కథ

గెలుపు గుర్రం

జనవరి 2015

మ్మ ఫోటో ముందు నిలబడ్డాను. అమ్మ పోయి అయిదేళ్ళు అయ్యింది. నాకు 35 ఏళ్ల వయసొచ్చినా నేనింకా అమ్మ ముందు చిన్నపిల్లాణ్నే. నా జీవితంలోనాకు ఆనందం పంచిన ఒకే ఒక స్త్రీ అమ్మ. నెమ్మదిగా కదిలి కిటికీ దగ్గరికి వచ్చి బయటకు చూశాను. మనుషులూ, కార్లూ, స్కూటర్లు, సైకిళ్ళతో రోడ్డు బిజీ గా వుంది. అందరినీ అలా చూస్తూవుంటే…‘నేనే ఎందుకలా?’ అన్న ప్రశ్న నాలో ముల్లులా గుచ్చుకుంటోంది. చాలా రోజుల తర్వాత ఆప్రశ్న మళ్లీ మళ్లీ నాలో ఉదయిస్తోంది.

కిటికీ దగ్గర్నుంచి వెనక్కి వచ్చి నా రీడింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లాను. పేపర్ వెయిట్ ని కూడా పట్టించుకోకుండా మైథిలి రాసిన ఉత్తరం గాలికి రెప రెపలాడుతోంది. నాకు దుఃఖం కమ్ముకొచ్చి గతంలోకి జారుకున్నాను.

***

చిన్నప్పుడు స్కూలు లో అందరూ హేళనగా చూస్తుంటే.. మాట్లాడుతుంటే.. బాధతో “అమ్మా, నేనే ఎందుకిలా?” అనేవాణ్ని.

అప్పుడు అమ్మ “నీవు స్పెషల్ నాన్నా” అని ధైర్యం చెప్పేది.

“ఎలా స్పెషల్?……పుట్టగానే ఎడమవైపు చెయ్యీ,కాలూ పొట్టిగా వుండి తరువాత సరిగా పెరగక అవిటితనం అందరికీ కనబడుతుంటే “నేను స్పెషల్” ఎలా అవుతాను. అవిటితనం అన్న పదం వినపడకుండా నాలో ఒక స్పెషాలిటీ ని రూపొందించాలని అమ్మ ఎంత తాపత్రయ పడింది. స్కూలులో ప్రతి ఎలక్యూషన్ పోటీ లో మొదటి బహుమతి తెచ్చుకునే నా వాగ్ధాటికి ఎంతో పదును పెట్టింది.

సైకాలజీ లో పి.జి. చేసి నా మనస్తత్వాన్ని మెరుగు పరచుకున్నాను. ఇతరుల మానసిక స్థితి గతులపై అవగాహన కల్పించుకుని అవలీలగా మాట్లాడే శక్తిని అలవర్చుకున్నాను. నలుగురూ గుర్తించి ఎన్నో కోర్సులకు నన్ను స్పీకర్ గా పిలిచారు. ఇప్పుడు నేనొక బిజీ పర్సన్ గా నిలవడం జీవితం లోఒక పెద్ద మలుపే.

“జీవితం లో సక్సస్ ఎలా?”

“మాటలతో ఆకర్షించడం ఎలా?”

“వివిధ పరిస్థితులలో ఆలోచనలు ఎలా ఉండాలి ?”

ఇలాటి టాపిక్స్ మీద మాట్లాడుతూ నా అవిటి తనాన్ని నేనే మర్చిపోయాను. మళ్లీ ఇప్పుడు ఈ స్థితి లో ఏమి చెయ్యాలని ఆలోచించాల్సిన అవసరం రావడం నాకు ఎంతో ఇబ్బందిగా ఉంది. ఇన్నాళ్లూ ఇతరులకు చెప్పినవన్నీ నాకే అన్వయించుకోవాల్సి న పరిస్థితి వస్తుందనుకోలేదు ఎప్పుడూ….!

***

రెండు సంవత్చరాల క్రితం ఒకచోట నా స్పీచ్ తరువాత నన్ను కలిసింది మైథిలి. నా స్పీచెస్ బావుంటాయని వాటితో చాలా ఇన్స్పైర్ అయ్యానని చెప్పింది. అలాంటివి వినడం అలవాటైన నేను చిరునవ్వుతో సమాధానం ఇచ్చాను.
ఆ తర్వాత మళ్ళీ నెలకు వచ్చింది మైథిలి. “జాబ్ దొరక్క చాలా డిప్రేస్డ్ గా ఉందని ‘ చెప్పింది.

‘హోప్’ అన్న టాపిక్ మీద కొంత చెప్పాను. మళ్లీ నెలకు కలిసింది మైథిలి.‘తలిదండ్రులు లేక పోవడం, అన్నఇంట్లో నిరాదరణ, జాబ్ దొరకక పోవడం’ ఈ బాధలన్నీ చెప్పుకుంది. నాకు మామూలు కథ లాగే అనిపించింది.
చివరగా అడిగింది ”కొద్ది రోజులు మీకు సాయంగా ఉండనా సార్”అని.

