ప్రత్యేకం

అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య

ఆగస్ట్ 2015

తొలితరం ఉద్యమ రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్యులు అస్తమయం తెలుగు జాతి ప్రజలకు – సాహిత్యానికి తీరని లోటు. వేదం నుంచి ఉద్యమం దాకా దగ్గరగా లోతుగా పరిశీలించి రచనలు చేసిన విలక్షణ రచయిత రంగాచార్య. బాల్యం నుంచి చివరి శ్వాస దాకా వివిధ సాహితీ ప్రక్రియల్లో ఆయన రచనలు చేశారు. రంగాచార్య జీవితం భిన్న వైరుధ్యాల నిలయం. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లా ఉండే అంశాలు ఆయనలో ఒక్కటిగా కలిసి కాపురం చేస్తాయి. ఆయనను చూస్తే, నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన పోరులో తుపాకీ పట్టిన యోధుడని, ఆయన నుదిటి పై కనిపించే తిరునామాలు చూసి ఆయనొక మార్క్సిస్ట్ అని ఎవరూ అనుకోరు. రంగాచార్య సంప్రదాయాన్ని ఎంతగా ప్రేమించారో, సంప్రదాయాన్ని కూడా అంతే ఇష్టపడతారు. భిన్నిత్వంలో ఏకత్వం అనే భారతీయ దృక్పథానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన దాశరథి రంగాచార్య స్వాతంత్ర్య సమర యోధునిగా, అక్షర బ్రహ్మగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.

వరంగల్ జిల్లా చిన్న గూడూరులో 1928 ఆగష్టు 24న జన్మించిన రంగాచార్య హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఉద్యమబాట పట్టారు. ‘అధ్యయనం – పోరాటం’ అనే నినాదానికి ఆయన అక్షర సాక్షి. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటూ నినదించిన దాశరథి కృష్ణమాచార్యులు ఆయనకు అన్న. తెలంగాణ వేదనను, వీరత్వాన్ని దాశరథి సోదరులు స్వయంగా అనుభవించి సాహిత్యంలో పలవరించారు. ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజం ప్రేరణతో అన్నయ్య నైజాం సంస్థానానికి వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టగా, తమ్ముడూ అదే బాటలో అడుగులు కదిపారు. తండ్రి సనాతనవాది అయినా అన్నయ్య సాంగత్యంలో రంగాచార్య అభ్యుదయ పంథా తొక్కారు. నేరుగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పగలు బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూనే, రాత్రుళ్ళు రైతు కూలీలకు ఉద్యమ బోధన చేసేవారు. ఇంతలో అన్న కృష్ణమాచార్య జైలు పాలుకావడంతో ఇంటి బాధ్యతలన్నీ రంగాచార్య మోయాల్సి వచ్చింది.

కుటుంబం ఉద్యమ ప్రభావంలోకి వెళ్ళడాన్ని తండ్రి వెంకటాచార్యులు తట్టుకోలేక భార్యబిడ్డలను వదిలేసి వెళ్ళిపోయారు. బతుకు తెరువు కోసం తల్లి వెంకటమ్మ హరికథలు చెబితే, రంగాచార్యులు లైబ్రేరియన్ గా పనిచేశారు. ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో రజాకార్లు పెట్రేగిపోయారు. ఉద్యమ నేపథ్యం కలిగిన దాశరథి కుటుంబంపై దాడులు చేశారు. ఈ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్ళిన రంగాచార్య తుపాకీ పేల్చడంలో శిక్షణ తీసుకున్నారు. తుపాకీ గుండ్లకు గుండెలనడ్డి రజాకార్లను ఎదుర్కొన్నారు. 1948 సెప్టెంబరు 16న పోలీస్ యాక్షన్ తరువాత రంగాచార్య ఉద్యమం నుండి బయటకు వచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత ప్రజలను పీడించిన దొరలే ఖద్దరు, గాంధీ టోపీ ధరించి రాజకీయ నాయకులుగా అవతారమెత్తారు. రంగాచార్య వారి మధ్య ఇమడలేక పోయారు. స్వయంకృషితో చదువుకొని 1951లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. తరువాత 1957లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో చేరి 1988లో అసిస్టెంట్ కమీషనర్ గా రిటైరయ్యారు. మారేడ్ పల్లి మున్సిపల్ ప్లే గ్రౌండ్ పక్కన ఉన్న ఇరుకైన సందులోని మూడు గదుల ఇల్లు ఆయన గడిపిన సాధారణ జీవితానికి అద్దం పడుతుంది.

