సెటైర్

నలుపు – తెలుపు

జనవరి 2015


రాత్రి తొమ్మిదిన్నరకి రోజువారీ కేబినెట్ మీటింగ్ పూర్తయ్యింది. కేబినెట్లో తన పరిపాలన పద్ధతులు మార్చుకోవాలని వత్తిడి పెట్టే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఏక కంఠంతో, అందరూ తన వాగ్ధాటి తగ్గించమని ఉచిత సలహా ఇవ్వడం మొదలెట్టారు. ముఖ్యంగా, టెలివిజన్లోమాట్లాడినప్పుడు, విలేకరుల గోష్టి లోనూ, వివాదాస్పదంగా కనిపించకండా ప్రతిపక్ష వర్గం నాయకుల ఆదర్శాలకి – వాళ్ళకోరికలకీ-అన్నింటికీ కాకపోయినా కొన్నింటికయినా — ఒకింత సుముఖత చూపించడం, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి తనకి, తన వర్గం వారికీ, తన ప్రభుత్వానికీ ఏవిధమయిన అభ్యంతరం లేదని సూచన ప్రాయంగా చెప్పడం అవసరమని కేబినెట్లో పెద్దతలకాయల అభిప్రాయం. బహిరంగంగా మాట్లాడేటప్పుడు, మైనారిటీ వర్గాలనీ, పేదవారిని వెనకేసుకు రావటం తప్పుకాదు కాని, ప్రతిసారీ కోటీశ్వరులని, కార్పరేషన్లనీ, కన్సర్వేటివ్ మోతుబరులని ఆక్షేపించటం మానెయ్యడం అత్యవసరమని కాస్త గట్టిగానే చెప్పడం మొదలుపెట్టారు.

పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, లోలోపల ప్రెసిడెంటుకి రోజు రోజుకీ గాభరా పెరుగుతూనే ఉంది. ఈ మధ్య తన పార్టీ సాధారణ సభ్యులే చాలామంది తనని సమర్ధించటల్లేదు. కొందరు తన పార్టీ సెనేటర్లు, తన పార్టీ కాంగ్రెస్ మెంబర్లూ, బహిరంగంగానే ‘ మా జోలికి, మా నియోజక వర్గానికీ రావద్దు మొర్రో ‘ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. తనని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదన్నట్టు, తప్పుకు తప్పుకు తిరుగుతున్నారు. మరి కొందరయితే తన పథకాలని సమర్థించడం మానేసి, బహిరంగంగా విమర్శించడం మొదలు పెట్టారు. పదవుల్లో ఉన్న నాయకులు కొంతమంది ముభావంగా ఉంటున్నారు. ప్రెసిడెంటు పథకాలకి మద్దతు చూపించిన వాళ్ళు, మద్దతు చూపించని వాళ్ళూ కూడ మధ్యంతర ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోవటానికి తన రాజకీయాలు, తన అసమర్థత కారణం అని వ్యతిరేక వర్గం వాళ్ళ పత్రికలు, వాళ్ళ కున్న ఒకే ఒక్క టెలివిజను స్టేషనూ ప్రతిరోజూ, ఇరవై నాలుగు గంటలూ ఘోష పెడుతున్నాయి. గోబెల్స్ కన్న అన్యాయంగా ప్రచారం చేస్తున్నాయి. స్వయంగా ఆలోచిండం చేతకాని జనాన్ని రోజూ ఊదర కొట్టేస్తున్నాయి. దురదృష్టం ఏమిటంటే, అమెరికాలో స్వయంగా ఆలోచించలేని జనాభాదే మెజారిటీ. అదొక వింతే మరి! అదేదో పాత సామెత చెప్పినట్టు, వాళ్ళు చెప్పే వార్త నిజం అవక్కరలేదు; నిజం ఏదీ వాళ్ళకి చెప్పదగ్గ వార్త కానే కాదు.ఏ మాటకామాటే చెప్పుకోవాలి. మధ్యంతర ఎన్నికల్లో నూటికి అరవై ఐదుగురు ఓటు వెయ్యలేదు. బద్ధకం! ఓటు వేసిన ముప్ఫై ఐదు శాతం లో తెల్లవాళ్ళు డెబ్భైఐదు శాతం. ఈ డెబ్భై ఐదు శాతం మూక ఉమ్మడిగా ప్రెసిడెంటు పార్టికి వ్యతిరేకంగా ఓటు వేసారు. అది అసలు నిజం. అలాగని ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెపుతూ, — కట్టె, కొట్టె, తెచ్చె –అన్న ధోరణిలో తనని సమర్ధించే మీడియాకి మామూలుగా ఉండే ప్రజాదరణే బహుకొద్ది. ఆ ఉన్న కాస్త ఆదరణా ఈ మధ్య కాలంలో అడుగంటి పోయింది. అందుకు మొదటి ముఖ్య కారణం: తాను కోరి కోరి ప్రవేశపెట్టిన ఆరోగ్యబీమా పథకం. దానికి పురిట్లోనే సంధి కొట్టింది. మొదలెట్టిన ముహూర్తం ఏమోగాని అన్నీ అవరోధాలే! ఎవరో తారాబలం రాసే వాడు చెప్పాట్ట! ఈ పథకం ప్రెసిడెంటు వేలిముద్ర వేసిన ఘడియలో రాహువు, కేతువు – ఇద్దరూ తిన్నగా చంద్రుణ్ణి చూస్తున్నారట. అంతే! ఆ క్షణంనుంచీ అన్నీ అడ్డంకులే! ఆ దెబ్బతో, తనని ఒక ప్రవక్తలా గౌరవించి సమర్ధించిన కుర్రకారు జనం, అభ్యుదయవాదులూ, ఆశావాదులూ — అందరూ చప్పబడి నీరు కారి పోయారు. ఈ బీమా పథకం గందరగోళానికి వెనకాల కార్పరేట్ కాన్స్పిరసీ (conspiracy) ఏమీ లేదని బహిరంగంగా, ఘంఠాపథంగా ఎవడూ చెప్పలేడు.

