కవిత్వం

తలకిందులు గమనం

జనవరి 2013

జీవితమొక వ్యసనం

అల్లుతుంటాం సాలెగూళ్ళు
గతితప్పిన కీటకాలకోసం

సాగదీస్తుంటాం
మెట్టజలగలా
క్రియా నిష్ఫలతని

ఎవడొప్పుకుంటాడు
బతికుండగానే
బలిచ్చేందుకు
స్వంత అస్థికల్ని

జీవితమొక వ్యసనం

చాలాకాలం నిలిచాను
ఊపిరి ఉగ్గబట్టుకొని

త్వరపెడుతున్న అడుగుల చప్పుడు
వెనుక ఎండుటాకుల
నడుమిరిగిన శబ్దాలు

పితృవనాల మీదుగా
గూటికి మళ్ళుతున్న
పరవశాల కిలకిలల
చిలకల దండు

జీవితమొక వ్యసనం

అరికాలులో పల్లేరుగాయ మూలుగు
ముసలి అశ్రువు పగిలిన ధ్వని

చెరువులో చేపపిల్ల
అలజడికి పగిలిన
వేయి వెన్నెల ముక్కలు

చాలా కాలం నడిచాను
శిధిలమైన సమయం
కనుమలగుండా నన్ను
నేను వితర్కించుకొంటూ

జీవితమొక వ్యసనం

అంతర్మధ్యాన ధూమవలయ
శాఖల్లో గాలి నిట్టూర్పులు

క్రమక్రమంగా
కనుమరుగౌతున్న
కొంగలబారు
గగన విన్యాసాలు …