కథ

పునరుత్థానం

జనవరి 2013

“కిటికీ బయటి వెన్నెల” పుస్తక ఆవిష్కరణ 2014 నవంబర్ 16న జరిగింది. పది కధలున్న ఈ “కిటికీ బయటి వెన్నెల” – చదువరులందరికీ అంతో ఇంతో సంతృప్తినీ, ప్రపంచం పట్ల ఒక సానుభూతినీ, కొంత ప్రేమనూ కలిగేలా చేస్తాయి. అయోమయపు సందిగ్ధంలో ఉన్న వారికి ఒక ఆత్మా విశ్వాసాన్ని, కొంత ఆలోచనా పఠిమనూ అందిస్తాయి. ఒక జీవన తాత్వికత, ఒక అనుభవైక వేద్యమయిన భావన ఈ కధలు అందిస్తాయి. ఒక పార్శ్వం నుండి కాక అన్ని కోణాలను౦డి ఒక వ్యక్తిని, సమాజాన్ని అంచనా వేసి గీసిన అక్షర చిత్రాలివి. రచయితకి ఎంతో నైపుణ్యత ఉంటే తప్ప వ్యక్తి అంతర్గతం నుండి సమాజపు లోలోపలి సమస్యల్లోకి ప్రవహించడం అంత మామూలు విషయం కాదు. కధల నిండా మధ్యతరగతి సగటు మనుషులు, స్త్రీలు, తమతమ జీవనోత్సాహాలను పరిరక్షి౦చుకు౦టూ, జీవితం ఆటుపోట్లను భరిస్తూ ఉక్కుమనుషులుగా నిలిచినా, పూబాలల అందాన్నీ, కిటికీ బయటి వెన్నెలనూ ఆస్వాది౦చే సౌకుమార్యం పోగొట్టుకోని మనసులున్న వారు.
జీవన ప్రవాహంలో పుట్టిన కధలివి. ఆ ఒరవడిలో మననూ తోసుకు పోడం పెద్ద చిత్రమేమీ కాదు.

కథా సంకలనం: కిటికీ బయటి వెన్నెల
రచన: వాడ్రేవు వీరలక్ష్మీ దేవి
వెల: Rs. 100
పుస్తకాలు నవోదయా బుక్ హవుస్ కాచిగూడాలో లభ్యం.

“కిటికీ బయటి వెన్నెల” నుండి మచ్చుకి ఒక కథ మీకోసం ఇక్కడ:

పునరుత్థానం

రాజూ నేనూ మా ఊరు వెళ్లినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్లకుండా ఉండలేం. ఆ ఇల్లు, ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ గలగలా మాట్లాడే ‘ఆమె’ మాకు ఒక ఆకర్షణ. మా చిన్నప్పటినుంచి ఆమెను చూస్తూనే ఉన్నాం. ఆమెది ఏమి అందం?! లేక కేవలం అదొక ఆకర్షణేమో? ఇప్పటికీ అర్థం కాదు.

నా చిన్నప్పుడు ఆమె గురించి ఆ పల్లెటూళ్లో ఏదేదో చెప్పుకునేవారు. ఆమె నుండి వెలువడే చైతన్యపరిమళం అంతటా కమ్ముకుని ఆ ఊరి జనాన్ని ఊపిరాడకుండా చేసేదేమో బహుశా.

ఈ సారి కూడా ఆమెకోసం నేను బయల్దేరితే నా కూడా రాజు కూడా వచ్చాడు. రాజు మా మేనత్తకొడుకు. నాకంటే పదేళ్లు చిన్నవాడు. చిన్నప్పటి నుంచీ నా నీడలా నావెంటే తిరుగుతూ ఉండేవాడు. మా మేనత్తను మా ఊళ్లోనే ఇచ్చారు. కలిసే పెరిగాం అందరం. ఇప్పుడు అందరం తలో ఊళ్లో ఉద్యోగం చేసుకుంటున్నా వీలయినప్పుడల్లా కలిసి అనుబంధాల చల్లదనాన్ని పదిల పరుచుకుంటూ ఉంటాం.

నిన్ననే వచ్చాను నేను. రాజు నాలుగురోజుల నుంచి ఇక్కడే ఉన్నాడట. ఏదో పెద్ద ఇబ్బందిలో పడ్డాడని తెలిసింది. రాత్రంతా చెప్తూనే ఉన్నాడు. ఎప్పటిలానే తేలికపాటి నవ్వు మొహం మీంచి జారుతూనే ఉంది. దానివెనక నుంచి అతను మోస్తున్న బరువు కూడా తెలుస్తోంది.

