ప్రత్యేకం

బహుముఖ ప్రజ్ఞాశాలి చేరా

ఆగస్ట్ 2014

ఆధునిక భాషాశాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు చేకూరి రామారావు తెలుగువారు గర్వించదగిన మహానుభావుడు. ఆధునిక భాషా రంగంలో అనితర సాధ్యమైన గుర్తింపు పొందిన మహా వ్యక్తి. ఆయన మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు. భద్రిరాజు కృష్ణమూర్తి, తూమాటి దొణప్ప తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన చేకూరి రామారావు తెలుగు వారికి చిరస్మరణీయులు. ఆయన వాడుక భాషా వ్యాప్తికి చేసిన కృషి ప్రశంసనీయం.

అందరికి ‘చేరా’గా సుపరిచితుడైన చేకూరి రామారావు ఖమ్మం జిల్లా మధిర తాలుకా ఇల్లిందుల పాడు గ్రామంలో జన్మించారు. ఆయన ప్రాధమిక విద్య గుంటూరు జిల్లా నరసరావుపేటలోను, ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో పూర్తి చేశారు. డిగ్రీ, యం.ఏ. తెలుగు హైదరాబాదులో పూర్తి చేసి, అమెరికా వెళ్ళి కార్నల్ యూనివర్శిటీలో జెరాల్డ్ కెలి పర్యవేక్షణలో ‘తెలుగు నామ్నీకరణం’(నామినలైజేషన్) పై పిహెచ్.డి. చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో లింగ్విస్టిక్  ప్రొఫెసర్ గా పనిచేసి అక్కడే పదివీ విరమణ చేశారు. కథకునిగా, విమర్శకునిగా, సాహితీవేత్తగా చేకూరి తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు.

వచన కవిత్వంలో దిట్ట అయిన చేరా వివిధ దిన పత్రికల్లో అనేక వ్యాసాలు, చేరాతలు వ్రాశారు. 1975 నుండి ఇటీవల కాలం వరకు ఎన్నో పుస్తకాలు ఆయన కలం నుండి జాలువారాయి.  తెలుగు వాక్యం, వచన రచన తత్త్వాన్వేషణ, సాహిత్య కిర్మీరం, భాషా పరివేషం, తెలుగులో వెలుగులు(భాషా పరిశోధన వ్యాసాలు), స్మృతి కిణాంకం, ఇంగ్లీషు – తెలుగు పత్రికా పదకోశం, ముత్యాలసరాల ముచ్చట్లు, చేరా పీఠికలు, వచన పద్యం లక్షమ చర్చ, రెండు పదుల పైన, చేరాతలు సాహిత్య విమర్శ – పరామర్శ, భాషాను వర్తనం, భాషాంతరంగం, సాహిత్య వ్యాసరించోళి, కవిత్వానుభవం  తదితర రచనలు చేసి భాషావ్యాప్తికి తన వంతు కృషి చేశారు.

చేరా 2000లో రచించిన ‘స్మృతి కిణాంకం’ అనే వ్యాస సంపుటికి 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వాడుక భాషకు కొత్త పుంతలు తొక్కించేందుకు చేరా ఎంతగానో కృషి చేశారు.  తెలుగు సాహితీ విమర్శకునిగా ప్రసిద్ధ చెందారు. జస్టిస్ ఆవుల సాంబశివరావు స్మారక పురస్కారాన్ని కూడా చేరా అందుకున్నారు. చేరా భాషా వైదుష్యానికి, నిశిత పరిశీలనా నైపుణ్యానికి గుర్తింపుగా తెలుగునాట అనేక సాహితీ, సాంస్కృతిక సంస్థలు సన్మానాలు జరిపి అక్షర నీరాజనాలర్పించాయి. చేరాది కుల – మత – ప్రాంతీయ దురభిమానాల సంకుచిత సరిహద్దులలో ఇమడని వ్యక్తిత్వం.

