కథ

మేస్ట్రుబాబు మరినేరు!

జూలై 2014

బరినికాన ఎంకట లచ్చాపాతుర్డు గోరు సనిపోనారు. నిన్నగాకమొన్ననే పట్నంలో పేనాలొగ్గీనారు. పెపంచికానికి దూరవైపోనారు.

‘‘లచ్చాపాతుర్డుగోరనే ఏటి.. కాలం తీరిపోతే వొవులైనా పోతారు.. రోజుకీ నక్షలమందిరి పుడ్డం నేదా.. పోడం నేదా.. ఈయనేం పైనించి దిగొచ్చినాడేటి.. అందర్నాగానే కిందినించి పైకెల్లీవోడో కదేటి..’’ ఈ మాదిరీగా మనం పాతుర్డుగోరి ఇసయంలో మాతరం అనీస్కోనేము. అదే మరి వచ్చింసిక్కు.
పాతుర్డుగోరేటి మామూలు మనిసేటి. గొప్ప తగ్నుమనిసి. సేనా మంచిమనిసి. కల్మసం తెలీని మనిసి. సమానింగా బగ్నమంతుడికీ ఈ బాబుకీ ఎంట్రుక ముక్కంత వోరాయే ఉంతాది. అదీ నేపోతే ఈయనగోరు పరమాత్ముడైపోను. ఆ బాబు మావూరోరేనని సెప్పుకుంతే మాకే కాదు. మా అర్జాపురం గ్రేమం ఇరుపంచాలా ఉన్న మేడివోడ, దొండపూడి, కొత్తకోట, బుచ్చీపేట, బంగారిమెట్ట ఇలగ్న అన్ని ఊల్లోల్లకీ గొప్ప గ్నర్రా.
మా పాతుర్డు బాబుకి జనమందరూ సుట్టాలే. సేసీది మావూల్లో మేస్ట్రు పని. అలగ్నని, గ్నుంటసావాదిగాళ్లకి నాలుగ్ను అచ్చరం ముక్కలు సెప్పీసి ఊరుకునీ మావూలు మేస్ట్రు కాదు. ఊరందరికీ మంచి సేసీ మహా మేస్ట్రు.

గ్రేమంనోకి టీకామందులొచ్చినాయనుకోండి. పాతుర్డుగోరు మాసెడ్డ హడావుడి పడిపోయీవోరు. ఒక్కటంటే ఒక్క ఇంటినీ వొగ్గీకుంతా టీకాలోల్లతో కలిసి తిరిగీసీవోరు. పిల్లలందరి పిర్రలికీ సూదులు పొడిపించీసీవోరు. అంతేనేటి. వొవులికౖేెనా జబ్బు సేసిందే అనుకోండి. ఈయనకే ఆ జబ్బేదో వచ్చీసినట్టు తెగ్న ఇదయిపోయీవోరు. ఊరి సర్కారీ డాటర్ని గ్నుంజాయించీసీవోరు. పేసెంటుకి సుస్తీతగ్గీదాక డాటర్‌బాబు దుంపతెంచీసి దూపం ఏస్సీవోరు. అప్పటికీ రోగ్నం తగ్న్గనేదనుకోండి. జబ్బుపడ్డోణ్ణి వొట్టుకుని ఇసాపట్నం పోయీవోరు. అక్కడి పెద్దాస్పత్రిలో సేరిపించీసి మరీ వచ్చీసీవోరు. ఆడికి కరుసూగిరుసూ అయితే జోబీలోంచే ఎట్టీసీవోరు. మల్లీ ఇచ్చినా తీస్కునీవోరూ గాదు. వొప్పుడూ దెప్పీవోరూ గాదు.

