ఎదో ఒకరోజు తను తప్పక అడిగే తీరుతుంది
“ఆ రోజు నువ్వెందుకు చచ్చిపోయావూ?” అని
కొన్ని కాగితాలుగా రూపు దిద్దుకుంటున్న నాదగ్గరకొచ్చి
మెల్లగా తన మృదువైన మునివేళ్ళకంటిన
నా రక్తాన్ని నాకే తుడుస్తూ అడుగుతుంది
అది ముందు రోజున నన్ను హత్య చేసినప్పుడు ఆమె చేతికంటిన రక్తం.
కిందటిసారి మరణించినప్పుడు
కూడా ఆమె ఇలాగే అడిగింది
బహుశా అది నా రెండో మరణమనుకుంటా
నేనపుడు ఒక గొంగళి పురుగుగా ఓ చెట్టు కొమ్మపై ఉన్నాను
సీతాకోకచిలుకగా పుట్టబోతూ కకూన్లోపలికి వెళ్తూంటే
ఇలానే అడిగిందామె
నిన్న సాయంత్రం ఎందుకని హఠాత్తుగా చచ్చిపోయావు? అని
మాపైన వర్షపు చినుకుల్లా కురుస్తున్న కొన్ని పసిపాపల
మృత శరీరలని చూసుకుంటూ బదులిచ్చాన్నేను
“నీకంటే జీవించటాన్ని ప్రేమించి ఉంటాను. అందుకే, బహుశా అందుకే నేను అప్పుడు చచ్చిపొయుంటాను”
రాలిపడిన పిల్లల శరీరాల్నేరుకొని వెళ్ళిపోతూ అన్నదామె
“హంతకుడివి నువ్వు”
ఇక నా కొన్ని జన్మల పాటు నేను తనని చూడనేలేదు
ఒకనాడు వొంటినిండా పువ్వులని మొలిపించుకున్న నన్నుచేరి
“నీకీరూపం బావుంది, ఉండు నా వేళ్ళ చివరి ముళ్ళు కొన్ని నీకతికిస్తాను” అంటూ
తన వొంటిమీది మబ్బులని తొలిచి నాలోకి కొన్ని ముళ్ళను గుచ్చి బదులుగా పువ్వులని తెంపుకొని
రక్తమోడే కొన్ని కుసుమాలని భూమిపై చల్లుకుంటూ వెళ్ళిపొయింది.
వేళ్ళనుండి ప్రవహించే ద్రవాభిసరణపు
నీటిబిందువులని బయటికి మందలుగా తోలేసి
కాలాన్ని ఉరిగా బిగించుకొన్నాను
ఇప్పుడు కొన్ని కాగితాలు కలిగిన పుస్తకంగా నేను పుట్టబోతున్నా
నాకు తెల్సు తనొచ్చి మళ్ళీ అడుగుతుంది
నా శిథిల దేహాన్ని తింటున్న చెదపురుగులని తోలేస్తూ
“ఆ రోజు నువ్వెందుకు చచ్చిపోయావూ”? అని
కవిత్వం భాషలోనో,పడికట్టు పదాల్లో, అక్షరాల్లో కాదు.. జీవితం లో ఉందనిపిస్తుంది. మార్మిక జన్మలంటూ. అబ్స్రాక్ట్ కవిత అద్బుతంగా వచ్చింది
అగైన్ అండ్ అగైన్ నువ్వు పొరలు పొరలు గా జీవితాన్ని విడదీసి చూపిస్తూనే ఉంటావు. కవిత్వం నీతో రాయించుకొంటోంది దాదా… నీ అనుభవాలు కొన్ని ఉండొచ్చు గాక,నీ షైలిలో కవిత్వీకరించే తీరు అవ్సం. బెటే జీతే రహో లిక్తే రహో …!
ఒక్కో పంక్తీ అద్భుత దృశ్యం
కొన్ని కాగితాలుగా రూపు దిద్దుకుంటున్న నాదగ్గరకొచ్చి
మెల్లగా తన మృదువైన మునివేళ్ళకంటిన
నా రక్తాన్ని నాకే తుడుస్తూ అడుగుతుంది
అది ముందు రోజున నన్ను హత్య చేసినప్పుడు ఆమె చేతికంటిన రక్తం.
తను అంటూ మొదటిసారి పరిచయం చేసిన ఆమె మృదువైన మునివేళ్ళ రక్తాన్ని నాకే తుడుస్తూ …. హత్య చేసిన ఆమె ప్రశ్న ” ఆ రోజున ఎందుకు చచ్చ్సిపోయావు?