ఆధునిక భాషాశాస్త్రవేత్తగా చేరా :- భాషాశాస్త్రం ఆయనకు అధికారిక అధ్యయన రంగం. సాహిత్యం ఆయనకు అభిరుచి రంగం. భాషాశాస్త్ర పరిశోధనలో కొత్త దారి తొక్కి, తెలుగు వాక్య నిర్మాణ రహస్యాలను ఆయన ఆవిష్కరించారు. 1975లో ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా ప్రచురించిన ‘తెలుగు వాక్యం’ తెలుగు వాక్యానికి నవీన వ్యాకరణం వంటిది. ఆధునిక తెలుగు వాక్యాన్ని చేరా వ్యవహర్తల సంభాషణల నుంచి, ప్రసిద్ధ వచన రచనల నుంచి నమూనాలుగా తీసుకొని విశ్లేషణలు – వ్యాఖ్యలు చేశారు. రాసే తెలుగుకి – మాట్లాడే తెలుగుకి అంతరం ఉండి తీరుతుందని, రాసే భాష ప్రయోజనాలు భిన్నమైనవని, బౌద్ధిక వచనం సూటిగా అలంకార రహితంగా ఉండాలని ఆయన వాదించేవారు. వాక్య నిర్మాణానికి సంబంధించిన తన శాస్త్రీయ సూత్రాలనే చేరా వచన కవిత్వ విశ్లేషణకు కూడా వినియోగించుకున్నారు.  ఆధునిక భాషాశాస్త్ర రంగంలో నవ్య విప్లవానికి నాందీ పలికిన నామ్ చామ్ స్కీ సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి, చేరా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

ఆధునిక సాహిత్య విమర్శకునిగా చేరా :- చేరాకు విస్తృతమైన ప్రసిద్ధిని అందించింది ఆయన ‘చేరాతలు’ కాలమ్. 1986 నుంచి 1994 దాకా ఎనిమిదేళ్ళ పాటు ఆంధ్రజ్యోతీ ఆదివారం సంచికలో ఆయన నిర్వహించిన చేరాతలు కాలమ్ నాటి సాహిత్య లోకంలో ఒక సంచలనం. సమకాలీన కవిత్వ విశ్లేషణగా సాగిన ఆ కాలమ్, కొత్తగా రాస్తున్న కవులకు ప్రోత్సాహకరంగా ఉండేది. రూపరీత్యా కవిత్వ నిర్మాణ పద్ధతిని వ్యాఖ్యానిస్తూ చేరా రాసిన వ్యాసాలు, అప్పటి తెలుగు సాహిత్య సమాజానికి అలవాటైన వస్తు విమర్శకు పూర్తిగా భిన్నమైనవి. చేరా ప్రగతిశీల భావాలు కలవారు. ప్రజా వ్యతిరేక కావ్య వస్తువును సమ్మతించేవారు కాదు.

కవితా నిర్మాణం మీద కేంద్రీకరించిన తీరు ఆయనకు రూపవాది అనే విమర్శను తెచ్చిపెట్టింది. వస్తువుతో ఏకీభావం ఉన్నప్పుడు, విమర్శించవలిసింది రూపాన్నే కదా… అని చేరా తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చేవారు. కవిత్వం రాయడానికి కాదు, కవిత్వాన్ని ఆస్వాదించడానికి కూడా కొంత శిక్షణ – సహాయము కావాలని చేరాతలు నిరూపించాయి.  కొత్త కవిత్వ పథంలో తొలి అడుగులు వేస్తున్న కవులకు చేరాతలు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు, వారి కవిత్వాన్ని అర్ధం చేసుకోగలిగిన పాఠకులను కూడా అవి రూపొందించాయి.

చేరాతలు కాలమ్ చేరాకు ప్రఖ్యాతితో పాటు, అనేక సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. ఆయన కాలంలో కనిపించిన కవులకు సాహిత్యరంగంలో ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో, చేరా ఎంపికపై విమర్శలు వచ్చాయి. చేరా తన విమర్శలలో స్త్రీవాద సాహిత్యానికి పెద్ద పీఠ వేశారు. స్త్రీ వాద కవిత్వాన్ని అర్ధం చేసుకోలేక నిరాకరిస్తున్న అనేకమంది కవుల – మేధావుల – విప్లవ కారుల ఆలోచనలకు సరియైన దారిలో పెట్టడానికి ఆయన విమర్శలు దోహదపడ్డాయి.  విప్లవ – దళిత కవులను కూడా చేరా అప్పుడప్పుడు తన విమర్శలలో పరామర్శించారు.