“నేను కత్తీ, డాలూ పట్టుకోలేను. సాయుధుడనై ఎదిరించలేను. నా పెన్నే నా గన్ను” అని చాటిన ఘనపాటి దాశరథి రంగాచార్యులు. ఆయన తన రచనల ద్వారా ప్రజల్ని మేల్కొపడానికి, అన్యాయాన్ని ఎదిరించేలా పురుగొల్పడానికి ఇష్టపడేవారు. తెలంగాణ సాయుధ పోరాటానికి రంగాచార్య రచనలు ఎంతగానో దోహదం చేశాయి. లక్ష్యశుద్థితో ఆయన తన రచనలు కొనసాగించారు. దాశరథి రంగాచార్య సాహితీ సేవ విలక్షణమైనది, విస్తృతమైనది, విభిన్నమైనది. రంగాచార్య రచనలు భావోద్రేకాలు రగిలించేకన్నా, భావోద్వేగాలు కలిగిస్తాయి. మహా రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి రచనలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆళ్వారు స్వామి వదిలి వెళ్ళిన రచనా ఉద్యమాన్ని రంగాచార్య తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. ఆయన సనదైన పద్ధతిలో తెలంగాణ ప్రజల జీవన చిత్రణ కోసం నవలా రచనకు పూనుకున్నారు.

రంగాచార్య మొత్తం 9 నవలలు రాశారు. వీటిలో ‘చిల్లరదేవుళ్లు’, ‘మోదుగుపూలు’, ‘జనపదం’ నవలలు పిరీయాడిక్ నవలలు కావడంతో ఒక నవల ముగింపు మరో నవలకు ప్రారంభం అవుతుంది. ఆయన తన తొలి నవల ‘చిల్లరదేవుళ్లు’ను 1969లో వెలువరించారు. తెలంగాణ గురించి తెలంగాణ మాడలికంలో రాసిన నవల కావడంతో ఈ నవలకు విశేష ఆదరణ లభించింది. మొదటి నవలకే రంగాచార్య కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి అందుకున్నారు. దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధ పోరాటం నాటి వాతావరణాన్ని, ఆ కాలంలోని బానిస పరిస్థితులను ఈ నవలలో విస్పష్టంగా ప్రస్ఫుటీకరించారు. గార్ల ప్రాంతంలోని జాగీర్దార్ల దాష్టికాలను ఈ నవలలో కళ్ళకు కట్టించారు. ఈ నవలలోని పీరిగాడు, పాణిమంజరి, ఇందిర పాత్రలు ఆనాటి సమాజంలోని ప్రజలకు ప్రతినిధులు. ఈ నవల 1974లో చలన చిత్రంగా వచ్చింది. ‘చిల్లరదేవుళ్లు’ 1938కి పూర్వపు తెలంగాణ ప్రజల జీవనాన్ని చిత్రిస్తే, తెలంగాణ సాయుధ పోరాటంలోని 1942-48 సంవత్సరాల మధ్య కాలాన్ని ‘మోదుగుపూలు’ నవల వర్ణిస్తుంది. రంగాచార్య నిర్వహించిన పోరాట చిత్రణమే ఈ నవలలోని ఇతివృత్తం. ఈ నవల చదివే చండ్ర రాజేశ్వరరావు రంగాచార్యను ‘ఆంధ్ర గోర్కీ’గా అభివర్ణించారు. ‘చిల్లరదేవుళ్లు’, ‘మోదుగుపూలు’ వంటి నవల్లో తెలంగాణ పలుకుబడులను – నుడికారాన్ని పలికించారు.స్వాతంత్ర్యం తరువాత రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలాన్ని ‘జనపదం’ నవలలోచిత్రించారు.