మా గేమ దేవత పసరమారమ్మ పండగొచ్చిందనుకోండి. పాతుర్డు మేస్ట్రు గాబరాయేగాబరా. పండగ్నంతా ఆయనగోరిదే. పందరిరాట్లకి తాటితడపలు కడ్డం దెగ్గిర్నించీ, అనుపునాడు డప్పులు బెత్తాయించీవొరకూ అన్నీ ఆ బాబే సూసుకునీవోరు. ఎప్పుడో సచ్చిపోయిన ఆల్ల నాన్న సన్నాసిపాతుర్డుగోరి పేరు మీద పండగ్ననాడు రాతిరి కురుచ్చేత్రమో, అరిచ్చంద్రో, రామాంజినీయయుద్దవో ఏదో ఒక డ్రేమా ఎట్టించీసి పజ్జేలు పాడిరచీసీవోరు.
ఓపాలి మావూల్లో గొప్ప మిస్టీక జరిగీనాది. పొగాకు కట్టలమ్మీ కటారు అచ్చిబాబుగోడు, నానా తంటాలు పడిపోయి నాలుగో కూతురి పెల్లి కుదిర్సేడు. రాటేసేడు. బేమ్మణ్ణి ఎట్టేడు. బేండుమేలం మోగించేడు. బోయినాలకి బందువుల్ని పిల్చేడు. ఇక మగ్నపెల్లోల్ల్లు రాడమే ఆలీసం. ఆల్లు మాతరం ఇంతకీ రారు. అంతకీ రారు. పైగా మా అర్జాపురానికీ మగ్నపెల్లోరుండే కొమాల్లపూడికీ పెద్ద దూరవేటీ కాదు. లావు మనిసి గ్నటిగా కేకేత్తే ఇనబడిపోద్ది. అలాటిది మూర్తానికి టయివవుతున్నా కుర్రోడుగానీ, ఆడి సైడు ఏ గొల్లిగోడూగానీ రాయేనేదు. దెబ్బకి అచ్చిబాబుగోడికి కచ్చతడిసిపోనాది. పెల్లాగిపోద్దేమోనని ఏడుపులెట్టేడు. ఎంటనే ఆడి పెద్దల్లుడు చిక్కా అప్పల్రాజు కలగ్నజేసీస్కుని ఏటయిందో కనుకుంతానుండమని సెప్పీసి కొమాల్లపూడి పారెల్లేడు. ఎల్లినోడు ఇలగెల్లేడా. అలగొచ్చీనాడు.

ఇంతకీ ఏటయిందంటే, కట్నం డబ్బులో నాలుగొందలు బొక్కెట్టేరు కాబట్టికి.. పెల్లికొడుకు తండ్రిగోడు లగ్న్గం గిగ్న్గం దొబ్బదని మెలికెట్టీనాడట్ట.. ఆ సంగ్నతి ఇనీసరికి మావందరం మావూలుగానే ఉన్నాం గాని, మా పాతుర్డు మేస్ట్రు మాతరం అగ్గిమీద గ్నుగ్గిలవైపోనారు.

‘‘ఏట్రా ఎదవకానా. కట్నం మొత్తంగా ఇచ్చీవొద్దేట్రా. నీకేదయినా డబ్బుకి ఎటాముటీ ఉంతే సెప్పొద్దేట్రా. నీ ఇబ్బంది మా ఇబ్బంది కాదేట్రా. ఊల్లో మావెందుకున్నావురా. కర్రాబిల్లా ఆడుకోనాకేట్రా. ఆ బాజోటు మగ్నపెల్లోల్లు ఇప్పుడెంత పరువుతక్కువసేస్సేరు సూడ్రా. వొవులో మనల్ని ఇనసల్టీగా మాటాడీడం ఏట్రా’’ అని పెద్దగొంతెట్టి సెడమడలాడిరచీనారు.

మరుచ్చనంలోనే పెల్లిపెద్ద గ్నూనురు అప్పల్లాయిన్ని ఎంటబెట్టుకుని సైకిల్‌మీద కొమాల్లపూడి బయలెలిపోనారు. అక్కడ పెల్లికొడుకు తండ్రి కొమ్మోజు నాగాచార్ని నాలుగ్ను దులిపీసీసి, తల్లి నూకరత్నాన్ని మరినాలుగ్ను చెరిగీసీసి, ఆల్లకివ్వలిసిన నాలుగొందలూ ఆల్లకి పార్సీసి, అల్లని లాక్కొచ్చీనారు. పెల్లి గెనంగా సేయించీనారు.
ఆడబొట్టె జీయితాన్ని నిలబెట్టీనారని కటారు అచ్చిబాబు పెల్లం ఎంకటలచ్చిమి నాటినించీ మా పాతుర్డుగోర్ని జనమనిచ్చిన తండ్రినాగానే గౌరవించీసీది.