 బహుముఖ ప్రజ్ఞాశాలి చేరా :-  అనువాదరంగమన్నా కూడా ఆయనకు విశేషమైన అభిమానం. ఆయన కొన్ని కవితలను అనువాదం చేయడమే గాక, అనువాద శాస్త్రం పై తన అభిప్రాయాలను వివిధ వ్యాసాలలో వ్యక్తీకరించారు. భద్రిరాజు కృష్ణమూర్తి గారి వ్యవసాయ వృత్తి పదకోశం లోని అనుభవంతో ఆయన నిఘంటవు నిర్మాణరంగంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, తెలుగు విశ్వ విద్యాలయంలో ఒక శాఖ ఏర్పాటుకు కృషి చేశారు. పత్రికా భాషపై ఆయనకున్న అభిమానంతో పత్రికలకు పనికివచ్చే ఇంగ్లీషు – తెలుగు పత్రికా పదకోశం కూడా నిర్మించారు. సాహిత్యాభిరుచి వల్ల ఆయనకు అటు భారతీయ సాహిత్య విమర్శ (ఛందో – అలంకార శాస్త్రాల విషయంలో) – పాశ్చాత్య సాహిత్య విమర్సలతో పాటు భాషాశాస్త్ర దృక్పథంలో ప్రారంభమై శైలి శాస్త్రం – ఈ మూడింటినీ జోడించి సాహిత్య విమర్శ ప్రారంభించారు. భాషాశాస్త్రంతో పాటు ఛందస్సు కూడా చేరాకు ఇష్టమైన రంగం. ముత్యాలసరం  మీద – వచన కవిత్వ లక్షణాల మీద సుదీర్ఘ చర్చలు చేశారు.

తొలి ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా వెలువరించిన ‘తెలుగువాక్యం’ మొదలుకొని నిన్నటి ‘భాషా పరివేషం’ వరకు ఎన్నో ఏళ్ళుగా చేరా రచనా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆయన గ్రంథాలు పునర్ముద్రితమవుతూనే ఉన్నాయు. సాహితీ వేత్తలు, విమర్శకులు, పాత్రికేయులు సమీక్షించి అంచనా కట్టే ప్రయత్నం చేశారు. సహజంగానే దృక్పథాల్లో ఉన్న వైరుధ్యాల వల్ల చేరా పుస్తకాల మీద వచ్చిన సమీక్షలలో సానుకూలమైనవి, ప్రతికూలమైనవి కూడా ఉన్నాయి. నిజ జీవితంలో ఇతరులను నొప్పించడం గాని, పరుషంగా మాట్లాడటం గానీ ఏనాడు చేయని చేరా భాషా సాహిత్య విమర్శనా రంగాలలో తన అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పడానికి ఏమాత్రం వెనుకాడే వారు కాదు. అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పినా  ఎదుటి వారి పట్ల ఆదరాభిమానల విషయంలో ఎన్నడూ ఆయన లోటు చేసేవారు కాదు. మానవీయ విలువలకు పెద్ద పీఠ వేయడంలో చేరాది ఎన్నడూ పెద్ద మనసే. తనను విభేధించే వారితో సైతం ఔన్నత్యాన్ని ప్రదర్శించి, వారిని ప్రశంసించగల సహృదయం చేరాది. అందువల్లే చేరా అందరి చేత మన చేరా అనిపించుకున్నారు.

ఆధునికత, ప్రగతిశీలత, సంయమనం, అపారమైన పాండిత్యం, గాఢమైన కవిత్వ ప్రేమ…..ఇన్ని లక్షణాలు కలగలసి రూపుదాల్చితే చేరా. చేరా తన జీవితకాలంలో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ప్రతిభలోనూ – ప్రజ్ఞలోనూ ఆయనతో ఏమాత్రం సరితూగని వారు ఉన్నత పదవులు అలంకరించినా, చేరా ఏనాడు పదవులు – హాదాలు కోరుకోలేదు.

తొలితరం భాషాశాస్త్రవేత్తగా, ఆధునిక సాహిత్య విమర్శకునిగా, నిఘంటువు నిర్మాతగా, ఎందరో తెలుగు రచయితలకు – రచయిత్రులకు స్ఫూర్తినిచ్చిన ఆదర్శమూర్తిగా చేరా తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. భౌతికంగా చేరా నేడు లేకపోయినా భాషాశాస్త్ర రంగంలో – ఆధునిక సాహిత్య విమర్శలో నూత్న పథంలో ముందుకు సాగే వారికి దిక్సూచిలా, వెలుగు దివ్వెలా దారి చూపిస్తునే ఉంటారు.