తన పిల్లలు, – మాల్య, శాషా – ఇంకా మెళుకువగా ఉన్నారేమోనని చూడటానికి వాళ్ళ పడక గదిలోకి వచ్చాడు, ప్రెసిడెంటు. మెలుకువగా వుంటే వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పి వాళ్ళతో కలిసి ఓ పాట పాడదామని ఆశ! తన పాటవినడం వాళ్ళకి సరదా.పరమ వేళాకోళం కూడాను!వాళ్ళిద్దరూ మాంచి నిద్రలో ఉన్నారు. తన పడక గదిలోకి వచ్చాడు; ధర్మపత్నితో మంతనాలాడటానికి. ఆవిడ గుర్రు పెట్టి నిద్రపోతూన్నది. పక్కలో కాల్విన్ యండ్ హాబ్స్ కార్టూన్ల పుస్తకం ఒకటి పక్కమీద ఎడమపక్కన తను పడుకునే వైపున తెరిచిపెట్టి ఉంది. బహుశా పిల్లలూ, ఆవిడా, కలిసి ఆ కార్టూనులు చదువుకొని హాయిగా నవ్వుకొని ఉంటారు. ఆవిడకి ప్రభుత్వ వ్యవహారాలు చిరాగ్గా కనిపించినప్పుడల్లా, కాల్విన్ యండ్ హాబ్స్ పాత కార్టూన్ల పుస్తకాలు చదవటం హాబీ! ఈ మధ్య ప్రతిరోజూ కాల్విన్ యండ్ హాబ్స్ కార్టూను పుస్తకాలు తన పడకమీద కనిపిస్తున్నాయి. తెరిచి పెట్టిన పేజీలో కార్టూను చూసి నవ్వుకున్నాడు, How true! అనుకుంటూ! పుస్తకం మూసిపెట్టి ప్రెసిడెంటు పిల్లిలా మళ్ళీ కోల గదిలోకి వచ్చాడు.

ఈ నెల ఆఖరికి — గత సంవత్సరంలో తన నాయకత్వంలో దేశ ఆర్థిక స్థితి ఎంత పుంజుకున్నదో, వచ్చేరెండు సంవత్సరాలలో తన ప్రభుత్వం సమర్థించబోయే నూతన పథకాలు మున్ముందు ముందు తరాలవారికి ఆర్థికంగా, సాంఘికంగా ఎంత అభివృద్ధి సూచకంగా ఉండబోతాయో ప్రజానాయకుల ప్రత్యేక జాయంట్ సభలో చెప్పుదామనుకుంటున్నాడు. సాంప్రదాయంగా నిరుడు జనవరిలో చేసిన ప్రసంగం ఎన్నికల్లో పోటీ చేయబోయే తన పార్టీలో ఉన్న కాంగ్రెసు నాయకులకి ఏమాత్రం నచ్చలేదు. ఈ జనవరిలో చెయ్యబోయే ఉపన్యాసంలో మార్పులు, చేర్పులు, — చప్పట్లకి వీలయ్యే కూర్పులూ వగైరా చేసుకోవటానికి ఆట్టే సమయం లేదు.

ఎందుకన్నా మంచిదని, స్పీకర్ ని పిలిచి కాస్సేపు మాట్లాడుదామని కోరిక కలిగింది. ఒక్కొక్కసారి బలే అనుమానం వస్తుంది; ఇతని వంటికి కమిలిన రంగు ఎలా వచ్చిందా అని! ఎప్పుడు కలిసినా అడుగుదామని పిస్తుంది కాని, అడగటానికి మొహమాటం. తనతో ఒంటరిగా మాట్లాడేటప్పుడు చాలా సఖ్యతగా నవ్వుతూ మాట్లాడుతాడు. బయట బహిరంగంగా మాట్లాడేటప్పుడు తనని, తన నాయకత్వాన్ని వేళాకోళం చేస్తాడు, నిశితంగా విమర్శిస్తాడు. ‘తన విదేశాంగ విధానం పిరికితనానికి ప్రతీక’ట! అందుకే మధ్యప్రాచ్యదేశాలలో మనమాట వినేవాడు ఒక్కడూ లేకుండా పోయాడుట. మన౦ ఎల్లవేళలా మద్దతిచ్చే మన దుడ్డుతో బతుకుతున్న ఒక్క చిన్నదేశం, మనని నమ్మటం లేదు. కారణం: తన ప్రభుత్వ పథకాలేనట! ఇదీ అతని వరస.’ అయితే, అసలు రహస్యం: వాడు బహిరంగంగా తన పథకాలని ఏ మాత్రం సమర్థిస్తున్నట్టుగా కనిపించినా సరే, వాడి భరతం పడతారు. – వాడి పార్టీ వాళ్ళు వాడికి టీ పార్టీ ఇచ్చి వాడిని ఉద్యోగంలోనుంచి పీకి పారేస్తారు. అదీ, వాడి అసలు భయం!

