కవిత్వం

నా కొన్ని మార్మిక జన్మలు

అక్టోబర్ 2014

 

 

 

 

 

 

 

ఎదో ఒకరోజు తను తప్పక అడిగే తీరుతుంది
“ఆ రోజు నువ్వెందుకు చచ్చిపోయావూ?” అని
కొన్ని కాగితాలుగా రూపు దిద్దుకుంటున్న నాదగ్గరకొచ్చి
మెల్లగా తన మృదువైన మునివేళ్ళకంటిన
నా రక్తాన్ని నాకే తుడుస్తూ అడుగుతుంది
అది ముందు రోజున నన్ను హత్య చేసినప్పుడు ఆమె చేతికంటిన రక్తం.

కిందటిసారి మరణించినప్పుడు
కూడా ఆమె ఇలాగే అడిగింది
బహుశా అది నా రెండో మరణమనుకుంటా
నేనపుడు ఒక గొంగళి పురుగుగా ఓ చెట్టు కొమ్మపై ఉన్నాను
సీతాకోకచిలుకగా పుట్టబోతూ కకూన్లోపలికి వెళ్తూంటే
ఇలానే అడిగిందామె
నిన్న సాయంత్రం ఎందుకని హఠాత్తుగా చచ్చిపోయావు? అని
మాపైన వర్షపు చినుకుల్లా కురుస్తున్న కొన్ని పసిపాపల
మృత శరీరలని చూసుకుంటూ బదులిచ్చాన్నేను
“నీకంటే జీవించటాన్ని ప్రేమించి ఉంటాను. అందుకే, బహుశా అందుకే నేను అప్పుడు చచ్చిపొయుంటాను”
రాలిపడిన పిల్లల శరీరాల్నేరుకొని వెళ్ళిపోతూ అన్నదామె
“హంతకుడివి నువ్వు”
ఇక నా కొన్ని జన్మల పాటు నేను తనని చూడనేలేదు

ఒకనాడు వొంటినిండా పువ్వులని మొలిపించుకున్న నన్నుచేరి
“నీకీరూపం బావుంది, ఉండు నా వేళ్ళ చివరి ముళ్ళు కొన్ని నీకతికిస్తాను” అంటూ
తన వొంటిమీది మబ్బులని తొలిచి నాలోకి కొన్ని ముళ్ళను గుచ్చి బదులుగా పువ్వులని తెంపుకొని
రక్తమోడే కొన్ని కుసుమాలని భూమిపై చల్లుకుంటూ వెళ్ళిపొయింది.

వేళ్ళనుండి ప్రవహించే ద్రవాభిసరణపు
నీటిబిందువులని బయటికి మందలుగా తోలేసి
కాలాన్ని ఉరిగా బిగించుకొన్నాను
ఇప్పుడు కొన్ని కాగితాలు కలిగిన పుస్తకంగా నేను పుట్టబోతున్నా
నాకు తెల్సు తనొచ్చి మళ్ళీ అడుగుతుంది
నా శిథిల దేహాన్ని తింటున్న చెదపురుగులని తోలేస్తూ
“ఆ రోజు నువ్వెందుకు చచ్చిపోయావూ”? అని