పెల్లనే కాదు. ఒక సావయినా అంతే. వొవులు పోయినా పాడి ముందు పరుగ్నులెత్తీవోరు పాతుర్డుగోరు. సచ్చినోరి పిల్లలకి, ఆరి కుటుంబానికి దయిరం సెప్పడం కాణ్ణించి, ఆల్లబాగ్నూవోగ్ను సూస్కోడం దాకా అంతా ఆయనే సేసీవోరు. మాకు తెలిసి మేస్ట్రు పనిమీద వొచ్చీ జీతం ఆయన ఎంతతిన్నారో తెల్దు. పెజలకి ఎట్టింది మాతరం తెలుసు.

‘‘బాబూ మీకెందుకండీ ఊరోల్ల గొడబ ’’ అని వొవులయినా అంతే మటికి సేనా ఇదయిపోయీవోరు
‘‘ఓసే. నాకెంతమందున్నారెహే. ఒక్క గ్నుంటడు. ఆడు కూడా ఇక్కన్నేడు. పట్నంలో సదుంతన్నాడు. ఇక మిగిలిందొవులు. నేను. ముసిల్దీని. మాకెంత కావాలెహే. నాను గానీ బూవుల్నీ పుట్రల్నీ వొట్టుకుని మీదకి పోతానేట్రా’’ అంటుండీవోరు.

ఆయనగోరికి తగ్న్గట్టే అమ్మగోరు అనసూయమ్మగోరూనూ. పనసకాయ కూరసేసేరనుకోండి. కందాబచ్చలీ కలిపీసి వొండీసేరనుకోండి. ఊరందరికీ సరీపడీలాగ్న సేస్సీది ఆయమ్మ. ఇకనదంతా పంచడమే. చేపల పులుసయినా అంతే. పీతల ఇగ్నురైనా అంతే. ఇద్దరు మనుసులికి సరీపడా వంటసేసీ సుర్కే ఆయమ్మకి తెలీదు.
అసలు మేస్ట్రుబాబు ఇంటినించి సైకిల్‌మీద బడికి ఎంత ముందరబయల్దేరీవోరో సెప్పనేం. ఆయన పలకరింపులికి తక్కువ టయిం పడతాదేటి. అందరితోనూ మాటాడి, ఆల్ల యోగ్నచ్చేమాలు కనీసుకుంతేగానీ ఆయనగోరికి రోజు గ్నడదు కదా.

‘‘బాబూ పూర్వంనా కాదు. జొన్నపంటమీద పడిపోయీ పిట్టముండనాగ్న వయసేమో తోస్కుని ఎలిపొచ్చెత్తన్నాది. ఎందుకుబాబూ రోజూ ఆల్లకాడికీ ఈల్లకాడికీ బొంగ్నరంనా తిరుగ్నుతారు. ఇంటికాడ కూకుని ఇస్రాంతి దీస్కోవచ్చుకదేటి’’ అని ఏ మారాజయినా అన్నాడనుకోండి.
‘‘ఒరేయి సాటి మనుసులు నేపోతేేే. ఆల్లతో మాటల్నేపోతే మనిసేట్రా. ఆడి బతుకేట్రా ’’ అంటూ ఏడిసినంత పనిసేసీవోరు.

అప్పుడెప్పుడో టేన్స్‌పరుమీద మావూరొచ్చీసి, ఇక మాకాడే ఉండిపోయిన పాతుర్డుగోరంటే అందుకే మాకంత పిచ్చి. మా కంత అబ్మానం. మావూరికి అటేపేమో పలకరాయి కొండుండీది. ఇటేపేమో పాతుర్డుగారి అండుండీది.

అలాటి బంగారంనాటి మేస్ట్రుబాబుకి రిట్రయిపోనాక సేనా బాద ఎలిపొచ్చీనాది. కలికాలమహచ్చమంతే మరదే. ఆ బాబు పదయీ ఇరమన సేసిన్రోజున స్కూల్లోనే మావూరి పెద్దలు మీటింగెట్నారు. ఆయన్ని చాలా ఇదిగా గౌరయించినారు. సేలువా అదీ కప్పినారు. దండలేసినారు. మైకుల్లో ఉపన్యాసాలిచ్చినారు. బళ్లో సదుంకునీ గ్నుంట్లయితే కల్లనీల్లెట్టుకున్నారు. ఆడమేడమ్‌లు కొందరు, నాన్నగోరూ అని మేస్ట్రుగోరి కాళ్లమీద పడి నేత్రాలు తడిసేసుకున్నారు.