సరిగ్గా తను పిలుద్దామనుకుంటూంటే, ఏదో “ టెలీపతీ” లాగా, స్పీకరే తనని పిలిచాడు. కుశల ప్రశ్నలు అయ్యాక, స్పీకర్ చెప్పాడు : ఈ సారి కాంగ్రెస్ లో బడ్జెట్ ఒప్పందం సాఫీ గా కుదిరినందుకు సంతోషంగా ఉన్నదట! సెనేట్ ఎంత తొందరగా ముద్దర వేస్తే అంత మంచిది. అనవసరపు గొడవలు కాస్త తగ్గుతాయని మేమంతా అనుకుంటున్నాం,” అనంగానే, “ అల్లాగే, దక్షిణ అమెరికా ప్రవాసుల బిల్లుకి, ఆదాయపు పన్ను సంస్కరణకీ కూడా ఏదోరకంగా ఒప్పందం కుదిరితే బాగుంటుందేమో?,” అని తను అన్నాడు. వాటిని గురించి ఏమీ మాట్లాడకండా, మరేదో సొద చెప్పడం మొదలుపెట్టాడు స్పీకరు. ప్రెసిడెంటు కి నాలిక చివర దాకా వచ్చింది, “ నువ్వు దురదృష్టవశాత్తూ వాళ్ళతో జట్టు కలిపావు. నువ్వు నిజంగా మాతో ఉండవలసిన వాడివి. నువ్వు మాపార్టీలోకి వచ్చెయ్యరాదూ! కేబినెట్ లో మాతో కలిసి పనిచెయ్యవచ్చు. ముమ్మాటికీ నువ్వు మాతో ఉండవలసిన వాడివే!వాళ్ళతో కాదు, నామాట నమ్ము,” అని. అలా చెప్పలని ఎన్నోసార్లు అనుకున్నాడు. కానీ, చెప్పటానికి మనసొప్పేది కాదు. ఈ సారి ప్రయివేటుగా కలిసినప్పుడు తప్పకండా నచ్చచెప్పాలి,” అని అనుకుంటూ “ థాంక్స్ యండ్ గుడ్ నైట్” అని చెప్పి కుర్చీలో కూలబడ్డాడు. తను చెయ్యబోయే కొత్త ఉపన్యాసం డ్రాఫ్ట్ కాగితాల కోసం, ఎడమపక్క డ్రాయర్ తెరిచాడు. కాగితాల పైన బైబిల్ సామ్స్ అధ్యాయం తెరిచి ఉన్నది.

బైబిల్ బయటికి తీశాడు.

సామ్స్ మొదటి పుస్తకంలో పాటలు 3 – 4 పైకి చదవటం మొదలుపెట్టాడు.

“O! Lord, how many are my foes!
How many rise up against me!
Many are saying of me,
God will not deliver him.”
But you are a shield around me, O Lord,

I lie down and sleep;
I wake again…
Answer me when I call you,
O my righteous God.
Give me relief from my distress;
Be merciful to me and hear my prayer…”

ఈ రెండు పాటలూ తనకి కంఠతా వచ్చు. అయినా పుస్తకంలో చూస్తూ చదవటం బాగుంటుంది. అదొక రకమైన మనశ్శాంతి ఇస్తుంది.

కుడిచేతి పక్కనున్న డ్రాయర్లో కొరాను – ఇంగ్లీషు అనువాదం- పైకి తీసాడు.

మొట్టమొదటి సూరా, ఆల్ – ఫతిహా పద్యాలూ ఏడూ చదివాడు.

In the name of God
Most Gracious Most beneficent.
All praise be to God,
Who is the Cherisher
And sustainer of all.

ఆరో పద్యం, ఏడో పద్యం ఒకటికి రెండుసార్లు చదవటం ఎంతో ఇష్టం. చిన్నప్పుడు ఆ రెండూ బిగ్గరగాచదుకునేవాడు. ‘తాతగారి ఇంటిలో ఉండే రోజుల్లో అరబిక్నేర్చుకొని వుంటే బాగుండేది,’అని ఈ సూరా చదివినప్పుడల్లా అనుకుంటాడు.

Show us, O Lord,
The right path,
The path of those
Whom you have blessed
And not of those
With whom you are wrathful,
Nor of those who have
Chosen to go astray.

ఆఖరి పద్యం చదవటం పూర్తి అవగానే, స్పీకర్ గుర్తుకొచ్చాడు. ప్రెసిడెంటు పెదాల మీద చిరునవ్వు వచ్చింది.

