు.

సందర్భం: ఆర్కియాలజిస్ట్ గా ఆ ఊళ్ళోకొచ్చిన వరుణ్ పై మనసుపడుతుంది జామిందారు కుమార్తె పాఖీ. వరుణ్ కూడా ఆమె పట్ల ఆకర్షితుడైనా, తనకున్న వృత్తిపరమైన నిబంధనల వల్ల మనసుని అదుపులోకి పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మాట వినే గుణం మనసుకు ఉంటే లోకంలో ఇన్ని అనర్థాలు ఎందుకు జరుగుతాయి?! తన అదుపులో లేకుండా, చిత్తం వచ్చినట్లు ప్రవర్తించే మనసుని ఉద్దేశిస్తూ రాసిన పాట ఇది. కథలో నాయికానాయకుల మనస్థితినీ, ప్రేమ లక్షణాలనూ తెలియజేసే సందర్భోచితమైన గీతం..

‘మోంటా రే’ స్వేఛ్ఛానువాదం:

कागज़ के दो पंख लेके, उड़ा चला जाए रे
जहाँ नहीं जाना था ये वहीँ चला हाय रे
उमर का ये ताना-बाना समझ ना पाए रे
ज़ुबां पे जो मोह-माया, नमक लगाये रे
के देखे ना, भाले ना, जाने ना दायरे
दिशा हारा कैमोन बोका, मोन्टा रे!

రెండు కాగితపు రెక్కల్ని తీసుకుని ఎగిరి వెళ్పోతుందిరా..
ఎక్కడికైతే వెళ్ళకూడదో.. అయ్యో! అది అక్కడికే వెళ్తుందిరా..
వయసు తాలూకూ పడుగుపేకలు అర్థం చేసుకోదుగదరా..
మోహావేశాల రుచి చూపి మరులుగొలుపుతుందిరా
ముందువెనుకలు చూడని మనసు హద్దులెరుగదు..
దిశారహితమైపోతుందిరా ఈ వెర్రి మనసు !

భావం: “कैमोन बोका, मोन्टा रे!” అనేవి బెంగాలీ పదాలు. అంటే “మనసెంత వెర్రిదో కదా..” అని అర్థమట! ఈ పల్లవిలో “ज़ुबां पे जो मोह-माया, नमक लगाये रे” అనే ప్రయోగం నాకైతే అద్భుతంగా తోచింది. చప్పబడిపోయిన జిహ్వ ఉప్పు తగలగానే ఎలా ఉత్తేజితమౌతుందో.. అలాగ మిథ్యామోహాల రుచి చూపించి మనసుని ఊరిస్తుందిట ప్రేమ. అలా మాయలో పడిపోయి ముందు వెనుకలూ, పరిస్థితులు గుర్తించక, హద్దులు మర్చిపోయి, ఎటువైపు పయనిస్తోందో తెలియకుండా దిశారహితంగా పరిగెత్తుతూపోతుందిట ప్రేమలో ఉన్న వెర్రి మనసు.

చ: फ़तह करे किले सारे, भेद जाए दीवारें..
प्रेम कोई सेंध लागे.. ((लागे रे लागे))
अगर मगर बारी बारी, जिया को यूँ उछाले
जिया नहीं गेंद लागे.. ((लागे रे लागे))
माटी को ये चंदन सा, माथे पे सजाये रे
ज़ुबां पे जो मोह-माया, नमक लगाये रे
के देखे ना, भाले ना, जाने ना दायरॆ
दिशा हारा कैमोन बोका, मोन्टा रे!
కోటలని జయించి, గోడలు దాటి రహస్యాలను భేదించే ఏదో కన్నమేమో.. అనిపిస్తుందీ ప్రేమ
అవుననీ.. కాదనీ.. వంతులవారీగా గెంతులువేయిస్తూ
మనసు కాదు బంతేమో అనిపిస్తుంది..
మట్టిని చందనంలా నుదుటిపై అలంకరించుకుంటుందిరా
మోహావేశాల రుచి చూపి మరులుగొలుపుతుందిరా
ముందువెనుకలు చూడని మనసు హద్దులెరుగదు..
దిశారహితమైపోతుందిరా ఈ వెర్రి మనసు !

భావం: ఈ చరణంలో ప్రేమ ఎటువంటిదో, మనసుని ఎలా ఆడిస్తుందో తెలుపుతాడు రచయిత. “सेंध ” అంటే దొంగతనంగా వేసే కన్నం అని అర్థం. అలా దొంగతనంగా మనసుకి కన్నమేసి, మనసనే కోటను జయించి, గోడల్లాంటి మనసుపొరలెన్నో దాటి లోపలి రహస్యాలను భేదించే కన్నమనిపిస్తోందట ప్రేమ. ఓసారి ఔననీ, మరోసారి కాదనీ వంతులవారీగా మాటమారుస్తూ, బంతిని ఎలాగైతే అటు ఇటు తంతామో అలా మనసుని బంతిని చేసి ఆడేసుకుంటుందిట ప్రేమ! ఉచితానుచితాలు మరిచిపోయేట్లు చేసే ఈ ప్రేమ మట్టిని సైతం చందనమని భ్రమించేలా చేస్తుందిట. తత్వ ధోరణిలో సాగే పాట కాబట్టి ప్రతి వాక్యానికీ చివరన “రే” అనే ప్రయోగం చేసారు.

ఈ పాటను ఇక్కడ చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=yj998MmDzVc