అప్పుడు మేస్ట్రు బాబు ఒకటే మాటనీసేరు.

‘‘నేను మాతరమూ రిట్రయినా కూడానూ ఎప్పుడూ ఊరొగ్గీసి ఎక్కడికీ ఎల్లను’’ అనీసేరు. ఆ మాటలు అందరికీ నచ్చీనాయిు. ఆయన కొడుగ్గోరికీ ,కోడలుగోరికీ తప్ప.
ఆ మీటింగికి వొయిజాగ్నుపట్నంలోనే సదివీసి అక్కడే ఉజ్జోగ్నం సేస్తున్న మేస్ట్రుబాబు కొడుకు సతీసొచ్చినాడు. టిప్పుటాపుగా వచ్చినాడు. పందేనికి రెడీగ్నున్న డిరకీకోడిపుంజునాగ్న తిక్కలుతిక్కలుగా వచ్చీనాడు. ఆయనగోరి పెల్లాం సిరిసమ్మా వచ్చినాది. తిప్పులాడి తిమ్మక్కనాగొచ్చినాది. కల్లద్దాలూ గ్నట్టాఎట్టి సోకుసోగ్గా వచ్చీనాది.

అప్పటికి మేస్ట్రుబాబు కొడుక్కి పెల్లయి ఆరు మాసాలయిందేటో. ఆ యబ్బాయి పెల్లి మేస్ట్రుబాబుకి, అనసూయమ్మకీ కూడా పూర్తిగా తెల్ద్దు. ఏదో రిజిస్టేరు పెల్లంట. అందుకే మాకూ తెల్దు. సరే. అదలగొగ్గీండీ.
కొడుకు కోడలూ వచ్చినారన్నమాటేగానీ మా పల్లెటూరి నాయాల్లెవరితోనూ ఒక్కమాటా మాటాడిరది నేదు.
‘‘ఓరి గ్నుటా. ఆల్ల ఆమ్మ బాబుతోనే ఆల్లు సరీగా మాటాణ్ణేదు. మన్తో ఏటి మాటాడతార్రా డోంగ్రీ’’ అని స్కూల్లోని మిగ్నతా మేస్టర్లు మాతో అన్నారు. మాం నోల్లు మూసుకుని వొల్లక్కూకున్నాం.

మీటింగ్నయిపోనాది. కొడుగ్గారూ, కోడలుగారూ టింగ్నురంగామని కారెక్కీసి పట్నం పారెల్లేరు. సెర్లో సేపని వోటంగా పట్టీనాక కొంగ్నతల్లి ఎంతరివ్వున ఆకాసంనోకి ఎల్తాదో అచ్చంగా అంత యేగ్నంతోనే మోట్రుబండిమీద దౌడాయించీనారు. ఆల్లూ అలెగెల్లినారు. ఆ రాత్రే. జరక్కూడంది జరిగిపోనాది.

అనసూయమ్మగారికి తెల్లారగ్నట్టే గ్నుండెల్లో నొప్పినెగిసిపోయింది. ఆ మాయదారి రోగ్నం అస్సలు టయిం ఇవ్వేనేదు. నిమిసాల్లో అమ్మగారిని కొట్టీసింది. డాటర్‌బాబుని లేపి తీసికొచ్చీసరికే అయమ్మ సనిపోయున్నారు.
‘‘గ్నుండెపోటంతే అంతే మరి’’ అంటూ డాటర్‌బాబు గ్నరిమెల్ల సత్తెనారామూర్తి గోలుగోలెట్టేడు.

మేస్ట్రుబాబు దుక్కానికయితే అంతేనేదు. ఆయననే ఏటి. ఊల్లో వోల్లంతా కూడా గ్నగ్గోలెట్టేరు. పట్నం కొడుకు, కోడలుపిల్ల, ఇంకా బందుగ్ననాలు వచ్చీసి దహనం గిహనం సేస్సేరు. దినంగినం తీర్సీసేరు. ఎల్తూ ఎల్తూ మేస్ట్రుబాబుని ఇసాపట్నం వొట్టూపోనారు.

