ఉత్తరం

From ఇస్మాయిల్ to ఆర్.యస్. సుదర్శనం

డిసెంబర్ 2014

ఇస్మాయిల్
కాకినాడ
5-12-89

సుదర్సనంగారికి,

నమస్కారం. మీ కార్డు అందింది. మీ పేపర్ కూడా అందింది.

‘Concept of ఫ్రీడమ్…’ చాలా enlightening గా వుంది సామాన్య పాఠకుల దృష్టిలో పడని చాలా లోతైన విషయాలమీద వెలుతురు ప్రసరించారు. మీ పేపర్ చదివాక చాలా విషయాలు నాకు స్పష్టమయాయి. భావ కవిత్వం గురించి ఇంత విశ్లేషణాత్మకమైన వ్యాసం ఇంతవరకు నేను చదవలేదు. చిర స్మరణీయమైన పనొకటి చేసారు.

సూవెనీర్ లోని ‘అనుభూతి కవిత్వ’మనే వ్యాసం ఆధునిక కవిత్వానికి సూక్ష్మ విశ్లేషణ చాలా సమర్ధంగా చేసింది. చాలా కొత్త విశేషాలు తెలిసాయి
‘అనుభూతి కవితగా గుర్తు పట్టడానికి ప్రధానమైన లక్షణం కవిత చదివిన తర్వాత మిగిలేది ఒక సందేశం, ఒక భావనం, ఒక దృక్పధం కాకుండా కేవలం అనిర్ధిష్టమైన అనుభూతి కావాలి’ అని మీరన్నారు . ఇది R H Blaith హైకూ కి ఇచ్చిన నిర్వచనంతో సమం గా వుంది:
“Its (haiku’s) peculiar quality is its self-effacing, self-annihilative nature, by which it enables us, more than any other form of literature, to grasp the thing-in-itself…it is a raft unwanted when the river is crossed. If, like waka(ordinary poem), the haiku itself has literary charm and value, we are distracted from the real region of haiku, the experience, the mutual, reunited life of poet and things.”
ఈ దృష్టితో చూస్తే నా పద్యాలన్నీ హైకూలు కావు. ఎందుకంటే, reaching out from the particular towards the universal అనేది కొన్నిట్లో కనిపిస్తుంది. ఇది romantic-symbolist-imagist influence అనుకుంటాను.

Pure haiku రాయటం చాలా కష్టం. అర్థం చేసుకోవటమూ కష్టమే! కవీ, పాటకుడూ ఇద్దరూ , కవీ, ప్రపంచమూ ఐక్యమయ్యే ఆ selfless -state ని సాధించవలసి వుంటుంది!

పైన చెప్పిన ‘హైకూ’ అనే పేరుతో నాలుగు కలెక్షన్స్, వివరణతో సహా, అచ్చు వేశాడు. కొన్ని వేల హైకూలు పోగు చేశాడు!
మొన్నటి మీ కాకినాడ ప్రయాణం సుఖంగా సాగలేదు. వెళ్ళిపోయేటప్పుడు ‘మనం తిరిగి కలుసుకుంటామో లేదో!’ అన్నారు. ఆ మాట ఎందుకన్నారో నా కర్థం కాలేదు. తప్పకండా తిరిగి కలుసుకుంటాం!

అమెరికా ఎప్పుడు వెడుతున్నారు? ఎన్నాళ్లుంటారు ?

కథల అనువాదం మొదలెట్టారా? పై సాహిత్య వ్యాసాల్లాంటివి ఇంకా ఎన్నో మీరు రాయవలసి వుంది.
తీరికున్నపుడు రాయండి.

మీ
ఇస్మాయిల్