ఆ మధ్యాహ్నం ఇద్దరం కలిసి రోడ్డుమీదకి వచ్చాం; ఆమెను చూద్దామని. ఆదిలక్ష్మి ఆమె పేరు. ఊళ్లో అందరూ అలాగే పిలుస్తారు.

మా ఇంటి నుంచి ఆదిలక్ష్మిగారి ఇంటికి ఫర్లాంగు దూరం ఉంటుంది. దారి అంతా అటూ ఇటూ చింతచెట్లు ఉంటాయి. అందులో ఒక చెట్టు పళ్లు ఎంత తియ్యగా ఉంటాయో చెప్పలేం. చిన్నప్పుడు పిల్లలం అందరమూ ఆ చెట్టు కిందే ఉండేవాళ్లం.

సరిగ్గా ఆ చెట్టుకి ఎదురుగా రోడ్డుకి అటువేపున వాళ్ల ఇల్లు ఉంటుంది. తాటాకులు నేసిన మట్టి అరుగుల ఇల్లు.

ఆదిలక్ష్మిగారి భర్త చిన్నపాటి కామందు, పేకాటలో చాలా భూమి పోగొట్టుకున్నాడు. పొలంలో పనిచేసే ఆడవాళ్లందరితోనూ సంబంధాలు ఉండేవి. ఊళ్లో ఆడవాళ్లు అతన్ని చూసి భయపడేవారు. సంతరోజుల్లో సాయంత్రాలు తాగేసి ఎర్రటికళ్లతో రోడ్డుమీద తిరుగుతూ ఉండేవాడు.

ఆదిలక్ష్మి పెళ్లయి మా ఊరి కోడలిగా వచ్చేటప్పటికే ఆ కుటుంబం ఆస్తులు పంచుకుని  విడిపోయింది. వేరు కాపరం, ఎవరి అదుపూలేని భర్తతో ఆమె జీవితవిధానం ఆమె చేతిలో కూడా లేకుండా పోయిఉంటుంది.

నాకు తెలిసేటప్పటికి ఆదిలక్ష్మి భర్త కాలువిరిగి మంచం మీద ఉండేవాడు. మంచం మీంచే ఆమె మీద అరుపులు అరుస్తూ, బూతులు తిడుతూ ఉండేవాడు. ఆమె అవేవీ వినిపించుకోకుండా చిరునవ్వు చెదరనీకుండా మాలాంటి కుర్రాళ్లతో కబుర్లు చెప్తూ ఉండేది.

ఆమె నాకన్నా దాదాపు పదేళ్లు పెద్దది. అప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు. భర్త సంపాదన లేదు. ఉన్నకాస్త భూమీ కౌలులో ఉంది. పిల్లలు ఆలనా, పాలనా లేనట్టు ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదిలక్ష్మి జీవితం పట్ల ఎంతో ఆశతో, ఆశేకాకుండా అనుభవించాలనే తపనతో ఉండేదనుకుంటాను.

ఎప్పుడు వెళ్లినా ఆ ఇంటి చుట్టూ పూల మొక్కలు అన్ని కాలాల్లోనూ విరగబూసి ఉండేవి. ఎత్తయిన మట్టి అరుగులు నున్నగా గచ్చులా ఉండేవి. వాటి నిండా తెల్లటి ముగ్గులు. ఎప్పుడూ వాళ్లింట్లో సంక్రాంతి పండగ నెలకొని ఉన్నట్టు అనిపించేది.

ఆ అరుగులమీద కూచుంటే పెరట్లో పొయ్యిమీద మరుగుతున్న పులుసు వాసన ఘుమఘుమలాడుతూ ఆమె జీవనకాంక్షకు ప్రతిరూపంగా వస్తూఉండేది.

ఎన్నో ప్రతికూలతల మధ్య ఆమె అలా ఉండడం ఎంతో ఆశ్చర్యంగా ఉండడమేకాక ఆమెతో గడిపిన ఆ కాస్త సమయమూ మమ్మల్ని ఉత్సాహపరిచేది; ఎంతో ఉల్లాసంగా కూడా ఉంచేది.

మా ఊళ్లో మాలాంటి యువకులందరికీ ఒకరకంగా ఆమె ‘ఆరాధ్య’ అని చెప్పుకోవాలి. కానీ పైకి ఎవరమూ ఏమీ మాట్లాడేవాళ్లం కాదు. మిగతా ఆడవాళ్లతో కలిసి ఏ పేరంటానికైనా వెళ్తుంటే లాగి విడిచిన బాణంలాగా నడుస్తూ, అందరిలోనూ కొట్టొచ్చినట్టుగా ఉండేది ఆమె. చాటుగా అందరం చూస్తూండేవాళ్లం.