నగర సమస్యల ఇతివృత్తంతో ‘మాయాజలతారు’ నవల రాశారు. దేశంలో సామ్యవాద స్థాపన జరుగుతుందన్న ఆశలను – ఆశయాలను ‘రానున్నది ఏది నిజం’ నవలలో చిత్రించారు. మతాలు వెలసిపోయే రంగులని, మానవత నిరంతంరం నిలిచే వుండే ఘనతని సందేశాన్నిస్తూ ‘మానవత’ నవల వ్రాయబడింది. ఒక బ్రాహ్మణునికి, ఒక దళితునికి మధ్య స్నేహాన్ని కల్పించి, మానవత్వం దైవత్వానికి అతి దగ్గరని ‘శరతల్పం’ నవలలో నిరూపించారు. స్వాతంత్ర్యం తరువాత కూడా ఆ స్వాతంత్ర్యపు వెలుగులు ప్రసరించని గ్రామాలు ఎలా దోపిడీకి గురయ్యాయో, ఆ దోపిడీలో ప్రజల విషాద జీవితాలు, టీచరమ్మ నుంచి చైతన్యం పొందిన గ్రామస్థులు తిరగబడి విజయం సాధించడం ‘పావని’ నవల చిత్రిస్తుంది. వీటి తరువాత రంగాచార్య దృష్టి సంప్రదాయ సాహిత్యంపై పడింది.
భారతం, వేదాలు, ఉపనిషత్తులు అనువదించిన తరువాత మళ్ళీ నవలా రచనకు ఉపక్రమించారు. ప్రపంచీకరణ, పారిశ్రామీకరణ ప్రభావంతో మరణం వైపు పయనిస్తున్న ప్రజలకు అమృతం వైపు పయనింపజేసే ‘అమృతంగమయ’ నవల రాశారు. ఇందులో భారతీయ తాత్త్వికత, దాని గొప్పదనం, ఆంగ్లేయులు దాన్ని ధ్వంసం చేసిన విధానం, భారతీయ సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం తదితర అంశాలను ఆ నవల చర్చిస్తుంది. సుదీర్ఘ తెలంగాణ సామాజిక పరిణామాలను తన రచనల్లో ప్రతిబింబించిన రంగాచార్య తన ఆత్మకథను ‘జీవనయానం’ పేరుతో రాశారు. మౌలికంగా ఈ రచన ఆయన స్వీయచరిత్రే అయినా పాఠకులకు ఎక్కడా స్వోత్కర్ష కనపడదు. తానేమిటో చెప్పేకన్నా, ఒక రచయితగా తన బాధ్యత ఏమిటో జీవనయాత్రలో అవగతం చేశారు. ఈ రచనలో రంగాచార్య తన జీవింతంలో పాటు, ఏడి దశాబ్దాల తెలుగు జాతి జీవనాన్ని చిత్రించారు. బుద్ధుని జీవిత చరిత్రను ‘బుద్ధ భానుడు’ పేరుతో అపురూపమైన రచనను 2010 సంవత్సరంలో వెలువరించారు. రంగాచార్య నవలలు ఎక్కువగా వ్రాసినా తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కథా సాహిత్యం అంటే ఆయనకెంతో అభిమానం. రంగాచార్య చేతి నుండి జాలువారిన కథా సంపుటి ‘నల్లవాగు’. సమర సాహిత్యానికి చెందిన ‘రణరంగం’, ‘రణభేరి’, ‘జనరంగం’ వీరి రచనలే.