‘చెయ్యబోయే ఉపన్యాసంలో చాలా మార్పులు చెయ్యాల్సి రావచ్చు, కొత్తగా చెప్పాల్సినవి ఏమీ లేకపోయినా’ అని అనుకుంటూ, కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ కుర్చీలో వెనక్కి జారగిల పడ్డాడు.

***

అకస్మాత్తుగా ఆకాశంలో వెయ్యి సూర్యులు ఒక్కసారే ఉదయించినట్టు కోల గది వెలిగిపోయింది. ఆ కాంతి కోలగది చుట్టూరా ప్రజ్వలించింది. స్పీల్బర్గ్సినిమాల్లోలాగా గది మొత్తం తనతో పాటు గిరగిర తిరుగుతున్నదా అనిపించింది. ఆ అద్భుత తేజస్సు మిరుమిట్లు గొలిపి, స్వర్గంలో భగవద్దర్శనం అంటే ఇలాగే ఉంటుంది కాబోలునని పించింది. కాస్త భయం వేసింది కూడాను.

ప్రెసిడెంటు ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరవలేక పోయాడు. ఎదురుగుండా ఆ తీక్షణమైన కాంతిలో లీలగాఒక చిన్న కుర్రాడి రూపం తెరమీద 3-D బొమ్మలా కనిపించింది. తల మీద నీలంగా నెమలి పింఛం, కుడిచేతిలో పిల్లన గ్రోవి తో నల్లగా ఉన్నఆ చిన్న కుర్రాడి ప్రతిబింబం చిలిపిగా చిరునవ్వు నవ్వుతున్నట్టు కనిపించింది. ప్రెసిడెంటుకి భయం పెరిగి పోయింది. ఒళ్ళంతా చెమటలు పోసాయి. బల్ల మీదున్న పేపర్వెయిట్తీసి విసురుదామనుకున్నాడు, కానీ చెయ్యి లేవలేదు.

‘ సెక్యూరిటీ, సెక్యూరిటీ,’ అని అరుద్దామని ఎంత ప్రయత్నించినా గొంతు పెగల్లేదు. తన అరుపు తన గొంతులోనే ఘట్టిగా వినిపిస్తోంది. కాని, గొంతులో నుంచి మాట బయటికి రావటల్లేదు.
గదిలో వెలుగు తీవ్రత మెల్లిగా తగ్గింది. గదంతా మరకత దీప కాంతి తో చల్లగా హాయిగా మారింది. తనని చూసి,

“ వెర్రివాడా! నన్నుచూసి నువ్వు అంతగా భయపడవలసిన అవసరం లేదు,” అన్నాడా నల్ల పిల్లాడు, తామరపువ్వుల్లాటి కళ్ళతో చిలిపిగా నవ్వుతూ! ఆ మాటలన్నప్పుడు కోలగది నిండా కాగుతున్న వెన్న వాసన ఆవరించిందా అనిపించింది. ఆ అబ్బాయి మాటల్లో దొంగతనపు జాణతనం ఉట్టి పడుతూన్నది.

ఆ కుర్రవాడు మాట్లాడే భాష ఏదో అర్థం కావటల్లేదు. ఏదో వింతైన వాద్య సంగీతం వింటున్నట్టు వినిపించింది. వింతగా ఉన్నా చాలా మృదువుగా ఆనందంగా ఉన్నది. అయితే తనకి ఒక్కమాటకూడాఅర్థం కాలేదు. వెర్రిమొహం పెట్టాడు, ప్రెసిడెంటు.

ఆ కుర్రాడు ఎదురుగా ఉన్నపెద్ద గాజుతెర వైపు తన చూపుడు వేలుతో ( సౌజ్ఞ) సంజ్ఞ చేసాడు, ‘ అదిగో! అటుచూడు,’ అన్నట్టు. అతని మాటలు వెంట వెంటనే ఇంగ్లీషులోకి తర్జుమా అయి పెద్దసైజు అక్షరాల్లో ఆ తెర మీద కనిపించాయి. ఆశ్చర్యం! తను మాట్లాడగలుగుతున్నాడు!

“ ఇదెలా సాధ్యం? ఏమిటీ మాయ? అసలు నువ్వెవరివో చెప్పు!,” అని గద్దించి, ‘ సెక్యురిటీ, సెక్యూరిటీ,’ అనబోయాడు. కానీ అప్పుడు మళ్ళీ గొంతు పెగల్లేదు.

“ ఇదా! ఇదంతా గూగుల్ మహిమ! నువ్వు మాట్లాడిన భాష నుంచి నా భాష లోకి, నా భాషణ ఏ భాషలో ఉన్నానీకు అర్థమయ్యే భాష లోకీ కాంతి కన్నావేగంగా అనువదించడం గూగుల్వాళ్ళు సాధించి పారేశారు.అది కూడా తెలియదా నీకు? సరే, పోనీలే! నువ్వేమన్నా సర్వజ్ఞుడివా? సర్వాంతర్యామివా?