ఆమె గురించి ఊళ్లో గుసగుసగా చెప్పుకునే మాటలు ఆమెకీ తెలుసని తర్వాత్తర్వాత ఆమె మాటలవల్ల తెలిసింది. కానీ ఆమె ఆ మాటల్ని లక్ష్యపెట్టేదీకాదు, వ్యతిరేకించేది కాదు. మేం చదువులకీ, ఉద్యోగాలకీ ఊరునించి వెళ్లిపోయాక, పెళ్లిళ్లయి ఎక్కడెక్కడో స్థిరపడిపోయాక ఆమెను మరచిపోయామనే చెప్పాలి. కానీ ఈ ఊరు వస్తే మాత్రం గుర్తూ వస్తుంది, వెళ్లి చూసి వస్తూనూ ఉంటాం.

అయితే ఇన్నేళ్లలో అంచెలంచెలుగా మేం ఎదుగుతూ వస్తూవున్నాం కానీ ఆమె స్థితి దిగజారిపోతూ వచ్చింది. ఉన్న కాస్తభూమీ కూడా పోయి రోగిష్టి అయిన భర్తతో ఎలా కాలం గడుపుతోందో ఎవరికీ తెలీదు. కానీ కిందటిసారి వచ్చినప్పుడు వెళ్తే ఎప్పట్లాగే గాజు పళ్లెంలో సున్నుండలూ, జంతికలూ తెచ్చిపెట్టింది. శుభ్రమయిన వాయిల్‌ చీర కట్టుకుని ఆరోగ్యంగా ఉంది. ఒంటి మీద బంగారపు పోగు కూడా లేకపోయినా సరే.

నేను ఏదో అనబోతే ‘చాల్లెండి బాబూ! నా కళ్లముందే పెద్దాళ్లయినా, నా కంటె పెద్దాళ్లు అయిపోలేదు మీరు’ అంది. ఆమె నన్ను ఏమనిఅన్నా అది నాకు ప్రశంసగానే వినిపిస్తుంది.

ఈ సారి ఆమె గురించి ఎవరినీ ఏమీ అడగలేదు. నేరుగా ఇంటికే బయల్దేరాం. దార్లో టైలర్‌ చిన్నబ్బాయి కనిపించాడు. ‘ఎక్కడికి సార్‌’ అన్నాడు. చెప్పడం ఇష్టంలేక ‘ఊరికే అలా కాసేపు నడుద్దామని బయటికొచ్చాం’ అన్నాను. చిన్నబ్బాయి మమ్మల్ని దాటుకుని వెళ్లిపోయాక ఆదిలక్ష్మిగారి ఇంటివేపు తిరిగాం.

రోడ్డుమీంచి దడి గుమ్మందాకా నిన్నరాత్రి కురిసిన వానకి నీళ్లు నిలిచిపోయాయి. అకాలవర్షం. కాళ్లు తడవకుండా అంతమేరా పొడుగాటి తాటివాసం వేసి ఉంది. తాటిదూలం నేలమీద సరిగ్గా ఆనకపోవడం వల్ల జాగ్రత్తగా నడవాల్సివచ్చింది. అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వెళ్తే వెదరుదడి తడిక కట్టేసి ఉంది.

గుమ్మంలోపలా బయటా కూడా నేలమీద తెల్లదనందివర్థనం పూలూ, పసుపుపచ్చని గన్నేరుపూలూ రాలి ఉన్నాయి. పైకి తలెత్తి చూశాను. రెండు చెట్లూ గుమ్మానికి ఒక పక్కగా విరగబూసి ఉన్నాయి.

రెండు మూడుసార్లు పిలిచినా ఎవరూ రాలేదు. ఇక తడిక విప్పుకుని లోపలికి వెళ్లాం. ఇల్లు ఇల్లులా లేదు. పాడుపడిపోయింది. లోపల మొక్కలన్నీ ఎండిపోయాయి, ఎండిపోగా మిగిలినవి చీడపట్టిపోయాయి. పెరడంతా పిచ్చిమొక్కలతో నిండిపోయివుంది. నేనూ రాజూ మొహంమొహం చూసుకున్నాం.

మట్టిఇల్లు కావడం వల్ల ఒకవేపు గదిగోడ పడిపోయింది. పైన తాటాకునేత. ఆ తాటాకులు ఎండిపోయి శిథిలమైపోవడంతో గోడలు వానలకు నానిపోయి నానిపోయి పడిపోతూ ఉన్నాయి. ఒకప్పటి సౌందర్య వైభవం తాలూకు స్పృహ కూడా లేదు అక్కడ.