తొలుత కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రభావితుడైన రంగాచార్య తదనంతరకాలంలో ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శ్రీ మద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు. కాలక్రమంలో వాల్మీకి రామాయణంలో చోటు చేసుకున్న అవాల్మీకాలు లేకుండా అచ్చంగా వాల్మీకి ప్రొక్తమైన రామయణాన్ని ‘శ్రీ మద్రామాయణం’ పేరుతో తెలుగువారికి వచనంలో అందించారు. రామాయణంలో అక్కడక్కడా రాసిన రంగాచార్య విమర్శనాత్మక అభిప్రాయాలు చదువరులను ఆలోచింపజేస్తాయి. అపరితమైన పరిజ్ఞాన్ని అందిస్తాయి. ‘సీతా చరితం’ పేరుతో మరోసారి రామయణాన్ని రాశారు. 1994లో హరివంశ సహిత ‘మహా భారతం’ రచించారు రామాయణ, మహా భారత రచనల తరువాత ‘శ్రీ మద్భాగవతం’ రాశారు. ఈ రచనలో రంగాచార్య వ్యాసున్ని అనుసరించినా, పోతన పద్యాల రుచిని పాఠకులకు చూపించారు.

అనంతర కాలంలో తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించి ‘అభినవ వ్యాసుని’గా ఖ్యాతిగాంచారు. వేదాలను అనువాదం చేయడానికి ముందు ఆయన తన వేషధారణ కూడా మార్చుకున్నారు. పంచె కట్టుకోవడం, చొక్కా వేసుకోకుండా శాలువా కప్పుకోవడం, నుదుట మూడు నామాలు పెట్టుకోవడం చాలా మందిని ఆశ్చర్యపర్చింది. ఆయన జీవితంలో వైరుధ్యంగా కనిపించిన విషయం. దీనికి ఆయన మతం వ్యక్తిగతమైంది. “మార్క్సిజానికి, నా వేషధారణకు, వేదాల అనువాదానికి మధ్య వైరుధ్యమేమీ లేదు” అంటూ నిక్కచ్చిగానే సమాధానమిచ్చారు. ప్రజలకు వేదం అనే నినాదంతో వేద ఉద్యమాన్ని ప్రారంభించి, విజయవంతంగా పూర్తి చాశారు. వేదాలను అందరూ చదువుకునేలా రాస్తావా? అంటూ సంప్రదాయవాదులు ఫోన్ ల ద్వారా, ఉత్తరాల ద్వారా హెచ్చరించినా ఆయన ఏమాత్రం లెక్క చేయలేదు. వేదావిష్కరణలో ఒక స్త్రీకి, ఒక దళిత యువకునికి వేద ప్రతులను అందించారు. వేదాలను ప్రవేశికగా వేదాలు మానవజాతి అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపాయో, నేటి యాంత్రిక నాగరికతకు వేద సాహిత్యంలో ఎటువంటి సమాధానాలు ఉన్నాయో వివరిస్తూ ‘వేదం – జీవననాదం’ రచించారు. రంగాచార్య వేద రచనను వివరిస్తుంటే రచయితకు ఉండాల్సిన మొదటి అర్హత ఏమిటో అర్ధమవుతుంది. సమాజహితం కోసం చేసే ఏ రచనకైనా ధైర్యం ఉండాలని ఆయన మాటల్లో బోధపడుతుంది.

