కవిత్వం

సంధి మాటలు

నవంబర్ 2014

ఊపిరి బ్రతికే స్పృహను కాదు
కోల్పోతున్న నిన్నే చెపుతుంది
పరిసమాప్తికి దూరంమెంతో
కొన్ని రక్తసిక్తశ్వాసలు చెపుతాయి
చెప్పలేనివి చెప్పాలని ఓర్చుకున్నవి
చెప్పకుండా మిగిలిన వాక్యాలు
కొన్ని కళ్ళలో ఒలికిపోతాయి

మార్పు మార్పు కోసమేనన్న యదార్థానికి
ధ్వంసమైన సీతాకోకల కథలే రుజువులు
శరణార్ధి అన్న పదంతో గుండె కలవరపడుతుంది
తపనలు లేని వేళే తేలుతుంది ఎవరికి ఎవరమని

యిక బాధే జీవితం, దుఖమే పవిత్రం, ప్రేమలే పాపాలు
వేళాడే కత్తి ఒకటి క్షణమొక సంధియుగముగా మార్చి
దాస్యాలను దాష్టీకాలను సాధారణం చేస్తుంది
ఆకాశానికి హద్దులేదని గుర్తుచేసే వేగుచుక్క
మిణుకు మిణుకుమని మెరుస్తుంది

అరచేతుల పగుళ్ళలో ఆత్మ ప్రవహించి
రక్తపు అడుగులతో తునాతునకలైన హృదయాన్ని మోస్తున్నా
కలవడమే పరమార్ధమనుకొనే క్షణాలను తోసిపుచ్చలేను
మరి సూరీడా! చీకటే బతుకైన వారికి నీవున్నావని తెలిసేదెలా?