నాన్రాను అని ఆయన ఎంత సెప్పినా ఆల్లు ఆలకించేనేదు. పైపెచ్చు ఒంటి మనిసికి నీకిక్కడేం పని.. అన్నారు. వొండీదొవులు తినీదొవులు.. అని బూకరించీనారు. అమ్మ సచ్చేక మీరిక్కడేటి సేత్తారని అడుదుం బుడుదుంగా మాటాడీనారు.

‘‘సేసింది సేన.. మా మావను వొగ్గీండి బాబూ..’’ అన్నట్టుగా మాయేపు తిరిగి మాటాడిరది కోడలమ్మ.
మేస్ట్రుబాబు కూడా కొంతసేపు రానని పట్టుపట్టేరు. కానీ పెల్లంపోయిన బాదలో ఉన్న మనిసి గ్నదా. రంది పెంచడం మంచిది కాదని వొల్లకుండిపోనారు. మావంతా ఏడుత్తుండగా..ఆయనా ఏడుసుకుంతానే.. కొడుకుతోటీ, కోడల్తోటీ ఇసాపట్నం దారిపట్టీనారు. ఎల్తూ ఎల్తూ, ఇల్లూ పొలాలూ జాగ్నర్తాగా సూసుకోమని ఆయన సెప్పేరు. మంచి బేరం దొరికితే ఆట్ని అమ్మీమని ఆయనగోరి కొడుగ్గారు సెప్పేరు. మాకు దిగ్నులేస్సింది.

అదిగో అలా మావూరు దేవుడు మానించి ఇడిపోయి ఎలిపోయి మరి రాయేనేదు. మావే కొన్నాల్లకి వొయిజాగెల్లవొలిసొచ్చింది.

అదేం వొయిజాగ్నండీ బాబూ. చీ..చీ.. అక్కడ సవుద్రం వుండొచ్చు. పేక్టరీలుండొచ్చు. మేల్లుండొచ్చు. మిద్దిలుండొచ్చు. కాని, అక్కడి మనుసులు సేనా మందిరి మాతరం వొంటిపిల్లి రాకాసీలండీబాబూ. ఆల్ల బుర్రల్లో బుద్దులూ, గేనాలూ సేనా పలసన. ఆల్ల మనసుల్లో పేమనేదు. అబ్మానం అంతకంటీనేదు. అంతా తబరకా గిబరకా.

నానిలాగ్న ఉత్తిపున్నేనికి అనీసేనని మీరనుకోకండి. మరి మా మేస్ట్రుగోరు సచ్చిపోతే మాకు బాదుండదేటి. మావూల్లో ఉన్నంతకాలం మగ్నరాజులాగ్నుండే మా పాతుర్డుగోరు పట్నవెల్లేక వల్లకాటికి పోతే గ్నుండికాయ పిండీసినట్టుండదేటి.

ఇంతకీ జరిగిందేటంతే.. ఇశాలంగా ఉండీ ఊల్లోనూ.. అబ్మానపడీ మనుసుల్లోనూ కలివిడిగా కలిసి బతికీసిన మా మేస్ట్రుగోరిని అనాసరంగా కొడుకుగారు, కోడలమ్మగారు పట్నం నాక్కుపోనారా. అక్కడ ద్వారకానగ్నరమనే పేంతంలో అగ్గిపెట్టంత ఎపార్టీమెంట్లో ఒక మూలజేర్చీసి కుదగొట్టీనారు.

కొడుకుబాబు ఉదయాన్నే కొలువుకి పోయీవోడు. కోడలమ్మా కొలువుకే పోయీది. ఇక మేస్ట్రుగోర్ని ఎపార్టీమెంట్లో పట్టించుకునీదొవులు.

పొద్దున్నే పొలాల్లో నడిసీ అలవాటున్న మేస్ట్రుబాబు ఎపార్టీమెంటు దిగి నడుద్దును కదా అనుకుంతే, సీమలబారునాగ్న మనుసులు పొద్దునపొద్దున్నే మోటారుబల్ల మీద బయలెల్తూ కనిపించీనారట. ఎవల్నోకం ఆల్దట. ఒకులికీ ఒకులికీ కంటిసూపుగానీ నోటి మాటగానీ నేదట. దగ్న్గరిసా ఉన్న డైమండ్‌పార్కీకి జనాన్ని ఈదుకుంతా ఎల్లీసరికి మేస్ట్రుబాబుకి తాతల్దిగీనారట. పైగా ఊరంతాను గేస్‌ కంపేనట. మేస్ట్రుబాబుకీ మొదట్రోజే ఊపిరి సలపిందికాదట. అప్పట్నించీ ఆయనగోరికి నడక నేకుండాపోయింది.

