కవిత్వం

వాన వెలిశాక..

అక్టోబర్ 2014

విరగబోయే కొబ్బరిమట్ట మీద కూర్చుని
ముక్కుతో పొట్ట పొడుచుకుంటూ
దిగులుగా ఊరంతా చూస్తుంది
ఒంటరి కాకి

డాబా మీది తూము నుండి నీళ్ళు
ధారల్లే క్రిందకు పడుతోంటే
తలంతా తడుపుకుంటూ ఇకిలిస్తాడు
బట్టల్లేని బుడతడు

దండేనికి వేలాడుతోన్న చినుకులన్నింటిని
చూపుడువేలు గాల్లోకి విసిరేశాక
ఏడుపు మొహాలతో బయటకొస్తాయ్
ఆరీఆరని బట్టలు.

జీరాడే కుచ్చిళ్ళు జాగ్రత్తగా
బురద నీళ్ళకు దూరంగా జరిగాక
పసుపు మరకల పట్టీలతో పేరంటానికెళ్తుంది
అమ్మలాంటి ఓ అమ్మ.

వానపడ్డంతసేపూ బుడబుడా నవ్వుతుంది, ఈ నేల
ఆ కాస్త ప్రేమకే మెత్తబడి కరిగిపోతుంది
ఎంత బాధ లోలోపల కొంపుకుంటుందో,
వాన వెలిశాక అదేపనిగా కళ్ళు తుడుచుకుంటుంది.