నాకు లోపలంతా పొగలాగ దిగులు కుమ్ముకుంటోంది. దాన్ని పైకి ఎలా చెప్పాలో తెలీడం లేదు. లోపల ఊపిరాడనట్టుగా ఉంది. నొక్కునొక్కుల పొట్టి జడలో జాజిపూల దండ ముడుచుకుని, సూది ముక్కు చివరనుంచి చూస్తూ, కంటి కొసల వెంట నవ్వుల్ని చిలకరించే ఆదిలక్ష్మి ఈ ఇంటిని నందనవనంలా ఉంచేది. ఆవిడ ఏమయిపోయింది-?

ఆ ఇంటిని ఇలా ఎలా వదిలేసింది?

రాజూ నేనూ కనీసం మాటకూడా మాట్లాడుకోలేకపోయాం. బిత్తరపోతూ ఇల్లూ, పెరడూ చూసి వీధిలోకి వచ్చేశాం. బయటికి వచ్చి వీధిగుమ్మం తడిక కట్టేశాం. అదేమీ తెలీని గుమ్మంలోని పూలు అమాయకంగా అతిథుల్ని ఆహ్వానిస్తూనే వున్నాయి. ఆదిలక్ష్మి తిరిగిన నేలలో ఏవో కొన్ని పిచ్చిపూలయినా పూస్తూనే ఉంటాయన్న మాట అనిపించింది.

 

తర్వాత తెలిసిన సంగతి. ఆదిలక్ష్మి సర్వమూ పోగొట్టుకుని బతుకు తెరువు కోసం విశాఖపట్నం వెళ్లిపోయిందనీ, బంధువుల ద్వారా ఎవరో డాక్టరు ఇంట్లో వంటమనిషిగా చేరిందనీనూ.

ఆదిలక్ష్మి భర్త కేన్సర్‌తో తీసుకుని చనిపోయాడు. పెద్ద కొడుకు ఇంట్లోంచి పారిపోయాడు. రాజమండ్రిలో లారీ క్లీనర్‌గా కనిపించాడని ఊళ్లో చెప్పుకున్నారు. పెద్దపిల్లకి పెళ్లి చేసేసింది, ఎలాగో కష్టపడి. అల్లుడు అప్పటికే వేరే కాపురం నడుపుతూ వున్నాడని తర్వాత తెలిసింది. కూతురు భర్త చేత దెబ్బలు తినలేక తల్లి దగ్గరికి పారిపోయి వచ్చేసింది. ఆఖరి పిల్ల తల్లిలా అందంగా ఉంటుంది. బంధువులెవరో పెంచుకుంటామంటే ఆదిలక్ష్మి ఇచ్చేసింది. ఇదంతా పాత కథే. ఇప్పుడు ఆ పెద్దపిల్లతో కలిసి వెళ్లిపోయి ఉంటుందా? ఆ పిల్లను ఏంచేసి ఉంటుంది? భర్త సరైన వాడుకాక బాధ్యత ఏమాత్రం తీసుకోకపోవడం వల్ల కుటుంబం ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోయి తలోదారీ అయిపోయిందన్న మాట.

సమాజంలోని ఆర్థిక శక్తుల ప్రభావం గురించి ఏమీ తెలీని ఆదిలక్ష్మి పిల్లల్ని దూరం చేసుకుని ఎక్కడో, ఎవరికో వండి పెడుతూ బతుకు గడపడం ఊహించలేకపోయాను.

ఆ కుటుంబంతో పోలిస్తే మేం ఇంకా మెరుగ్గానే ఉన్నాం. రాజుకి అర్థమయ్యిందో లేదో గానీ నాకు మరోవైపు ధైర్యం కూడా వచ్చింది.

మర్నాడే మా ప్రయాణాలు. ఎవరి ఊళ్లకు వాళ్లం. రాజు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. నేను బెంగుళూరు వెళ్లాలి. ఈ గోదావరి జిల్లా పల్లెటూరి నుంచి పొట్టచేత్తో పట్టుకుని అంతంత దూరాలుఅనేనా ఆలోచించకుండా ఒకనాడు అత్యుత్సాహంతో వెళ్లిపోయాం. కానీ ఆ ఉత్సాహాలు మిగల్లేదు.

రాత్రి రాజుతో అన్నాను.

‘రాజూ! ఇల్లు అంటే మనకి స్తిమితాన్నీ, శాంతినీ ఇవ్వవలసిన చోటు. అది దొరకకపోతే ఆ ఇంటి గురించి ఆలోచించడం అనవసరం. అదసలు ఇల్లే కాదు.’