రాత్రి కొడుకింటికొచ్చేక ఈ సంగ్నతే సెబితే
‘‘ఊల్లో నడిసింది సాల్లే. టీవీ సూసుకుంతా ఇంటికాడ కూకో’’ అన్నాడట గీర్వానంగా.
‘‘మాకుసెలవుల్నేక బాద. మీకుండిబాద’’ బాపతీగా కోడలుగారు పుల్లయిరుపుమాటలేవో అనీనారట. దెబ్బకి మేస్ట్రుబాబుకి కళ్లనీళ్లు కుమ్ముకొచ్చీనాయట. అంతేకాదు. రోజూ కోడలుగారు కొడుకుగారికి మావ మీద కంప్లయించ్చీదట. బోగీమంటల్లో ఏసీడానికి పురుకోసకి పిడకలు గ్నుచ్చుతారే.. అంత సేకసెక్కింగా సాడీలమీద సాడీలు దండ గ్నుచ్చీసీదట.

‘‘ మీ నాన్న ఎదర ఎపార్టీమెంటీవోల్లతో ఎందుకు మాటాడాడో కనుక్కోమీ’’ అనీదట.

‘‘ఆల్ల అంతస్తేటి మన అంతస్తేటి’’ అని సణిగీసి గొణిగీసీదట.

ఆ మొగ్నుడుబాబు తండ్రిబాబూమీద సురాకారంనా సురుసురులాడీవోడట. ఆడేటి సప్పనేటి. ఆడికీ బాబంతే నెక్కనేదు.

ఈ యవ్వారం ఇలా నాలుగ్ను మాసాలు గ్నడిసీసరికి మేస్ట్రుబాబుకి ఎక్కణ్ణేని నిస్త్రాణమూ వచ్చి పడిపోనాది. ఆయనకి నా అన్న మనిసి నేకుండా పోయేడు. మాట మాటాడ్డానికి పిట్టమనిషి దొరికితే ఒట్టు. ఎపార్టీమెంట్లో వొవుల్తో మాటాడదామంటే ఆల్లే తలుపులేసీసుకుంతన్నారట. అలా పాతుర్డుగోరికి నోరున్నా మాటపడిపోయినట్టయిందట. ముద్దుల పెయ్యినాగ్నుండీ మనిషి ముదనస్టపు సేటపెయ్యినాగ్న అయిపోనారట.

‘‘ పులితోక గొర్రికరిసినట్టయిందిరా. నడిసీవోణ్ణి బంగ్నురుతున్నట్టుందిరో. నలుగ్నుర్లో నాడెంగా బతికీ మనిసిన్రా. కలీగ్నట్టి తెచ్చీసి ఒంటరోన్ని సేస్సేవురో ’’ అని కొడుకు దగ్గిర మొత్తుకునీవోరట.

‘‘ సుట్టూరా మనుసుల్తోటీ, మాటా మంతీతోటీ ఉండీవోణ్ణి తీసుకొచ్చి బోనులో ఎట్టీనావురా’’ అని గ్నగ్గోలెత్తీసీవోరట.

‘‘ నానిక్కడ ఏకాకినా బతకనేన్రా. ఊరికి పంపించీరా’’ అని ఆయాసపడిపోయీవారట.
ఆ కొడుకు పట్టించుకునీవోడే కాడట.

అలా రోజులు గ్నడిసీసరికి ఒకానొక దినం పెద్ద గోలే జరిగిపోయిందట.

ఎపార్టీమెంటీలో వొవులూ మాటాడ్డం నేదని మేస్ట్రుబాబు ఓసాయంత్రంపూట తన గోడేదో సెప్పుకోడానికేటో వాచుమేనుతోటి మాటకలిపినాడట. సరీగా ఆపీసు నించి వచ్చీ కోడలమ్మ ఇది సూసీసిదంట. కొడుక్కి సెప్పీసిందట. పెంటెట్టీసిందట. ఆయమ్మ, ఆ బాబు కలిపి ఆనాడు సెట్టంత మేస్ట్రుబాబునొట్టుకుని దడదడనాడిరచీనారట. పట్నంవొచ్చి మాపరువు బజార్న ఎడతన్నావని, పెతీ అనాకానీ ఎదవల్తోనూ మాటాడతన్నావనీ, పాటకపుజనాల్తో పనేటని సూబ్బరంగా దంచీనారట. మేస్ట్రుబాబును సేతులెత్తి కొట్నేదుగానీ, మాటల్తోనే అంతపనీ సేస్సేరట.