“సాయం లేకుండా నా పనులు నేను చేసుకోగలను.. అవిటితనం పై జాలి నాకు ఇష్టం వుండదు”

“కాదండీ, నాకూ కాలక్షేపం అవుతుంది. మీ దగ్గర వుండటం వలన ఇంకా నేర్చుకోగలను”

వద్దనడానికి కారణం కనిపించలేదు.

మరుసటి రోజు నుండే పొద్దున్నే నా ఆఫీసు గదికి వచ్చేది మైథిలి. అంతవరకూ ఎటువంటి అసిస్టెంటు లేకుండా వుండే నాకు కొంచెం మేలుగా అనిపించింది. నెల రోజుల్లోనే మైథిలి వల్ల కంప్యూటర్ పనీ, టాపిక్ విషయ సేకరణ, ప్రోగ్రాం ఫిక్స్ చెయ్యడం వంటివన్నీ అంతకుముందు కన్నా వేగంగా అవుతున్నాయి. ఇవే కాకుండా అప్పుడప్పుడూ నా టాపిక్స్ నోట్స్ ప్రిపేర్ అయినప్పుడు కొన్ని మైథిలి డౌట్స్, పరిశీలనా శక్తి నాకు చాలా ఉపయోగపడ సాగాయి.
అమ్మ ఎప్పుడూ చెప్పేది నన్ను నేను ఒక గెలుపు గుర్రం లా మలుచుకోవాలని. మరి ఆ గెలుపు పర్సనల్ లైఫ్లో ఎందుకు కాకూడదు?….ఎక్కడో చిన్న కదలిక నా మనసులో….

“నేను ఇలా అవిటి తనం తో ఉన్నానంటే నీకేమనిపిస్తుంది మైథిలీ?” అని అడిగాను ఒకరోజు.

“మీరు ఒక సక్సెస్ ఫుల్ పర్సెన్ సార్, అదే గుర్తుకు వస్తుంది..” అందామె. నా ఫిజికల్ అప్పియరెన్స్ గురించి ఆమెకు పెద్దగా పట్టింపు లేదన్న విషయం అర్థమై ఉత్సాహంగా అనిపించింది. ఇంటికి వచ్చినా మైథిలి ఆలోచనలు నన్ను వదలడంలేదు.

“ఒక సారి డైరెక్టు గానే మనసులో మాట చెప్పేస్తే బావుంటుందా..?” తర్జనభర్జన పడ్డాను.

పదిరోజుల తర్వాత ధైర్యం చేసి ఆమెతో ఇలా అన్నాను.

“మైథిలీ మనమిద్దరం ఒకటైతే ఎలావుంటుంది?”

మైథిలి కళ్లలో ఆశ్చర్యం!! -దానికి సమాధానమే మరుసటి రోజు మైథిలి ఇచ్చిన ఈ లెటర్.

“నేను చూసింది ఒక అంగ వైకల్యంగల వ్యక్తీ లో ఒక విజయం ని మాత్రమే. ఆ విజయం లో భాగస్వామి కావాలనుకున్నాను తప్పితే మీ జీవిత బాగాస్వామిని అవ్వాలని కాదు. మీకు ఇటువంటి ఆలోచన కలుగజేసానా?? మీరిలాగేనా అర్థం చేసుకునేది….”పూర్తిగా చదివే ధైర్యం లేక లెటర్ ని మడిచి జేబులో పెట్టుకుని ఇంటికి వచ్చేశాను.

***

ఇంటికొచ్చానే కానీ మనసులో మనసు లేదు. ఎక్కి స్వారీ చేస్తున్న గుర్రం మీది నుంచి సడన్ గా పడిపోయిన బాధ. ఆరోజంతా ఏం తినబుద్ధి కాలేదు. నాలో ఆవేశం ఉవ్వెత్తున లేచింది . చిన్నప్పటి నుంచి అణచిపెట్టుకున్న వికారాలు.. విజృంభించాయి.

“ఛీ…ఎందుకీ లైఫ్? కోరింది దొరకనప్పుడు ఏమైనా చేసుకు చస్తే ఏంటి? ప్రేమ, అనురాగం దొరకనప్పుడు బతికి ఏమి ప్రయోజనం?” వెర్రిగా ఆలోచించాను. తల పగిలిపోతోంది. పిచ్చి పట్టినట్టుగా ఉంది. నిద్ర మాత్ర తో కొంచెం ఉపశమనం లభిస్తుందేమో. వెళ్లి టాబ్లెట్ వేసుకున్నాను. దాంతో ఆలోచనా తీవ్రత తగ్గి మెదడు మొద్దు బారినట్టయ్యింది. హఠాత్తుగా అమ్మ ఆకారం కళ్లలో మెదిలింది. అమ్మ .. నా చెయ్యి పట్టుకుని అచ్చం చిన్నప్పటి లాగే ఎక్కడికో ప్రేమ తీరాల్లోకి తీసుకెళ్తోంది..