‘నిజమే. అయితే ఏం చెయ్యమంటావు చెప్పు’

‘నష్టానికేనా సరే ఆ ఫ్లాట్‌ అమ్మేయ్‌. ఆ డబ్బుతో బ్యాంక్‌ అప్పు తీర్చేయ్‌. మిగతాది నెమ్మదిగా చూడొచ్చు. ఇప్పటికి ఈ ఊళ్లో ఉన్న ఇల్లు అమ్మే ఆలోచనవద్దు’ అన్నాను.

ఈ ఆర్థికమాంద్యంలో రాజు ఉద్యోగం పోయింది. ఆ జీతం తాలూకు భరోసాతో ముప్పయి లక్షలు బ్యాంక్‌ లోన్‌ తీసుకుని ఇల్లు కొన్నాడు. అయిదు లక్షలయినా అప్పు తీరకుండానే ఉద్యోగం పీకేసి పొమ్మన్నారు. ఈలోగా బతుకు తెరువుకి మరో చిన్న ఉద్యోగం సంపాదించాడు కానీ ఆ ఫ్లాట్‌ అతని నెత్తిన కొండలా కూచుంది. ఈ ఊళ్లో వాళ్ల తాతయ్య కట్టిన మేడ ఉంది. అందులో అన్నగారు ఉంటున్నాడు. తన వాటా అమ్మేద్దామని ఆ డబ్బుతో ఫ్లాట్‌ నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాడు రాజు.

ఆ మేడనిండా ఎన్నో జ్ఞాపకాలు ఎలాగూ ఉండి తీరుతాయి. కానీ సౌకర్యాలముందు, సుఖాల ముందు జ్ఞాపకాలు ఏపాటివి?

నేనూ అలాంటి సందిగ్ధంలోనే ఉన్నాను.

నా ఉద్యోగం పోయింది. రమ్య ఉద్యోగం మాత్రం ఉంది. రమ్య నా భార్య. ఇంట్లో పెద్దగా గొడవలేమీ ఉండవు. కానీ పూర్వం ఇద్దరమూ ఆఫీసులకు హడావిడిగా తయారై వెళ్లే వాళ్లం. ఇప్పుడు తనొక్కతే వెడుతోంది. ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది ఆ సమయంలో. తనకీ, నాకూ కూడా లోలోపల అస్తిమితం.

మెత్తటి సోఫాలో కూర్చుని ‘డీవీడీ’ పెట్టుకొని సినిమా చూస్తున్నట్టు నటిస్తాను ఆమె వెళ్లే టైమ్‌కి. నేను ప్రశాంతంగానే ఉన్నానని నా ప్రకటన. ఆమె వండినవి టేబుల్‌ మీద సర్ది పూర్వం కంటే ఎక్కువ శ్రద్ధగా అమర్చి నావేపు చూడకుండా లిఫ్ట్‌లోకి వెళ్లి దిగిపోతుంది.

ఇద్దరం నటిస్తున్నాం. ఇల్లు ఇల్లులా లేదు.

మాకొక పాప. పన్నెండేళ్లు. దాన్ని డూన్‌ వాలీ స్కూల్‌లో పెట్టాం. ఇప్పుడింక అంత డబ్బు కట్టి చదివించలేమేమో? తీసుకొచ్చి మరో చిన్న స్కూల్‌లో పెడితే అది ఏమి నొచ్చుకుంటుందో? ఇంట్లో ఉంచుకుంటే చదివించ గలమో! లేదో! అసలు ఈ పరిస్థితి ఇలా ఎన్నాళ్లుంటుంది?

రమ్య వెళ్లగానే టీవీ కట్టేసి ‘ల్యాప్‌టాప్‌’ తీస్తాను. సాయంత్రం దాకా ఉద్యోగాల వేట. చిన్న ఉద్యోగాలు నచ్చవు. కాలం గడిచిపోతోంది, రోజురోజుకీ బరువెక్కుతూ.

ఇలాంటి నా మనస్థితిలోనూ, ఇంటి పరిస్థితిలోనూ రాజు పిలుపు అందుకొని ఇటొచ్చేశాను. ఈ రెండు రోజులూ ఇద్దరం ఇవే మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. దేశ రాజకీయాలూ, అంతర్జాతీయ ఆర్థిక విధానాలూ చర్చించుకున్నాం. ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేశాం. కానీ బరువు దిగలేదు. అలాంటిది ఆదిలక్ష్మి ఇల్లు చూసి వచ్చాక మాత్రం మా కష్టాలు ఇబ్బందులుగా మాత్రమే అనిపించాయి. ఎంతో నిబ్బరం కలిగింది. ఆదిలక్ష్మి గురించి కాసేపు విచారించినా, ఆ తర్వాత హాయిగా పాత కబుర్లన్నీ చెప్పుకున్నాం. ఏం చెయ్యాలో ఇతమిత్థంగా ఒక నిర్ణయానికి రాలేకపోయినా ఆ రాత్రికి మాత్రం సుఖంగా నిద్రపోయాం. అలాంటి విరామమేదో కొంచెంగా నయినా హృదయానికి దొరికింది. కూలిపోయినా నిలబెట్టేదేదో ఆ ఇంటి దగ్గర మాకు కనిపించింది.