కాగితాలుగా రూపు దిద్దు కుంటున్నది ఎవరు ఒక చెట్టా ఒక మనిషి ఊహా ? చెట్లను హత్య చేస్తున్నది ఒక ఆధునికతా? ఒక స్వార్ధ వ్యామోహమా? ఆ ముందు రోజు హత్య చేసిన సౌకుమార్యం ఒక డెలికేట్ అనుభవమా ? ఒక తెలియని తనమా ? ఎన్ని౦టి గా ఊహించగలం?
చంపినా రక్తాని మళ్ళీ చచ్చి పుడుతున్న ఒక సృజనకే తుడిచేయ్యడం ఒక రాక్షస ఆనందానికి ప్రతీకనా?
కిందటిసారి మరణించినప్పుడు
కూడా ఆమె ఇలాగే అడిగింది
బహుశా అది నా రెండో మరణమనుకుంటా
మరణం కొత్త కాకపోడం దాన్ని కొత్తగా వ్యక్తీకరించడం బాగుంది. క్రితసరం చంపినా , చచ్చినా బెంగలేదు మళ్ళీమళ్ళీ పుడుతూనే ఉండటం ఒక ఆశా భావన
ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడం ఒక OPTIMISTIC భావం .
వర్షపు చినుకుల్లా కురుస్తున్న పసిపాపల మృత శరీరాలు ఏమి ఉంటాయి ఆకులూ, రాలిపడిన పూలూ కాల స్వభావానికి సూచికలా
అవన్నే ఏరుకుంటూ వెళ్ళిపోయే ఆమె ఒక సృష్టి ఆది శక్తి అతీత భావన ఒక జగన్నాటక సూత్రధారి …
మాపైన వర్షపు చినుకుల్లా కురుస్తున్న కొన్ని పసిపాపల
మృత శరీరలని చూసుకుంటూ బదులిచ్చాన్నేను
“నీకంటే జీవించటాన్ని ప్రేమించి ఉంటాను. అందుకే, బహుశా అందుకే నేను అప్పుడు చచ్చిపొయుంటాను”
రాలిపడిన పిల్లల శరీరాల్నేరుకొని వెళ్ళిపోతూ అన్నదామె
“హంతకుడివి నువ్వు”
ఇక నా కొన్ని జన్మల పాటు నేను తనని చూడనేలేదు
ఎన్నో జన్మల తరువాత ఒంటినిండా పూలు మోలిపిమ్చుకునే పూల మొక్క –ఒక సౌ౦దర్య ప్రతీక
ముళ్ళు అతికించడం తనపై మబ్బులను ఒలిచి –ప్రక్రుతి సహజ సిద్ధంగా చేసే మార్పులు ముళ్ళు గుచ్చి పూలను తెంపుకుని పుష్ప విలాపం గుర్తు తెచ్చారు రక్త మోడ్ కుసుమాలను చల్లుకుంటూ వెల్లిపోదాం తో
ఒకనాడు వొంటినిండా పువ్వులని మొలిపించుకున్న నన్నుచేరి
“నీకీరూపం బావుంది, ఉండు నా వేళ్ళ చివరి ముళ్ళు కొన్ని నీకతికిస్తాను” అంటూ
తన వొంటిమీది మబ్బులని తొలిచి నాలోకి కొన్ని ముళ్ళను గుచ్చి బదులుగా పువ్వులని తెంపుకొని
రక్తమోడే కొన్ని కుసుమాలని భూమిపై చల్లుకుంటూ వెళ్ళిపొయింది.
నీటి బిందువులను మందలుగా బయటకు తోలేయ్యడం -కాలాని ఉరిగా బిగి౦చు’కోడం
మళ్ళీ పుస్తకంగా పుట్టబోడం
జీవిత చక్రాన్ని స్పష్టంగా చూపుతోంది.
వేళ్ళనుండి ప్రవహించే ద్రవాభిసరణపు
నీటిబిందువులని బయటికి మందలుగా తోలేసి
కాలాన్ని ఉరిగా బిగించుకొన్నాను
ఇప్పుడు కొన్ని కాగితాలు కలిగిన పుస్తకంగా నేను పుట్టబోతున్నా
నాకు తెల్సు తనొచ్చి మళ్ళీ అడుగుతుంది
నా శిథిల దేహాన్ని తింటున్న చెదపురుగులని తోలేస్తూ
“ఆ రోజు నువ్వెందుకు చచ్చిపోయావూ”? అని
మొక్కయినా, కాగితం ముక్కయినా, గొంగళి పురుగయినా , చివరకు ఏ జీవితమైన ఒక అతీత శక్తి అధీనంలోనే’ననీ, లా అఫ్ లైఫ్ సూత్ర౦ బాగుంది.
ఒక జీవన విధానం , ఒక వేదాంతం ఒక సౌ౦దర్యం ఒక తాత్వికత ఉన్న కవిత.
తాంక్యూ సాయీ , ఇమ్రాన్ దాదా థాంక్ యు మేం జయశ్రీ నాయుడూ గారు