“అమ్మా నీ వల్లే ఒక మనిషిగా నిలబడ్డా. ఇప్పుడు మరోమనిషి…నాకు సహాయ పడే మనిసి నాకు తోడుగా వుంటే బాగుంటుందని అనిపించకూడదా??? నేనూ ఒక మనిషినే….ప్రేమ కావాలనుకోవడం తప్పా??”
అమ్మ ఏమీ మాట్లాడ లేదు. కానీ ఆ చెయ్యి ఆసరా నన్నెక్కడికో తీసుకు వెడుతున్నట్టుగా వుంది.

నిద్రమత్తులో లోకూడా ఆలోచనలు ఒక నిర్ణీత మార్గం గుండా ప్రయాణిస్తూ నా మెదడుకు ఆలోచన మార్గాన్ని నిర్దేశిస్తూ తరంగాలలో మారుతున్న రంగులను స్పష్టం చేస్తూ చివరికి ఓ ఉన్నతమైన వెలుగువైపు వెడుతూండగా నిద్రాదేవి దుప్పటి కప్పింది.

ఎప్పటిలాగే సూర్యోదయం.

మనసులో ఒక వెలుగు. ఆవేశం లేని ఆలోచనలు.

మైథిలి పరిస్థితిని అవకాశంగా తీసుకున్నానేమోనన్న గిల్టీ. ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కో విధంగా మలుస్తాడు దేవుడు. ఆయన ఇచ్చిన అవిటి తనాన్ని జయించేందుకు పరికరం అయింది అమ్మ. ప్రేమ, బంధాల కంటే అతీతం నాలోని శక్తి అని తెలియచేసింది మైథిలి. నాలోని అవిటితనం ఆవిరి అయ్యింది.

గెలుపు గుర్రం ఉరకలు వేసింది.

ఒక కొత్త రాజు… ఒకటి కాదు రెండు వీక్నెస్ లు జయించిన రాజుగా రాజ్యమేలాలనే దృడ నిశ్చయం జరిగింది.

జీవితంలో “అన్ని ఆలోచనా ధోరణులూ మార్చుకుని సక్సెస్ ని రుచి చూడడం ఎలా అన్న టాపిక్’ పై మాట్లాడడానికి తయారవుతున్నాను.

**** (*) ****

 

పరిచయం:
చదువూ ఉద్యోగం హైదరాబాదు నేపధ్యం అయినా రిటైర్మెంటు తరువాత సొంత వూరైన చిన్న పల్లెటూరు చేరడం- జీవితంలో ఒక అధ్బుతమైన మలుపు, సాహితీ ప్రయాణం చక్కగా సాగడానికి అనువైన వాతావరణం, కావలసినంత తీరిక. నా కథలను ప్రచురిస్తూ ప్రోత్సాహాన్నిచ్చిన వివిధ పత్రికలూ, వెన్నుదట్టి నాలోని రచయితను నిలిపాయి. ముఖ్యంగా అంతర్జాల పరిచయం అఖండ తెలుగు ప్రజలను దగ్గర చేసింది. నా కథను బహుమతినిచ్చి మనసారా ఉత్సాహాన్ని కలిగించిన కథాగ్రూపు, సాయి అఖిలేష్ ప్రొడక్షన్స్ వారికి మరియు వాకిలి అంతర్జాలపత్రికకు ధన్యవాదాలు.5 Responses to గెలుపు గుర్రం

 1. alluri gouri lakshmi
  January 3, 2015 at 11:52 am

  షార్ట్ అండ్ పవర్ ఫుల్ స్టొరీ లక్ష్మి గారూ! సింపుల్ గా చాలా బాగా రాసారు ! అపజయాల్ని వెనక వదిలి ముందుకు దూసుకు పోవాల్సిన గెలుపు గుర్రాలమే మనమంతా ! congratulations !

 2. Lakshmi raghava
  January 3, 2015 at 10:39 pm

  Dhanyavadaalu Alluri Gouri Lakshmi garu.

 3. Yamuna
  January 7, 2015 at 10:47 pm

  లక్ష్మి రాఘవ గారు, కథ చాల బాగుంది. మొదటి భాగం చాల సార్లు చదివిందే అనిపించింది.కాని తరువాత భాగం లో ఉన్న అతని ఆలోచనా మలుపు ఉన్నతంగా ఉంది.’ఒక కొత్త రాజు….’ హత్తుకు పోయింది. అభినందనలు.ఇలా విభిన్నంగా ,ఉన్నతమైన కథలు రాయాలని కోరుకుంటున్నాను.

 4. Mangu Siva Ram Prasad
  January 13, 2015 at 10:09 pm

  చివరిలో కథను మీరు మలచిన తీరు ఒక ఆశావహ దృక్పథాన్ని కల్పిస్తూ జీవించడానికి ఒక పరమార్థాన్ని.బలహీనతలను జయించడం ద్వారా తెలియజేస్తూ ఒక చక్కటి సందేశాన్నిచ్చింది. ఒక మంచి కథను చదివిన మధురానుభూతిని కలిగించినందుకు ధన్యవాదాలు లక్ష్మీ రాఘవగారు.

 5. bhupathi macharla
  June 17, 2016 at 12:20 pm

  అమ్మ !నాపేరు భూపతి మాచర్ల.మీకత చాలా బాగుంది .

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)