****

సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్లీ ఇద్దరం కూడబలుక్కుని మా ఊరు వచ్చాం. అదే డిసెంబర్‌ నెలలో అలాంటి అదే చలిలో. మా జీవితాలలో కూడా పెద్దగా మార్పేదీ లేదు.

రాజు ఈ ఏడాదిలో రెండు ఉద్యోగాలు మారేడు. అతని భార్య కూడా చీరల వ్యాపారం ఏదో మొదలు పెట్టిందట. లక్నో నుంచి సూరత్‌ దాకా తిరుగుతూ ఉందట. ఏదో ఒకరకంగా ఆ ఫ్లాట్‌ నిలబెట్టుకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారల్లే ఉంది. ఆ ఇంటి మీద ఎంతో ఇష్టం పెట్టుకున్నారు. ‘ఉడ్‌వర్క్‌’తో సహా అన్నీ దగ్గరుండి చేయించుకుంటున్న ఇల్లు. చిత్రమేమిటంటే బిల్డర్‌ ఆ ఇల్లు ఇంకా వీళ్లకి అప్పజెప్పలేదు. ఆఖరి వాయిదా కూడా కట్టించేసుకున్నాడట. నా పరిస్థితీ అలాగే ఉంది. త్రిశంకు నరకంలోలా.

మధ్యాహ్నం నిద్రపోయి లేచి అక్క ఇచ్చిన టీ తాగి రాజు ఇంటివేపు బయల్దేరాను. టీ ఏదో చిత్రమయిన వాసన వేసింది. అప్పుడు గుర్తురాలేదు కానీ ఇప్పుడు గుర్తొస్తోంది. పిడకల పొయ్యిమీద కాచిన పాలవాసన అది. బాల్యకాలపు స్మృతిని నిద్రలేపే సువాసన అది. సువాసనతోపాటు రుచికూడా.

అక్కా బావా ఇక్కడే ఉంటారు. బావ వ్యవసాయం. అక్క ఇప్పటికీ పాలు ‘పిడకలదాలి’ మీదే కాస్తుంది. చేతులు అడ్డంపెట్టి దీపాన్ని కాపాడుతున్న తరంలోని వాళ్లు వీళ్లు.

రాజు దూరం నుంచే నన్ను చూసి మేడమీంచి దిగాడు. లోపలికి పిలిచాడు. వద్దులే. ఇలా కూచుందాం అని చెప్పి ఆ ఇంటి వీధి అరుగుమీదే కూర్చున్నాను. తనూ నా పక్కన కూర్చున్నాడు.

సాయంత్రపు నీరెండ వేడి తగ్గిపోయి వెచ్చదనాన్ని ఇవ్వలేకపోతోంది. కానీ బంగారు రంగు చివరి కిరణాలు వీధిమెట్ల మీద వాలుతున్నాయి.

లోపల్నించి కాఫీ వచ్చింది. టీ తాగిన రుచి ఇంకా నా జిహ్వను అంటిపెట్టుకునే ఉంది. వద్దన్నాను. అదే మా ఆఫీసులో అయితే తాగేసి ఉందును. వాడు కాఫీ తాగాక ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ రోడ్డు ఎక్కాం.

మేం ఎప్పుడు ఈ వూరొచ్చినా రోడ్డుమీద కొస్తే మా కాళ్లు అప్రయత్నంగా ఆదిలక్ష్మి ఇంటివేపు తిరుగుతాయి. ఇప్పుడూ అటే నడుస్తున్నాం. కానీ అక్కడ ఏం మిగిలింది? ఆ ఇల్లు పూర్తిగా కూలిపోయి ఉంటుంది. ఆ ఇంటి శిథిలాలు చూడ్డానికి వెళ్లాలి. అయినాసరే మాట్లాడుకుంటూ, మాటల్లో పడి అటే నడిచాం. ఆ ఇంటిదాకా వెళ్లాం కూడా.

కానీ మాకు అక్కడ ఆ కూలిన ఇల్లు కనిపించలేదు. చుట్టూ కొత్త వెదురుకంచె. ఎప్పటిలాగే నందివర్థనం పూలని, పసుపు గన్నేరు పూలని దారి పొడుగునా రాల్చి అమాయకంగా ఆకాశం వేపు చూసే చెట్లు. లోపల ఎవరో కనిపిస్తున్నారు.

