కవిత్వం

సమాంతర ఛాయ!

మే 2015

క్కోసారి నీ గురించి ఆలోచిస్తా
ఎప్పటిలా నాలోపల మెదిలే నీతో కాకుండా,
ప్రత్యేకంగా నీ ఎదురుగా వచ్చి…

అనిపిస్తుంది,
నీకు అన్నిటికి అన్నీ తెలిసిపోతున్నాయని
వెంటనే ఒక అభద్రత నన్ను చెట్టెక్కిస్తుంది
భయంగా కిందకితొంగి చూస్తాను
నీవు మాత్రం ఎప్పటిలా చిన్న గులకరాళ్ళతో
ఏటిగట్టుపై కూర్చొని ఒక్కొక్కటీ విసురుతూ వింటావు.
నీకిదంతా అర్థమైనా ఏమీ లేనట్టు కళ్ళెత్తి చెప్తావు-
“బుజ్జీ చూడు! ఈ చిన్నరాయి ఎన్ని వలయాలు చేస్తుందో” అని

నమ్మీ నమ్మలేక మెల్లగా దిగి వచ్చి నీ పక్కన కూర్చుంటాను
మళ్లీ అంటావు ‘బుజ్జీ నేనిక్కడే ఉన్నాను.
ఏటికోసం, రాళ్లకోసం, కొంచెం మనం ఆడుకోవడం కోసం’
యిక, నీకు చెప్పకుండా దాచవలసిన భయం ఎందుకో అర్థం కాదు.

నీ చేతివేళ్ళని గుర్తుచేసుకున్నప్పుడు అనుకుంటా
ఒకసారి వాటిని గట్టిగా పట్టుకొని
చెప్పవలసిందంతా చెప్పివేద్దామని..

ప్రత్యేకించి ఇలా నీతో మాట్లాడటం మాత్రం
మౌనం కంటే అద్భుతంగా ఉంటుంది.
ధ్యానం, ధ్యాస, దోసిట్లో
నింపుకున్న నీ ఆలోచనలు
నెమ్మదిగా జారిపోవడం,
చుక్కలు చుక్కలుగా కిందపడటం.
నేను మళ్ళీ మాములవ్వడం ,
ఒక దైనందిక జీవనచర్యగా భావిస్తా.

ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకు
మాత్రం నాకు ఏమీ తోచదు.
తెలిసిన అన్ని పేర్లను, లక్షణాలను
వెతికి చూస్తా.
పసలేని వాదాలతో
నన్ను నేను ఓడించుకుంటా కొంతకాలం.

నువ్వొక ప్రపంచం అవుతావు అందరికీ-
నీ ప్రపంచం వేరే ఉంటుంది
మాటల్లోనో, పాటల్లోనో ఒక స్పర్శ తడుతూనే ఉంటుంది.
ఆలోచన తరంగాల రూపమెత్తి
హృదయాన్ని చుట్టూరా పరుస్తుంది.

అవును!
కలలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు.
ఈ నిమిషం బ్రతికి ఉండటం,
నువ్వు నా ఊహగా కాక
నిజంగానే ఉండటం అంతేనిజం.

ఐనా-
అసలు యిదంతా కాకపోవచ్చు.
ఒక సమాంతర ఛాయలా
నాతో నడుస్తున్న నీడలేని రూపం నీదే కావచ్చు.