ఆ! ఇంతకీ ఏమిటి అడుగుతున్నావు?నేనెవరినిఅనా? వెర్రివాడా! నేనే తెలియదా నీకు? నా గురించి చదవకపోతే పోనీలే! నా గురించి నువ్వు ఎప్పుడూ ఎక్కడా వినలేదూ?” అని ఒక్క క్షణం ఆగి, “నీకూ నాకూ చాలా పోలికలున్నాయి, తెలుసా?” అన్నాడు ఆ చిన్నవాడు, గర్వంగా గాలికి అటూఇటు మెల్లిగా ఊగుతున్న తలమీద పింఛం సవరించుకుంటూ.

“పోలికలా? నిజంగా? అదెట్టా?”

“ ముందుగా, నువ్వూ నేనూ నల్లటి వాళ్ళం. అంటే మన ఇద్దరి వంటి రంగూ ఒకటే. మన ఛాయల్లో అటూ ఇటూగా కొంచెం తేడాఉండచ్చు. ఆ ఛాయా భేదం వర్ణించడం అనే పనికిమాలిన పని కాల్పనిక కవులకి, పెళ్ళిచూపుల పేరుతో ఆడపిల్లని వర్ణించే మొగపిల్లల బంధువులకీ వదిలేద్దాం. అసలు నిజం చెప్పాలంటే, నాకు ఒక రంగు, ఒక ఆకారం, ఒక పరిమాణం ఎప్పుడూ లేవు. ఎన్నడూ లేవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకోవచ్చు.
పొగడచ్చు; తెగడచ్చు. పాతకాలంలో నేను నలుగురి నోళ్ళలో పడి నల్లనివాడిగా ప్రసిద్ధికెక్కాను.”

“ ఇదేదో విచిత్రంగా ఉన్నది. నువ్వు ఏదో వింతమనిషిలా ఉన్నావు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెపుతున్నావు.”

ఆ బాలుడు చిరునవ్వు నవ్వాడు. కుడిచేతిలో పిల్లన గ్రోవి హుందాగా ఎడమ చేతిలోకి మార్చాడు. గాలికి నెమలి పింఛం అటూ ఇటూ ఊగుతున్నది.

“ నీకూ నాకూ ఉన్న పోలిక, రంగు ఒక్కటే కాదు. నేను పుట్టంగానే మానాన్న నన్ను తట్టలో తీసికెళ్ళి మరో ఊళ్ళో యాదవకుల స్త్రీ ఇంటి గుమ్మంలో వదిలిపెట్టి ఎవరికీ కనిపించకండా పారిపోయాడు. మీనాన్న నిన్నూ వదిలేసి పోయాడు. ఒకరకంగా ఆలోచిస్తే చిన్నప్పటి నీ జీవితమే నయం. నిన్ను మీ నాయన మీ సొంత అమ్మ దగ్గిర వదిలిపెట్టి పోయాడు; కనీసం నువ్వు మీ సొంత అమ్మ దగ్గిర పెరిగావు. నేను నా సొంత అమ్మనాన్నల దగ్గిర పెరగనే లేదు.”

“ అసలు నువ్వు ఈ కోల గదిలోకి సెక్యూరిటీ వాళ్ళ కళ్ళకి కనిపించకుండాఎలావచ్చావు?”

“వెర్రివాడా! నేను సర్వాంతర్యామిని. నన్ను నమ్మిన వాళ్ళకి, ఎక్కడ కావాలంటే అక్కడ కనిపించగలను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కనిపించగలను. ఏ ఆకారం కావాలని కోరుకుంటే ఆ ఆకారంలో కనిపించగలను .ఏ పరిమాణంలో ఊహించుకుంటే ఆపరిమాణంలో ప్రత్యక్షమవ గలను.”

“నేను నిన్ను కోరుకోలేదే? నువ్వు ఇప్పుడు నాదగ్గిరకెందుకు వచ్చావు?”

“ఓరి అమాయకుడా! యోగక్షేమమ్ వహామ్యహమ్!”

“అంటే?”

“ఎక్కడ భద్రత అవసరమో, ఉన్నది చెడకుండా ఉండాలో అక్కడే నేను ఉంటాను.”

“ నన్ను అబద్ధాల కోరు అని,అసమర్థుణ్ణనీ, — ‘ యుద్ధంవద్దు; ఏదో రకంగా సంధి చేద్దామని ప్రయత్నిస్తే–నా శతృవర్గం వాళ్ళు, పిరికివాణ్ణని, ఇంకా ఏవేవో నానా మాటలూ అంటున్నారు. అయినా నీతో చెప్పుకొని …” ప్రెసిడెంటు మాటలు పూర్తికాక ముందే ఆ కుర్రాడు,

“ ఆగవయ్యా! ఆగు! అక్కడితో ఆపు నీ వాచాలత! నీ దండకం కట్టిపెట్టు. నా విషయం పూర్తిగా చెప్పనీ!” అని అడ్డుపడ్డాడు.