నేత్రాల్లోనించి జలములు పొంగీసి రాగా పాతుర్డుబాబు ఆయాల రాత్రి టిపినీ గిపినీ కూడా సెయ్యకుండా తొంగ్నుండిపోనాడట. ఆ తొంగోడమే తొంగోడం. అదే సివరి తొంగోడం. మరసట్రోజు మరి నెగ్ననేదట. తీరామోసి సూస్తే మేస్ట్రుగోరున్నారు గానీ, ఆయనలో పేనాల్లేవట. దేవుడి కాడికి ఎలిపోనారట.

మూడోనాడు మాకు కపురు తెలిసింది. ఆరోజు మా అర్జాపురం ఏడిసిన ఏడుపు తక్కువేడుపుకాదు. మా కన్నీల్లు సాన్నాల్లు బూమిలోనికి ఇంకనేదంతే ఒట్టు. పెతీ ఒక్కరం మా ఇంట్లో మనిసే పోయినట్టు ఏడిసేం. మావేనేటి. మా వురిసుట్టూ ఊల్లన్నీ కూడా బాదగా దుక్కపడ్డాయి. కపురు తెలిసేక ఊరుకోగ్నల్దువేటి. అంతా కలిసి వొయిజాగ్ను ఎలిపోనాం. డైరట్రగా ద్వారకానగ్నరమే ఎలిపోనాం.

మాం ఎల్లీసరికి సతీసుబాబు ఎపార్టీమెంటీలో వొవులూ నేరు. తాలం ఏసీసి ఉన్నాది. వాచుమేనుబాబు నడిగినాం. ఆ బాబు మొత్తం కదంతా సెప్పి మమ్మల్ని వొట్టుకుని ఎక్కిఎక్కి ఏడిసీనాడు. కన్నీల్లు మొకం మీదినించి కారి కారి ఆ బాబు ఏస్కున్న బనీన్ని పుల్లుగా తడిపీనాయి. సాయంత్రం వరకూ ఉంతేగ్ననక, మేస్ట్రుబాబుగారి కొడుకూ కోడలూ వచ్చెత్తారని వాచుమేను బాబు సెప్పినాడు.

‘‘ మా పాతుర్డుగోరు ఇంతగోరంగా సచ్చిపోయేక ఇంకెందుకు. వొయిజాగ్నుతో మాకేటి పని. మా వస్తువే పోనాది. ఇకనేటి’’ అనీసుకుని అందరమూ అర్జాపురం మల్లిపోనాం.

వచ్చీ దార్లో ఆలోసించుకుంతే మేస్ట్రుబాబే మా కల్లముందు కదలాడీనారు.

మా పాతుర్డుగోరు రోగ్నంతోనూ రొస్టుతోనూ సనిపోనేదు. మాటాడ్డానికి మనిసి దొరక్క సచ్చిపోనారు. కట్టం సుకం సెప్పుకోడానికి, నోరారా మాటాణ్ణీకి మనుసులు దొరక్క పోనారు. పేమను, మర్యాదానీ, మంచినీ ఇచ్చిపుచ్చుకునే దరమపెబువులు దొరక్క ఎలిపోనారు. అప్పుడు మా కనిపించీసింది. మనిసన్నోడికి అన్నవూ, గ్నుడ్డ గేరెంటీగ్నుండాలి. ఆటితో పాటు నలుగ్నురు మనుసులు కూడా వొప్పుడూ తోడుండాలి. మన సుట్టురా జనాలుండాలి. మనం ఆల్ల మయానుండాలి.

అలా నేపోతే..

అలా నేపోతే..

ఏటవుద్ది.. ఏటవుద్దీ..