ఆశ్చర్యంగా, కుతూహలంగా కూడా లోపలికి వెళ్లాం. రోడ్డుమీంచి తడికదాకా వేసిన తాటి దూలం అలాగే ఉంది. కానీ నడుస్తుంటే కదలకుండా దానికి అటూ ఇటూ రాళ్లు కూరి ఉన్నాయి. నేలలో పాతుకుపోయినట్టు ఉంది. లోపలికి వెళ్లగానే అంతా ఆకుపచ్చదనం. ఒకవేపంతా బంతి మొక్కలు పూలతో. మరోవేపు వంగమొక్కలు, మిరపమొక్కలు, పెరడంతా శుభ్రంగా ఉంది. ఆరునెలలుగా ఇక్కడ శ్రమలోని ఆనందం తెలిసిన మనుషులు నివసిస్తున్న చిహ్నాలుగా ఈ మొక్కలు.

ఇంత పెద్ద స్థలంలో ఒక పక్కగా కొత్తగా లేచిన తాటాకుపాక. లోపల్నుంచి కిలకిలా నవ్వుతూ ఆదిలక్ష్మి బయటికొచ్చింది. అదే మనిషి. అదే ముక్కుచివరనుంచి వచ్చి గుచ్చుకునే చూపు. కానీ బాగా పాడయిపోయింది. జుట్టుసగం నెరిసింది సాల్ట్‌పెప్పర్‌ కలయికలా.

‘రండి! రండి! ఎన్నాళ్లకెన్నాళ్లకు! ఇద్దరూ కలిసే వచ్చారు.

మమ్మల్ని మరచిపోయారు. పెద్దాళ్లయిపోయారు’ అంటోంది నవ్వుల్ని కూడా గుచ్చుతూ.

పట్టలేని సంతోషం కలిగింది నాకు. రాజు మొహమూ అలాగే ఉంది.

‘రాజుబాబూ! చెప్పండి ఏంటి కబుర్లు’ అంది.

ఉండండుండండి! మీరు చాలా చెప్పాలి మాకు. మేం కిందటేడు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇల్లంతా కూలిపోయి ఉంది. మీ గురించి అడిగితే ఊళ్లో ఏదేదో చెప్పారు’.

‘అవును బాబూ! నిజమే. పొట్ట చేత్తో పట్టుకుని కూలిపనికే వెళ్లిపోయాం నా కూతురూ నేనూ. కానీ అక్కడెక్కడా బతకలేననిపించింది. నా ప్రాణాలన్నీ ఈ మట్టిలోనే ఉండిపోయినట్టున్నాయి. రోజూ ఈ ఇల్లూ, మొక్కలూ కలల్లోకి వస్తూ ఉండేవి. ఎలాగోలాగ బతకలేకపోమని వచ్చేశాం’ అని చెప్తూ ‘ఇల్లు చూద్దురుగాని రండి’ అని లోపలికి తీసుకెళ్లింది.

ఇటుకతో గోడలు కట్టారు. దానిమీద తాటి దూలాలు కట్టి తాటాకు నేసారు. ఒక గదీ- వరండా. అదే ఇల్లు. తల్లీ, కూతురూ కలిసి కాసిన డబ్బులు పోగేసుకున్నారట. కూతురు అక్కడే కాలేజీ మెస్‌లో పని చేస్తోందట. మళ్లీ వెళ్లిపోతుందట. ఆదిలక్ష్మి ఇక్కడే ఉండి చిన్న హోటల్‌ పెట్టుకుని నడుపుకోవాలని నిర్ణయించుకుందట. విశాఖపట్నంలో గడిపిన జీవితపు అనుభవం తనకు ఆ ధైర్యాన్ని ఇచ్చిందట. ఇలా కాకపోయినా ఈ అర్థం వచ్చేలా చెప్పింది.

పెరటి వేపు కూడా రకరకాల మొక్కలు కనిపించాయి. ఆ మొక్కల దగ్గర వాళ్ల అమ్మాయి ఉంది. మాకు రోడ్డుమీంచి కనిపించిన మనిషి ఆచూకీ ఆ పిల్లే అయి ఉండాలి.

‘ఈ తోటంతా మళ్లీ మునుపటిలాగ ఎప్పుడు తయారుచేసేసారు? ఒక అర్ధరాత్రి వచ్చి మంత్రం వేసేశారా? ఏమిటి?’ అన్నాను నవ్వుతూ.

