యెల్లో రిబ్బన్...

ఇట్లు మీ…

జనవరి 2015

 చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకొన్న దాగుడుమూతల్లా యిప్పుడు నీతో నాతో యీ సెల్‌ఫోన్‌ కన్నెక్టివిటి అంటూ భలే దాగుడు    మూతలాడుతోందిలే. ప్రస్తుతానికి నీతో ఫోన్‌లో మాట్లాడాలనే ఆలోచనని విరమించి యీ మెయిల్‌ రాస్తున్నాను.

యీ వుదయం యిక్కడికొచ్చాం.

మా సినిమాటోగ్రాఫర్‌ యిక్కడ వెలుగుని చూస్తు ముచ్చటపడుతూ యీ కాంతిని యిలానే తన పనితనంతో పట్టుకోవాలని కలలు కంటున్నాడు.  యెలాంటి మూమెంట్స్‌ కంపోజ్‌ చెయ్యాలని కొరియోగ్రాఫర్‌, యెలాంటి కలర్‌ కాంబినేషన్స్‌ మరింత అందాన్ని యిస్తాయని కాస్ట్యూం డిజైనర్‌, యీ   చలికి జలుబు తెచ్చుకోకుండా మిరియాలపాలు యింకా యేమేమి యివ్వాలాని ఫుడ్‌ మేనేజర్‌ యిలా ప్రతి వొక్కరూ 360 డిగ్రీస్‌ ఆలోచిస్తున్నారనుకో. కొంత కాలంగా టీమ్‌ వర్క్‌ టీమ్‌ వర్క్‌ అంటూ కొన్ని రంగాల గురించి అంటున్నారు కానీ సినిమారంగంలో టీమ్‌ వర్క్‌ అనేది మొదటి నుంచి వుంది. యీ కొత్త రంగాల వాళ్ళకి చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అనుభవాలని షేర్‌ చేసుకొనే క్లాస్‌లు పెడితే బాగుంటుంది కదా.

యిప్పుడే ఆవిరి పొగలు చిమ్ముతోన్న స్వీట్‌ కార్న్‌ సూప్‌ వచ్చింది. యిక్కడ వేడివేడి అల్లం టీ, గ్రీన్‌ టీ, కాఫీ ,రకరకాల సూప్స్‌ని యిస్తున్నారు పదేపదే. క్షణాల్లో చల్లబడి వెచ్చదనాని వెవ్వేనని వెక్కిరిస్తూ చల్లదనం అల్లరల్లరిగా గెంతుతోంది వుడుత పిల్లలా.

యీ పర్వతపు లోయల్లో యీ చిన్నిచిన్ని కాటేజెస్‌లో నేను నా క్రూ కొంత కాలం యిక్కడే వుండాలి కదా…

యీ కాటేజ్‌లో వో మంచం. చిన్ని వెదురు టేబిల్‌ కుర్చీ. అదే రైటింగ్‌ టేబిల్‌ మీద నా లేప్‌టాప్‌ పెట్టి నీకు రాస్తున్నాను. నేలకి చిన్ని యెత్తులో గుండ్రని డైనింగ్‌ టేబిల్‌. చుట్టూ చిన్ని చిన్ని మోకాలి పీటలు నాలుగు. నువ్వుంటే యిద్దరం యెదురెదురుగా కూర్చుని యీ వేడివేడి రొట్టెల మెత్తదనం యీ మెంతికూరా పప్పు కమ్మదనం పాయసంలోని కుంకుమపువ్వు సుగంధం యెలా వున్నాయో మాట్లాడుకొంటూ తింటుంటే వాటి రుచి మరింత ఎన్హాన్స్ అయివుండేది కదా.

యీ కాటేజ్‌ గోడలు నేలంతా యెర్త్‌ కలర్స్‌తో వుండటంతో యీ కాటేజే వో చిన్ని భూగోళంలా వుందనుకో. వొక గోడ మీదంతా చిత్రించిన రంగురంగుల పువ్వులతోట అచ్చంగా నాకోసమేనన్నట్టు… ఆ తోటలో తిరుగుతున్న సీతాకోకచిలుకలా వున్నాననుకో. పేరు తెలియని చిన్నిచిన్ని పువ్వులు ఆకుల సువాసన యీ మంచులో సమ్మిళితమైన చల్లచల్లని గాలి శరీరాన్ని చీరలా చుట్టుకొంటుంటే నువ్విచ్చిన యీ సంపెంగెవర్ణపు స్వెటర్‌ వేసుకొన్నా చల్లదనం స్పర్శిస్తోనే వుంది నీ చిలిపితనంలా. నువ్వేదో వెచ్చదనాన్ని తోడిచ్చి పంపిచావనుకొంటావేమో, నీ స్పర్శకి యీ స్వెటరేం ఆల్‌టర్‌నేటివ్‌ కాదబ్బాయి.