అబద్ధాల కోరువని నిన్ను అంటున్నారా? అదేదో నువ్వంటే గిట్టని వాళ్ళు అనే మాటలు పట్టుకొని వేళ్ళాడుతున్నావా, వెర్రివాడా? వాటి గురించి నువ్వు పట్టించుకోనే కూడదు. నన్నుఎంత మంది అబద్ధాలకోరు అని అన్నారో! చిన్నప్పుడు వీధిలో ఆడుకోటానికిపోతే, మా పెద్దన్నయ్య మా పెంపుడు తల్లితో , నేను స్వేచ్చగా మట్టి తింటున్నానని నా మీద అబద్ధాలు చెప్పేవాడు. పితూరీలు చేసేవాడు .మన్ను తినటానికి నాకేమయినా జబ్బు ఉన్నదా?ఆ అబద్ధాలు విని మా పెంపుడుతల్లి నా వీపు చితక కొట్టేసింది.”

ఆ కుర్రాడి మాటల ధోరణికి అడ్డుపడుతూ, “ క్రమశిక్షణ పేరుతో, అలా శిక్షిస్తే, అమ్మనైనా సరే, మా దేశంలో జైలులో పెడతారు. తెలుసా?” అన్నాడు ప్రెసిడెంటు.

“ సరేలే! నన్ను పూర్తిగా చెప్పనీ! అడ్డు పడబోకు,” అని గద్దించాడు ఆ కుర్రాడు. “ #Sorry!#” అని కిమ్మన కుండా కూచున్నాడు, ప్రెసిడెంటు.

ఆ అబ్బాయి అందుకున్నాడు. “ పరాయి వాళ్ళ సంగతి చెప్పకండా ఉండటమే మంచిది. వాళ్ళేం తక్కువ తిన్నారా? నా మీద అబద్ధాలు చెప్పటానికి, రాయటానికీ అడక్కండా వచ్చేవాళ్ళు, ఒంటి కాలి మీద!

“ నఖశిఖ పర్యంతం నన్ను తేరిపార చూసి గోపికలు,….” ఆ కుర్రాడి వాక్యం పూర్తి కాకముందే ప్రెసిడెంటు గాజు తెర మీద చూసి, “ కాలిగోటి నుంచి నెమిలి సిగ వరకూ ఏమిటి? ఈ తిరకాసు భాష నాకు అర్థం కావటల్లేదు.”

“ అది గూగుల్ చేసిన‘బూబూ’ నాయనా! ముక్కస్య ముక్క అనువాదం. గూగుల్సాయంతో ఏ భాషలో నుంచైనా మరో భాషలోకి ఎడాపెడా తర్జుమా చెయ్యచ్చు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పి తీరాలి. ఈ మధ్య ఇండియాలో తెలుగువాళ్ళు క్వెచువా భాషలో నుంచి కూడా కవితలు, ఇంగ్లీషులోకి, ఇంగ్లీషు నుంచి సంస్కృతంలోకీ అనువాదాలు చెడామడా చేసి పారేస్తున్నారు. లహండ భాష చదివేవాళ్ళు లేరు గానీ, ఒకవేళ ఉండి ఉంటే, దొరికిందే సందు అని అందులోకి కూడా అనువాదాలు చేసి పారేస్తారు, ఈ కవి పుంగవులు! ఈ ముక్కస్యముక్క అనువాదాలు చాలా ప్రమాదకరంగా పరిణమించాయి. గూగుల్ నిఘంటుల సాయంతో చేసే అనువాదాలు ప్లేగు వ్యాధికన్నా భయంకరంగా పెరిగిపోతున్నాయంటే నమ్ము! భాషీయమైన అనువాదాలు చెయ్యడానికి కావలసిన కిటుకులన్నీ గూగుల్ వాళ్ళు ఇంకా తయారు చెయ్యలేదు. ఎవడన్నానీబోటివాడు డబ్బిస్తాడేమోనని ఎదురు చూస్తున్నారు. అయినా, ఈ గొడవలన్నీ ఇప్పుడు నీకెందుకులే! ‘ నఖశిఖపర్యంతం,’అంటే, ‘కాలి నుంచి తల వరకూ’ అని అర్థం. అంటే, నీభాషలో head to toe, అని.”

“ సారీ! నేను అడ్డుపడ్డాను. గోపికలు…అనిఅన్నావు. వాళ్ళెవళ్ళూ? పూర్తిచెయ్యి నీ వాక్యం,” అన్నాడు ప్రెసిడెంటు.

“ గోపికలు – పాల ముంతలు సరఫరా చేసే అందమైన ఆడపిల్లలు! నీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, milk maids అన్నమాట! ఈ గోపికలు కానుగ చెట్టు రంగులో అందంగా ఉన్న నా శరీరం — అంటే నల్లగా ఉన్ననా శరీరం చూసి మోహించి పరవశ పడేవాళ్ళని రాసి పారేశారు, ఈ కవులు నా గురించి.”

“ నిజంగానా? నల్లటి వాళ్ళు అందంగా వుంటారని మీ కవులకు ఆనాడే తెలుసన్న మాట! వాళ్ళేదో, మంచి నాగరీకుల్లా వున్నారు!”