‘ఆరు నెలలయింది వచ్చి. ఎంతో కష్టపడితే ఈ రూపుకి తేగలిగేం. వచ్చిన వెంటనే గొప్పులు తవ్వుకుని ముందు మొక్కలు నాటేశాం’

‘ఇంత ఏపుగా ఎలా వచ్చాయి-?’

‘రోజూ నీళ్లు పోస్తే అవే వస్తాయి బాబూ! నేలమంచిది కదా’.

ఆ మొక్కల మధ్య ఎర్రటి దాలియా నాలుగు పువ్వులు పూసింది. దూరానికి విశేషంగా కనిపిస్తోంది. దగ్గరికి వెళ్లి ‘ఈ మొక్క ఎక్కడిది?’ అనడిగాను.

‘మాకూడా వచ్చేటప్పుడు తెచ్చాం. బాగానే బతికింది’ అని ఏ మమకారమూ లేకుండా చటుక్కున రెండు పూలుకోసి మా ఇద్దరికీ ఇచ్చింది’. అయ్యో! తెంపొద్దు’ అంటున్నా వినలేదు.

‘రాక రాక వచ్చారు. ఇవి తప్ప ఇంకేమీ లేవు ఇవ్వడానికి’ అంటూ. నేను ఎట్లా ఛార్జ్‌ అవుతున్నానో నాకే తెలీడం లేదు. హైఓల్టేజ్‌లో ఉన్నాను. రాజు మాటిమాటికీ నా చెయ్యి నొక్కుతున్నాడు.

వచ్చేస్తుంటే సంతోషంగా చెప్పింది.,

‘మా చిన్నమ్మాయిని పెంచుకోడానికి ఇచ్చేసేంకదా! దానికి బాసర ఇంజనీరింగ్‌ కాలేజీలో సీటు వచ్చిందట’.

ఎక్కడ ఆదిలక్ష్మి? ‘బాసర’లో ఇంజనీరింగ్‌ కాలేజి పెట్టారని కూడా మాకు తెలీదు. ఎక్కడ ఇంజనీరింగ్‌ సీటు? ఎలా కలిశాయి విడిపోయిన కుటుంబపు శకలాలు?! ఏ ఆశవల్ల అతుక్కుంటున్నాయి-?!

నా మనస్సులో ఒక నందివర్థనం వేలవేల పూలుపూసి దారి పొడుగునా రాలుస్తూ ఉంది. పునరుత్థానం అంటే ఇంతకన్నా వివరంగా ఎవరయినా చెప్పగలరా?

బతుకు బరువయినప్పుడల్లా ఎవరో ఒక ఆదిలక్ష్మి శిథిలాలలోంచి కొత్త జీవితాన్ని నిర్మించుకుంటూ దారి చూపుతూనే ఉంటుందేమో! మనం ఈ జనారణ్యాల్లో వెతుక్కోగలిగితే చాలు!!

(మొదటి ముద్రణ చినుకు మాసపత్రిక, ఏప్రిల్‌ 2010)2 Responses to పునరుత్థానం

 1. December 6, 2014 at 8:19 pm

  ఈ కథని ఎన్నోసార్లు చదివాను . మళ్ళీ నాలుగు రోజుల క్రితం చదివాను. ఈ కథా సంకలనం లో నాకు బాగా నచ్చిందీ కథ . . ఇక్కడ మళ్ళీ చదివాను కూడా ..
  :)

 2. రాణి
  December 22, 2014 at 11:11 am

  కథలను చదువుతూ ఉంటాం. ఆనందిస్తూ ఉంటాం. కొన్ని కథల గురించి ఆలోచిస్తాం. మరికొన్ని కథల గురించి పదిమందికీ చెబుతాం. కానీ కొన్ని కథల్లోకి మనం కూరుకుపోతాం. వాటినుండీ బయట పడటానికి ఎంతగానో ప్రయత్నిస్తాం. కానీ వీలు పడదు. అందులోనే ఉండిపోతాం. అందులోనే మనని మనం వెతుక్కుంటాం. అలా వెతుక్కుంటూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మన మిత్రులో అయినవాళ్ళో ఆదుకున్నవాళ్ళో అక్కున చేర్చుకున్నవాళ్ళో అన్నం పెత్తినవాళ్ళో మనతోబాటు ఆ కథలోకే చొచ్చుకు వచ్చేస్తారు. అప్పుడు ఆ కథకి ఒక పేరు పెట్టాలనిపిస్తుంది. మరో పేరు పెట్టాలని ఎంతగానో ఆలోచిస్తాం. చివరికి దానికి పునరుత్థానం అనే పేరునే నిర్దారిస్తాం.
  తాతినేని వనజగారన్నమాట నూరుపాళ్ళూ నిజం.
  రాణి

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)