ఇంతవరకూ ఆలోసించినాం గానీ, ఆ పైని కుసింత ఆలసించడానికీ మాకు మనసొప్పనేదు. దయిరం అంతకంటే సాల్నేదు…

 

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)



7 Responses to మేస్ట్రుబాబు మరినేరు!

  1. y. nageswara rao
    July 3, 2014 at 9:51 am

    మట్టి భాష, మనిషి భాష రాసిన చింతకింది కి జే జేలు. ఈ కళింగాంధ్ర కలం వీరుని నుంచి మరిన్ని మేస్త్రు బాబులు కథలుగా రావాలని కోరుకుంటున్నాను.

  2. July 3, 2014 at 10:12 am

    మనిసన్నాక మాటాడటానికి తోడుండాలి.అది కూడా అనాకానీ తోడు కాదు.పరువుకు తగ్గ తోడుండాలి.తలెత్తుకుతిరిగే తోడుండాలి.మాట గురి సూసి విసిరితే సేతులెత్తి కొట్టదం కన్నా మా గట్టిగా తగులుతాది.అలా ఇలా కాదు గుండెల్లోకి సూటిగా గుచ్చుకుంటాది.ఇక రోగమూ రొస్తూ అక్కర్నేదు టపా కట్టేసి పేనమొగ్గేడమే.అదే మానుసం మరి .ఉత్తరాంద్రలో అక్కడ బాబెవరో కూచోబెట్టి చెబుతున్నత్తే ఉంది కత .చింతకింది వారో అభినందనలండి .

    • July 4, 2014 at 2:19 pm

      మంచి మాటలు మాస్టారు

  3. July 3, 2014 at 12:12 pm

    చింతకింది ఓరూ ,

    అప్పుడేప్పుడొ చదివించిన రావి శాస్త్రి బాబు గారి కథనం గుర్తు వచ్చీసినాదండి ..బాబూ .. మాస్తారు పోయారా ? కాదు సెంపేసారు కదండీ బాబూ , మంచి సెబ్బర సెప్పుకోడానికి ,నలుగురు కావాలి కదండీ ,మనిషన్నాక, మరి నాలుగు గోడలు ,మూడు పూట్ల తిండి ,ఓ బొమ్మ్ల ల పెట్టె ,రంగులది ..ఇచ్చేసి .ఇంక బతికేయ్ అంటే ..
    బాబూ ..మాసట్ర గారు పోయారా ?? ఆయన తోనే మంచితనం , పోయిందా ??
    లేదా ? ఉందనటారా , ఆ ఊరు లో నే ఉండాలి ..అంతే మరి ..
    మా అమ్మ సెప్పింది ,నోరు మంచిదైతే ఊరు మంచిదని ..
    మరి ఆ ఊరు ఎక్కడా అంటే ..నీ చుట్టు నే ఉందే అంది అమ్మ .
    ఆ అమ్మ ని గుర్తు చేసారు ..భలే మంసుని తట్టే కత ..

    వసంత లక్ష్మి .

  4. bhaskar lekkala
    July 9, 2014 at 4:38 pm

    లచ్చాపాత్రుడు వంటి మంచి మనిషిని మాకు చూపినందుకు చింతకింది గారికి నమస్కారాలు. ఈ భూమి మీద మంచి ఎలా నిలబడుతుందో అర్ధం కావడం లేదు. ఏది ఎమైన రచయితగా శ్రీనివాస రావు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నందుకు సంతోషిస్తున్నాను .

  5. allu venkatesh
    July 11, 2014 at 5:52 pm

    కథ బాగుంది. కథనం అద్భుతం. యాస కథకి శ్వాస అయింది. అందుకే నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. రచయితకు అభినందనలు.

  6. July 17, 2014 at 4:54 pm

    వోవులాలు సిన్తకింది శ్రీనివాసు బాబ ? మావు ఎప్పుడో వోగ్గినాం ఇజనరాన్ని, అయినా ఈ బాబు వోగ్గిసిన ఇజనారాన్ని మళ్ళి గుర్తు తెచ్చినాడు. ధర్మ పెబువులు లచ్చాపాతుర్డు గోర్ని కళ్ళ ముందు ఎట్టి ఒరే బతుకు మానవు బతికినం కుక్క బతికింది ఎటి నాబం బతికితే లచ్చాపాతుర్డు నాగ బతకాలిరా అని జనాలకి సేప్పేరు. ఆరు పదికాలాల్ పాటు సల్లగుండాల

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)