“నిజమా, నిజమున్నరా! అంతటితో ఆగారా? భీమ రథీ నది దారిన నడవద్దని జనాన్ని హెచ్చరించారు! అసలు భీమరథీ నది ఎక్కడుందో తెలియని వాళ్ళకి కూడా దండోరా వేయించి భయపెట్టేశారు. ఏం చెప్పమంటావు? నేను దిసమొలతో కూచొని, దొంగతనం చేస్తానుట! గోపికల ఇళ్ళల్లోకి దూరివెన్న దొంగిలించి ఆవెన్నంతా నేను తింటానుట. నీ తోటి నా బాధలు చెప్పి ప్రయోజనం ఏముంది, చెప్పు? తెలుగులో ఒక సామెత వుందిలే! ‘రోలువెళ్ళి మద్దెలతో మొర పెట్టుకుందిట.’ అయినా, నిజం చెప్పొద్దూ! అంత వెన్నతింటే, నా ఆరోగ్యం ఏమయి ఉండేది? నా కొలెస్ట్రాల్ ఎంత పెరిగిపోయి ఉండేదో చెప్పు.చిన్నప్పుడే ‘ఢాం’ అని ఉండేవాడిని. అసలు అంతంత వెన్నతినటం ఎవరికీ మంచిది కాదు కాబట్టే నేను గోపికల ఇళ్ళల్లో ఉట్ల మీద దాచిన మట్టికుండల్లో వెన్న వాళ్ళు చూస్తూ ఉండంగానే తీసుకుపోయేవాడిని; ఊళ్ళో అందరికీ సమానంగా పంచిపెట్టేసే వాడిని.
ఏమిటంటున్నావ్? చేతకాని వాడివని, అసమర్థుడివనీ అంటున్నారా?

అసమర్థుడివని నిన్ను ఆడిపోసుకుంటున్నారని నువ్వు ఊరికే బెంబేలు పడిపోతున్నావు. నా సంగతి చెప్పుతా విను. ఒకసారి, ఒక రాజు, నన్ను మర్యాదగా పిలిచి నాకు రాచ గౌరవం చేస్తుంటే , కుళ్ళుబోతు వాడు ఒకడు – మా మేనత్త కొడుకే – నన్నూ అలాటి మాటలే అన్నాడు, ఒకసారికాదు, వందసార్లూ, పబ్లిక్సభలో! ఆ వందమాట్లు వాడి చెత్త వాగుడు విని, పోనీలే అని ఊరుకున్నా! వాడిని క్షమించా. అంతే. ఆ తరువాత వాడు నోరు తెరిచాడు, నన్ను తిట్టటానికి. అంతే!వాడిని ‘సఫా’చేసాను. నీకూ సమయం కలిసి వస్తుందిలే! వాళ్ళ మాటలు వాళ్ళే మింగుతారు, కంగారు పడకు.

ఏమిటన్నావ్? సంధి చేద్దామనుకున్నావా? జీవితాంతం కొట్టుకొని చస్తున్న జాతివాళ్ళకి సంధి ఎక్కడ కుదురుతుందయ్యా, వెర్రి ఓబన్నా?

ఇదిగో! కాస్త నేల కోసం, — మాదంటే మాదని కొట్టుకొని చస్తున్న జ్ఞాతుల మధ్య సంధి చెయ్యటం నాకే సాధ్యం కాలేదు? అన్నదమ్ముల మధ్య అనవసర యుద్ధం ఆపటం కోసం నేను ఎంత ప్రయత్నించానో, సంధిచెయ్యటం కోసంఎన్నిఅగచాట్లు పడ్డానో నీకేం తెలుసు? నీ బాధా అదేగా? యూదులూ, అరబ్బులూ జ్ఞాతులే గదయ్యా! చెప్పుతున్నా, సావధానంగా విను.

ఒకసారి అన్నదమ్ముల పిల్లల మధ్య సంధి చెయ్యటానికి నేను రాయబారిగా వెళ్ళా. ఒక వర్గం వాళ్ళు నానా దుర్భాషలూ ఆడి, నన్ను తాళ్ళతో కట్టి బంధించారు, తెలుసా? రాయబారి నెవడన్నా, అలా కట్టి పడెయ్యడం, చరిత్రలో ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా? నీ అదృష్టమే బాగుంది, నిజంచెప్పద్దూ?! ” అని అన్నాడు ఆ చిన్న కుర్రాడు.

“ భలే గా గుర్తు చేశావ్! నిన్నునా సెక్యూరిటీ వాళ్ళు కట్టి పడేసేలోగా నువ్వు ఇక్కడ నుంచి నిష్క్రమించడం నీకు మంచిది. నేను …”

“ అది అసాధ్యం. ఆనాడు అక్కడ వందమంది అన్నదమ్ములు నన్నుకట్టిపడేస్తే నేను నా విశ్వరూపం, ప్రళయ రూపం ప్రదర్శించి నా విరోధుల నందరినీ భయపెట్టేశాను. నేను చెక్కు చెదరకండా బయట పడ్డాను! నీ సెక్యూరిటీ వాళ్ళకి నేను అసలు కనపడనే కనపడను!”

“ నీ కట్టు కథలన్నీ బాగానే ఉన్నాయి గానీ, నా అసలు విషయం నీకు బోధపడదు; నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదు,” అన్నాడు ప్రెసిడెంటు.

