కవిత్వం

ఒక పరిమళ భరిత కాంతి దీపం

జూలై 2014

బ్రతుకుని వంపుకున్న
నీటి ప్రవాహపు హోరులో
నాకు తెలిసి అమ్మే నా మొదటి పుస్తకం
నాన్నే కదా నా తొలి భాష

ఎక్కడా ఏమీ మిగలని తనంతో
మనం కదుల్తున్నప్పుడు
శరీర ఊపిరుల మధ్య నుంచి
నేను పుస్తకం లోకే నడుస్తాను

పుస్తకం బతుకు లాంతరంత గొప్పది
నాకైతే
విశ్వ స్నానపు అనుభూతి ఒక్క పుస్తకం తోనే సాధ్యం
రీతులు,గోతులు,గొంతుకల వారదే కదా పుస్తకం

నీ ప్రపంచాన్ని ఇతరుల ముందు నిలపాలన్నా
ఇతర ప్రపంచపు వాకిలి నీవు తట్టాలన్నా
అది ఒక్క పుస్తకం తోనే సాధ్య మయ్యే పని ..

పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడల్లా
నాకు జ్ఞాన పుష్పాన్ని కౌగిలించు కున్నట్లుంటుంది
దాన్ని చదివేసాక
స్వర్గలోకంలో తయారైన అత్తరుని
ఒంటికి పూసుకు తిరిగినట్లుంటుంది …

నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు
నన్ను నేను అక్షరంలో ఒదుగుకున్నట్లు
నా లోపలి అతిధిని బయటకు తీసి సంభాషించినట్లు
తోడి పెట్టుకున్న బ్రతుకుని మరో కక్ష్య లోకి ప్రవేశ పెట్టుకున్నట్లు
కలయిక ఒక్కటే ఒక సందోహ నిష్పత్తిని విభజించి నట్లుగా
పుస్తకాన్ని ముట్టుకున్నప్పుడల్లా
నాకు అనిపిస్తుంటుంది ..

అక్షరం చదవక ముందు మనిషి నయిన నేను
అక్షరాన్ని గుండె నిండా నింపు కున్నాక
రెక్క లోచ్చిన పక్షినై ఆకాశాని కేగుతాను

పుస్తకం అనేకానేక రహస్య తెరల్ని విడదీసి
మన ముందు ఒక నిజ ప్రపంచాన్ని నిలబెడుతుంది

ఆకలి తీరడానికి పుస్తకం కారణం కాక పోవచ్చు ,కానీ
ఒక విశ్వాసాన్ని మన ముందు వుంచి
దాన్ని అభిషేకించి
మంత్రించిన నాగలిని భుజాన పెట్టగలదనే నమ్మకం నాది

పవిత్ర గ్రంధం కోదాఒక పుస్తకమే కదా
అందుకే జీవితమంత గోప్పదిగానే భావిస్తాను ,నేను పుస్తకాన్ని

స్వర్ణ దశల వెలుగు గదుల్లో బందీనయి
అనేక రంగుల క్రియా జన్మల సౌందర్యాన్ని అనుభవిస్తూ
రక్త జ్వలిన నిరీక్షిత ప్రపంచాన్ని వీక్షిస్తూ
కన్నీళ్లను ఆర బెట్టుకున్న జీవితాల్ని
కవిత్వం చేయడానికి ..
నేను జీవిత పుస్తకపు ముందు మాటను చదువుతాను
నా లోపలి అంతః ఛాయలకు వెలుగులతో నింపుకోడానికి
గుండె పుస్తకాన్ని మండించి మార్గాన్ని నిర్మించుకుంటాను

ఆకాశం పుస్తకం మీద నక్షత్రాల అక్షరాల్ని చదువుకుంటూ
చీకటి దశల్ని చీల్చి నా దారుల నిండా వెలుతురు నింపుకుంటాను
పుస్తకం నా పురాతన సహవాసి
ఒక పూర్ణ దేహాన్ని విప్పినంత స్పష్టంగా
నేను పుస్తక ప్రయాణాన్ని అతి పవిత్రంగా ముగిస్తాను
రోజూ జరిగే జీవన క్షణాల
దేహ శిక్షల్ని పుస్తకంగా మలుచు కుంటాను

నా దృష్టిలో
“పుస్తకం ఒక పరిమళ భరిత కాంతి దీపం”
(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)

చిత్రం: జావేద్