రంగాచార్య జీవితానికి, అనువాదాలకు విడదీయని బంధం ఉంది. ఆయన చిన్నతనంలోనే వారి తండ్రి నిర్వహించిన ‘దాశరథి’ పత్రిక కోసం ద్రావిడ గ్రంథాలను అనువదించారు. తరువాత కాలంలో ఆయన సాహితీ జీవితం అనువాదంతోనే ప్రారంభం అయింది. 1940ల్లో కోల్ కతాలో వచ్చిన కరువు రక్కసి గురించి ప్రఖ్యాత భారతీయ ఆంగ్ల రచయిత భవానీ భట్టాచార్య రాసిన నవల ‘He who rides A tiger’ను ‘దేవుని పేరిట’ పేరుతో తెలుగులో అనువదించారు. తొలినాళ్ళలో రంగాచార్య పిల్లలకోసం ‘వివేకనందుడు’, ‘మహాత్ముడు’, ‘కాళిదాసు’ అనే మూడు నాటకాలు రచించారు. 1974లో ‘శ్రీ వేంకటేశ్వర లీలలు’ రచించారు. రంగాచార్య రచనలు పబ్లిషర్లకు లక్ష్మీకటాక్షాన్నిచ్చాయి. ఐతే తాను మాత్రం సరస్వతీ కటాక్షానికే సంతృప్తులైనారు.

రంగాచార్యుల రచనలది విశిష్ట పంథా. మెలోడ్రామాలు సృష్టించడం ఆయన సాహితీ నైజానికి విరుద్ధం. శిల్పాన్ని త్యాగం చేయకుండా చెప్పాల్సిన కథను ఆయన అలవోకగా నడిపించగలరు. యువకళావాహిని ఆయనకు అక్షర వాచస్పతి బిరుదు ప్రధానం చేశారు. రచయిత భావుకత్వానికి ఒక నైజం ఉండాలని ఆయన తరచూ అనేవారు. భావుకత్వానికి నైజం అనే మాట సాహిత్యంలో కొత్త ప్రయోగానికి నాంది పల్కింది. కథలు, నవలల్లోని పాత్రలు పాఠకునికి సన్నిహితమైతమైతేనే ఆ రచన సమాజానికి స్ఫూర్తిదాయకం అవుతుందని దాశరథి విశ్వసించేవారు. ప్రాంతీయ విభేదాలు, కులాలు, మతతత్వ ప్రాతిపదికన రచనలు చేయడం ఆయనకు నచ్చేది కాదు. అన్యాయాలను ఎదుర్కొవడమే రచనల ముఖ్య ఉద్దేశం కావాలని రంగాచార్య దృఢంగా నమ్మేవారు. ఆయన రచనలు చదివిన ప్రతి పాఠకుడూ తనను తాను పరిశీలించుకునే అవకాశం కలుగుతుంది. అటువంటి సాహిత్యమే సజీవంగా నిలుస్తుంది.

మన కాలపు మహా మనిషి రంగాచార్య రచనల్లో తెలంగాణదనం ఉట్టిపడుతుంది. ఆయన రచనల్లో ప్రగతిశీలురు అభ్యుదయాన్ని చూడవచ్చు. వేదపరాయణులు వేదాలను తెలుసుకోవచ్చు. రంగాచార్య వెలువరించిన సారస్వతాంబుధిలో సాహితీవేత్తలకు సాహిత్య రత్నాలు లభిల్తాయి. చరిత్రకారులకు తెలంగాణ చరిత్ర దర్శినమిస్తుంది. మానవత్వమే రంగాచార్య నమ్మిన మతం. ఆయన వేదం….జన జీవన నాదం. ఆయన రచనలు మట్టి బతుకుల అక్షర చిత్రాలు. నిరంకుశంపై అంకుశం రంగాచార్య కలం. ఆయన ఒక కథ రాసినా, ఒక నవల రాసినా…అది తిరుగుబాటు బావుటే. అది ముమ్మాటికీ సామాన్యుడి గొంతుకే. అందుకే కాబోలు సామన్యుల నడుమ సామాన్యుడిగానే తుదిశ్వాస దాకా ఆయన బతికారు. చిరకాలం బతికుంటారు. అందుకే దాశరథి నిజంగా కరుణాపయోనిధి!.

**** (*) ****