నా కాటేజ్‌ చిన్ని కిటికీలోంచి యెతైన హిమాలయ శిఖరపు అంచుపై మబ్బు పడితే వుదారంగులో, సూర్యకిరణపు వెలుగులో పండిన నారింజ తొనలా కనిపిస్తోంది. యింత చిన్న నలుచదరపు కిటికీలోంచి అంతపెద్ద శిఖరాన్ని చూసినప్పుడంతా నువ్విక్కడుంటే నీవెనగ్గా నిలబడి నీ భుజం మీదుగా నా చుబుకానాంచి ఆ మహోన్నత శిఖరపు అంచుని చూస్తుంటే యెలా వుంటుందానే వూహలతో చాలా సేపట్నుంచి మనస్సు స్కేటింగ్‌ చేస్తోంది.

వో పక్కగా క్యాంప్‌ ఫైర్‌ వ్వావ్‌… యేకాంతంలో నీ మధురస్మృతులు మంచుకిరణాల్లా భలే గుచ్చుకొంటుంటాయి.

వొక దగ్గరితనమూ గుప్పుమన్న ఛమేలిపూల పరిమళమూ వొక కాంక్షాత్మక చూపు నీ చెక్కిలిపై మెరిసే చిన్నిచిన్ని నల్లని గెడ్డం వొక సుదీర్ఘ సంభాషణా వొక చర్చ వొక ప్రశంసా వొక శరీరాన్వేషణా వొక శృంగార భంగిమా వొక ప్రేమలేఖా వొక గాఢాలింగనమూ వొక చిలిపి మాటా వొక దొంగ చూపూ… పసిడి రెక్కలు పరచి వలపులు విసిరిన కాలం పదేపదే స్ఫురిస్తోంది.

నువు నాకోసం తీసిపెట్టిన క్షణాలకు కోట్లాది ముద్దుల కృతజ్ఞతలు. నువ్వు నాకోసం సృష్టించిన అద్భుత అనుభవాలకు ఆలింగనాల అభినందనలు.

ప్రేమించటమూ నీకు తెలుసు. ప్రేమని అందుకోవటమూ నీకు తెలుసు. నీ సమస్త జ్ఞానానుభవాలనూ రంగరించి శరీరానికీ ఆత్మకీ తేడా లేనట్టుగా మోహరాగాలని వర్షించటమూ నీకు తెలుసు. నా స్పర్శ ప్రతి అర్థమూ నీకు తెలుసు. కదలికలకు అనువుగా కలసిపోవడమూ చీలిపోవడమూ విస్ఫోటించడమూ విస్తరించడమూ సూక్ష్మంకావడమూ అన్నీ నీకు తెలుసు. అనుభవపు ప్రతిక్షణంలోనూ మెరిసిపోయే జ్ఞానవర్చస్సునీది.

నీ పాపిడి నిమిరినప్పుడు నీ వుబ్బుకనుపాపలపై ముద్దుపెట్టినప్పుడు నీ మెడపైన వేళ్ళు కదిలినప్పుడు నేను అనుకుంటాను…

లక్ష అర్థాల స్పర్శ నీది.

కొత్త అనుభవాలకు నిర్వచనాలను ఆపాదించుకొనే స్పర్శ నీది. నీ దగ్గరే నా మనస్సు పదేపదే వర్షరుతువవుతుంది. నీకు కొంచెం దూరంగా వచ్చినాసరే అదే పనిగా గ్రీష్మకాలమవుతుంది.
నీ సమక్షంలో నాకెంత వైభవం. నువ్వు నేనూ గడిపే యేకాంతం యెంతటి వుజ్వలం.

యీ దిగులు రాత్రి నీ మధురస్మృతులు నన్ను అమాంతం నీ దగ్గరికి లాక్కుపోతున్నాయి. మనస్సులోని బెంగ యేమంటుందంటే మనిద్దరం వొకే టైమ్‌ జోన్‌లో వుండటమే మన ప్రేమ చేసుకొన్న అదృష్టమంట.
నీ ఫోన్‌ సిగ్నల్‌ అందుబాటులోకి రాగానే పలకరించు.

నీ స్వరరొజాయిని కప్పుకోపోతే నాకు నిద్రపట్టదని నీకు తెలుసుగా.

వొక రోజంటే భూమి తన చుట్టూ తాను తిరిగే కాలం.

వొక రోజంటే యింత పెద్దదని నువ్వే చెప్పావు.

**** (*) ****