“ఆ ‘ అసలువిషయం,’ అదేమిటోచెప్పు, చూద్దాం!”

“ నేను నల్లవాడిని. ఇది తెల్లవాడి దేశం. కాబట్టి, ఈ తెల్లజనం నామాటలు పట్టించుకోవటం లేదు. నన్ను నమ్మటల్లేదు. నన్ను చులకనగా చూస్తున్నారు. నే చెప్పింది ఏదీ వినిపించుకోవటల్లేదు. పైగా, నేను పట్టిన కుందేటికి మూడేకాళ్ళని భీష్మించుకొని కూచున్నానని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.నేను మంచిగా, అందరికీ మంచి చేద్దామన్నఅభిలాషతో పనిచేస్తుంటే, నన్నుఖాతరు చెయ్యటల్లేదు. ప్రతి పనికీ, ఎడ్డెమంటే తెడ్డెమని అడ్డు పడుతున్నారు. నేనే గనక తెల్లవాడి నయిఉంటే…”

“ నువ్వు అందరికీ మంచి చెయ్య గలవని నిజంగా నమ్ముతున్నావా?”

“ Oh! Yes!! ”

“అందరికీ మంచి చెయ్యటం ఈ కలియుగంలో సాధ్యమా?”

“Certainly! At least to a majority of the people.”

“ ఏ విధమైన ఫలా పేక్షలేకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే నీకెవరూ అడ్డు రారు. ఈ సూక్ష్మ సిద్ధాంతం విషయం నేను ఏనాడో చెప్పాను. ”

“ మళ్ళీ మొదటి కొస్తున్నావు. నేనే గనక తెల్లవాడినయి ఉంటే, నే చేసే పనికి, చేద్దామనుకున్న పనికీ ఎవడూ అడ్డుపెట్టేవాడు కాదు.”

“ నిజంగానా?”

“ముమ్మాటికీ నిజం. నూటికి నూరుపాళ్ళు నిజం.”

“ నువ్వు తెల్లవాడివయి ఉంటే, నీకు అడ్డుపెట్టరంటున్నావ్ అంతేనా?”

” Yes. Yes. And Yes.”

“ అదే నీ కోరికయితే నేను నీకు తేలిగ్గా సాయం చెయ్యగలను. కానీ…”

“మళ్ళీ కానీ ఏమిటి?”

“ ఇందాక చెప్పానుగా! నేను సర్వాంతర్యామిని, అని. అన్ని జీవరాసులకీ నేను ఒక్కడినే! నా అనురాగం అందరి పైనా సరిసమానంగా ఉంటుంది. ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ ఎన్నడూ చెయ్యను. అందరూ నాకు సమానమే!

“ ఈ క్షణంలో నిన్ను తెల్లవాడిగా చేస్తాను. కానీ…”

వాక్యం పూర్తి కాకుండానే, ప్రెసిడెంటు, “ That’s enough for me! That’s all what I want!” అన్నాడు. కళ్ళు నులుపుకొని, ప్రెసిడెంటు అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్నాడు. ఉన్నట్టుండి తాను తెల్లవాడైపోయాడు. ఎంతో సంతోషంతో, ఒక్కఉదుటున తాను ఒక్కడూ జాయంట్సభకి హుటాహుటిన వెళ్ళాడు.

ఆశ్చర్యం! అక్కడ, ఒక ఇద్దరో ముగ్గురో మినహా, సభలో మిగిలిన అందరూ నల్లవాళ్ళే! ఏ ఒక్కడూ తనని పట్టించు కోకండా, కుర్చీలు, విసిరేస్తూ, బెంచీలపై ఘట్టిగా గుద్దుతూ, ఎందుకో అరుచు కుంటున్నారు.గద్దె మీద కూచున్నవాడు బల్ల గుద్దుతూనే ఉన్నాడు, ఆర్డర్, ఆర్డర్ అంటూ!. ఎవడూ వాడి మాట వింటున్నట్టు లేదు. ఎవడో వెనక నుంచి విసిరిన ఇనప కుర్చీ తన నెత్తిమీద పడేదే, తను గనక పక్కకి తప్పుకోక పోతే!
కొంపదీసి, నేను గనక పొరపాటున ఇండియాలో ఏదో విధానసభకి వచ్చేసానేమోనని భయపడి, కెవ్వున కేకవేసి, కళ్ళుతెరిచి చూసాడు.

***

కోలగది తలుపులు తెరుచుకొని, వెంటనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులువచ్చి“Are you alright, Mr. President?” అని సవినయంగా అడిగారు. Thanks! I am OK,” అన్నాడు ప్రెసిడెంట్, ‘What a scary dream!’ అని మనసులో అనుకుంటూ.

తన పడక మీద కాల్విన్ యండ్ హాబ్స్ కార్టూన్ పుస్తకంలో, కాల్విన్ రెప్పవెయ్యకండా ధ్యాన భావంతో ఆకాశంకేసి చూస్తూ ‘Oh shit, Even God’s not going to help me with this mess,’ అన్న కొటేషన్ గుర్తుకొచ్చింది, ప్రెసిడెంటుకి!

**** (*) ****